- ఇంగ్లండ్ సిరీస్ తో రీ-ఎంట్రీకి తహతహ
- 300 వికెట్ల రికార్డు ముంగిట లంబూపేసర్
వివిధ కారణాలతో గత ఏడాదికాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న భారత లంబూ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ..టెస్ట్ పునరాగమనానికి సిద్ధమయ్యాడు. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో ఈనెల 5న ప్రారంభంకానున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ ద్వారా ఇశాంత్ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కరోనా వైరస్ కారణంగా క్రికెట్ కార్యకలాపాలు స్తంభించిపోడం, అదీ చాలదన్నట్లుగా ఐపీఎల్ -13 ఆడుతూ గాయపడి..గత సంవత్సరకాలంగా ఆటకు దూరమైన ఇశాంత్ పూర్తి ఫిట్ నెస్ తో ప్రస్తుత 2021సీజన్ కు అందుబాటులోకి వచ్చాడు.గాయంతో ఆస్ట్రేలియా సిరీస్ కు దూరంగా ఉన్న ఇశాంత్ కెరియర్ కే ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ కీలకంగా మారింది.
Also Read: భారత గడ్డపై అతిపెద్ద టెస్ట్ సమరం
300 వికెట్లకు చేరువగా ఇశాంత్:
తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 97 టెస్టుల్లో 297 వికెట్లు పడగొట్టిన ఇశాంత్ ప్రస్తుత సిరీస్ లో మరో 3 వికెట్లు పడగొట్టగలిగితే…300 వికెట్ల క్లబ్ లో చేరగలుగుతాడు. ఇప్పటికే 300 వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్లలో కపిల్ దేవ్,జహీర్ ఖాన్ మాత్రమే ఉన్నారు. అంతేకాదు…మరో రెండు వికెట్లు సాధిస్తే స్వదేశీ సిరీస్ ల్లో 100 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా కూడా ఇశాంత్ రికార్డుల్లో చేరనున్నాడు. స్వదేశీ సిరీస్ ల్లో ఇప్పటికే 100కు పైగా వికెట్లు పడగొట్టిన భారత పేసర్లలో కపిల్ దేవ్ ( 219 ), జవగళ్ శ్రీనాథ్ ( 108), జహీర్ ఖాన్ ( 104 )
Also Read: సిరీస్ నెగ్గితేనే భారత్ కు ఫైనల్స్ బెర్త్
టెస్టుల సెంచరీకి తహతహ:
ఇశాంత్ శర్మ ప్రస్తుత సిరీస్ లోని మూడుటెస్టులు ఆడగలిగినా 100 టెస్టుల మైలురాయిని చేరగలుగుతాడు. 32 ఏళ్ల ఈ జెయింట్ ఫాస్ట్ బౌలర్ కు ఇప్పటి వరకూ 97 టెస్టులు ఆడిన అనుభవం ఉంది. సీనియర్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయాలతో ఇంగ్లండ్ సిరీస్ కు దూరం కావడంతో…భారతజట్టుకు ఇశాంత్ శర్మ పెద్దదిక్కుకానున్నాడు. ఇంగ్లండ్ తో భారతజట్టు ఆడిన గత సిరీస్ లో ఇశాంత్ మొత్తం 18 వికెట్లు పడగొట్టి…తన జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.
2018 సీజన్ తర్వాత నుంచి తాను ఆడిన టెస్టుల్లో ప్రతి 41.7 బంతులకు ఒక వికెట్ చొప్పున పడగొడుతూ వస్తున్న ఇశాంత్…యార్కర్ల కింగ్ బుమ్రా కంటే మెరుగైన స్ట్రయిక్ రేట్ సాధించడం విశేషం.మరి ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లో ఇషాంత్ ఏ స్థాయిలో రాణించగలడన్న అంశంపైనే భారతజట్టు జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.
Also Read: చెన్నై టెస్టులో రోహిత్ జోడీ ఎవరో?