ప్రముఖ సోషలిస్టు నాయకురాలు, ప్రసిద్ధ నటి స్నేహలతా రెడ్డి వర్థంతి ఈ రోజు (20 జనవరి). నలభై అయిదేళ్ళ కిందట ఏళ్ళ కిందట ఆత్యయిక పరిస్థితిలో అన్యాయంగా జైలులో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి ప్రభుత్వం ఆమెను బలితీసుకున్నది. విచారణ లేకుండా ఎనిమిది నెలలకు పైగా జైలులో ఉంచారు. ‘‘రాత్రిపూట నిశ్శబ్దంలో ఆమె సెల్ నుంచి హృదయవిదారకంగా అరుపులూ, పెడబొబ్బలూ వినిపించేవి. నేను వాటిని వినలేకపోయేవాడిని’’ అని అదే జైలులో బందీగా ఉండిన మధు దండావతే రాశారు. అదే జైలులో అటల్ బిహారీ వాజపేయి కొన్ని రోజులు ఉన్నారు. అడ్వాణీ మొత్తం అత్యయిక పరిస్థితిని ఎత్తివేసి విడుదల చేసే వరకూ అక్కడి జైలులోనే ఉన్నారు. ఆమె జైలులో రాసుకున్న డైరీలోని అంశాలను 1977లో కర్ణాటక మానవహక్కుల సంఘం ప్రచురించింది. స్నేహలతారెడ్డి 1932లో జన్మించారు. 20 జనవరి 1977న మరణించారు. ఆమె రాంమనోహర్ లోహియా అభిమాని, అనుచరురాలు. చివరికి చార్జిషీటులో ఆమె పేరు కూడా లేదు. చేయని నేరానికి ఘోరమైన శిక్ష అనుభవించి తనువు చాలించినవారిలో స్నేహలత ఒకరు. చిన్నతనం నుంచీ ఉబ్బసం వ్యాధి వేధించేది. జైలులో హింసతో ఆమె ఆరోగ్యం చెడిపోయింది. జైలు నుంచి పెరోల్ పైన విడుదల చేశారు. విడుదలైన అయిదో రోజునే ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది.
స్నేహలత నటి, ప్రయోక్త, నిర్మాత, హక్కుల నాయకురాలు. కన్నడ, తెలుగు సినిమాలలో అందరూ గౌరవించే మనిషి. రంగస్థల నటి. మద్రాస్ ప్లేయర్స్ అనే రంగస్థల బృందాన్ని తయారు చేసిన నిర్వాహకురాలు. కన్నడ చిత్రం సంస్కారలో చంద్రి పాత్ర పోషించిన స్నేహలత పేరు కన్నడసీమలోనూ, వెలుపలా 1970 ప్రాంతంలో మారుమోగింది.
‘పిడేల్ రాగాల డజన్’ కవి, భావకవిత్వంమీద పని గట్టుకొని దాడి చేసిన సాహసి, చలనచిత్ర నిర్మాత తిక్కవరపు పఠాభిరామరెడ్డి సతీమణి స్నేహలత. సోషలిస్టు నాయకుడు, బెంగుళూరుకే చెందిన జార్జి ఫెర్నాండెజ్ కు సన్నిహితురాలు. బరోడా డైనమైట్ కేసు జార్జి ఫెర్నాండెజ్ పైన పెట్టిన ప్రభుత్వం అదే కేసుతో సంబంధం ఉన్నదనే తప్పుడు ఆరోపణపైన ఆమెను అరెస్టు చేసింది. హక్కుల ఉద్యమ నాయకురాలు నందనం రెడ్డి తల్లి. సంగీత విద్వాంసుడు కొనార్క్ రెడ్డికి మాతృమూర్తి. ఆమెపైన డాక్యుమెంటరీని 2019లో నిర్మించారు. మహిళా ఉద్యమకారిణి, చరిత్ర పరిశోధకురాలు, చిత్రనిర్మాత ఉమాచక్రవర్తి నిర్మించిన ‘పాయిజన్ డెయిరీ’ స్నేహలత జీవితానికి కొంతవరకూ అద్దం పట్టింది. కోనార్క్, నందన, దీపా ధన్ రాజ్ ల ఇంటర్వూలను అక్కడక్కడ చూపించి స్నేహలత జీవిత కథ చెప్పిన తీరు ఆకట్టుకున్నది. వీక్షకుల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టు సతమతం అవుతారు. డాక్యుమెంటరీ గుండెను పిండుతుంది. అయితే, స్నేహలత జీవితం మొత్తాన్ని చూపించదు. మరింత పరిశోధన చేసి ఉన్నట్లయితే పూర్తి నిడివి చిత్రంగా బాగుండేది. డాక్యుమెంటరీ కేవలం ఆత్యయిక పరిస్థితికీ, ఆమె జైలు జీవితానికీ పరిమితమైనట్టు కనిపించింది. 1970 ఉత్తరార్ధంలో బెంగళూరు ఆంధ్రప్రభలో ఉపసంపాదకుడిగా పని చేస్తున్న నేను స్నేహలత భౌతిక కాయాన్ని చూసి శ్రద్ధాంజలి ఘటించాను. నాటి దృశ్యం ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు ఉంది.