అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పునరుద్ధరణ ఒక్కటే చెప్పుకోదగిన విశేషం. హిందీ రాష్ట్రాలలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య యుద్ధంపైన జాతీయ మీడియా దృష్టి కేంద్రీకరించింది. ఈ దక్షిణాది రాష్ట్రంలో జరుగుతున్న బహుముఖ పోటీలో స్పష్టమైన తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం జాతీయ రాజకీయాలపైన కూడా ఉంటుంది. రెండేళ్ళ క్రితం వరకూ తెలంగాణలో కాంగ్రెస్ దీనావస్థలో ఉంది. 2018లో అవమానకరమైన పరాజయం (28 శాతం ఓట్లూ, 119 అసెంబ్లీ స్థానాలలో కేవలం 19 స్థానాలు గెలుచుకోవడం), అనంతరం లోక్ సభ ఎన్నికలలో మూడు స్థానాలు గెలుచుకొని నాలుగు స్థానాలు సాధించిన బీజేపీ తరువాత స్థానంలో, మూడో స్థానంలో, నిలబడింది. ఆంధ్రప్రదేశ్ లో పతనమైనట్టే తెలంగాణలో కూడా పాతాళానికి వెళ్ళే సూచనలు కనిపించాయి. అటువంటి పరాజయం తర్వాత ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తిరిగి బతికి బట్టకట్టలేదన్నది చరిత్ర. 2019 లోక్ సభ ఎన్నికలలోనూ 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలోనూ ఘనవిజయాలు సాధించిన తర్వాత తెలంగాణలో బీజేపీ విజృంభిస్తున్నదనేది ప్రజాభిప్రాయం. బీజేపీని బలోపేతం చేసి తెలంగాణను మరో బెంగాల్ గా చేయాలని కమలనాధులు ప్రయత్నాలు ప్రారంభించారు. బెంగాల్ కంటే మెరుగైన ఫలితాలు కాకపోయినా బెంగాల్ లో వచ్చిన ఫలితాలను పోలిన ప్రజాతీర్పు పొందాలని అనుకున్నారు.
Also read: రాజ్యం-జాతీయత నమూనా ఇప్పటికీ ఆదర్శప్రాయమే
అప్పుడే నిశ్శబ్దంగా కాంగ్రెస్ పునరుద్ధరణ కార్యక్రమం ఆరంభమైంది. మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు అనుముల రేవంత్ రెడ్డిని 2021 జూన్ లో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వదిలి కాంగ్రెస్ లో అప్పుడే ప్రవేశించారు. ఆయన నిర్మొగమాటంగా మాట్లాడుతారు. తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత రాష్ట్ర సమితి)నీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావునీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నాడనే పేరుంది. అంతర్గత సమస్యలను అధిగమించి, అంతిమంగా పార్టీలో అమేయమైన శక్తిని నింపడానికి ఆయనకు అధిష్ఠానవర్గం అందించిన సంపూర్ణ సహకారం దోహదం చేసింది.
ఆ తర్వాత రాహుల్ గాంధీ 2022లో చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో రెండు వారాలు సాగింది. కాంగ్రెస్ కార్యకర్తలలో జోష్ నింపింది. తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన ఘనవిజయం నైతికంగా, ఆర్థికంగా తెలంగాణ కాంగ్రెస్ కి ఊతం ఇచ్చింది. సరికొత్త ఊపరిలూదింది. అదపపు జవసత్త్వాలు ఇచ్చింది.
ఇందుకు పూర్తి భిన్నంగా బీజేపీ పరపతి తగ్గింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (బీసీ)ని అనవసరంగా, నిష్కారణంగా పదవి నుంచి తప్పించారు. సంజయ్ బీఆర్ఎస్, కేసీఆర్ ను విమర్శించడంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవారు. ఇదీ, ఢిల్లీ సారా కుంభకోణంలో కవితను అరెస్టు చేయరాదనే నిర్ణయం తీసకోవడంతో బీజేపీ జాతీయ నాయకత్వం బీఆర్ఎస్ మూడో విజయానికి అడ్డురాకూడదని తీర్మానించుకున్నట్టు స్పష్టమైన సంకేతాలు వెలువడినాయి. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్యం ఒప్పందం కుదిరిందన్న ఆరోపణలను నిరూపించే సాక్ష్యాలుగా ఈ నిర్ణయాలు నిలిచాయి.
Also read: హిందూమతవాదానికీ, బహుజనవాదానికీ మౌలికమైన తేడా ఉంది
అప్పటికి బీఆర్ఎస్ పూర్తిగా సంతృప్తిగా లేకపోయినా ఆత్మవిశ్వాసంతో మాత్రం ఉంది. అధికారంలో ఉన్న పార్టీ పట్ల కానీ, మంత్రివర్గం పట్ల కానీ అసంతృప్తి జాడలేదు. ప్రచారంతో హోరెత్తించి రెండు విడతల ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రగతి మంత్రం జపిస్తూ దేశంలో కెల్లా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమంటూ గొప్పలు చెప్పుకున్నారు. దీనికి ఉదాహరణగా అనేక ప్రాజెక్టులను చూపించారు. సమాజంలో వివిధ వర్గాలకు నగదు బదిలీ చేసే అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రైతుబంధు, దళితబంధు వంటి కార్యక్రమాల గురించి ప్రచారంలో వల్లెవేయసాగారు. పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి కనుక హడావిడి లేదు. నింపాదిగా సాగుతోంది ప్రచారం. అప్పట్లో జరిగిన అభిప్రాయ సేకరణ సర్వేలు బీఆర్ఎస్ కు అతి పెద్ద ఆధిక్యం లభిస్తుందని అంచనా వేశాయి. ఆఖరి సర్వే కాంగ్రెస్ పునరుద్ధరణను సూచించినప్పటికీ, మేము పరిశీలించిన ఎనిమిది సర్వేలు సగటున బీఆర్ఎస్ కు 57 స్థానాలు, కాంగ్రెస్ కు 49 స్థానాలు ఇచ్చాయి.
తెలంగాణ ఎక్కడున్నది?
అడుగున, హైదరాబాద్ ఆవల బీఆర్ఎస్ పరిస్థితి బాగాలేదు. 2021లో దేశంలో మావనాభివృద్ధి సూచిలో మొత్తం 30 రాష్ట్రాలలో తెలంగాణ 17వ స్థానంలో ఉన్నది. సామాజికార్థికాభివృద్ధిలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకూ, హైదరాబాద్ కు దూరంగా ఉన్న జిల్లాలకూ హస్తిమశకాంతరం ఉన్నట్టు ద హిందూ ప్రచురించిన డేటా పాయింట్ లో స్పష్టం చేసింది. మొత్తం ఎనిమిది ప్రగతి సూచికలలోనూ నాలుగింటిలో 2019-20లో తెలంగాణ రాష్ట్రాల జాబితాలో అడుగు భాగంలో ఉన్నదని డేటా చూపుతున్నది. తక్కువ బరువుతో పుట్టిన శిశువుల విషయంలో మొత్తం 30 రాష్ట్రాలలోనూ తెలంగాణ 21 స్థానంలో ఉంది. శిశుమరణాలలో 26వ స్థానంలోనూ, 18 ఏళ్ళకంటే చిన్నవయస్సులో పెళ్ళయిన మహిళల విషయంలో 23వ స్థానం, ఆరు సంవత్సరాలు దాటినా బడి మొహం చూడని బాలికల విషయంలో దేశంలో అట్టడుగున 30వ స్థానంలో నిలిచింది. ఏడు ప్రగతి సూచికలలో రాష్ట్రం 2015-16కూ, 2019-20కీ మధ్య బాగా దిగజారింది. పైన పేర్కొన్న నాలుగు ప్రగతి సూచికలతో పాటు శిశుమరణాల రేటు, ఎదుగుదల లేని బాలల రేటు, ఆరోగ్య బీమా పథకం కిందికి రాని కుటుంబాలు అనే మూడు సూచికలలో తెలంగాణ సంగతి అడుగంటినట్టు ఉంది.
పరుగుపందెంలో బీఆర్ఎస్ ముందున్నదని అభిప్రాయ సేకరణ సర్వేలు నిర్థారిస్తుండగా వాటిని జాగ్రత్తగా గమనిస్తే కొత్త లొసుగులు బయటపడతాయి. సీ-ఓటర్ సర్వేలో 57శాతం మంది ప్రభుత్వం పట్ల ఆగ్రహం వెలిబుచ్చుతూ ప్రభుత్వాన్ని మార్చక తప్పదని అన్నారు. ఎన్నికలు జరిగిన తక్కిన నాలుగు రాష్ట్రాలలోనూ సీ-ఓటర్ జరిపిన సర్వేలోనే ప్రభుత్వాల పట్ల ఇంతటి జనాగ్రహం వ్యక్తం కాలేదు. ఎంఎల్ఏల పట్ల ఆగ్రహం సైతం ఎక్కువే (53శాతం). ఇది అయిదు ఎన్నికలు జరిగిన రాష్టాలలోనూ తెలంగాణలో అత్యధికం.
అప్పటి వరకూ లోలోన ఉండిన అసంతృప్తి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత బయటపడింది. బీఆర్ఎస్ కీ, కాంగ్రెస్ కీ మధ్య వ్యత్యాసం వారంవారం తగ్గుతూ వచ్చింది. రెండిటీ మధ్యా ఆరు మాసాల కిందట వ్యత్యాసం ఆరు పాయింట్లు ఉంటే నెలరోజుల కిందటికల్లా రెండు పాయింట్లకు తగ్గింది. ఈ రచయితలలో ఒకరు (యోగేంద్రయాదవ్) బీఆర్ఎస్ కు పెట్టని కోటలు అనుకున్న నియోజకవర్గాలలో క్షేత్రసందర్శనకు వెడితే మార్పు గాడుపు స్పష్టంగా కనిపించింది. ఆయనతో పాటు బారత్ జోడో అభియాన్ సహచరులు కూడా ఉన్నారు. వీధులలో జనం కేసీఆర్ పట్ల కోపంగా లేరు. రోడ్లు బాగున్నాయనీ, కరెంటు సరఫరా బాగున్నదనీ అంగీకరించారు. కానీ ఇక ముందుకు సాగి కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వాలన్న సంకేతం స్పష్టంగా కనిపించింది.
Also read: బీహార్ కులజనగణన బృహత్తరమైన ముందడుగు
ప్రధానమైన ఆరు అంశాలు
ఒకటి: కేసీఆర్ హయాంలో తెలంగాణ సాధించింది ఆయన చేసిన వాగ్దానాల కంటే, ఆయన చేశానని చెప్పుకుంటున్నదాని కంటే తక్కువ. రెండు: కేసీఆర్ అవినీతి కంటే కూడా స్థానికంగా కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ ల అణచివేత బలంగా వినిపించిన ఫిర్యాదు. అవినీతి, అహంకారం వల్ల చాలామంది ఎంఎల్ఏలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మూడు: ఉపాధి విషయంలో తెలంగాణ పరిస్థితి అధ్వానం. యువ ఓటర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. నాలుగు: నగదు బదిలీ విధానంలో కొందరికే ప్రయోజనం కలగడం వల్ల కొంతమందికి మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చుతోందని ప్రజలు అనుకుంటున్నారు. ఐదు: ముస్లింలు ఇంతవరకూ బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ వచ్చారు. వారికి కేసీఆర్ పట్ల షికాయతు ఏమీ లేదు. కానీ బీజీపీతో బీఆర్ఎస్ లాలూచీ పడిందనే ఆరోపణలు అధికారపార్టీని దెబ్బతీశాయి. చివరగా, ఆరో అంశం: క్రైస్తవులు తెలంగాణ జనాభాలో రెండు శాతం మాత్రమే ఉంటారని లెక్కలు చూపుతున్నాయి కానీ వాస్తవంలో వారు ఎక్కువమందే ఉన్నారు.అన్ని రకాల క్రైస్తవులు మణిపూర్ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయమైన కాంగ్రెస్ కు మూకుమ్మడిగా ఓటు చేయాలని తీర్మానించుకున్నారు.
ఇన్ని అంశాలు కలసికట్టుగా అధికారపార్టీని మట్టికరిపిస్తున్నాయి. ఈ పతనం ఎంత అధికంగా ఉంటుందోనన్నది మాత్రమే జవాబు తెలియవలసిన ప్రశ్న. పోయిన అసెంబ్లీ ఎన్నికలలో 28 శాతం ఓట్లు మాత్రమే సాధించి బీఆర్ఎస్ కంటే 17 శాతం తక్కువగా ఉండిన కాంగ్రెస్ పైకి రావాలంటే పెద్ద తుపాను రావలసిన అవసరం ఉంది. 2018లో బీఆర్ఎస్ మొత్తం పది అవిభక్త జిల్లాలలో తొమ్మిదింటిలో ఘనవిజయం సాధించింది (తూర్పున ఉన్న ఖమ్మంజిల్లా ఒక్కటే మినహాయింపు). రాష్ట్రంలో బీఆర్ఎస్ కు 88 స్థానాలు రాగా కాంగ్రెస్-టీడీపీ కూటమికి 21 స్థానాలు మాత్రమే లభించాయి. పది శాతం కాంగ్రెస్ కు అనుకూలంగానూ, అంతే శాతం బీఆర్ఎస్ కి వ్యతిరేకంగానూ ఓట్ల ఊపు (స్వింగ్) ఉంటేనే కాంగ్రెస్ కి ఆధిక్యం లభిస్తుంది.
ఇది కష్టతరం కానీ అసాధ్యం మాత్రం కాదు. గ్రేటర్ హైదరాబాద్ లోనూ, కొన్ని ఉత్తర జిల్లాలలోనూ బీజేపీ కాంగ్రెస్ అవకాశాలను వమ్ము చేయగలదు. మిగతా చోట్ల బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా గాడ్పు ఉంది. బీఆర్ఎస్ మిత్రపక్షమైన ఆల్ ఇండియా మజ్లిస్ –ఎ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పరిస్థితి కూడా అట్లాగే ఉంది. అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఏఐఎంఐఎం పాతబస్తీలో ప్రతికూల పవనాలను ఎదుర్కోవచ్చు. బీజేపీ బలహీనపడినప్పటికీ సుమారు 40 స్థానాలలో బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను చీల్చే స్థితిలో ఉందని సమాచారం. బీసీ ముఖ్యమంత్రిని నియమిస్తామనీ, ఎస్సీ రిజర్వేషన్లను మాదిగల కోర్కె ప్రకారం వర్గీకరిస్తానని బీజేపీ వాగ్దానం చేయడం వల్ల కాంగ్రెస్ కు కొంత నష్టం జరగవచ్చు. ఈ స్థానాలలో బీజేపీ బాగా కష్టపడి పని చేస్తే ఆ మేరకు బీఆర్ఎస్ కు లబ్ధి కలగవచ్చు. అధికారపార్టీ తరఫున చివరిక్షణంలో నోట్ల పంపిణీ జరుగుతుందనే అనుమానాలు బలంగా ఉన్నాయి.
ఒక సారి సానుకూల పవనాలు వీచడం ప్రారంభమైతే వాటిని ప్రత్యర్థుల ఎత్తుగడలూ, జిత్తులూ ఆపజాలవని ఎన్నికలలో సంభవించే సానుకూల పవనాల చరిత్ర స్పష్టంగా చెబుతున్నది. చివరి వరకూ ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోకుండా ఉన్న తటస్థ ఓటర్లపైన, ముఖ్యంగా మైనారిటీలపైన, కూడా ఈ పవనాల ప్రభావం పడుతుంది. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న గాలి(హవా)ని తుపాను (ఆంధీ) గా మార్చవచ్చు. ఆధారపడగలిగిన తాజా సర్వే మన ముందు లేనప్పుడు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని అంచనా వేయడం దండగ. కాకపోతే, కాంగ్రెస్ పునరుద్ధరణ నాటకీయంగా జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ కు అంత అద్భమైన విజయం సిద్ధించకపోయినా, మెజారిటీ రాకపోతే మాత్రం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది.