పవన్ కల్యాణ్ సినిమా వేదికను రాజకీయాలకు వినియోగించడం తప్పు. పవన్ కల్యాణ్ మాటలకు పోసాని కృష్ణ మురళి అంత ఘాటుగా స్పందించడం అనవసరం. మోతాదు మించిదే ఏదైనా వికటిస్తుంది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించీ, చిరంజీవి కుమార్తె గురించీ నోటికొచ్చినట్టు పోసాని మాట్లాడటం ఏ మాత్రం సమర్థనీయం కాదు. అందరూ ఖండించాల్సిన అవాంఛనీయమైన ధోరణి అది. పోసాని తన నాయకుడు, అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మెప్పించదలచుకుంటే పవన్ కల్యాణ్ ని రాజకీయంగా ఎంతయినా ఎండగట్టవచ్చు. తమ్మారెడ్డి భరద్వాజ సముచితంగా, మృదువుగా సలహా చెప్పినట్టు పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి సినిమావారికి అనవసరం. రాజకీయంగా ఎంత ఘాటుగానైనా విమర్శించుకోవచ్చు.
‘రిపబ్లిక్’ సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడటం వల్ల సినీ పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లుతుంది. అందుకే కొందరు నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవలసి వచ్చింది. నానీని కలుసుకున్నవారిలో మెగా కుటంబానికి సన్నిహితుడైన దిల్ రాజు కూడా ఉన్నారు. చిరంజీవి కూడా పవన్ కల్యాణ్ మాటలకు చింతిస్తున్నట్టు చెప్పారని పేర్నినాని అన్న మాటలు పవన్ కల్యాణ్ కు మాత్రం ఏమి గర్వకారణం.
తాను కులాలకు అతీతుడినని చెప్పుకుంటూనే కమ్మవారిని అణచివేస్తున్నారనీ, కాపుకులంవారిని వేపుకు తింటున్నారనీ రాజకీయ ప్రసంగం చేయడం పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కల్యాణ్ ప్రభుత్వంపైన దాడి చేయవచ్చు. ఎంత ఘాటుగానైనావిమర్శించవచ్చు. ప్రభుత్వ విధానాలను దుయ్యపట్టవచ్చు. కానీ కులం కుంపట్ల ప్రస్తావన తేవడం అవివేకం.
పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పన్నిన వలలోకి నడుస్తున్నట్టు కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన, బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేయాలన్నది నాయుడి లక్ష్యం. ఆ లక్ష్య సాదనకోసం పవన్ కల్యాణ్ పైన మెండ్ గేమ్స్ తెలుగుదేశం నాయకులూ, ఆ పార్టీకి వత్తాసు పలికే పత్రికలూ కొంతకాలంగా ఆడుతున్నాయి. బీజేపీ జనసేన దూరం అవుతోందని వార్తలూ, వ్యాఖ్యాలూ టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్నాయి. టీడీపీ చేతిలో ఉన్న సోషల్ మీడియా అయితే చాలా ముందుండి వ్యవహారం నడిపిస్తోంది. వారి క్రీడాకౌశలం ముందు జనసేనాధిపతి ప్రావీణ్యం దిగదుడుపే. చంద్రబాబునాయుడు పాచిక పారినట్టే కనిపిస్తోంది. సినిమా ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు చూస్తే త్వరలోనే బీజేపీతో తెగతెంపులు చేసుకొని టీడీపీతో మళ్ళీ సంబంధాలు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో మలుపు తీసుకోవడానికి పవర్ స్టార్ సన్నద్ధమైన దృశ్యం కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్లు అమ్ముతే తనకు నష్టమనీ, తన నిర్మాతలకు నష్టమనీ పవన్ కల్యాణ్ భావించవచ్చు. కానీ కొందరు నిర్మాతలు స్వయంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సినిమా టిక్కెట్లు ప్రభుత్వం అమ్మితేనే నయమని చెప్పిన విషయం పవన్ కల్యాణ్ కి తెలియదా? పవన్ కల్యాణ్ వల్ల సినిమా పరిశ్రమకు నష్టం కలుగుతోందని రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. పేర్ని నాని పవన్ కల్యాణ్ పైన అడ్డగోలుగా తిరుగు దాడి చేయడాన్ని కూడా గమనించాలి. రాజకీయాలలో ఉన్నవారు తమ ప్రయోజనాలు రక్షించుకోవడానికి ఎంత దూరమైనా పోతారు. సినిమా పరిశ్రమతో సంబంధాలు లేకపోతే పవన్ కల్యాణ్ ఏ విధంగా మాట్లాడినా చెల్లుతుంది. కానీ పవన్ కల్యాణ్ స్వయంగా సినిమాలలో వేషాలు వేస్తన్నారు. పవన్ కల్యాణ్ కుటుంబం యావత్తూ టాలీవుడ్ పైనే ఆధారపడి జీవిస్తున్నది. మెగాస్టార్ చిరంజీవిని పెద్దదిక్కుగా సినీపరిశ్రమ పరిగణిస్తున్నది. దాసరి నారాయణరావు మరణించిన తర్వాత సినీ పరిశ్రమకు దిక్కు మెగాస్టారే. ఆయన అందుకు తగినట్టుగానే అందరినీ కలుపుకొని పోతున్నారు. మెగా కుటుంబం నుంచే అరడజను మంది హీరోలు తయారైనారు. ప్రభుత్వాలతో జగడాలు పెట్టుకుంటే సినీపరిశ్రమ మనజాలదు. ఒక్క పవన్ కల్యాణ్ వల్ల సినీ పరిశ్రమ మొత్తం నష్టపోవడానికి సిద్దంగా ఉండదు. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలలో గెలుపొంది అధికారంలోకి వస్తాడన్న విశ్వాసం ఉంటే వచ్చే రెండున్నర సంవత్సరాలూ నెట్టుకురావచ్చని సనీపరిశ్రమలో బాధ్యులు అనకుంటారు. 2019 ఎన్నికల కంటే కొద్ది శాతం మొన్న మునిసిపల్ ఎన్నికలలో జనసేనకు పెరిగాయి. అది స్వల్పంగానే. వైసీపీని కొట్టగలిగే స్థాయి ఇంకా రాలేదు. మాటలే కోటలు దాటుతున్నాయి. అధికారంలోకి వచ్చే ఎన్నికలలో ఖాయంగా వస్తామని చెప్పగలిగే సీను లేనప్పుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వంపైన దాడిని ముమ్మరం చేయడం ఏమాత్రం శ్రేయస్కరం?