Saturday, December 21, 2024

గెలిచినా ప్రయోజనం లేని ఇజ్రేల్ గాజా యుద్ధం

  • ముంబయ్ పై ముష్కరుల దారి సమయంలో మన్మోహన్ సింగ్ విధానమే సరైనది
  • హమస్ హింసాకాండను మించిపోయిన ఇజ్రేల్

థామస్ ఎల్ ఫ్రీడ్ మన్

నేను ఇజ్రేల్-హమస్ యుద్ధం చూస్తూ ప్రపంచ నాయకులలో నేను బాగా అభిమానించిన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను: మన్మోహన్ సింగ్. 2008 నవంబర్ ద్వితీయార్ధంలో ఆయన భారత ప్రధానిగా ఉన్నారు. లష్కరే తొయ్యబా ముఠా నుంచి పది మంది పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు అంతకు ముందు ఇండియాలో జొరబడి ముంబయ్ లో 160 మందిని చంపివేశారు. నిహతులలో రెండు లక్జరీ హోటల్స్ లో చనిపోయిన 60 మంది ఉన్నారు. ఈ ఉగ్రవాద సంస్థకు పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పుకునేవారు. ఈ ఘాతుకానికి మన్మోహన్ సింగ్ సైనిక స్పందన ఏమిటి?

ఆయన ఏమీ చేయలేదు.

ఢాక్టర్ మన్మోహన్ సింగ్

సైనికంగా పాకిస్తాన్ పైన కానీ లష్కరీ తొయ్యబా స్థావరాలపైన కానీ మన్మోహన్ సింగ్ ఎటువంటి ప్రతీకార చర్యా తీసుకోలేదు. అది చెప్పుకోదగిన నిగ్రహం. ఆయన నిష్క్రియాపరత్వంలో హేతువేమిటి? ‘‘చాయిసెస్: ఇనసైడ్ ద మేకింగ్ ఆఫ్ ఇండియాస్ ఫారీన్ పాలసీ’’ అనే పుస్తకంలో నాటి విదేశాంగ కార్యదర్శి శివశంకర్ మీనన్ కొన్ని కీలకమైన మాటలు రాశారు:

‘‘నేను స్వయంగా  ఆ సమయంలో వెంటనే అందరికీ కనిపించే విధంగా ప్రతీకార చర్య తీసుకోవాలని సూచించాను. జిహాదిస్టులపైనా, వారితో కుమ్మక్కు అయిన పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ పైనా చర్య తీసుకోవాలని చెప్పాను. అట్లా చేయడం వల్ల ఆవేశపరంగా సంతృప్తి కలిగేది. భారత పోలీసులూ, సైనికులూ ఏమీ చేయలేకపోయారనే, అసమర్థులుగా మిగిలిపోయారనే సిగ్గుమాలిన మరక చెరిగిపోయేది’’ అంటూ మీనన్ రాశాడు.

‘‘ఒక సారి నింపాదిగా, నిరావేశంగా ఆలోచిస్తే, వెనుదిరిగి చూస్తే సైనికంగా ప్రతీకార చర్యలు తీసుకోకపోవడం, దౌత్యపరంగా బాహాటంగానూ, రహస్యంగానూ పని చేయడం ఆ సమయానికీ, పరిస్థితులకు తగిన పని అని ఇప్పుడు నేను విశ్వసిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు.  

మీనన్ చెప్పిన ప్రధాన కారణాలు ఏమంటే సైనిక చర్య తీసుకుంటే లష్కరే ఉగ్రవాదులు భారత పౌరులపైనా, సందర్శకులపైన జరిపిన దాడిలోని పైశాచికత్వం అంతగా బయటపడేది కాదు. పాకిస్తాన్ ప్రభుత్వ సహకారంతో ఉగ్రవాదులు ఇండియాపైన పాశవికంగా చేసిన దాడి తాలూకు ప్రభావం అంతగా కనిపించేది కాదు. ఇండియా ప్రతీకార చర్య తీసుకుంటే ప్రపంచ దేశాలు ‘‘ఈ వివాదాలూ, ఘర్షణ సంబంధాలూ ఇండియా, పాకిస్తాన్ మధ్య మామూలే’’ అని అనుకునేవి. దీనిలో అసాధారణం ఏమీ లేదని తీర్మానించేవి.

అంతే కాకుండా, ఇండియా కనుక పాకిస్తాన్ పైన దాడి చేస్తే పాక్ సైన్యం వెనుక పాకిస్తానీయులు సమైక్యంగా నిలబడేవారు. పాక్ సైన్యం అప్పటికే అప్రతిష్ఠపాలైంది. పాకిస్తాన్ పైన దాడి చేస్తే పాకిస్తాన్ లో పౌరప్రభుత్వం బలహీనపడేది. కొన్ని రోజుల కిందటే  ఎన్నికైన పౌర ప్రభుత్వం సైన్యం కంటే ఎక్కువగా ఇండియాతో సత్సంబంధాలు కోరుకుంటున్నది. పాకిస్తాన్ లో సైన్యం మీద ఉన్న ఒత్తిడి తగ్గించుకోవడానికి పాక్ సైన్యం సరిగ్గా కోరుతున్నది యుద్ధభయం లేదా యుద్ధం’’ అంటూ మీనన్ రాసుకొచ్చారు.

‘‘యుద్ధమే జరిగి ఉన్నట్లయితే ఇండియా గెలిచినప్పటికీ దానికి మూల్యం చెల్లించుకోవలసి వచ్చేది. ఆర్థిక ప్రగతి కుంటుపడేది. అప్పుడు2008 నవంబర్ లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది’’ అని మీనన్ గుర్తు చేశాడు.

పాకిస్తాన్ పైన దాడి చేయకుండా ఉండటం మూలంగా దారుణం చేసిన దోషులను శిక్షించవలసిందిగా న్యాయవ్యవస్థకు విజ్ఞప్తి చేయడానికీ, పాకిస్తాన్ పైన నష్టదాయకమైన పరిణామాలు ఉండే విధంగా అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేయడానికీ, పాకిస్తాన్ అటువంటి మరో దాడికి సాహసించకుండా ఉండేందుకు అవసరమైన చర్యలుతీసుకునే వెసులుబాటు ఇండియాకు దక్కింది’’ అంటూ మీనన్ తన వ్యాఖ్యానం ముగించాడు.

ఇజ్రేల్ ప్రధాని నెటన్యాహూ

ఇండియాకూ, ఇజ్రేల్ కూ పోలిక లేదని నాకు తెలుసు. ఇండియా విస్తారమైన దేశం. జనాభా 140కోట్ల పైమాటే. ముంబయ్ లో 160 మంది చనిపోయిన ఉదంతం తాలూకు విషాదం ఇండియాలోని పల్లెలన్నిటిలో నిండి ఉండదు. అదే ఇజ్రేల్ లో 1400మంది హమస్ చేత నిహతులైన విషయం, లెక్కలేనంతమంది గాయపడిన సంగతి, రెండు వందల మందికి పైగా అపహరణకు గురైన అంశం దేశం అంతటా ఉడికించి ఉంటుంది.

అయినప్పటికీ, ముంబయ్ ఉగ్రవాద దాడులకు ఇండియా ప్రతిస్పందనతో హమస్ ఊచకోతకు ఇజ్రేల్ స్పందనను పోల్చి చూడాలి.

ఇజ్రేల్ లో పిల్లలూ, పెద్దలూ అన్న విచక్షణ లేకుండా హమస్ నిర్దాక్షిణ్యంగా చంపివేయడం పట్ల తొలుత భయంకరమైన స్పందన అనంతరం ఏమైంది? చర్చ గాజా పౌరుల పట్ల ఇజ్రేల్ దుర్మార్గపు దాడులవైపు దృష్టి మళ్ళింది. ఇజ్రేలీ పౌరులలో కలసిపోయిన  హమస్ ఉగ్రవాదులను ఏరివేయడానికి ఇజ్రేల్ పెద్ద ఎత్తున గాజాపైన దాడి చేసింది. దీనివల్ల హమస్ ఉగ్రవాద చర్య కంటే పెద్దఎత్తున సాగిన ఇజ్రేల్ దాడులలో ప్రాణనష్టం అధికంగా జరిగింది. కొంతమంది దృష్టిలో హమస్ ధీరోదాత్తమైన సంస్థగా పేరు తెచ్చుకున్నది. అబ్రహాం ఒప్పందాలలో ఇజ్రేల్ మిత్రులుగా ఉండిన అరబ్ దేశాలు మళ్ళీ యూదుదేశానికి దూరమైనాయి.

గాజా నుంచి హమస్ ను తరిమివేయడానికి నెలలు పడుతుందని అంచనా. ఇందుకోసం 3,60,000 మంది ఇజ్రేలీ పౌరులను (రిజర్విస్టులను) సైనిక పాత్ర పోషించడానికి పిలిపించారు. దీనివల్ల ఇజ్రేల్ ఆర్థికంగా దెబ్బతినడం ఖాయం.  మూడు మాసాలు యుద్ధం సాగితే  ఇజ్రేల్ ఆర్థిక వ్యవస్థ సాలీనా పది శాతం తగ్గుతుందని అంచనా. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఇసీడీ)లో వేగంగా పెరుగుతున్న నాల్గవ ఆర్థిక వ్యవస్థగా ఇజ్రేల్ ని ది ఎకనామిస్ట్ 2022లో గుర్తించింది.

యూదులు పుట్టిన దేశంలో తాము ఆత్మరక్షణకు కానీ స్వయంనిర్ణయానికి కానీ అర్హులు కాదన్నట్టు (ఇజ్రేల్ తిరుగుదాడి చేయకముందే) హమస్ ను సమర్థించిన విద్యార్థులూ, ప్రగతిశీలుర వైఖరి నాకు వ్యక్తిగతంగా చాలా బాధకలిగించింది. ఈ ఆగ్రహం ఇజ్రేల్ ఎన్ని తప్పులు చేసినా అది అన్ని మతాలవారికీ నిలయమనీ, అక్కడ డాక్టర్లుగా పట్టభద్రులు అవుతున్నవారిలో సగం మంది అరబ్ జాతికి చెందినవారనే, అరబిక్ మాట్లాడేవారేననే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అదే విధంగా హమస్ మిలిటెంట్ ఇస్లామిక సంస్థ అనీ, అవిధేయతను సహించదనీ, స్వలింగసంపర్కుల పొడ గిట్టదనీ, ఈ భూమిపైన యూదులకు దేశం లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్న సంస్థ అనీ గుర్తించాలి.

నాజీల చేతిలో మారణహోమం (హొలోకాస్ట్) అనంతరం మొన్ననే అత్యధిక సంఖ్యలో యూదులను కోల్పోయిన ఇజ్రేల్ ఎదుట ఏమేమి ప్రత్యామ్నాయాలు ఉన్నాయోనని ఆలోచిస్తే భయం కలుగుతుంది. ముంబయ్ ఉగ్రవాద దాడికి మన్మోహన్ సింగ్ విశిష్ఠమైన స్పందన నాకు బాగా గుర్తున్నది కనుక ఇజ్రేల్ ఆచితూచి ముందడుగు వేయాలనీ, బాగా ఆలోచించి స్పందించాలనీ సలహా చెప్పాను. సేవ్ అవర్ హోస్టేజెస్ ఆపరేషన్ (బందీలను రక్షించే కార్యక్రమం) ను కొనసాగిస్తూ పిల్లలనూ, వృద్ధులనూ అపహరించినవారిని పట్టుకొని సంహరించి ఉండవలసింది. ఆ విధంగా చేసి ఉంటే ప్రతి తల్లీ,తండ్రీ అర్థం చేసుకునేవారు.

ఆ విధంగా కాకుండా రక్షణమంత్రి యోవ్ గాల్లాంట్ అన్నట్టు ఈ భూమి మీది నుంచి హమస్ ను తుడిచిపెట్టాలన్న నిర్ణయాన్ని ఇజ్రేల్ ప్రధాని బెంజమిన్ నెటన్యాహూ ప్రభుత్వం తీసుకున్నది. మూడు వారాలలో ఇజ్రేల్ స్వయంగా నష్టబోయిన ప్రాణాల కంటే ఆస్తులకంటే చాలా ఎక్కువ నష్టాన్ని గాజాకు కలిగించింది. అంతేకాకుండా గాజాను సైనికంగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నది.  జనాభా దృష్ట్యా మెక్సికోలో సగ భాగాన్ని ఆక్రమించుకోవాలని అమెరికా నిర్ణయించుకున్నట్టు లెక్క. హమస్ సైనిక శక్తినీ, పరిపాలనా వ్యవస్థనూ ధ్వంసం చేసి బందీలను ఇంటికి తీసుకురావడం అన్నది చాలా సుదీర్ఘమైన, కష్టభూయిష్టమైన కార్యక్రమం అని నెటన్యాహూ అంటున్నారు.

నేను ఇదివరకే చెప్పినట్టు ఇజ్రేల్ ఇండియా కాదు. పొరుగున ఉన్నవాడు ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపడం సాధ్యం కాదు. కానీ నెటన్యాహూ పథకం ఏమిటి? నేను మాట్లాడిన ఇజ్రేలీ అధికారులు రెండు అంశాలు స్పష్టంగా చెబుతున్నారు. హమస్ గాజాను మరలా పరిపాలించలేదు. హమస్ అనంతరం గాజాను ఇజ్రేల్ పాలించదలచుకోలేదు. పశ్చిమతీరాన (వెస్ట్ బ్యాంక్)లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అధికారుల సూచన. పాలస్తీనియన్లు దైనందిక పరిపాలన చూసుకుంటారు. ఇజ్రేలీ, షిన్ బెట్ దళాలు (ఇజ్రేల్ అంతర్గత భద్రతా దళాలు) వెనక ఉంటూ మద్దతు ఇస్తాయి.

ఇది సగం వండిన వంటకం. సంపూర్ణ ప్రణాళిక కాదు. ఇజ్రేల్ తరఫున గాజాను పరిపాలించడానికి నియమించే పాలస్తీనావారు ఎవరు? ఇజ్రేల్ కోసం పని చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని ఒక రోజు ఉదయం హత్య చేసి, అతని భౌతిక కాయానికి ఒక నోటు తగిలించి, దానిపైన ‘దేశద్రోహి’ అని రాసి హమస్, అండర్ గ్రౌండ్, అని రాసినప్పుడు ఏమి చేయగలిగారు?

పైగా గాజాలో నివసిస్తున్న 22 లక్షల మంది ప్రజల పరిపాలనా వ్యయాన్నీ, వారి విద్య, ఆరోగ్య వ్యయాన్ని ఎవరు భరించాలి? యూరోపియన్ యూనియన్ కానీ, గల్ఫ్ అరబ్ రాజ్యాలు కానీ, అమెరికా ప్రతినిధుల సభలో ఉన్న ప్రగతిశీలవాదులు కానీ ఈ ఖర్చును భరిస్తారా? వెస్ట్ బ్యాంక్ లో పాలస్తీనియన్లకు సమాన హక్కులు లేకుండా నెటన్యాహూ, ఆయన తోడి అగ్రవాదులు పెత్తనం చెలాయిస్తూ ఉంటే గాజాలో ఇజ్రేలీ పెత్తనాన్ని కొనసాగించడానికి పైన పేర్కొన్న సంస్థలు ఖర్చు పెట్టుకుంటాయా? గాజాను ఆక్రమించుకోవడం ఇజ్రేల్ ఆర్థిక వ్యవస్థకూ, సైన్యానికీ శక్తికి మించిన పని. ఈ భారాన్ని కొన్నేళ్ళపాటు మోయాలి.

అంతే కాకుండా, నెటన్యాహూపైన ఇజ్రేల్ లో (సకారణంగానే) గౌరవం లేకుండా అక్కడి నుంచి ఇటువంటి సంక్లిష్టమైన వ్యవహారాన్ని ఎట్లా నిర్వహించగలరు? మొన్న శనివారంనాడు నెటన్యాహూ తనపైన నింద వేసుకోకుండా హమస్ దమనకాండకు ఇజ్రేల్ సైన్యం, ఇంటెలిజెన్స్, షిన్ బెట్ బాధ్యత వహించాలని అన్నాడు. ఆ మర్నాడు ఇజ్రేల్ ప్రజాభిప్రాయం విజృంభించింది. యుద్ధసమయంలో సహచరులను నిందించడం  మానుకోవాలని ప్రజలు హితవు చెప్పారు. అన్నమాటలు వాపసు తీసుకోవాలని చెప్పారు. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది.

నెటన్యాహూ ప్రత్యర్థులలో ఎవ్వరూ ఆయనను బలపరిచేవారు లేరు. తమ ప్రధాని విజయాలన్నిటినీ తన ఖాతాలో వేసుకొని వైఫల్యాలకు తమను నిందిస్తాడనీ, ఇటువంటి లోపభూయిష్టమైన వ్యక్తిత్వం వ్యక్తి మాటలు నమ్ముకొని దీర్ఘకాలపు నిర్ణయాలను తీసుకోవడానికి ఆయన జట్టులోని సహచరులు సిద్ధంగా లేరు.

ప్రియమైన పాఠకులారా, ఇజ్రేల్ ఎందుకు హమస్ ను విధ్వంసం చేసి ఇరుగుపొరుగున మరెవ్వరూ భవిష్యత్తులో ఇటువంటి దాడి చేసే సాహసం చేయకుండా బెదరగొట్టాలని అనుకుంటున్నదో నాకు అర్థం అయింది. గెలుపొందడానికి అవసరమైన నాయకత్వం కానీ, ఈ సంక్షోభంలో ఎదురయ్యే ఒడుదుడుకులను అధిగమించి ఇజ్రేల్ ను విజయపథంలో నడిపించే శక్తిసామర్థ్యాలు కలిగిన నాయకుడు కానీ ఇప్పుడు లేడన్నది అమెరికా ప్రభుత్వ అభిప్రాయం. ఇందుకు అవసరమైన పక్కా ప్రణాళిక కూడా లేదు. ఏకపక్షంగా సైనిక చర్యలు సాగిస్తూ ఎంతమందినైనా గాజాలో ప్రజలను సంహరిస్తానంటే, అపరిమితంగా గాజా పౌరులు మరణిస్తుంటే మిత్రదేశమైన అమెరికా సైతం చూస్తూ ఊరుకోదు. దాని సహనానికి హద్దు ఉన్నది.

మానవీయమైన కాల్పల విరమణకు, బందీల మార్పిడికీ ఇజ్రేల్ సిద్ధంగా ఉండాలి. సయోధ్యకు తలుపులు తెరచి ఉంచాలి. అప్పుడే హడావిడిగా గాజాకు సైన్యాన్ని పంపడం వల్ల కలిగిన పరిణామాలు ఏమిటో, దీర్ఘకాలికంగా చెల్లించవలసిన మూల్యం ఏమిటో ఇజ్రేల్ కు తెలిసివస్తుంది.

అందుకే నేను భారత దేశ ఉదాహరణను ప్రస్తావించాను. ఏదైనా లక్ష్యం పెట్టుకొని, పరిమితమైన సైనిక బలాన్ని వినియోగించడం ద్వారా ఇజ్రేల్ కు దీర్ఘకాలిక ప్రయోజనం కలగవచ్చునేమో, సంపద నష్టం కాకుండా కాపాడుకోవచ్చునేమో కానీ ఏకపక్ష యుద్ధంలో హమస్ ను తుదముట్టించాలన్న ప్రయత్నం సఫలం కాదు. ఈ రెండు విధానాల లాభనష్టాలను ఇజ్రేల్ బేరీజు వేస్తుందనే ఆశాభావం నాది.

కొంత విరామం దొరుకుతే గాజా ప్రజలు కూడా ఆలోచించుకుంటారు. హమస్ దాడి, ఊహించినవిధంగానే ఇజ్రేల్ ప్రతిదాడి వల్ల గాజాకు జరిగే హాని ఎటువంటిదో గాజా ప్రజలు తెలుసుకోగలుగుతారు. కొన్ని వారాల క్రితం వరకూ వేలాది గాజా ప్రజలు పనికోసం ఇజ్రేల్ వెళ్ళివస్తూ ఉన్నారు. గాజా-ఇజ్రేల్ సరిహద్దు దగ్గర పంటధాన్యాల ఎగుమతులు చేసుకుంటూ ఉన్నారు. ఆ సంస్థ చర్యను అర్థం చేసుకున్నారే గాని ఎవ్వరూ ప్రశ్నించలేదు.

హమస్ సభ్యులు కూడా ఆస్పత్రి కింద సొరంగాల నుంచి బయటికి వచ్చి తమ ప్రజల కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఇజ్రేల్ మీద ఎందుకు దాడి చేశారో, పిల్లల్నీ, వృద్ధులనూ ఎందుకు అపహరించవలసి వచ్చిందో, అటువంటి హింసాకాండ నుంచి వారు ఏ ఫలితాన్ని ఆశించారో చెప్పాలి.

ఇజ్రేలీ-పాలస్తీనా సంక్షోభాన్ని 1900 ల నుంచి ఏక వాక్యంలో చెప్పుకోవచ్చునని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది.సంఘర్షణ. విరామం, సంఘర్షణ. విరామం. సంఘర్షణ. విరామం. విరామ సమయంలో వారు ఏమి చేశారన్నది ప్రధానం.

కొన్నిలోపాలు ఉన్నప్పటికీ ఇజ్రేల్ మంచి సమాజాన్నీ, ఆర్థిక వ్యవస్థనీ  నిర్మించింది. హమస్ తన వనరులన్నీ తీసుకొని యుద్ధానికి అవసరమైన సొరంగాలను నిర్మించింది.

ఇజ్రేల్, దయజేసి ఆ సొరంగాలలో ఆగం కావద్దు.

(న్యూయార్క్ టైమ్స్ సౌజన్యంతో)

అనువాదం: కె. రామచంద్రమూర్తి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles