కృష్ణాజలాలు – 4
నదులను స్వాధీనం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంలోని జలశక్తి మంత్రిత్వ శాఖ 15జులై 2021న జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ అనేక రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తింది. ముందుగా అది రాజ్యాంగంలోని 14 అధికరణను ఉల్లంఘిస్తున్నది. ఎందుకంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలనూ అంతర్ రాష్ట్ర నదులు పారుతున్న తక్కిన రాష్ట్రాలకంటే భిన్నంగా పరిగణించినట్టు అవుతోంది. అన్ని రాష్ట్రాలనూ సమంగా చూడాలనే సూత్రానికి భంగం కలిగించారు. కేంద్రానికీ, రాష్ట్రాలకీ మధ్య అధికారాల పంపిణీ విషయంలో పాటించే సమాఖ్య స్ఫూర్తికి ఈ నోటిఫికేషన్ విరుద్ధం. నీరు రాష్ట్ర జాబితాలో ఉంది. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నదంటూ కేంద్రం తప్పుడు అన్వయం చేస్తోంది. అదే విధంగా 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలకు కూడా తప్పుడు భాష్యాలు చెబుతోంది. సాధారణంగా సార్వభౌమత్వాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య పంచుకోవాలని అనుకున్నా తమ నీటి విషయంలో నిర్ణయాలు తీసుకొని స్వయంనిర్ణయాధికారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉంది. చాలా సౌమ్యంగా చెప్పాలంటే, ఈ సమాఖ్య సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో నీరుగార్చారు.
Also read: నదుల నిర్వాహక మండళ్ళ నిర్వాకం
భారత దేశంలో 25 మేజర్ రివర్ బేసిన్లు ఉన్నాయి. ఉపబేసిన్ లు 103 ఉన్నాయి. ప్రతి బేసిన్ లోనూ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల నుంచి వచ్చే ఉపనదులు ఉంటాయి. ఈ నదులు మన ఆర్థిక వ్యవస్థకీ, వ్యవసాయానికీ, ఆహారభద్రతకీ పెద్ద వెన్నుదన్ను. ఇదే కాకుండా నదీతీరాలలో నాగరికత విస్తరిస్తుంది. చాలా సందర్భాలలో నదీజలాలను వనరులుగా వినియోగించి స్వప్రయోజనాలకోసం వాడుకోవాలని రాజకీయ నాయకులు ఆరాటపడతారే కానీ నదులను రక్షించాలనీ, వాతావరణాన్ని పరిరక్షించానీ భావించరు. నదీ జలాల పంపిణీ విషయంలో ఎదురయ్యే వివాదాల పరిష్కారానికి మనం ఇంకా ఒక పద్ధతి పెట్టుకోలేదు. వనరుల పంపిణీలో సహకార పద్ధతిని అవలంబించే ఆలోచన కూడా చేయలేదు. ఇది మన ఆనవాయితీ కాదు. మన చరిత్రలో సహకార భావన లేదు. రాజ్యాంగబద్ధంగా ఇందుకు తగిన ఏర్పాట్లూ జరగలేదు.
స్వాతంత్ర్యసిద్ధికి పూర్వం మనం మన సార్వభౌమత్వాన్ని బ్రిటిష్ పాలకులకు అప్పగించినట్టే బాగా కేంద్రీకృతమైన యూనియన్ ప్రభుత్వం అజమాయిషీలో అరకొర చర్యలతోనే కాలక్షేపం చేస్తున్నాం. దిల్లీ సర్వాధికారాలకూ కేంద్రం కనుక రాజాస్థానాలూ, రాష్ట్రాలూ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కు పూర్తిగా లోబడి ఉండేవి. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆదేశాలు కచ్చితమైనవి. అన్నిప్రిన్స్ లీ స్టేట్స్ కూ, రాష్ట్రాలకూ శిరోధార్యమైనవి. జలవనరుల వినియోగం విషయంలో ప్రావిన్స్ లకు నిర్ణయాధికారం బొత్తిగా లేకుండా మొత్తం సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ చేతిలో కేంద్రీకృతం చేస్తూ 1919లో, 1935లో తెచ్చిన ఇండియా యాక్ట్ ల ఫలితం అది. సాగునీటి విషయంలో మాత్రం స్వయంనిర్ణయాధికారాలు 1919 చట్టంలోని మొదటి షెడ్యూల్ లోని రెండో భాగంలో ఏడో అంశంగా ఉండేది.
Also read: విభజన రాజ్యాంగపరమైన అవసరం
రాజ్యాంగాధికారాల పంపిణీ
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అమలులోకి తెచ్చుకున్న మన రాజ్యాంగం ప్రకారం కేంద్రానికీ, రాష్ట్రాలకీ మధ్య శాసనపరమైన అధికారాలూ, పాలనాపరమైన అధికారాలూ పంచారు. రెండో జాబితాలో (అంటే రాష్ట్ర జాబితాలో) 17వ ఎంట్రీలో నీరు అనే మాట ఉంది. మొదటి జాబితాలో (కేంద్ర జాబితాలో) అంతర్ రాష్ట్ర నదులు అనే మాట 56వ ఎంట్రీలో ఉంది. ఆ రకంగా నదీ జలాల విషయంలో పెద్దగా వివరించకుండా అధికారాల పంపిణీ అస్పష్టంగా జరిగింది.
ఒక నది నీటిని కానీ నదీలోయలోని నీటిని కానీ నియంత్రించడం, పంపిణీ చేయడం, వినియోగించడం విషయంలో ఫిర్యాదులు వచ్చినా, వివాదాలు చెలరేగినా వాటిని పరిష్కరించే విధంగా శాసనాలు చేసే అధికారం రాజ్యాంగం 262(1) అధికరణ పార్లమెంటుకు దఖలు పరిచింది. 262 (1) అధికరణ కింద ప్రస్తావించిన వివాదాలనూ, విజ్ఞప్తులనూ పరిష్కరించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాల పరిధులను సైతం పరిగణించనవసరం లేదు.
రెండో జాబితాలో 17వ ఎంట్రీ: నీరు, అంటే నీటి సరఫరా, సాగునీరు, కాల్వలు, డ్రైనేజీ, కరకట్టలు, నీటి నిల్వ, జలవిద్యుత్తు వంటి అంశాలన్నీరెండో జాబితాలో ఉంటాయి – 56వ ఎంట్రీకి అనుగుణంగా.
మొదటి జాబితా (యూనియన్ లిస్టు) ఎంట్రీ 56 ప్రకారం రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్: అంతర్ రాష్ట్ర నదీజలాల అభివృద్ధి, నదీలోయల అభివృద్ధి ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా పార్లమెంటు చట్టం చేసినంత మేరకు కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు. శాసనం చేసే అధికారాలనూ, పరిపాలన అధికారాలనూ మూడు జాబితాలోనూ పంపిణీ చేశారు. ఏ జాబితాలో ఏయే అంశాలైతే ఉంటాయో ఆయా అంశాలకు సంబంధించి శాసనాలు చేసే అధికారం రాష్ట్రాలకీ, లేదా కేంద్రానికీ ఉంటాయి.
రాష్ట్ర జాబితాలో కేవలం నీరు అని మాత్రమే ఉంటుంది. అంటే రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఉపరితల జలాలు అని అర్థం. నదులూ, ఉపనదులూ ఎక్కడ పుట్టినా, ఎక్కడి నుంచి ప్రవహిస్తూ రాష్ట్రంలో ప్రవేశించినా, రాష్ట్రం నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ సాగరంలో సంగమిస్తున్నా సరే ఒక రాష్ట్రం పరిధిలో ఉన్న జలాల నియంత్రణ, నిర్వహణకు సంబంధించి ఆ రాష్ట్రం శాసనాలు చేయవచ్చును. పాలనాపరమైన నిర్ణయాలూ తీసుకోవచ్చును. అయితే దేశ హితం కోసం ఏమి చేయాలని యూనియన్ ప్రభుత్వం భావిస్తున్నదో దానికి లోబడే రాష్ట్ర నిర్ణయాలు ఉండాలి.
యూనియన్ పాత్ర
ఈ విషయంలో యూనియన్ పాత్ర కీలకమైనది. ఇదే విషయాన్ని ఉమ్మడి జాబితాలో ఆర్థిక, సామాజిక ప్రణాళిక పద్దు కింద 20వ ఎంట్రీ నొక్కి చెబుతోంది. భారీ, మధ్యతరహా ఇరిగేషన్ ప్రాజెక్టులూ, జలవిద్యుచ్ఛక్తి కర్మాగారాల నిర్మాణానికి ముందు వాటిని జాతీయ ప్రణాళికలో చేర్చడానికి వీలుగా కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు పొందాలి. కనుక శాసనం ఏదీ లేకుండానే యూనియన్ ప్రభుత్వానికి నియంత్రణ అధికారాలు గణనీయంగా ఉన్నాయి.
అదే సమయంలో అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద పరిష్కారానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ శాసనాలను చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నది. నీటి సరఫరానూ, సాగునీటి వినియోగాన్నీ, కాల్వల నిర్వహణనూ, డ్రైనేజీ కాల్వల నిర్వహణనూ, కరకట్టలనూ, నీటి నిల్వనూ, జలవిద్యుచ్ఛక్తినీ నియంత్రించేందుకు రాష్ట్ర జాబితాలోని 17వ ఎంట్రీ ద్వారా రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయి. అధికార వికేంద్రీకరణలో ఉన్న ఈ అస్పష్టత నీటి పంపిణీలో సమస్యలు ఉత్పన్నం కావడానికి దారి తీసే ప్రమాదం మాత్రం ఉంది.
Also read: జలవివాదానికి ఉత్తమ పరిష్కారమార్గం సూచించిన ప్రధాన న్యాయమూర్తి