Wednesday, January 22, 2025

ఇది ‘రమణ ఎఫెక్ట్’, రిబీరో వ్యాఖ్య

జూలియో రిబీరో పేరు వినని వారు ఉండరు. ఆయన పోలీసు ఉన్నతాధికారిగా ముంబయ్ లోనూ, మరి పెక్కు చోట్లా సమర్థంగా, నిజాయితీగా,నిర్భయంగా పని చేశారు. మంచి పేరు గడించారు.  ఆ తర్వాత రుమేనియాలో భారత రాయబారిగాలో కొంతకాలం ఉన్నారు. దిల్లీ అల్లర్ల సందర్భంగా అరెస్టయిన ముగ్గురు విద్యార్థి నాయకులకు దిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం వెనుక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ స్ఫూర్తి ఉన్నదని స్క్రాల్. ఇన్ ప్రచురించిన ఒక వ్యాసంలో రిబీరో వ్యాఖ్యానించారు. నిచ్చెన మెట్ల మాదిరి ఉండే పోలీసు వ్యవస్థలో పైన ఉండేవాడిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఈ సూత్రం మానవ కార్యాచరణలన్నిటికీ వర్తిస్తుంది. ఇది న్యాయవ్యవస్థలో అమలు జరుగుతున్నదనడానికి మొన్న దిల్లీ హైకోర్టులో, అలహాబాద్ హైకోర్టులో, బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ లో వెలువడిన ఆదేశాలే సాక్ష్యం. ఈ పరిణామం ఏప్రిల్ లో జస్టిస్ రమణ సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి స్పష్టంగా గోచరిస్తున్నదని రిబీరో అన్నారు. ఇందుకు తాజా నిదర్శనం ఇద్దరు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థినులనూ, జామియా మిలియాలో చదువుకునే మరో విద్యార్థినీ సంవత్సర కాలంపాటు అక్రమంగా జైల్లో నిర్బంధించిన తర్వాత గురువారంనాడు బెయిల్ పైన విడుదల చేయడం.

Julio Ribeiro, a retired senior police official

నిరపరాధులైన విద్యార్థులను స్వేచ్ఛ నుంచి సంవత్సరంపాటు దూరం చేసి జైలులో నిర్బంధించినందుకు వారికి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారనేది ఎవరికి వారు ఊహించుకోవలసిన అంశం. దిల్లీ పోలీసుల అతి పోకడ, ఆధిక్య ప్రదర్శన, వారి గుడ్డి విధేయతలను మాజీ పోలీసు ఉన్నతాధికారి ఆ వ్యాసంలో ఖండించారు. ‘‘శాంతియుతంగా నిరసన ప్రకటించడం ప్రజల హక్కు. అది ఉగ్రవాద చర్య కాదు,’’ అని  జస్టిస్ సిద్దార్థ్ మృదుల్, జస్టిస్ అనూప్ భాంభానీ స్పష్టం చేశారు. ఇది ప్రతి పోలీసు అధికారికీ శిక్షణలో విధిగా చెప్పే పాఠ్యాంశం. రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కుల గురించి దిల్లీ పోలీసులు ఆకస్మికంగా ఎట్లా మరచిపోతారు? సిటిజన్ షిప్ అమెండ్ మెండ్ యాక్ట్ లో ముస్లింల పట్ల వివక్షను ప్రశ్నిస్తూ నిరసన చెప్పడం అనే అపరాధం చేసినందుకు ముగ్గురు విద్యార్థులనూ అరెస్టు చేసినప్పుడు తాను దిల్లీ పోలీసు శాఖాధిపతికి లేఖ రాశాననీ, నిరుడు ఈశాన్య దిల్లీలో అల్లర్లను ప్రేరేపించిన అసలు వ్యక్తులను ఉపేక్షించడాన్ని విమర్శించాననీ, నిరసనకారులపైన దాడి చేయాలనీ, చంపివేయాలనీ రెచ్చగొడుతున్న వ్యక్తులు టీవీలలో కనిపించినప్పటికీ వారిని వదిలేసి అమాయకులైన విద్యార్థులను నిర్బంధించడాన్ని దుయ్యపట్టాననీ ఆయన రాశారు. రాజకీయ నాయకుల మెహర్బానీ కోసమో, వారి దయకు ప్రాప్తులు కావాలన్న ఆరాటంతోనో పోలీసులు నేరం చేసిన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులనూ వదిలివేశారు. వారిలో ఒకరు కేంద్ర  సహాయ మంత్రి. పక్కనే షహీన్ బాగ్ లో నిరసన ప్రకటించేందుకు కూర్చొన్న ముస్లిం మహిళలనీ, ముగ్గురు విద్యార్థులనూ అరెస్టు చేశారు. ముస్లిం మహిళలు పబ్లిక్ రోడ్డును చాలా రోజుల పాటు ఆక్రమించి వాహనదారులకు ఇబ్బంది కలిగించిన మాట వాస్తవమే. దానికి పరిష్కారం బెయిలుపైన విడుదల చేసే అవకాశం లేని ఉపా (అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) వంటి భయానక చట్టాన్ని ప్రయోగించడం కాదు. మహిళా పోలీసుల సహాయంతో వారిని (ముస్లిం మహిళలను) అక్కడి నుంచి తొలగిస్తే సరిపోయేది.

‘మన జాతి పునాదులు గట్టిగా ఉన్నాయి. కొద్ది మంది విద్యార్థులు ఆందోళన చేసినంతమాత్రాన కదిలేవి కాదు,’ అంటూ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఉపా కింది ముగ్గురు యవజనులను అరెస్టు చేయవలసిందిగా ఆదేశించిన పోలీసు కమిషనర్ కు ఆ విషయం (లాజిక్) తెలుసు. తాను రాజ్యాంగంపైన చేసిన ప్రమాణాన్ని గౌరవించడం కంటే పాలకులను సంతోషపెట్టాలని ఆ పోలీసు అధికారి నిర్ణయించుకున్నారనేది స్పష్టం.

దిల్లీ పోలీసు కమిషనర్ శ్రీవాత్సవతో నేను తలబడినప్పుడు పోలీసు శాఖలో లోగడ నాతో కలసి పనిచేసిన సహచరులు చాలా మంది కమిషనర్ చర్యను సమర్థించారు. అదృష్టవశాత్తు దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు అందుకు భిన్నంగా ఆలోచించారు. న్యాయానికి భావజాలం లేదు. అది మతానికీ, కులానికీ, వర్గానికీ, ఆర్థిక స్థితిగతులకీ, సామాజిక హోదాకూ అతీతమైనది. అన్నిటికంటే ముఖ్యం ఏమంటి అది (న్యాయం) భావజాలాలకి దూరం.

న్యాయం కోరేవారికి శక్తి ప్రదానం చేసిన తీర్పు ఇదొక్కటే కాదు. సినీ నిర్మాత అయిషా సుల్తానాకు ముందస్తు బెయిలు ఇవ్వాలన్న కేరళ హైకోర్టు నిర్ణయం కూడా ఇటువంటిదే. దేశద్రోహానికి ఒడిగట్టిందనే ఆరోపణలు ఆమె పైన ప్రభుత్వం చేసింది.  లక్షద్వీప్ ను టూరిజం కేంద్రంగా మార్చివేయాలన్న తలంపుతో ప్రత్యేకంగా నియమించిన పరిపాలకుడు 60 వేలమంది స్థానికులు వేల సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను హరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎద్దేవా చేస్తూ ఆమె వ్యాఖ్యానించారు. పాలకుడిపైన దాడిలో భాగంగా ప్రభుత్వం ప్రశాంతంగా జీవిస్తున్న లక్షద్వీప్ పైన మానవరూపంలో ఆయుధాన్ని (బయోవెపన్)ను ప్రయోగించిందంటూ కాస్త ఘాటుగానే అన్నారామె. దీంతో కోపం పెంచుకున్న పాలకుడు స్థానిక భారతీయ జనతాపార్టీ నేత చేత ఆ యువ ఫిలిం నిర్మాతపైన ఒక ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు) దాఖలు చేయించాడు. అభూత కల్పనలతో కూడిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడానికి కేరళ హైకోర్టు ఎక్కువ సమయం వృధా చేయలేదు. ఇంత వేగంగా న్యాయమూర్తులు కదలడానికి కారణం ‘‘రమణ ఎఫెక్ట్’ అని అభివర్ణించాలని అనుకుంటున్నాను. (భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ ఆవిష్కరించిన విషయాన్ని రామన్ ఎఫెక్ట్ అంటారు. అదే విధంగా భారత ప్రధాన న్యాయమూర్తిని ప్రస్తావిస్తూ రిబీరో ‘రమణ ఎఫెక్ట్’ అన్నారు).

దిల్లీ హైకోర్టు హేతుబద్ధంగా ముగ్గురు విద్యార్థులను బెయిల్ పైన విడుదల చేయాలని ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వుకు దిల్లీ పోలీసులు స్పందించిన తీరు కొన్నేళ్ళుగా వారు ప్రవర్తిస్తున్న తప్పుడు తీరుకు నిదర్శనంగా ఉంది. నిందితులకు పూచీకత్తు ఇచ్చే వ్యక్తుల ఆధార్ కార్డులనూ, నిందితుల చిరునామాలనూ తనిఖీ చేయడానికి మూడు రోజులు అవసరమంటూ తమ పరిధిని దాటి వాదించి దిల్లీ పోలీసులు అభాసుపాలైనారు.  

‘బెయిల్, నో జైల్’ అనే పదబంధాన్ని సృష్టించిన న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్. కేంద్ర దర్యాప్తు సంస్థ సంయుక్త సంచాలకుడిగా అద్భుతంగా పని చేసిన అసాధారణమైన పోలీసు అధికారి, నా సహచరుడు వి. లక్ష్మీనారాయణకు కృష్ణయ్యర్ తమ్ముడు. అరెస్టు చేయడం, కోర్టులో ప్రవేశపెట్టడం, తర్వాత విచారించడంతో కూడిన న్యాయ నిర్వహణ పద్ధతి కాకుండా తమకు పడని వారిని విచారణ లేకుండా శిక్షించాలనే పద్ధతికి మార్చాలని మన పాలకులు గట్టి పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. తమకు ఇబ్బందికరంగా పరిణమించిన హక్కుల కార్యకర్తలను వారు తప్పు చేయకుండానే ఏళ్ళ తరబడి జైళ్ళలో  ఉంచాలని పాలకులు ప్రయత్నిస్తున్నారని రిబీరో విమర్శించారు.

కృష్ణయ్యర్ తో కొన్నేళ్ళ కిందట నేను జరిపిన సంభాషణను గుర్తు తెచ్చుకున్నప్పుడు నీతీనిజాయితీతో పని చేసే తన అన్నగారంటే ఆ న్యాయకోవిదుడికి ఎంత గౌరవమో తెలిసింది. లక్ష్మీనారాయణ కనుక ఇప్పుడు దిల్లీ కమిషనర్ గా ఉండి ఉంటే దిల్లీ అల్లర్ల వెనుక ఉన్న అసలు దోషులను వదిలిపెట్టేవారు కాదు. అన్యాయాన్ని ఎదిరించిన విద్యార్థి నాయకులను కేసులలో ఇరికించేవారు కాదని రిబీరో స్పష్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles