Sunday, December 22, 2024

టీడీపీ 2018-19లో చేసినట్టు టీఆర్ఎస్ యూ-టర్న్ తీసుకుంటుందా?

అశ్వనీకుమార్ ఈటూరు

  • అవధులు మీరి ప్రధానిపైన విమర్శలు
  • ఏపీ సీఎంపై మంత్రి ప్రశాంతరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
  • తెలంగాణ ప్రత్యేక దేశం కావాలంటూ మరో నాయకుడి వెర్రి గొంతుక
  • తెలంగాణ సెంటిమెంటును మళ్ళీ రాజేయడానికి టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తున్నదా?
  • దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేకత తగ్గుతుందా?

హైదరాబాద్: పంజాబ్ లో చేసినట్టుగానే తెలంగాణలో కూడా వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రమంతటా ధర్నాలు చేసింది. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులపైన వాగ్దాడి చేసేందుకు వరుసగా రెండు రోజులు మీడియా గోష్ఠులు పెట్టారు. తెలంగాణలో పండిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రం అంతటా శుక్రవారంనాడు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులను ఆదేశించారు.

ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను అధిగమించేందుకేనా?

తమ పట్ల ఉన్న వ్యతిరేకతను ఈ ఉద్యమం ద్వారా అధిగమించవచ్చుననే ఉద్దేశంతో స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంగా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ టీఆర్ఎస్ ను ఎట్లాగూ దాడులతో సతమతం చేస్తోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ బీజేపీ దాడులూ, మాటల ఈటలూ ఇంకా పెరుగుతాయి. హుజూరాబాద్ విజయంతో వచ్చిన హుషారుతో ఆ పార్టీ చెలరేగిపోతోంది. ఈ వాతావరణాన్ని అధిగమించడం కోసం టీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే బీజేపీ దాడులను ముమ్మరం చేసింది. రాష్ట్ర సరిహద్దులు దాటి విమర్శలు కురిపించింది.

పొరుగున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన తెలంగాణ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి విరుచుకుపడ్డారు. నిజానికి జగన్ కూ శుక్రవారంనాటి ధర్నాలకూ సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలు అడుక్కు తింటారనీ నాడు ఆంధ్ర రాజకీయవాదులు విమర్శించారనీ, ఇప్పుడు రోజు గడవాలంటే కేంద్రం దగ్గర జగన్ మోహన్ రెడ్డి చేయి చాస్తున్నారో చూడండంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

కరీంనగర్ కు చెందిన మరో నాయకుడు ప్రధాని నరేంద్రమోదీని తీవ్రపదజాలంతో దుయ్యపట్టి తెలంగాణను ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటూ మాట్లాడారు. కేసీఆర్ కుమార్తె, ఎంఎల్ సీ కవిత నిజామాబాద్ ఎంపీగా ఉండగా కశ్మీర్, తెలంగాణలను కేంద్రం బలవంతంగా కలుపుకున్నదంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. కరుణాసాగర్ కవితపైన దేశద్రోహం కేసు కూడా పెట్టారు.

తెలంగాణ సెంటిమెంటును రాజేస్తున్నారా?

ప్రస్తుత వాతావరణాన్ని గమనిస్తే కొత్త సీసాలో పాతసారా అన్నట్టుగానే కనిపిస్తోంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి తెలంగాణ పల్లవి అందుకుంటున్నది. ఆంధ్రులను రాక్షసులంటూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నీళ్లదొంగ అంటూ అభివర్ణించడం ద్వారా హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ప్రశాంతరెడ్డి చేసిన నిర్వాకం అదే. తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడమే. అయినా హుజూరాబాద్ లో పప్పులు ఉడకలేదు. ఇదంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడే ప్రారంభమైన ప్రచారంలాగా కనిపిస్తున్నది. 2018లొ కూడా కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం చేసేందుకు ఖమ్మంలో, ఆ తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టే వరకూ టీఆర్ఎస్ కూ, కేసీఆర్ కీ ఎన్నికల ప్రచారంలో ఇతివృత్తం లేదు. చంద్రబాబునాయుడు వచ్చిన తర్వాతనే తెలంగాణ సెంటిమెంటు రాజుకున్నది. బాబుగారి పాలన రిమోట్ ద్వారా అమరావతి నుంచి కావలో ప్రత్యక్షంగా హైదరాబాద్ నుంచి తన పాలన కావాలో కోరుకోమంటూ ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలు సానుకూలంగా స్పందించారు. అంతవరకూ కాంగ్రెస్ లేదా బీజేపీకి ఓటు వేయాలని తలపోసిన ఓటర్లు సైతం టీఆర్ఎస్ కే ఓటు వేసి గెలిపించారు. ఆ తర్వాత 2024 లోక్ సభ ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు ప్రభావం తెలంగాణ మీద లేదు. అందుకే తెలంగాణ సెంటిమెంటు కూడా బలహీనపడింది. అందుకే మొత్తం 17 లోక్ సభ స్థానాలలో నాలుగు బీజేపీకీ, మూడు కాంగ్రెస్ కీ, ఒకటి ఎంఐఎంకీ పోగా తొమ్మిది మాత్రమే టీఆర్ఎస్ కి దక్కాయి.  2018-19లో చంద్రబాబునాయుడు పోషించిన పాత్రనే ఇప్పుడు కేసీఆర్ పోషించాలని ఉబలాటపడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే టీఆర్ఎస్ నాయకులూ, శ్రేణులూ బీజేపీపై కాలుదువ్వుతున్నారు.

టీడీపీ విఫలమైన చోట టీఆర్ఎస్ సఫలమౌతుందా?

ఇప్పుడు టీఆర్ఎస్ ఆడుతున్న ఆటనే అప్పుడు టీడీపీ ఆడింది. నాలుగేళ్ళపాటు బీజేపీతో రాసుకొని పూసుకొని తిరిగిన చంద్రబాబునాయుడు అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకొని బీజేపీపైన ధ్వజమెత్తారు. భార్యని ఏలుకోలేని మోదీ దేశాని ఏమి ఏలుతారంటూ చురకలు తగిలించారు. దేశవ్యాప్తంగా పర్యటించి బీజేపీ, మోదీ వ్యతిరేక ప్రచారం చేశారు. చంద్రబాబునాయుడు అంతేవాసి, సినీనటుడు మురళీమోహన్ దేశాన్ని రెండు ముక్కలు చేసి దక్షిణభారతం, ఉత్తరభారతంగా పరిగణించాలని కోరారు. అసెంబ్లీలో చంద్రబాబునాయుడు మోదీపైన దాడి చేసేవారు. టీడీపీ శ్రేణులు బీజేపీ వ్యతిరేక ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఆ యూ-టర్న్ ఏపీలో విఫలమైంది. చంద్రబాబునాయుడు తన రాష్ట్రంలోనే చిత్తుగా ఓడిపోయారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ సీపీకి ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూ, కేసీఆర్ కూ భిన్నమైన ఫలితాలు వస్తాయా?

గత మూడేళ్ళలో బీజేపీని కానీ, ప్రధాని నరేంద్రమోదీని కాని పల్లెత్తు మాట అనని కేసీఆర్ ఇప్పుడు బీజేపీపైన ధ్వజమెత్తారు. మూడు వ్యవసాయ చట్టాల గురించి ఇప్పటి వరకూ ఒక అభిప్రాయం వెలిబుచ్చని కేసీఆర్ ఇప్పుడు మూడు చట్టాలనూ వ్యతిరేకిస్తున్నామని చెబుతూ నిరసనోద్యమం  సుదీర్ఘంగా నిర్వహిస్తున్న రైతులు సంఘీభావం ప్రకటించారు. పెట్రోలు, డీజిల్ రేట్లను తగ్గించాలంటూ మాట్లాడుతున్నారు. ఈ యూ-టర్న్ ఎటువంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

జనహృదయం గెలుచుకోవడం ప్రధానం

ఎప్పటి కప్పుడు ఎత్తులూ, పైఎత్తులూ వేస్తూపోతూ  రాజకీయాలు చేసే వారంటే ప్రజలకు గౌరవం ఉండదు. అటువంటి వ్యక్తులు ఎన్నికలలో గెలవవచ్చు. అధికారంలో కొంతకాలం ఉండవచ్చు. వందిమాగధులు భజన చేయవచ్చు. మనకు తిరుగులేదనే గర్వం పొడసూపవచ్చు. కానీ గత డెబ్బయ్ నాలుగేళ్ళ స్వతంత్ర భారత చరిత్రలోనే ప్రజలు ఆదరించి, గౌరవించిన ముఖ్యమంత్రులు ఉన్నారు. జ్యోతిబసు  మూడు దశాబ్దాలకు పైగా బెంగాల్ ముఖ్యమంత్రిగా చేశారు. బిజూ పట్నాయక్ కేంద్రమంత్రిగా, ఒడిశా ముఖ్యమంత్రిగా పని చేసి మన్ననలు అందుకున్నారు. ఆయన కుమారుడు నవీన్ పట్నాయక్ చాలా కాలంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పటికే నాలుగు విడతల విజయం సాధించిన నవీన్ మరోసారి గెలుస్తారు. స్వర్గీయ ఎన్ టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలను ప్రేమించారు. ప్రజాసేవ చేశారు. మోదీ సైతం గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు టరమ్ లు చేసి ప్రధానిగా ఎదిగారు. మొన్న ముఖ్యమంత్రి పదవిని తొలిసారి స్వీకరించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలలో కలిసిపోయి అందరితో స్నేహంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతిపక్షాన్ని గౌరవిస్తున్నారు. జయలలిత ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్ లను ఆమె ఫోటోలతో సహా కొనసాగిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆ విధంగా ముందుకు పోతే మంచి పేరు వస్తుంది. ఓటు బ్యాంక్ రాజకీయాలకంటే, ఎత్తులుపైఎత్తుల కంటే ప్రజల హృదయాలను గెలుచుకునే  ప్రయత్నం చేయడం మేలు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles