తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో, పరిస్థితులు బీజేపీ అంచనాకు తగినట్టుగానే రూపొందుతున్నాయని అనిపిస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) బీజేపీ పన్నిన వలలోకి నడుస్తున్నారా? ఆయన బీజేపీ పట్ల కఠినంగానూ, మజ్లిస్ పట్ల ఉదారంగానూ ఉన్నారనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోందా? అటువంటి అభిప్రాయం కలగడమే బీజేపీకి కావలసింది.
ఆగస్టు 21న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరిన సందర్భంలో మునుగోడులో నిర్వహించిన బహిరంగసభలో దేశీయాంగమంత్రి అమిత్ షా ప్రసంగించారు. అందులో కేసీఆర్ ని కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ప్రత్యక్షంగా విమర్శించలేదు. అంతకు ముందు జులై 3న బీజేపీ కార్యవర్గ సమావేశం ముగింపు సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. అందులోనూ కేసీఆర్ లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఊసులేకుండానే, పల్లెత్తు మాట అనకుండానే ప్రసంగం ముగించారు. తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ ని కోరుకుంటున్నారని మాత్రమే ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనాయకులిద్దరూ మాటల తూటాలూ పేల్చకుండా నిఘా సంస్థలను ఉసిగొల్పాలని నిర్ణయించినట్టు కనిపిస్తున్నది. హైదరాబాద్ నుంచి దిల్లీలో అమిత్ షా విమానం దిగిన వెంటనే ఎన్ఫోర్ష్ మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) హైదరాబాద్ లో బడా వ్యాపారసంస్థలపైన దాడులు ప్రారంభించింది. ఇద్దరు అంతగా ప్రముఖులు కాని బీజేపీ నేతలు దిల్లీ మద్యం వ్యాపారానికి సంబంధించిన కుంభకోణంలో ఎంఎల్ సీ కవితకు ప్రమేయం ఉన్నదనీ, హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మద్యం వ్యాపారులతో వచ్చి అయిదు నక్షత్రాల హోటల్ గదిలో చర్చలలో ఆమె పాల్గొన్నారనీ ఆరోపించారు. ఈ విషయంలోవారి మాట విశ్వసించడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. దిల్లీ మద్యం వ్యాపారానికి కవితకూ ముడిపెట్టడం అసంగతంగా కనిపిస్తోంది. కనుక ఆ విషయాన్ని అక్కడే వదిలేస్తే సరిపోయేది. కేసీఆర్ కూతురు కవిత కనుక, తనపైన బురద చల్లడం ద్వారా తన తండ్రిని బదనాం చేస్తున్నారంటూ ఒక ప్రకటన విడుదల చేయడం సమంజసంగానే ఉన్నది. ఆ మద్యం వ్యవహారంతో తనకు ప్రమేయం లేదనీ, తన పైన తప్పుడు ఆరోపణలు చేసినవారిపైన పరువునష్టం దావా వేస్తున్నాననీ కవిత ప్రకటించారు. ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. అంతటితో వదిలిపెట్టినా సరిపోయేది. టీఆర్ఎస్ మంత్రులూ, ఎంఎల్ఏలూ, ఇతర నాయకులూ పెద్ద సంఖ్యలో కవిత నివాసానికి వెళ్ళి ఆమెను పరామర్శించడం, సంఘీభావం తెలపడం అవసరమా? దీనికి ఇంత ప్రచారం లభించడం బీజేపీ కోరుకున్నట్టుగానే జరిగింది. ఈ ప్రచారం వల్ల టీఆర్ఎస్ కు కానీ కవితకు కానీ కేసీఆర్ కి కానీ ఏ మాత్రం ప్రయోజనం లేదు. ప్రయోజనం ఏమైనా ఉంటే అది బీజేపీకే.
హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ను పిలిపించుకొని హైదరాబాద్ లో మతపరమైన గొడవలు జరగకూడదంటూ కేసీఆర్ స్పష్టం చేసి ఉంటే సరిపోయేది. ఏ పార్టీవారైనా, ఏ మతానికి చెందినవారైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వదిలిపెట్టవద్దంటూ ఆదేశిస్తే పోలీసులు తమ పని తాము చేసుకునేవాళ్ళు. సీవీ ఆనంద్ కూ, హైదరాబాద్ పోలీసులకూ ఆ సామర్థ్యం ఉన్నది. స్టాండప్ కమేడియన్ మున్వర్ ఫారుఖీ ప్రదర్శన పోలీసుల సహకారంతో జయప్రదంగా ముగిసిందని హాస్యనటుడినీ, ఆ కార్యక్రమాన్నీ విమర్శించిన బీజేపీ ఘోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. 20వ తేదీ ఈ కార్యక్రమం జరిగితే 19వ తేదీనే రాజాసింగ్ ని గృహనిర్బంధంలో ఉంచారు. అతనికి కావలసింది అదే. ఆ తర్వాత రాజాసింగ్ వీడియో పెట్టడం, అందులో మహమ్మద్ ప్రవక్తపైన చేయరాని వ్యాఖ్యలు చేయడం, లోగడ నుపుర్ శర్మను బీజేపీ నుంచి సస్పెండు చేసినట్టే ఇప్పుడు రాజాసింగ్ ను కూడా చేయడం తెలిసిందే. ఇస్లాంమత అనుచరులకు ఖేదం కలిగించే వీడియోను ఎందుకు పోస్ట్ చేశావంటూ ఒక ఎఫ్ఐఆర్ ను దాఖలు చేసి ఉంటే సరిపోయేది. అరెస్టు చేయడం ఆ దశలో అనవసరం. శాంతిభద్రతల దృష్ట్యా అరెస్టు చేయవలసి వస్తే సీఆర్ పీఎస్ 45 ఎ సెక్షన్ కింద నోటీసు జారీ చేయడం అనే పద్ధతిని పాటించవలసింది. అటువంటి నోటీసు జారీ చేయలేదు కనుక అరెస్టు చెల్లనేరదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. విడుదలైన తర్వాత విజయసంకేతం (విక్టరీ సింబల్ ) చూపిస్తూ బయటికి వచ్చిన రాజాసింగ్ తానేదో విజయం సాధించినట్టు కనిపించారు.
బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేయడం బొత్తిగా అనవరసరం. అతడు ఇంకా రెండు రోజులు పాదయాత్ర చేసి ముగించేవారు. ముగింపు సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించేవారు. ఆకాశం ఊడి మీద పడేది కాదు. ఎవరిదారిన వారు పోయేవారు. అటువంటి పరిస్థితిలో సంజయ్ ను అరెస్టు చేయడంతో బీజేపీ పట్ల కేసీఆర్ ప్రభుత్వ కఠినంగా వ్యవహరిస్తుందనే అభిప్రాయం జనానికి కలిగి ఉంటుంది.
అదే సమయంలో మంగళవారం రాత్రి, బుధవారంనాడు పాతబస్తీలో ప్రదర్శనలను అనుమతించడం, ప్రదర్శనలు నిరోధించడానికి ప్రయత్నం చేయకపోవడంతో మజ్లీస్ పట్ల కేసీఆర్ ప్రభుత్వ మెతకవైఖరి ప్రదర్శిస్తోందనే అభిప్రాయం కలుగుతోంది. బీజేపీకి కావలసింది సరిగ్గా ఇటువంటి అభిప్రాయమే. బీజేపీ ప్రదర్శకుల పట్ల వ్యవహరించిన రీతిలోనే మజ్లీస్ ప్రదర్శకుల పట్ల వ్యవహరించి ఉండవలసింది. ప్రదర్శకులు ఎవరైనప్పటికీ పోలీసులు నిగ్రహం, సంయమనం ప్రదర్శించాలి. తాను బీజేపీ పట్ల కఠినంగానూ, మజ్లీస్ పట్ల మెతకగానూ ఉన్నట్టు ప్రజలకు అర్థం కావడం అనర్థదాయకమని కేసీఆర్ కు తెలియకపోలేదు. ఆయన ప్రమేయం లేకుండానే అట్లా అర్థం అవుతున్నారు. అందుకే మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది.
ఇటువంటి సందర్భాలలోనే మహానుభావుడు ఎన్ టి రామారావు గుర్తుకొస్తారు. 1984లో పాతబస్తీలో అల్లర్లు జరిగినప్పుడు సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఆంజనేయరెడ్డి ఉండేవారు. పార్టీ, మతం అంటూ చూడకుండా ఎవరైతే మలకలహాలు సృష్టిస్తున్నారో వారిపైన కఠినంగా వ్యవహరించమని ఏకవాక్య ఆదేశం ఎన్టీఆర్ జారీ చేశారు. హిందూ, ముస్లిం నాయకులను చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో సలావుద్దీన ఒవైసీని కూడా బలవంతంగా వ్యాను ఎక్కించి తీసుకుపోయారు. శాంతిభద్రతలు పునరుద్దరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ హైదరాబాద్ లో మతకలహాలు జరగలేదు. ఒక నేదురుమిల్లి జనార్దనరెడ్డి హయాంలో ఎవరో రాజకీయులు సృష్టించిన అల్లర్లు మాత్రం మినహాయింపు. అతికి పోకుండా నిబంధనలకు పరిమితమై పనిచేయడంలో హైదరాబాద్, ముంబై పోలీసులు సమర్థులు. అత్యాచారాలకు పోకుండా ఒక కంట కనిపెడుతూ, పోలీసులకు స్వేచ్ఛ ప్రసాదిస్తే వారు తమ సామర్థ్యం ప్రదర్శించి సత్ఫలితాలు సాధిస్తారు.