Wednesday, January 15, 2025

పాలకపక్షాలకే మళ్ళీ పల్లకీ

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా, అందరి చూపు పశ్చిమ బెంగాల్ వైపే నిలిచింది. మోదీ వర్సెస్ దీదీగానే ప్రచారం జరిగింది. నువ్వా? నేనా? అన్నట్లుగా సాగిన పోరులో  దీదీయే గెలిచారు. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ మమతా ప్రాభవమే కొనసాగింది.  నందిగ్రామ్ లో అతి తక్కువ ఓట్లతో మమతా ఓడిపోవడం, సువేందు అధికారి గెలవడం మినహా, మిగిలిన విజయమంతా మమతాదే కావడం విశేషం. గత ఎన్నికల్లో కంటే కూడా ఎక్కువ సీట్లను సాధించి దీదీ తన తడాఖా చూపించారు.

మమతా హ్యాట్రిక్

ప్రధానమంత్రి మొదలు బిజెపి అగ్రనేతలంతా ఏకమైనా,ఆమె గెలుపును అడ్డుకోలేకపోయారు. వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా సింహాసనాన్ని అధిరోహించబోతున్నారు. ఇంతటి పోరులో కూడా హ్యాట్రిక్ సాధించిన ఘనత మమతాకు దక్కింది. బెంగాలీ సెంటిమెంట్ బలంగా పనిచేసిందని చెప్పాలి. ఆమెను ఒంటరి చేసి, ఇబ్బందిపెట్టారనే సానుభూతి కూడా ప్రజల్లో పెరిగిందని భావించాలి. 2019 లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి 18 సీట్లు దక్కాయి. ఈ అంశాన్ని ఆమె సీరియస్ గా తీసుకొని, తమ ఉనికిని కాపాడుకోడానికి బలమైన పథక రచన చేశారు. ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా నియమించుకోక ముందే, ఆమె సరికొత్త వ్యూహాన్ని నిర్మించుకున్నారు. ఆమె రాజకీయ ప్రయాణంలో దాడులు కొత్త కాదు. దాడి జరిగిన ప్రతిసారీ, ఆమెదే పైచేయిగా నిలిచింది.

మోదీకి బలమైన ప్రత్యర్థి

తనకు ఎదురేలేదనుకుంటున్న నరేంద్రమోదీకి, జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ రూపంలో ఒక బలమైన ప్రతిపక్షనేత తయారయ్యారు.వచ్చే సాధారణ ఎన్నికల్లో మమతా బెనర్జీ పాత్ర ప్రముఖంగా ఉండే అవకాశం ఉంది.  ఆమె పోరాటానికి ఇది అంతం కాదు, ఆరంభమని చెప్పాలి. పశ్చిమ బెంగాల్ లో దీదీ -మోదీ రేసులో,వామపక్ష, కాంగ్రెస్ పార్టీలు తుడిచిపెట్టుకు పోయాయి. వారి స్వయంకృత అపరాధాలే ఈ అపజయానికి కారణాలు.ఆ పార్టీల స్థానాన్ని కొంత బిజెపి, కొంత తృణమూల్ కాంగ్రెస్ ఆక్రమించాయి. మూడు సీట్ల దశ నుంచి రెండంకెల స్థానాలకు ఎగబాకడం బిజెపి విజయ యాత్రలో కీలకమైన పరిణామం.పశ్చిమ బెంగాల్ లో రెండవ అతిపెద్ద పార్టీగా బిజెపి వేళ్లూనుకుంది.

చరిత్ర సృష్టించిన విజయన్

కేరళలో పినరయ్ విజయన్ 44ఏళ్ళ నాటి చరిత్రను తిరగరాశారు. వరుసగా రెండవసారి కూడా ఎల్ డి ఎఫ్ ను అధికార పీఠంపై కూర్చోబెట్టారు. ఆ ఘనతంతా ఆయనదే. పినరయ్ విజయన్ ముఖ్యమంత్రిగా తన పరిపాలనా కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, సాంకేతికంగా వినూత్న ప్రచారం ఆయనకు మళ్ళీ పట్టం కట్టాయి. పినరయ్ ప్రభుత్వంపై పడిన అవినీతి ముద్రలు గెలుపును ఆపలేకపోయాయి. కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న యూడిఎఫ్ విజయాన్ని సాధించలేక పోయినా, పరువును కాపాడుకుంది. బిజెపికి ఆశించిన ఫలితాలు రాలేదు. మెట్రోమెన్ గా ప్రసిద్ధుడైన శ్రీథరన్ ను ఎన్నికల బరిలో దింపినా, పెద్దగా ఫలితాలను రాబట్టలేకపోయింది. బిజెపి ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీథరన్ సైతం కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

తమిళనాట డిఎంకె బావుటా

తమిళనాడులో పదేళ్ల తర్వాత డిఎంకె అధికారానికి దగ్గరయ్యింది. స్టాలిన్ కు పెద్ద స్థాయిలో ఆకర్షణ లేకపోయినా, సుదీర్ఘకాలం నుంచి అధికారంలో ఉన్న ఏఐఏడిఎంకె కూటమిపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ( యాంటీ ఇంకంబెన్సీ) డిఎంకె కూటమికి కలిసివచ్చింది. భాగస్వామి పార్టీయైన కాంగ్రెస్ కు కూడా ఆ ఫలితం దక్కి, కాసిన్ని స్థానాలను గెలుచుకునేట్లు చేసింది. నేడు, జయలలిత వంటి దిగ్గజం లేరు. పళనిస్వామి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. పన్నీరుసెల్వం నిన్నటి దాకా అమ్మచాటు బిడ్డగానే వున్నారు. అయినప్పటికీ, వీరి నాయకత్వంలో నడిచిన అన్నా డిఎంకె  ఓడిపోయినా,మంచి ఫలితాలనే సాధించింది. ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉండడం ప్రధానమైన కారణం. వ్యక్తిగతంగా పళనిస్వామిపై పెద్దగా వ్యతిరేకత లేకపోవడం కూడా మరో కారణం. ఏది ఏమైనా, స్టాలిన్ నాయకత్వంలో నడుస్తున్న డిఎంకెకు, అన్నా డిఎంకె గట్టి పోటీనే ఇచ్చింది.పార్టీ ప్రతిష్ఠను కాపాడుకుంది.

కమలహాసన్ వైఫల్యం

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి, పార్టీని స్థాపించిన కమల్ హాసన్ సోదిలో లేకుండా పోయారు. సినిమా నాయకుడుగా గొప్ప పేరు తెచ్చుకున్నారు కానీ, ప్రజానాయకుడుగా కమల్ ను ప్రజలు గుర్తించలేదు.రాజకీయ నాయకుడుగా మారిన మరో సినిమా నటుడు విజయకాంత్ కూడా ఈ హోరులో కొట్టుకుపోయారు. పుదుచ్చేరిలో బిజెపి కూటమి అధికారాన్ని కైవసం చేసుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవలే అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ కూటమి నేటి ఎన్నికల్లో మంచిఫలితాలనే సాధించింది. అధికారానికి చేరువుదాకా వచ్చింది. ఇది మంచి విజయమే. అధికారాన్ని చేజిక్కించుకోడానికి, రెండు కూటముల మధ్య గోరంత వ్యత్యాసమే ఉంది.

అసోంలో మళ్ళీ బీజేపీ

అసోంలో మళ్ళీ బిజెపి కూటమి అధికారం చేపట్టబోతోంది. ఈ ఎన్నికల వేళ, అక్కడ వరుసగా అనేక అనూహ్య పరిణామాలు జరిగాయి. బిజెపి కూటమి నుంచి బలమైన బిపిఎఫ్ బయటకు వెళ్ళిపోయి, యూపి ఎతో జత కల్సింది.ఈ పార్టీలన్నీ కలిసి “మహా జోత్ ” గా ఏర్పడి, బిజెపికి గట్టి పోటీని ఇచ్చాయి. అధికార ఎన్ డి ఏ కూటమికి ఎదురుగాలులు వీచాయి. ఎట్టకేలకు, బిజెపి గెలుపుబాట పట్టింది. ఈ గెలుపులో హిమంత బిశ్వశర్మ పాత్ర ప్రధానమైంది. అతని వ్యూహరచనలే బిజెపిని అందలమెక్కించాయి. అసోం ముఖ్యమంత్రిగా బిశ్వశర్మను ఎంపికచేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి, తమిళనాడులో స్టాలిన్ కు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించారు. వారి గెలుపులో ఆయనకు కూడా కొంత భాగస్వామ్యం ఉందని భావించాలి.

ప్రాంతీయ పార్టీల ప్రాభవం

ఈ ఎన్నికల ఫలితాలను గమనిస్తే, మమతా బెనర్జీ ‘హీరో’గా నిలిచారు. నరేంద్రమోదీ ఆకర్షణ కొంత తగ్గుముఖం పట్టిందని చెప్పాలి. స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినా,తమిళనాడు ప్రజల్లో తన ప్రాభవాన్ని, విశ్వాసాన్ని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.కాంగ్రెస్ పార్టీకి కేరళ, అసోం, తమిళనాడు, పుదుచ్చేరిలో లో కాస్త గౌరవనీయమైన ఫలితాలు వచ్చినా, పశ్చిమ బెంగాల్ లో చతికిలబడి పోయింది. మమతా బెనర్జీతో సరియైన ప్రయాణం చెయ్యకపోవడం కూడా అపరాధమే. ఇప్పటికైనా, కాంగ్రెస్ పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో వచ్చిన ఫలితాలు ప్రాంతీయ పార్టీల ప్రాభవాన్ని మరోసారి చాటి చెప్పాయి. బిజెపి పెద్దలు ఆత్మపరీక్ష, ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణం వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థులకే ప్రజలు పట్టంకట్టారు. కరోనా ప్రభావంతో ప్రజలు విసిగెత్తి పోతున్నారు. ప్రజల బాగోగులు సరిగ్గా చూసుకోకపోతే, నేడు అధికారంలో ఉన్న ప్రతిపార్టీకీ రేపటి ఎన్నికల్లో మొండిచెయ్యే ఎదురవుతుంది. మొత్తంమీద, ఈ ఎన్నికల ఫలితాలు కొందరికి పాఠాలు, మరికొందరికి గుణపాఠాలు.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles