ఇజ్రాయిల్ -పాలస్తీనా ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. కొన్ని వారాల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రమంగా అది యుద్ధ వాతావరణంలోకి వెళ్ళిపోయింది. సోమవారం నుంచి ఇవి మరింతగా పెరిగాయి. ఇజ్రాయిల్ లో హమాస్ ఉగ్రవాదులు వందలకొద్దీ రాకెట్ బాంబులను విసిరారు. ఈ దాడుల్లో ఇద్దరు మరణించారు. వారిలో ఒకరు కేరళ మహిళ కావడం గమనార్హం.
Also read: పాకిస్తాన్ కొత్త పాచిక?
ఘర్షణ ముదిరి యుద్ధం
దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ సైనికులు తాజాగా విమానదాడులు చేపట్టారు. సోమవారం, మంగళవారం ఎడతెరపిలేకుండా బాంబుల వర్షాన్ని ఇజ్రాయిల్ సైనికులు కురిపించారు. ఈ దాడుల్లో 28మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది ఉగ్రవాదులేనని ఇజ్రాయిల్ సైన్యం అభిప్రాయపడుతోంది. ఈ దాడులు మరింతగా పెరిగే వాతావరణమే కనిపిస్తోంది. జెరుసలేం లోని ‘అల్ అక్సా’ మసీదు దగ్గర ఇజ్రాయిల్ సైనికులు -పాలస్తీనులు మధ్య గొడవలు జరిగాయి. అవి పెరిగిపెద్దవై యుద్ధానికి దారితీశాయి.
Also read: భారత్-బ్రిటన్ మధ్య గాఢమైన మైత్రి
ఇస్లామిక్ దేశాల ఖండన
పాలస్తీనాపై దాడులను ముస్లిం దేశాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. తొలుత, మసీదు దగ్గర బలగాలను ఉపసంహరించాలని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ దళాలను హెచ్చరించారు. అంతటితో ఆగక దాడికి దిగారు. ఇద్దరి మరణానికి కారకులయ్యారు. దీనితో ఇజ్రాయిల్ సైనికులు ఆగ్రహోదగ్రులై ప్రతిదాడికి దిగాల్సి వచ్చింది. ఇరువైపుల మరణాలు సంభవించడంతో పాటు పెద్ద సంఖ్యలో ఇరు వర్గాలవారు గాయాల పాలయ్యారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘర్షణలో ముగ్గురు కమాండర్లు కూడా మరణించారని హమాస్ ఉగ్రవాద ముఠా ప్రకటించింది.
Also read: భారత్ – రష్యా సంబంధాలలో మలుపు
ఇదో రావణకాష్టం
ప్రస్తుతం ఇజ్రాయిల్ – పాలస్తీనీల మధ్య మొదలైన ఈ యుద్ధవాతావరణం ఎటుతీసుకెళ్తుందో అనే భయాలు వివిధ దేశాల్లో అలుముకుంటున్నాయి. వీటి పూర్వాపరాల్లోకి వెళితే, పెద్ద చరిత్రే ఉంది. ఈ గొడవలు ఇప్పుడు కొత్తగా మొదలైనవి కావు. దశాబ్దాల నుంచి ఈ రావణకాష్టం కాలుతూనేవుంది. ఇజ్రాయిల్ 1948లో బ్రిటన్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందింది. జెరూసలేం దీనికి రాజధాని. ఇది స్వయం నిర్ణితమైన రాజధాని. ఈ అంశం ఇంకా అంతర్జాతీయంగా వివాదాస్పదంగానే వుంది. ఈ దేశం ప్రధానంగా యూదులు ఎక్కువగా ఉండే ప్రదేశం. అరబ్బులు మొదలైనవారిని ఇక్కడ మైనారిటీలుగా పరిగణిస్తారు. ఇప్పుడు వైమానిక దాడులు గాజాపై జరిగాయి.
Also read: ఉక్రెయిన్ పై ఆధిపత్యానికి రష్యా ఆరాటం
దశాబ్దాలుగా సాగుతున్న దాడులు
ఇవి ఎన్నో దశాబ్దాలుగా జరుగుతూనే వున్నాయి. గాజాపై ఇజ్రాయిల్ కాల్పులను విరమించాలని గతంలోనే ప్రపంచంలోని పలుదేశాలు ఒత్తిడి తెచ్చాయి.శాంతి ఒప్పందాలకు చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ, అవి సంపూర్ణంగా ఇప్పటి వరకూ ఫలవంతం కాలేదు. కాకపోగా, కాల్పులు మళ్ళీ ఊపందుకున్నాయి. గొడవలు రాజకున్నాయి. 1948 లోనూ ఇజ్రాయిల్ సైనికులపై అరేబియన్లు దాడులు చేశారు. దీన్ని అరబ్ -ఇజ్రాయిల్ యుద్ధం అంటారు. ఇజ్రాయిల్ కూడా పొరుగున ఉన్న అరబ్ దేశాలతో యుద్ధాలు చేస్తూనే వుంది. వాటిల్లో భాగంగా ఇప్పుడు దాడులు జరుగుతున్న గాజాపట్టీ మొదలైన ప్రాంతాలను ఇజ్రాయిల్ ఆక్రమించుకుంది.యూదులు -పాలస్తీనుల మధ్య సఖ్యత కుదర్చాలని అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ప్రయత్నించి, విఫలమైంది.
Also read: తాలిబాన్ కు తలొగ్గిన అగ్రరాజ్యం, కశ్మీర్ కు పొంచి ఉన్న ముప్పు
మతవైషమ్యాలే అసలు కారణం
2015 గణాంకాల ప్రకారం ఇజ్రాయిల్ లో 84లక్షలమంది జనాభా ఉన్నారు. వీరిలో 63లక్షల మంది యూదులే. 17లక్షల మంది అరబ్బులు ఉంటారు. ఇది ప్రధానంగా యూదుల రాజ్యం. కానీ, ఈ దేశానికి అధికారికంగా మతం లేదు. ఇక్కడ ఘర్షణలకు ప్రధానమైన కారణం మతాల మధ్య విభేదాలే అని భావించాలి. పాలస్తీనాతో రాజీ కుదరడం కష్టమేనని అనిపిస్తోంది. జెరూసలేం రాజధాని అంశం కూడా పరిష్కారం చేయలేని వివాదంగా ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు.
Also read: క్యూబాలో కొత్త శకం
ఇజ్రాయిల్ కు భద్రతామండలి సలహా
ఆక్రమించిన ప్రాంతాలను వదిలి, అరబ్ దేశాలతో అనుకూల వాతావరణం ఏర్పరచుకోవాలని ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఇజ్రాయిల్ కు ఎప్పుడో పిలుపు ఐచ్చింది. కానీ, ఆ దిశగా ముందుకు వెళ్ళలేదు.గాజాపట్టీని ఆక్రమిత ప్రాంతంగా ఇజ్రాయిల్ భావించడం లేదు. ఈ నేపథ్యంలో, ఘర్షణలు కొనసాగూతూనే వున్నాయి.మతాల మధ్య అంతరాలు మూలాలుగా సాగుతున్న ఈ యుద్ధాలు మానవ సమాజానికి ఏ మాత్రం ఆదర్శం కాదు. ఇప్పటికైనా, శాంతియుత మార్గంలో చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవడమే వివేకమైన మార్గం. అంతర్జాతీయ సంస్థలు, అగ్రరాజ్యాలు, తటస్థ దేశాలు కలుగజేసుకొని ఈ యుద్ధ వాతావరణానికి, ఉద్రిక్తతలకు చరమగీతం పాడాలి.ఈ పరిస్థితి రావడంలో ఇరువర్గాల మధ్య తప్పులున్నాయి. వాటిని సరిచేసుకోవడమే మేలు మేలు.
Also read: భారత్, చైనా ధృతరాష్ట్ర పరిష్వంగం