Thursday, December 26, 2024

విపక్షాల కల సాకారం అవుతుందా?

  • ప్రతిపక్షాలలో ప్రధాని పాత్రపైన ఏకాభిప్రాయం కుదురుతుందా?
  • ప్రధాని కావాలని కలలు కంటున్న అనేకమంది నాయకులు

ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే రాజకీయ పార్టీలు పొత్తులపై దృష్టి సారించడం సాధారణమైన విషయం. మళ్ళీ అందలమెక్కడానికి అధికార పక్షం, పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాన విపక్షం ఎన్ని కుస్తీలు పట్టాలో అన్నీ పడతాయి. అధికారానికి దూరమై చాలాకాలం పట్టిన పార్టీలు మరింత దూకుడును పెంచుతాయి. జాతీయ రాజకీయాల ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. రేపటి సార్వత్రిక ఎన్నికల సమయానికి అధికారం కోల్పోయి పదేళ్లు పూర్తవుతుంది. పదేళ్లంటే తక్కువ కాలం కాదు. రెండు పర్యాయాలు ఓడిపోయినట్లు. ఒకప్పుడు ప్రతిపక్షాలన్నీ ఇందిరాగాంధీని ఎప్పుడు గద్దె దింపాలా అని చూసేవి. ఇప్పుడు నరేంద్రమోదీని పదవీ భ్రష్టుడని చేయాలని చూస్తున్నాయి. ఈ ఇద్దరూ బలమైన, జనాకర్షణ కలిగిన నాయకులై ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. నియంతృత్వ పోకడలతో ముందుకు వెళ్తున్నారని ప్రధానమైన విమర్శ. అప్పుడు ఇండియా అంటే ఇందిరా. నేడు భారత్ అంటే మోదీ. ఈ ఇరునాయకుల నేపథ్యం ఏదైనా ప్రభావ శీలురైన విజేతలుగా చరిత్రకెక్కారు. విపక్షాలతో పాటు మీడియా మొదలు అన్ని వ్యవస్థలనూ కాళ్ళ కింద తొక్కే విధంగా ఎమర్జెన్సీని విధించారని ఇందిరాగాంధీ చెడ్డపేరు మూటగట్టుకున్నారు. ప్రతిపక్షాలపై కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పి, కబంధ హస్తాలలో

మగ్గించాలని, మీడియాను సైతం తన చేతికింద ఉంచుకోవాలనే ధోరణులతో నరేంద్రమోదీ నడుస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విపక్షాల భయాందోళనలు

మళ్ళీ నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే భరించరాని పరిణామాలు వస్తాయనే భయంలో విపక్షాలు ఉన్నాయి. అధికారాన్ని దక్కించుకోవాలనే ఆశ ఎలాగూ ఉంటుంది. ఈ తరుణంలో, దేశంలోని మోదీ వ్యతిరేకశక్తులన్నీ ఏకమవ్వడానికి నానా యాతనలు పడుతున్నాయి. కర్ణాటకలో బిజెపి ఓటమి, కాంగ్రెస్ గొప్ప గెలుపుతో ఈ వర్గాలకు మరింత ఆత్మవిశ్వాసం పెరిగినట్లుంది. ఆ మధ్య మమతా బెనర్జీ, కొన్నాళ్ల క్రితం శరద్ పవార్, మధ్యలో కేసీఆర్ – ఇంకోపక్క కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నితీష్ కుమార్ ఈ పాత్రపోషణ ఎంచుకున్నారు. అఖిలేష్ యాదవ్, స్టాలిన్ వంత పాడుతూనే ఉన్నారు. సరే! కేజ్రీవాల్ గొంతు కాస్త ఎక్కువ పెంచుతున్నాడు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, శరద్ పవార్, నితీష్ కుమార్ ఎవరికి వారు తామే ప్రధానమంత్రి అభ్యర్థి అనుకుంటున్నారు. ఆ మాట కొస్తే ఈ ఆశ కేజ్రీవాల్ కూ లేకపోలేదు. ఆచరణలో సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నప్పటికీ, ఎవడి గోల వాడిది.

ఇదుగో ఈ జూన్ 12వ తేదీన పాట్నాలో విపక్షాల భేటీకి ముహూర్తం ఖరారైంది.

సుమారు 20 ప్రతిపక్షపార్టీలు ఇందులో పాల్గొంటాయని సమాచారం. ప్రధాన ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్ ఎలాగూ ఉంటుంది. దీనికి తోడు వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ మొదలైనవి అందులో ఉంటాయి.

ఆవేశంతో అధికారం దక్కదు

లోక్ సభ ఎన్నికల్లో బిజెపి/ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా ఈ భేటీలో చర్చకు వస్తుంది. ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాన భూమికను పోషిస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు. కాబట్టే, పాట్నాను క్షేత్రంగా ఎంచుకున్నారని భావించాలి. ఈ క్రమంలో, ఒక వారం కిందటే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో నితీష్ కుమార్ భేటీ అయ్యారు. విపక్షాల మధ్య ఐక్యతను సాధిస్తే తప్ప కాగల కార్యాన్ని సాధించలేమని వీరి ఏకాభిప్రాయం. మొన్న కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి పలువురు విపక్షనేతలు హాజరయ్యారు. తమ మధ్య గొప్ప ఐక్యత ఉందని చాటిచెప్పడానికి ప్రయత్నం చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేసే దిశగానూ పలువురు ప్రతిపక్ష నేతలు కేజ్రీవాల్ కు మద్దతు ప్రకటించారు. తాజాగా జరిగిన

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి కూడా చాలా ప్రతిపక్షాలు దూరంగా ఉన్నాయి. ఇవన్నీ ప్రతిపక్షాల ఆక్రోశానికి అద్దం పడుతున్నాయి. కేవలం ఆవేశం, అరుపులు, కేకలతో అధికారాన్ని ఎవ్వరూ దక్కించుకోలేరు, ఇంకొకరి అధికారాన్ని దించలేరు. ప్రజాభిమానమే ప్రధానమైన బలం. ప్రజావ్యతిరేకతే ప్రధాన శాపం. ప్రజలు ఏ పక్షానికి వరాన్ని ఇస్తారో? శాపాన్ని, కోపాన్ని చూపిస్తారో ఎన్నికలయ్యే దాకా ఎవ్వరూ పూర్తిగా చెప్పలేరు.

ఐక్యత ఏ మేరకు ఉంటుందో?

ఉత్తరాదిలో ఎట్లా ఉన్నప్పటికీ, దక్షిణాదిలో బిజెపి బలం పెంచుకోవడంలో వెనుకబడుతోంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ లో వచ్చిన ఫలితాలే దానికి అద్దం పడతాయి. తెలంగాణలో బిజెపి బలం బాగా పెరిగిందనే వార్తలు నిన్నమొన్నటి దాకా వినపడ్డాయి.ఇప్పుడు దృశ్యం మారిందంటున్నారు. రేపు తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమైన పోటీ బిఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యనే ఉంటుందనీ, బిజెపి మూడో స్థానంలోకి పడిపోయిందని ఎక్కువ ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా

బిజెపి చీలిపోయిందనే మాటలు వినపడుతున్నాయి. బిజెపి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఈసారి వ్యూహ రచనను మరింత పదును పెట్టాల్సివుంది. ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎవరుంటారన్న విషయం కూడా విపక్షాల ఐక్యత, ప్రయాణంపై

ప్రభావం చూపిస్తుంది. ఫైర్ బ్రాండ్ గా పేరున్న మమతా బెనర్జీ, చంచల స్వభావిగా పేరుపడిన నితీష్ కుమార్, అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ యాదవ్ వంటివారి మధ్య ఐక్యత ఏ మేరకు ఉంటుందో చూడాలి.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles