- చైనాకు చెక్ పెట్టేందుకు క్వాడ్ కఠినవ్యూహాలు
- డ్రాగన్ కట్టడికి బహుముఖ వ్యూహం
విస్తరణ కాంక్షతో రగిలిపోతూ నేలమీద, నీటిలో సరిహద్దులను చెరిపేస్తూ పేద దేశాలను గుప్పిట పట్టేందుకు అప్రతిహతంగా దూసుకొస్తున్న చైనాను కట్టడి చేసేందుకు క్వాడ్ దేశాలు వ్యూహరచన చేస్తున్నాయి. తాను చెప్పిందే వేదం తాను గీసిందే గీత అంటూ దురాక్రమణలకు పాల్పడుతూ అనుక్షణం తెంపరితనం ప్రదర్శిస్తున్న డ్రాగన్ ను అడ్డుకునేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాలు కూడా అంతే దూకుడుగా పావులు కదుపుతున్నాయి. అన్నివైపుల నుంచి చైనాను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నాయి.
క్వాడ్ దేశాల ఉమ్మడి కార్యాచరణ:
నాలుగు దేశాలు అంతరిక్షంలో కూడా కలిసిపనిచేసేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. కూటమిలోని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలో ఇండియా తన బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే వాతావరణ మార్పులు, సరికొత్త పరిజ్జానం, భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు ఉమ్మడి కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలని కూటమి దేశాలు అంగీకారానికి వచ్చాయి. అయితే గతవారం తొలిసారి జరిగిన క్వాడ్ దేశాల అధినేతల సమావేశం అనంతరం ఈ సహకారాన్ని అంతరిక్ష రంగానికి విస్తరించాలని నిర్ణయించాయి.
Also Read:ముందు శాంతి ఆ తర్వాతే చర్చలు
ఇస్రో, నాసా రూపొందిస్తున్న నిసార్:
అమెరికాతో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న నిసార్ ఉపగ్రహం కోసం ఇస్రో ఎస్ బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ ను ఇటీవలే రూపొందించింది. దీన్ని శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. భారత్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్ – 3లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన లేజర్ రిఫ్లెక్టోమీటర్ ను అమర్చేందుకు రెండు దేశాలు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి.
జాక్సాతో ఇస్రో చెట్టాపట్టాల్:
ఇదే తరహాలో జపాన్, ఆస్ట్రేలియాలతోనూ ఇస్రో మైత్రీ బంధాన్ని ఏర్పాటుచేసుకోవడానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జపాన్ అంతరిక్ష సంస్థతో భూ పరిశీలన, చంద్రమండలంపై పరిశోధనలు, ఉపగ్రహ నావిగేషన్ వంటి పలు అంశాలలో ఉమ్మడి సహకారానికి ఇస్రో చర్చలు జరిపింది. ఉపగ్రహ సమాచారంతో వ్యవసాయ విస్తీర్ణం, గాలి నాణ్యతపై పర్యవేక్షణ వంటి కార్యకలాపాలను ఉమ్మడిగా చేపట్టాలని ఇస్రో, జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా నిర్ణయించాయి. 2023 నాటికి చంద్రుడి దక్షిణ ధృవానికి లూనార్ పోలార్ ఎక్స్ ప్లొరేషన్ పేరుతో ఒక వ్యోమనౌకను సంయుక్తంగా నిర్మించి పంపాలని తీర్మానం చేశాయి. ఇందుకోసం జపాన్ నిధులను కూడా కేటాయించింది.
Also Read: అమెరికాతో భారత సంతతి అనుబంధం బలోపేతం