వోలేటి దివాకర్
గంగిగోవు పాలు గరిటడైనను చాలు… కడివెడైనను చాలవు కరము పాలు..అన్న సామెత పరమార్థాన్ని గ్రహించి రాజకీయ పార్టీలు తమ సభలకు భారీగా జనాన్ని తరలిస్తున్నాయి. ఇటీవల సంభవించిన మరణాల దృష్ట్యా పార్టీలు తమ విధానాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తమ పథకాలు, విధానాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాజకీయ పార్టీలు సభలు.. సమావేశాలు నిర్వహిస్తాయి. సభలకు హాజరైన ప్రజలు నాయకుల మాటలను వినకపోతే వాటి మౌలిక ఉద్దేశమే దెబ్బతింటుంది.
Also read: అమరావతి రైతులకు అరసవిల్లి వెళ్లే భాగ్యం లేదా?!
రాజమహేంద్రవరంలో పెన్షన్ పెంపు వారోత్సవాల సభ జరిగింది. ఈ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నగరంలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సభకు రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేశారు. జన సమీకరణకు రెండు రోజుల ముందు నుంచే వలంటీర్లు లబ్ధిదారులకు ఫోన్లు చేసి ముఖ్యమంత్రి సభకు రాకపోతే పథకాలు నిలిపివేస్తామని బెదిరించారు. దీంతో భయపడిన లబ్దిదారులు ఇష్టం లేకపోయినా సిఎం సభకు హాజరుకావాల్సి వచ్చింది. వచ్చిన లబ్దిదారులతో సంతకాలు తీసుకుని, ఆర్టీసీ, స్కూలు బస్సుల్లో ఎక్కించి, ఆర్ట్స్ కళాశాలలోని సభా ప్రాంగణానికి తరలించారు. పెన్షన్లు పొందుతున్న వృద్ధులు, దివ్యాంగులు సభకు వచ్చి ఇబ్బందులు పడగా… సిఎం సభతో రాజమహేంద్రవరం నగరంలోని చిరువ్యాపారులు, స్థానిక ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. సభా ప్రాంగణాన్ని పోలీసులు దిగ్బంధించడంతో సభకు వచ్చిన సగం మంది మైదానం బయటే ఉండిపోవాల్సి వచ్చింది. సభకు హాజరైన వారు కూడా ముఖ్యమంత్రి, ఇతర నాయకుల ప్రసంగాన్ని వినేందుకు కనీస ఆసక్తి చూపించలేదు. ఎప్పుడెప్పుడు ఇళ్లకు వెళ్లిపోదామా అనే ఆతృతలో కనిపించారు.
Also read: కాంగ్రెస్ ఒంటరి పోరు!..2024 కాంగ్రెస్ దేనట!
జన సమీకరణపై కాకుండా వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు ప్రభుత్వ విధానాలను, పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజల నోళ్లలో నానే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇతర అతిధులు మాటల్లో లబ్దిదారులు ఏం అర్థం చేసుకున్నారో చెప్పాలని, అక్షరాస్యులు రాసి చూపించాలని ఆదేశాలు ఇచ్చినా కనీసం 50 శాతం జగన్ సర్కారు విధానాలు, పథకాలు ప్రజల్లోకి వెళ్లే వీలుండేది. ఈ విధానాలు ఇటు లబ్దిదారులకు, అటు నాయకులకు ఉపయుక్తంగా ఉండేది. తద్వారా ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో చర్చ జరిగేది. ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ విధానాలపై ఆసక్తి ఉన్న వారు ఎలాగూ సభకు హాజరై, సౌకర్యవంతంగా ప్రసంగాలు వినే అవకాశం ఉండేది. భారీ ఏర్పాట్లకు అయ్యే ప్రజాధనం వృధా తగ్గేది… నాయకులకు కూడా శ్రమ, ఖర్చులు తగ్గేవి. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు జనసమీకరణపై కాకుండా తమ విధానాలు… పధకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేస్తే సభల్లో తొక్కి సలాటలు, ప్రజలకు ఇబ్బందులు తప్పించినట్టవుతుంది.
Also read: సొంత జనంతో ‘మార్నింగ్ షో’