- ఆమిర్ ఖాన్, దేవరకొండ సినిమాలపై దుర్మార్గం
- తెలుగుసినిమాకి తీరని నష్టం
సినిమా రంగంలో తెలుగువారికి బాలీవుడ్ తో పాటు ప్రపంచం మొత్తం బ్రహ్మరథం పడుతోంది. బాలీవుడ్ మొత్తం టాలీవుడ్ కళాకారులు,సాంకేతిక నిపుణుల వైపు చూస్తోంది. తెలుగు రాష్ట్రాలపై కన్నేస్తోంది. బాహుబలి సినిమాతో ఇంతటి ప్రభంజనం మొదలైందని చెప్పాలి. ‘పాన్ ఇండియా’ సినిమా అంటూ కొత్తకీర్తిని మనవాళ్లు దక్కించుకుంటున్నారు. తెలుగువారి ప్రతిభకు కొత్తగా ఇప్పుడే గుర్తింపు రాలేదు. ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే తెలుగువారు నిర్మించిన సినిమాలకు బాలివుడ్ సైతం సెల్యూట్ చేసే ట్రెండ్ ఈ మధ్య కాలంలో పెరిగింది. ఇది ఇలా ఉండగా, దీనికి పూర్తి విరుద్ధంగా ‘బాయ్ కాట్’ ట్రెండ్ గత కొంతకాలంగా బాలీవుడ్ ను కుదిపేస్తోంది. కొంతమంది ఖాన్ లు, కపూర్ ల సినిమాలు విడుదలైనప్పుడల్లా ఆ సినిమాలను బాయ్ కాట్ చేయండంటూ ఒక వర్గం ప్రేక్షకులు సోషల్ మీడియా రూపంలో విరుచుకుపడుతున్నారు. ఈ ప్రభావం ఆ యా సినిమాల ఫలితాలపై పడుతోంది.
మతప్రమేయం మూర్ఖత్వం
ఈ నేపథ్యంలో, కొన్ని సినిమాలు ఆర్ధికంగా ఘోరంగా దెబ్బతింటున్నాయి. కొన్నింటికి రావాల్సినంత ఆదాయం రావడం లేదు. మరికొన్నింటికి లాభాలు తగ్గుతున్నాయి. వెరసి నష్టం జరుగుతోంది. ఇందులో మత వ్యతిరేక కోణాలు, నెపోటిజం (బంధుప్రీతి) ప్రధానంగా ఉన్నాయి. గతంలో బీహారీ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన సంఘటన సంచలనం సృష్టించింది. రాజకీయ దుమారం రేపింది. కేంద్రం – మహారాష్ట్ర పోలీసుల మధ్య చిచ్చు రేపింది. సుశాంత్ ‘బంధుప్రీతి’కే బలయ్యాడని పెద్ద ప్రచారం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద చర్చ జరిగింది. ‘బంధుప్రీతి’ అంశానికి మతం, మరికొన్ని అంశాలు జోడై ఇప్పుడు పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్నాయి, కలవరం పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘బాయ్ కాట్ ‘ ప్రభావం బాలీవుడ్ మెగా హీరో ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’పైన కూడా పడిందని వార్తలు వస్తున్నాయి. ఖచ్చితమైన వివరాలు, అసలు వాస్తవాలు ఇంకా పూర్తిగా తెలియాల్సివుంది. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ ను కూడా బాయ్ కాట్ చేయాలంటూ ఒక వర్గం సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేపట్టారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆమిర్ ఖాన్ ప్రపంచం మెచ్చిన గొప్ప నటుడు. తనపై తానే ప్రయోగాలు చేసుకుంటూ కొత్తదనం కోసం పరితపించే విలక్షణ నటుడు, నిర్మాత కూడా. ఈ క్రమంలో తన ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ముందుకు వెళ్తున్న సాహసి. అటువంటి వారి సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలుపునివ్వడం దుర్మార్గమైన విధానం. విజయ్ దేవరకొండ ఇప్పుడిప్పుడే పైకొస్తున్న మంచి హీరో. ఎంతో భవిష్యత్తు కలిగివున్న నటుడు. ‘లైగర్’ సినిమా ప్రచారం సమయంలోనే పెద్ద పేరు మూటకట్టుకుంది. ట్రైలర్స్ సంచలనం రేపుతున్నాయి.
Also read: దూకుడు పెంచిన చైనా
నిన్నటి దాకా తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రేక్షకులకే దగ్గరైన విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాతో బాలీవుడ్ లోనూ భజాయిస్తున్నాడు. దేశవ్యాప్తంగా అతని క్రేజ్ పెరుగుతోంది. మాములుగా సంవత్సరంలో 100 సినిమాలు విడుదలైతే, నష్టాలు లేకుండా బయటపడే సినిమాలు 4-5 మించి ఉండవు. లాభాలు తెచ్చిపెట్టేవి ఇంకా తక్కువగా ఉంటాయి. కరోనా వైరస్ ప్రభావంతో సుమారు రెండేళ్లపాటు సినిమా ప్రపంచం అంధకారంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడిప్పుదే కాస్త మంచి వాతావరణం ఏర్పడుతోంది. సినిమా ఖర్చు, పన్నులు, రెమ్యునరేషన్, 24 క్రాఫ్ట్స్ వారి జీతభత్యాలు, ప్రదర్శన, అమ్మకాలపై గందరగోళం నడుస్తోంది. తెలుగులో ఇటీవల విడుదలైన రెండు సినిమాలకు హిట్ టాక్ రావడం మంచి పరిణామంగా పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.
Also read: కృష్ణం వందే జగద్గురుమ్
మనం కూర్చున్న కొమ్మను నరుక్కుంటామా?
ప్రస్తుతం తెలుగు సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. చర్చలు సఫలమైతే త్వరలో మళ్ళీ షూటింగ్స్ మొదలవుతాయి. ఇటువంటి వెలుగునీడల మధ్య కొట్టుమిట్టాడుతున్న సినిమా పరిశ్రమకు,ముఖ్యంగా తెలుగుసినిమా రంగానికి మంచి రోజులు రావాలి. దేశవ్యాప్తంగానూ భారతీయ సినిమాలు విజయాలను వరించి లాభాలబాట పట్టాలి. ఆర్ధిక పరిపుష్టి కలగాలి. సినిమా పరిశ్రమ అంటే బాగా డబ్బులు సంపాయించుకొని బాగా స్థిరపడిన కేవలం నలుగురు నిర్మాతలు, హీరోలు, దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులు కాదు. ఇది 24 కళల /వృత్తుల సమాహారం. ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా కొన్ని వేలమంది, పరోక్షంగా కొన్ని లక్షలమంది జీవితాలు ఆధారపడి వున్నాయి. వారిలో ఎక్కువమంది రెక్కాడితే కానీ డొక్కాడనివారు. మతం, కులం, వర్గం, ప్రాంతం, భాష మొదలైన విభేదాలతో సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడం హేయమైన చర్య. సమాజాన్ని, మనుషులను, దేశాన్ని కించపరిచే, రెచ్చగొట్టే, విధ్వంసాలను సృష్టించే, జుగుప్సాకరమైన సన్నివేశాలు, సంభాషణలు ఉంటే, దేశ సార్వభౌమత్వానికి నష్టం కలిగించే చెడ్డసినిమాలను తప్పకుండా నిషేధించాలి. అంతేకానీ, వ్యక్తిగత అభిప్రాయాలతో,ద్వేషాలతో, చాదస్తాలతో ప్రతి సినిమా పైనా బురదచల్లే చర్యలు మంచివి కాదు. ‘బాయ్ కాట్ ‘ సంస్కృతి ఆరోగ్యదాయకం కాదు. సినిమా అత్యంత శక్తిమంతమైన మీడియా. కోట్లాదిమందికి వినోదాన్ని పంచే సాధనం. పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం కలిగించే గొప్ప రంగం. పరోక్షంగా, ప్రత్యక్షంగా నిరుద్యోగాన్ని తగ్గించే వ్యవస్థ. మొబైల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కదా అని ఆ సాంకేతికతను సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేయడం సరియైన సంప్రదాయం కాదు. ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాపై ‘బాయ్ కాట్’ విధానాన్ని ఖండించిన విజయ్ దేవరకొండ సినిమా ‘లైగర్’ పై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొందరు వరుసగా పోస్టులు పెడుతున్న తీరు సక్రమమైంది కాదు. భారతీయ సినిమా పరిశ్రమను కాపాడుకోవాలి. తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టుకోవాలి, పెంచుకోవాలి. సినిమాల నిర్మాణం, పరిశ్రమల తీరుతెన్నులపై సమీక్షలు జరగాలి. చర్చలు పెరగాలి. లోపాలను తప్పకుండా సరిదిద్దుకోవాలి. మంచి సినిమాలు రావాలి. సినిమా ప్రపంచం మంచిగా ఉండాలి. కానీ,మన కొమ్మను మనమే నరుక్కోకూడదు.
Also read: కశ్మీర్ పండిట్లపై ఉగ్రపంజా