హైదరాబాద్ : ‘బీజేపీ ఆఫీసులో కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయ్.అంగీలు….లాగులు చినుగుతున్నాయ్. మీలో సయోధ్య లేదు..ప్రజలకేం చేస్తారు.. ? బీజేపీలో నాయకత్వం కోసం బండి సంజయ్ వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్లుగా అగ్గిరాజుకుంది’ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
‘టికెట్ రాలేదని బీజేపీ ఆఫీసులో అంగీలు, లాగులు చింపుకుంటున్నారు. తలలు పగులగొట్టుకుంటున్నారు. బీజేపీ నేతలమధ్యే సయోధ్య లేదు. వీళ్లు ఇంక ప్రజల కోసం ఏం చేస్తారు? మోదీ ప్రభుత్వం బెంగళూరు లో వరదలు వస్తే 600 కోట్లు ఇచ్చారు. గుజరాత్ లో వరదలు వస్తే 500 కోట్లు ఇచ్చారు. కాని హైదరాబాద్ లో వరదలు వస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు. తెరాస ప్రభుత్వం వరద సాయం అందిస్తుంటే , బీజేపీ పార్టీ దాన్ని కూడా అడ్డుకుంటోంది. ఎన్నికల కమిషన్ కు వరద సాయం ఇవ్వకూడదని బీజేపీ పార్టీ ఫిర్యాదు చేసింది. ఇలా హైదరాబాద్ కు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ. హైదరాబాద్ కు అన్యాయం చేసిన పార్టీ బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి,’ అని హరీష్ ప్రశ్నించారు.
‘పెద్ద నోట్లు రద్దు చేస్తామని మోదీ ప్రకటించారు. కాని రద్దయ్యాయా? వేయి రూపాయల నోట్లు రద్దు చేసి ప్రజలను రోడ్డు మీద పడేసి రెండువేల నోట్లు తెచ్చారు. బీజేపీ ప్రభుత్వం విధానాలవల్ల దేశం ఆర్థిక మందగమనం దిశగా దిగజారింది. తెరాసపాలనలో హైదరాబాద్ లివబుల్ సిటీగా రూపుదిద్దుకుంది. ఆరేళ్ళలో నగరంలో గొడవలు లేవు. బాంబు పేళుళ్లు లేవు. హైదరాబాద్ లో ప్రజలు ఆత్మవిశ్వాసం తో , భద్రత మధ్య జీవిస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ వెల్యూ పెరగాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెరాస గెలవాలి,’
‘వడ్డెర బస్తీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ఇక్కడ యువతకు స్థానికంగా ఉద్యోగాలు వచ్చేలా చూస్తాం. ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్, బీజేపీలు వచ్చి సీసాలు, వలన డబ్బులు పంచుతారు.వాటిని నమ్ముకోవద్దు,’ అంటూ ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు.