Sunday, December 22, 2024

తాలిబన్లు కాదు, తాలిబాన్!

  • మూడు దశాబ్దాల కింద తాలిబాన్ కు అమెరికా అండదండలు
  • ఇప్పుడు అమెరికాపట్ల వ్యతిరేకత, చైనా, రష్యాల మైత్రి
  • తాలిబాన్ సృష్టికర్త, రూపశిల్పి, వ్యూహకర్త, అప్పుడూ, ఇప్పుడూ సంధానకర్త పాకిస్తాన్

అఫ్ఘానిస్తాన్ లో సంభవిస్తున్న నాటకీయమైన, సంచలనాత్మకమైన, విషాదకరమైన పరిణామాలపైన తెలుగు పత్రికలలో వార్తలు పుంఖానుపుంఖంగా వస్తున్నాయి. దాదాపు అన్ని పత్రికలూ అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించినవారు తాలిబన్లు అని లేదా తాలిబాన్లు అని రాస్తున్నారు. అది తప్పు. తాలిబ్ అంటే విద్యార్థి. విద్యార్థులు అంటూ విద్యార్థికి బహువచనం, తాలిబ్ కి బహువచనం – తాలిబాన్. పాకిస్తాన్ మదర్సాలలో కేవలం ఇస్లాంమతంలోని అన్ని విషయాలూ కాకుండా ఛాందసవాదాన్ని మాత్రమే బుర్రలలో దట్టించి యుద్ధతంత్రంలో శిక్షణ పొందిన యువకులువారు. వారు 1996లో అఫ్ఘానిస్తాన్ లో అధికారంలోకి వచ్చారు. తాలిబాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2001లో అమెరికా దాడి చేసేవరకూ వారి రాజ్యమే అక్కడ ఉండేది.  అంతకు ముందు అఫ్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న సోవియట్ దళాలలను ఓడించి దేశం నుంచి వెళ్ళగొట్టినవారు తాలిబాన్. చావుకు వెరవని భయంకరమైన యోధులు.

తాలిబాన్ అధికారంలో ఉండగా అప్ఘానిస్తాన్ లో మహిళలు ఇంటికే పరిమితమైనారు. బాలికలకు చదువులు లేవు. ఆధునిక ప్రపంచంలో బతకడానికి అవసరమైన విద్యాబుద్ధులు నేర్పించే వ్యవస్థ లేదు. ఛాందస ఇస్లామిక్ నియమాలను అమలు పర్చుతూ రాజ్యంచేసే అఫ్ఘానిస్తాన్ ను కేంద్రంగా చేసుకొని అల్ ఖాయిదా నేత ఒసామా బిన్ లాడెన్ న్యూయార్క్ లో ట్రేడ్ టవర్స్ పైన విమానాలతో దాడి చేయించి వేలాది మంది మరణానికి కారణభూతుడైనాడనే ఆగ్రహంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ (జూ.) అఫ్ఘానిస్తాన్ పైకి అమెరికా విమానాలను పంపించాడు. నాటో సైనికులు కూడా రంగంలో దిగారు. తాలిబాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. గత రెండు దశాబ్దాలుగా అఫ్ఘానిస్తాన్ పౌరులకు పౌరహక్కులు ఉండేవి. మహిళలు చదువుసంధ్యలలో రాణించారు. ఉద్యోగాలు చేశారు. పోలీసు ఉద్యోగాలనే కాకుండా సైన్యంలోనూ చేరారు. వారందరి భవిష్యత్తు ఏమౌతుందోనని ఆందోళన ఉంది. వారిని తిరిగి బుర్ఖాలు వేసి ఇంటికి పంపించి అక్కడే కునారిల్లమంటూ తాలిబాన్ ప్రభువులు ఆదేశిస్తారా లేక స్వేచ్ఛాస్వాతంత్ర్యాలతో మనుగడ కొనసాగనిస్తారా అన్నది ప్రశ్న. తిరోగమనమా, పురోగమనమా అనేది కొన్ని రోజుల్లోనే తేలబోతున్నది. తాలిబాన్ విధానాలనూ, పద్ధతులనూ గమనించినవారికి అఫ్ఘానిస్తాన్ లో తిరిగి అంధకారం నెలకొంటున్నదనే భయం పట్టుకున్నది.

Taliban in truck

సోవియట్ యూనియన్ సైన్యంపైన 1996కు ముందు తాలిబ్ లను యుద్ధానికి సన్నద్ధం చేసిన పాకిస్తాన్ కు అమెరికా చేదోడువాదోడుగా ఉండేది. తాలిబ్ లకు ఆయుధాలు, నిధులూ సమకూర్చేది. అప్పట్లో చైనా పెద్ద శక్తిమంతమైన దేశం కాదు. అగ్రరాజ్యం కావాలనే ఆకాంక్ష బలంగా ఉన్నప్పటికీ అంత శక్తి లేదు. అప్పుడు అమెరికా, పాకిస్తాన్ లు అంటకాగాయి. సోవియెట్ యూనియన్ భరతం పట్టాయి. అఫ్ఘానిస్తాన్ లో ఓడించి ఇంటికి పంపించాయి. సోవియెట్లు అధికారంలో నిలబెట్టిన అధ్యక్షుడిని తాలిబాన్ 27 సెప్టెబర్ 1996న ఉరితీశారు. అమెరికా కమాండోలు ఒబామా అధ్యక్షుడుగా ఉండగా పాకిస్తాన్ లో తలదాచుకున్న ఒసామా బిన్ లాదెన్ ను హతమార్చారు.

అఫ్ఘానిస్తాన్ పౌరులు ఎవ్వరికీ తలవంచరనే ప్రఖ్యాతి ఉంది. ఆ దేశాన్ని ఆక్రమించుకునేందకు గ్రీకులూ, హూనులూ, మంగోలియావారూ, అరబ్బులూ, బ్రిటిష్ వారూ, సోవియట్లూ ప్రయత్నించి భంగపడ్డారు.  చివరగా అమెరికన్లూ, యూరోపియన్లూ (నాటో) 2001లో అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించుకున్నారు. రెండు దశాబ్దాల అనంతరం దేశాన్ని అల్లకల్లోలంలో ముంచి నిర్దయగా, నిస్సిగ్గుగా నిష్క్రమించారు. ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. సుమారు నాలుగు వేల మంది సైనికులను కోల్పోయారు. లక్షకు పైగా అప్ఘాన్ సైనికులకు శిక్షణ ఇచ్చారు. అత్యాధునికమైన ఆయుధాలు సమకూర్చారు. కానీ ఆ సైనికులు తాలిబాన్ తో యుద్ధం చేయడానికి కానీ వారిని చంపడానికి కానీ వారి చేతుల్లో చనిపోవడానికి కానీ సిద్ధంగా లేరు. అమెరికా ఇచ్చిన ఆయుధాలతో సహా తాలిబాన్ లో కలసిపోయారు. అమెరికా తరఫున అమెరికా నుంచి వచ్చి దేశాధ్యక్షుడిగా వ్యవమరించిన అష్రాఫ్ ఘనీ కజికిస్తాన్ కి పరారై వెళ్ళిపోయారు. తిరిగి 2001నాటి పరిస్థితి పునరావృత్తమైంది.

తాలిబాన్ ను సృష్టించి, పెంచి, పోషించిన పాకిస్తాన్ సైనికాధికారులు పండుగ చేసుకోవాల్సిన సందర్భం. ఇప్పుడు తాలిబాన్ వెంట పాకిస్తాన్ తో పాటు రష్యా, చైనా కూడా ఉన్నాయి. రష్యా సమకూర్చిన ఆయుధాలతోనే తాలిబాన్ విజృంభించి అమెరికా సేనల ఉపసంహరణ ప్రారంభించిన తర్వాత కేవలం పది రోజులలో అఫ్ఘానిస్తాన్ ను పూర్తిగా ఆక్రమించి కాబూల్ లోని అధ్యక్ష భవనంలో తిష్ఠవేశారు. చైనా తాలిబాన్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. తాలిబాన్ అఫ్ఘానిస్తాన్ సంకెళ్ళను తెంచివేసి స్వాతంత్ర్యం సంపాదించారని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. ఇప్పుడు అఫ్ఘానిస్తాన్ కు మద్దతుగా పాకిస్తాన్, చైనా, రష్యా నిలిచాయి. అప్పుడు రష్యా (సోవియెట్ యూనియన్ )కు వ్యతిరేకంగా తాలిబాన్ కు అండగా అమెరికా, పాకిస్తాన్ నిలిచాయి. పాకిస్తాన్ అన్ని వేళలా తాలిబాన్ తో నే ఉన్నది. భవిష్యత్తులో తాలిబాన్ పాకిస్తాన్ తో ఎటువంటి సంబంధాలు పెట్టుకుంటుందో చూడాలి. పాకిస్తాన్ కు లొంగి ఉంటుందా, స్నేహభావంతో ఉంటుందా, పాకిస్తాన్ ప్రమేయాన్ని సహించని స్వతంత్ర వైఖరిని అవలంబిస్తుందా చూడాలి.

మొత్తం మీదికి తెలుగు పత్రికలలో వస్తున్నట్టు వారు తాలిబన్లు కానీ తాలిబాన్లు కానీ కాదు. వారు తాలిబాన్. తాలిబ్ కు బహువచనం.

Related Articles

1 COMMENT

  1. తాలిబన్ ల గురించి చక్కని వివరణ నిచ్చి నందుకు ధన్యవాదములు. వీరు మత ఛాందసవాద మైనే సాప్ట్ వేర్ లోడు చేసిన రోబోట్లు. వారికి తెలిసినది తుపాకులతో కాల్చి వేయడమొక్కటే. మూడ విశ్వాసం తప్ప ఏ మతానికి సంబంధించిన జ్ఞానం లేని మూర్ఖులు. విద్యాసంస్కారం లేని విద్యార్థులు. పరిపాలన పై ఏ మాత్రం అవగాహన లేని అధికారం చేపట్టిన పాలకులు. భగవంతుడు ఈ శకుని వారసుల నుండి ప్రపంచాన్ని రక్షించు గాక ! 🙏🙏🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles