- నందమూరి కుటుంబం సంయుక్త మీడియాగోష్ఠిలో ప్రశ్న
- ఎన్ టీఆర్ (జూ), కల్యాణ్ రామ్ విడిగా వీడియో విడుదల
- వైసీపీ నాయకులూ ఖబర్దార్, బాలకృష్ణ హెచ్చరిక
- కుటుంబ సభ్యులను అవమానించడం అన్యాయం, పవన్ కల్యాణ్
- భువనేశ్వర్ ని మా ఎంఎల్ఏలు పల్లెత్తు మాట అనలేదు : పేర్ని నాని
అశ్వినీకుమార్ ఈటూరు
అమరావతి: టీడీపీ స్థాపించిన అనంతరం మొట్టమొదటి సారి నందమూరి కుటుంబం సంయుక్తంగా మీడియా గోష్ఠి నిర్వహించింది. అందులో నందమూరి హరికృష్ణ తనయులు జూనియర్ ఎన్ టీ ఆర్, కల్యాణ్ రామ్, సోదరి దగ్గుబాటి పురందేశ్వరి లేరు. వారు విడిగా వీడియో విడుదల చేశారు, ట్వీట్ ఇచ్చారు. చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరిని వైఎస్ఆర్ సీపీకి చెందిన ఎంఎల్ఏలు అనరాని మాటలు అన్నారంటూ చంద్రబాబునాయుడు శనివారం మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ లో కంటతడిపెట్టి, వెక్కివెక్కి ఏడ్చిన సంగతి విదితమే. అధికారపక్షం అనాగరికంగా వ్యక్తిత్వ హననానికి పాల్బడిందనీ, అధికారపక్షం నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలనీ నందమూరి కుటుంబ సభ్యులు హెచ్చరించారు.
ఖబర్దార్ వైసీపీ : బాలకృష్ణ గర్జన
ప్రముఖ నటుడు. హిందుపూర్ ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ వైసీపీ ఎంఎల్ఏలకు ఖబర్దార్ అంటూ హెచ్చరిక జారీ చేశారు. ‘‘మర్యాద ఇచ్చిపుచ్చుకోండి, మా కుటుంబ సభ్యులపైన నేలబారు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. ఇంతకాలం చంద్రబాబునాయుడు సలహాపైన మిన్నకున్నాం. ఒక సారి మేము లేస్తే ఏ వ్యవస్థా మమ్మల్ని అదుపు చేయలేదు. ఎవ్వరూ మమ్మల్ని ఆపుచేయలేరు. ఏదీ మమ్మల్ని అడ్డుకోలేదు,’’ అంటూ సినిమా ఫక్కీలో డైలాగ్ చెప్పారు.
‘‘వారు నేలబారు భాష ఉపయోగించారు. మా సోదరిపైన వ్యక్తిగత నిందలు మోపారు. వారి ప్రవర్తన చూస్తే ఇది అసెంబ్లీనా పశువుల సంతా అని అనుమానం వచ్చింది. అసెంబ్లీలో ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. దిగజారిన చర్చ కాదు. మొదటి నుంచీ టీడీపీ సమస్యలపైనే పోరాడుతోంది. వ్యక్తులమీద కాదు. మా సోదరి కుటుంబపరమైన హెరిటేజ్ వ్యాపారం చూసుకుంటున్నారు. మా హిందూపూర్ నియోజకవర్గంలో కంప్యూటర్లు దానం చేసే కార్యక్రమం ఇటీవల చేపట్టారు. వైసీపీ నాయకులు ఎన్నడూ అటువంటి మంచి పనులు చేయరు. అధికార పార్టీ నాయకులకు సంబంధం ఉన్న వివేకానందరెడ్డి హత్య మీది నుంచి దృష్టి మరల్చడంకోసం వైసీపీ నీచమైన రాజకీయం చేస్తోంది. మా కుటుంబం సహనాన్ని పరీక్షించవద్దు. ధైర్యం ఉంటే రాజకీయంగా పోరాటం చేయండి. అంతే కానీ భీరువుల్లా వ్యక్తిగత దాడులు చేయవద్దు,’’ అంటూ బాలకృష్ణ ఆవేశపూరితంగా మాట్లాడారు.
కుటుంబ సభ్యులను విమర్శించడం అన్యాయం: పవన్ కల్యాణ్
చంద్రబాబు నాయుడు ఎడవడం చూస్తూ బాధ కలిగింది. చాలా విచారకరం. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వర్షాలూ, వరదలూ అల్లకల్లోలం సృష్టిస్తుంటే ప్రజాప్రతినిధులు ఈ గంభీరమైన సమస్యను పట్టించుకోకుండా ఎవ్వరూ ఆమోదించజాలని నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారు. తన భార్య పరువుతీసే విధంగా వైసీపీ నేతలు మాట్లాడారని ఆరోపిస్తూ గౌరవనీయుడైన ప్రతిపక్ష నాయకుడు ఏడ్వడం విచారం కలిగిస్తోంది. దీన్ని నిస్సందేహంగా ఖండించవలసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను బాధించే విధంగా లోగడ ప్రతిపక్ష సభ్యులు వ్యాఖ్యలు చేయడాన్నికూడా నేను ఆక్షేపించాను. రాజకీయ వ్యవస్థను చులకన చేయవద్దంటూ రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను,’’ అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ఆడపడచులపైన నిందలు మోపడం మన సంస్కృతి కాదు: జూ. ఎన్టీఆర్
స్వర్గీయ హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్ టీ ఆర్, కల్యాణ్ రామ్ కూడా భువనేశ్వరి గురించి వైసీపీ నాయకులు అసభ్యంగా మాట్లాడటంపైన అభ్యంతరం తెలిపారు. నీచమైన పదజాలంతో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవద్దంటూ రాజకీయ నాయకులకు సోదరులు ఇద్దరూ విజ్ఞప్తి చేశారు. అందులోనూ ఆడపడచులను గౌరవించడం మన సంస్కృతి కాదనీ, ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం ముమ్మాటికీ ఖండనార్హమనీ వారు అన్నారు. ఈ మేరకు వారు వీడియోలు విడుదల చేశారు.
మేము విలువలతో పెరిగాం : పురందేశ్వరి
మేము తోబుట్టువులం విలువలతో పెరిగామనీ, అటువంటి దుష్ట సంస్కృతి తమకు లేశమైనా లేదనీ కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ‘‘భువనేశ్వరికి పరువు నష్టం కలిగే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. మేము తోబుట్టువులం విలువలతో పెరిగాం. ఆ విషయంలో మేము రాజీ పడే ప్రసక్తే లేదు,’’ అంటూ పురందేశ్వరి ట్వీట్ చేశారు.
భువనేశ్వరి ప్రస్తావనే లేదు, రికార్డులు మీరే చూడండి : పేర్ని నాని
నందమూరి కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను ఖండిస్తూ రవాణా, సమాచారం మంత్రి పేర్ని నాని, అసెంబ్లీలో భువనేశ్వరి ప్రస్తావనే రాలేదనీ, మా ఎంఎల్ఏలలో ఎవ్వరూ కుటుంబ సభ్యులను గురించి మాట్లాడలేదనీ అన్నారు. కేవలం ప్రజల సానుభూతికోసం చంద్రబాబునాయుడు డ్రామాలు వేస్తున్నారనీ, కావాలంటే అసెంబ్లీ సమావేశాల తాలూకు టేపులను పరిశీలించవచ్చుననీ, నాయుడు ఎత్తుగడలకు మోసపోవద్దనీ నందమూరి కుటుంబసభ్యులకు నాని చెప్పారు.