Thursday, November 7, 2024

జ్యోతిష శాస్త్రంలో ఏకాభిప్రాయం అసాధ్యమేనా?

జ్యోతిషం భారతీయుల ఆత్మ. దేశీయులు చేసే ప్రతి పనిలో, జ్యోతిషం ప్రత్యక్షంగానో పరోక్షంగా నో తన వంతు పాత్ర పోషిస్తున్నది. పండుగలు, పూజలు, యజ్ఞ యాగాదులు, వివాహాది శుభ కార్యాలు, పరాపర కర్మలు, ప్రతిదీ జ్యోతిషంతో ముడిపడి ఉన్నవే. అందరికీ అందుబాటులో ఉండడానికి, గ్రహగతులను, తిథి వార నక్షత్రాదులను తెలపడానికి ఉపయోగపడేది జ్యోతిషం. కాలానికి అంగాలైన తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం గురించి తెలిపేది కనుక పంచాంగం. 

మూలం సూర్యసిద్ధాంతం

పూర్వకాలం నుండి, గ్రహగతులు లెక్కించడానికి, తద్వారా పంచాంగ గణనకు, ఎన్నో పద్ధతులు సిద్ధాంతాలు ఉన్నాయి. అన్నింటికీ మూలం సూర్య సిద్ధాంతమని భావన. అయితే సిద్ధాంతకర్తలు గ్రహ గణితంలో , ద్యుక్తుల్యం కావడానికి, కాలానుగుణంగా గణితంలో సంస్కారం చేసుకోవాలని సూచించారు. సూర్యాది అష్టాదశ జ్యోతిష శాస్త్ర ప్రవర్తకులు, అంటే జ్యోతిష శాస్త్రాన్ని రచించిన వారు, కలియుగం ముందున్న, ఆరంభం తరువాతి వారు, అనంతరం  భాస్కరాచార్యుడు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్టు ఆదిగా జ్యోతిష సిద్ధాంతాలను రచించారు. తదుపరి పంచాంగ గణితం, వాడుకకు అనుగుణంగా ఉండే, కరణ ప్రాంతాలను కేశవ దైవజ్ఞ, గణేశ దైవజ్ఞ ఆది పండితులు రచించారు. ప్రస్తుతం పూర్వ పద్ధతి పంచాంగాలుగా, పిలువబడే పంచాంగాలు, ఈ కరణ గ్రంథాల ఆధారంగా రచింప బడేవే. గ్రహ లాఘవం, గణకానందం, నర కంఠీరవం, తిథి రత్నావళి, తిథి  చంద్రిక, ఖేచ దర్పణం, దిన చంద్రిక,  పంచాంగ మంజూష, సిద్ధాంత రహస్యం, తదితర ప్రసిద్ధ కరణ గ్రంథాల ఆధారంగానే, ప్రస్తుతం పూర్వ పద్ధతి అనుసరించే, సిద్ధాంతులు పంచాంగ రచనలు చేస్తున్నారు. ఈ కరణ సిద్ధాంతాలు అన్నింటికీ సూర్య సిద్ధాంతమే మూలాధారం.

సూత్రబద్ధత అసాధ్యం

కరణ సిద్ధాంతాలన్నీ ఒకే గణితాన్ని అనుసరిస్తున్నాయి. గ్రహ గమనాలను కాలానుగుణంగా, కొంత తేడాలు రావడం జరుగుతున్నదని, అలాంటి  సందర్భాలలో, వాటి గణితానికి సంబంధించిన సూత్ర భద్రత అసాధ్యమని, కాలానుగుణ సవరణలు అనివార్యం అని కొందరి భావన. ఈ సవరణలు గ్రహాలను ప్రత్యక్షంగా వీక్షించి, పరిశీలించి, తదనుగుణ సంస్కారాన్ని, గ్రహ గణితానికి చేయడం, తప్పనిసరి అని చెబుతున్నారు. ఈ విషయం ముందే తెలిసిన మన పూర్వీకులు, తమ సిద్ధాంత గణితం, ద్యుక్తుల్యంగా ఉండాలని, తదనుగుణ మార్పులు చేసుకోవాలని సూచించారని ఉదాహరిస్తూ ఉన్నారు. అయితే కరణ గ్రంథాలలో వివరించిన, గణిత – పట్టికల విషయాలు, తర్వాతి కాలంలోనూ సంస్కారం చేయాల్సి ఉందని, అది చేయకే, గ్రహస్థితిలో కొంత తేడా రావడం జరుగుతున్నదని అంటున్నారు.

జ్యోతిర్గణితం

ఈ తేడాను గమనించి, మహారాష్ట్రకు చెందిన దామోదర కేత్కర్ అనే జ్యోతిష పండితులు, గ్రహ గణితం విషయాల్లో చేసిన కృషి ఫలితంగా, “జ్యోతిర్గణితం” అనే సిద్ధాంత గణితం, రూపుదిద్దుకుందని,  దృక్పద్దతి  గణితాన్ని తెలుగువారైన పిడమర్తి వారు, దాతే, నిర్ణయ సాగర్ తదితర పంచాంగకర్తలు, సుమారు 150 ఏళ్ళ నుండి వినియోగిస్తున్నారని, వారి వాదన. దేశంలో వివిధ పంచాంగాలు ఉండడం వల్ల, పండగల, ఇతర ధార్మిక అంశాల్లో ప్రతిసారి వివాదం చోటు చేసుకుంటున్నది.

భారత ప్రభుత్వం దేశమంతటా ఒకే పంచాంగ గణితం ఉండాలని భావించి,  1953లో, “పంచాంగ సంస్కరణ సంఘం” ఏర్పాటుకు చొరవ తీసుకున్నది.

దృక్ గణిత పంచాగమే శాస్త్రీయం

ఈ సంఘం ద్వారా సైతం ద్రుక్ గణిత పంచాంగాన్ని అందరూ వాడాలని, అదే శాస్త్రీయ మని నిర్ణయించారు. అయితే సదరు సంఘ నిర్ణయంతో విభేదిస్తున్న కొందరు, పూర్వ పద్ధతి పంచాంగం, వాడడం వల్ల అట్టి గణితంతో చేసే, పంచాంగ గణితంలో , తిథి ఆదుల ఆద్యంతాలు, దృక్ గణిత పంచాంగంతో చేసే లెక్కకు పొంతన లేకుండా పోతున్నది. ఫలితంగా ప్రతిసారీ పండగ పర్వాల విషయంలో, భిన్నాభిప్రాయాలు పొడ చూపుతున్నాయి.

గతంలో పలుమార్లు, జ్యోతిష, ఆగమ, ధర్మశాస్త్ర సదస్సులలో భాగంగా, జ్యోతిష శాస్త్రం, పంచాంగాలు, పంచాంగాల ప్రామాణికత, ముహూర్త నిర్ణయాలు, కాలసర్ప, పితృ దోష విశ్లేషణలు, నామ నక్షత్ర ప్రాధాన్యత, కుజదోష ప్రభావం, జాతక ఫల నిర్ణయాలు, ఆధునిక దృకోణాల్లో, జ్యోతిష్యం విజ్ఞాన ప్రయోజనం, తదితర అంశాలపై సిద్ధాంతుల ప్రసంగాలు, చర్చలు, సంవత్సర పండుగల తేదీలు, సైద్ధాంతిక నిర్ణయాలు చేయడానికి విద్వత్ సభలు నిర్వహించారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎన్ని జరిగినా, బహు పండితులలో ఏకాభిప్రాయ సాధన సాధ్యం కాక పండగ  పబ్బాల విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉన్న ది. సైద్ధాంతిక ఏకాభిప్రాయ సాధన, దాని ఆచరణ ఎప్పటికైనా సాధ్యమేనా? అన్నది సమాధానం లభించని ప్రశ్నగానే మిగులుతున్నది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles