- ఇది నిజమేనా? లెక్కలలో పొరపాట్లు జరిగాయా?
- కుట్ర సిద్ధాంతంలో అర్థం ఉన్నదా?
‘ప్రపంచ ఆకలి సూచీ’లో భారతదేశం స్థానం అడుగంటిందని అంటున్నారు. ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న శ్రీలంక, పాకిస్థాన్ కంటే కూడా మనం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామని చెబుతున్న నివేదికలు భయపెడుతున్నాయి. అవి అసత్యాలు కావాలని హృదయపూర్వకంగా కోరుకుందాం. ఆర్ధికంగానూ, వనరులలోనూ ఈ రెండు దేశాలతో పోల్చుకుంటే ఎంతో ఎత్తున ఉన్న మనకు ఇటువంటి దుర్భిక్షం రానే రాదనే విశ్వాసంలోనే ఉందాం. కన్ సర్న్ హంగర్, వెల్తుంగర్ హిల్ఫ్ సంస్థలు సంయుక్తంగా తయారుచేసి బయటపెట్టిన ఈ నివేదికలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. దేశంలో సుమారు 22.4కోట్ల మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, ముఖ్యంగా పుష్టికరమైన ఆహార లోపం, ఆకలి, ఎదుగుదలలో లోపంతో పిల్లలు బాధపడుతున్నారని వినవచ్చే కథనాలు, వినిపించే విమర్శలకు అధికారపక్షం సహేతుమైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రజల్లో భరోసా నింపాల్సిన సందర్భం ఇది. రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని, ఆహార సంక్షోభం ఆహాకారాలు చేస్తోందని, ఆర్ధిక మాంద్యం పొంచివుందని వెల్లువెత్తుతున్న వార్తలు నిజం కావని శాస్త్రీయంగా, సోదాహరణంగా వివరించాల్సిన బాధ్యత పాలకులపై, సంబంధిత అధికారులపై ఉంది. కేవలం రాజకీయమైన ఖండనలు సరిపోవు. తాజాగా వేడి పుట్టిస్తున్న ఆకలి సూచీ నివేదికను కేంద్రం తప్పు పడుతోంది. ఆకలి స్థాయిల్ని లెక్కించే పద్ధతిలో ఆశాస్త్రీయత అక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని కేంద్రం అంటోంది.
Also read: హిందీపై తిరుగుబాటు బావుటా
రూపాయి విలువ పడిపోవడం లేదంటున్న నిర్మలాసీతారామన్
రూపాయి విలువ పడిపోవడం కాదని, డాలర్ విలువ మాత్రమే పెరుగుతోందని, మిగిలిన దేశాల కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి విలువ బాగుందని మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు. రూపాయి విలువ దిగజారకుండా ఉండే విధంగా రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆమె చెబుతున్నారు. మంచిదే అది ఆచరణలో సాధ్యమవ్వాలి. ముందుగా రూపాయి విలువ మరింత పతనం కాకుండా చూడాలి. అది జరిగితేనే ముందు నిలబడతాం. పుంజుకోవడం ఆ తర్వాత విషయం. రష్యా -ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం అందరినీ చావుదెబ్బ కొట్టింది. అనేక సరఫరాలు ఆగిపోయాయి. ప్రపంచ దేశాల కరెన్సీ విలువలు పడిపోవడంపై దీని ప్రభావం కూడా కాదనలేని సత్యం. సద్దుమణిగింది కదా అనుకున్న ఆ యుద్ధం ఇప్పుడు మరో రూపం తీసుకుంది. ఆ రెండు దేశాల మధ్య మళ్ళీ ఘర్షణలు మొదలయ్యాయి. ఇది మంచి పరిణామం కాదు. ఈ యుద్ధంతో రష్యా కూడా చతికిలబడి పోయింది. అయినా యుద్ధోన్మాదాన్ని ఆపడం లేదు. అమెరికా వంటి దేశాలు ఉక్రెయిన్ ను రెచ్చగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం రావణకాష్టంగా మారిపోయింది. కరోనా తెచ్చిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇదిగో, ఇప్పుడు ఈ దేశాల మధ్య గొడవలు, ఆర్ధిక స్వార్ధాలు, సామ్రాజ్య విస్తరణ కాంక్షలు, జాత్యహంకారాలు మన వంటి సంప్రదాయ సిద్ధమైన దేశాలపైన కూడా దుష్ప్రభావం చూపిస్తున్నాయి. ఆహార సంక్షోభం విషయానికి వస్తే, ఇది మన శాస్త్రవేత్తలు సైతం ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న అంశం.
Also read: ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అంటే మాటలా?
పాకిస్తాన్, నేపాల్ కంటే హీనమా?
ఆకలి సూచీలో మరీ పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక కంటే కూడా దారుణంగా భారత్ ఉందన్న మాటలు నమ్మబుధ్ధి కావడం లేదని మన బుధ్ధిజీవులు సైతం కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నివేదికల పేరుతో మన దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఎవరైనా కుట్ర పన్నితే అది క్షమార్హం కాదు. వారిని పసిగట్టి ప్రజల ముందు నిలబెట్టాలి, చట్టబద్ధంగా చర్యలు చేపట్టాలి. ఈ నివేదికను తయారుచేసింది ఐర్లాండ్ కు చెందిన సంస్థలుగా తెలుస్తోంది. వీరి వెనకాల ఎవరైనా ఉన్నారా అన్నది కూడా కనిపెట్టాలి. దేశంలో తలసరి ఆహార లభ్యత, వ్యవసాయ ఉత్పత్తులు, దిగుబడులు మళ్ళీ ఒక్కసారి లెక్కించాల్సివుంది. చిన్నారులకు సంబంధించిన ఆరోగ్య కొలమానాలు కూడా కచ్చితంగా తెలియాల్సివుంది. గిడ్డంగులలో మగ్గుతున్న ఆహార నిల్వల వివరాలు కూడా స్పష్టంగా బయటకు రావాల్సి వుంది. ప్రపంచంలోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించిందని చెప్పుకుంటున్నాం. మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా గొప్పగా ఉందని చెప్పుకుంటున్న నేపథ్యంలో, మనం ఒకసారి పునఃసమీక్ష చేసుకోవడంలో తప్పేమి లేదు. ఆహార ఉత్పత్తి -పంపిణీ మధ్య సమన్వయం ఎలావుందో కూడా పరీక్షించుకోవాలి. జనాభా పెరుగుదల -అవసరాలు -ఉత్పత్తి మధ్య సమతుల్యతను సాధించామా లేదా? ఆత్మపరీక్ష చేసుకోవాలి.ఆహార ధాన్యాల లభ్యతలో మెరుగుదల సాధించామా? అనే ప్రశ్నలు, సందేహాలు కొన్ని వర్గాల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి నివేదికల బట్టి పిల్లల్లో పోషకాహార లోపం 43శాతం ఉందని మన శాస్త్రవేత్తలు కొందరు అంటున్నారు. ఆకలి కాకపోయినా, అర్ధాకలి ఎక్కువగా ఉందనే అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటిని సరిచూసుకొని, సరిచేసుకొని ముందుకు సాగాలి. ఆహార ఉత్పత్తి ఇంకా పెరగాలి, పంపిణీ వ్యవస్థ ఇంకా వేగం పుంజుకోవాలి. ఆరోగ్యంతో ఆహార ఉత్పత్తిని అనుసంధానం చేయాలి. వ్యవసాయం దండగమారి అనే అభిప్రాయం రైతుల్లో రానీయకుండా,అన్నదాతలకు లాభసాటి వ్యవస్థగా తీర్చిదిద్దాలి. వెరసి,ఏలినవారు ఆకలిరాజ్యం రాకుండా చూడాలి.
Also read: సౌర విద్యుత్తుకు అపారమైన అవకాశాలు