Thursday, November 21, 2024

కాంగ్రెస్ పునరుద్ధరణ ప్రారంభమైందా?

  • తాను పూర్తికాలం అధ్యక్షురాలినంటూ స్పష్టం చేసిన సోనియా
  • ఏడాదిలోగా సంస్థాగత ఎన్నికలు పూర్తి
  • నవంబర్ 1 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం
  • రాహుల్ గాందీ తిరిగి పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం

ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం మొన్న శనివారం నాడు జరిగింది. సోనియాగాంధీ స్వరంలో కొన్ని ప్రత్యక్ష సందేశాలు,పరోక్ష సంకేతాలు వినిపించాయి.తానేమీ పార్ట్ టైమ్ పొలిటీషియన్,అర్ధ సింహాసనపు అధ్యక్షురాలు కానని సోనియా కుండబద్దలు కొట్టేశారు.సంస్థాగత ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపేశారు.2022 అక్టోబర్ లో, అంటే సంవత్సర కాలంలో, కొత్త అధ్యక్షుడి ఎంపిక కూడా జరుగుతుందనే సమాచారం బయటకు వచ్చింది. అప్పటి వరకూ ఆమే కొనసాగుతారని అర్థంచేసుకోవాలి. జి -23గా వార్తల్లోకి ఎక్కుతున్న పార్టీకి చెందిన ముఖ్యనాయకులకు పరోక్షంగా ఆమె చురకలు అంటించారు.  నేరుగా మాట్లాడకుండా రోడ్డుకెక్కటం ఏంటని సోనియా అన్నట్లు తెలుస్తోంది.

Also read: డిజిటల్ డబ్బుల దిశగా ప్రపంచం అడుగులు

తనయుడిని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలన్నదే సోనియా సంకల్పం

కొత్త అధ్యక్షుడుగా రాహుల్ గాంధీయే ఎంపికవ్వాలని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. మొన్నటి సమావేశంలో ఈ విషయాన్ని కూడా వ్యక్తపరచినట్లు సమాచారం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నదే సోనియాకున్న ఏకైక సంకల్పం. అధ్యక్ష స్థానంలో ఎవరు కూర్చున్నా, వారందరూ ఒకటే. నెహ్రు-గాంధీల వారసత్వంతో పాటు, దేశాధికారం తన బిడ్డల చేతుల్లో ఉండాలన్నది ఆమె అభిమతం. ఈ ఏడేళ్ళల్లో జాతీయ స్థాయిలో పార్టీ కుదేలైపోయినా, ఇప్పటికీ ఆ పార్టీలో ఎంతోకొంత ఆకర్షణ, ప్రభావం చూపించగలిగే అవకాశాలు రాహుల్, ప్రియాంక ద్వయానికే ఉన్నాయి. సోనియా గాంధీకి వయసు మీద పడుతోంది. త్వరలో 75 ఏళ్ళు నిండబోతున్నాయి. ఆమె ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆమె వారసులపైనే ఎక్కువగా ఉంది. ఇంతకాలం పాటు  సంస్థాగత ఎన్నికలు జరుపకుండా ఉండడం పార్టీ చేసిన పెద్ద తప్పు. ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో నాయకులు, క్యాడర్ చాలా వరకూ వేరే పార్టీల్లోకి జారిపోయారు. ఇప్పుడు మళ్ళీ మరోమారు ప్రకటించినప్పటికీ, వివిధ పదవులకు జరిగే ఎంపిక ప్రక్రియ కోసం వచ్చే సంవత్సరం జూన్ వరకూ ఎదురుచూడాల్సిందే. జిల్లాలకు వచ్చే జూన్ నుంచి, రాష్ట్రాలకు జులై నుంచి, జాతీయ స్థాయికి సెప్టెంబర్ /అక్టోబర్ లో సంస్థాగత ఎన్నికలు జరిగే విధంగా తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నవంబర్ 1 నుంచి పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు ప్రక్రియ  జరుగనుంది. ఈ షెడ్యూల్ విడుదల చేయడం గుడ్డిలో మెల్ల వంటిది. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరిగే లోపు,2022 నుంచి వివిధ దశల్లో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి కీలక రాష్ట్రాలు, పంజాబ్ వంటి ముఖ్య రాష్ట్రాలు అందులో ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలంటే, అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలను రాబట్టడం అత్యంత కీలకం. అటు రాజకీయంగానూ -ఇటు నైతికంగానూ అత్యంత అవసరం. ఇవన్నీ సాధించాలంటే పార్టీకి జవసత్వాలను ఎక్కించాలి. ప్రస్తుతం,పార్టీ అంపశయ్యపైనే ఉంది.ముందుగా స్వతంత్రంగా గాలి పీల్చుకొనే దశకు చేరుకోవాలి. ఆ తర్వాత  అంబులపొదిలో శక్తివంతమైన బాణాలను నింపుకోవాలి. ఆయుధాలు అందుబాటులో ఉన్నా, వడిసి పట్టుకొని పోరు సాగించి, విజయభేరి మోగించగల యోధులు కావాలి. పార్టీలో అంతటి యోధులు పెద్దగా కనిపించడం లేదు. పాత యోధుల్లో ఎక్కువమంది వృద్ధులైపోయారు.కొత్త యోధులు రావాలి,కొత్త నెత్తురు కావాలి. సోనియాగాంధీ సంగతి ఎలా ఉన్నా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మాత్రం కొత్తతరం వైపే మొగ్గు చూపిస్తున్నారు. వారు పాతతరానికి తిలోదాకలు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా అర్ధమవుతోంది. అది మంచి ఆలోచనే అయినప్పటికీ, కొంతకాలం వరకూ కొంత పాతతరాన్ని భరించకపోతే, పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. బహుశా  సోనియాగాంధీ కూడా పాతతరం పాట్ల కొంత సుముఖంగా ఉన్నట్లు అర్ధమవుతోంది.  ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితిలో, ప్రయోగాలు అవసరమే కానీ  అవి వికటించకూడదు. పంజాబ్ లో కొత్త ప్రయోగాలు చేశారు. కొమ్ములు తిరిగిన పాతనేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ను వదుల్చుకోవడం, మొట్టమొదటి సారిగా ఆ రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రిగా నియమించడం, ఆవేశపరుడు, చంచలస్వభావుడైన నవ్ జోత్ సింగ్ ను అందలమెక్కించడం మొదలైనవన్నీ సరికొత్త ప్రయోగాలే. వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమైన పాతనేతలు  పార్టీని వీడి  బలంగా ఉన్న బిజెపిలోకి వెళ్తున్నా  చూస్తూ ఊరుకోవడాన్ని మొండి ధైర్యం అనాలా? సరికొత్త వ్యూహం అనాలా? అర్థం కావడం లేదు.

Also read: కృత్రిమ మేథదే భవిష్యత్తు!

రాహుల్ పై విశ్వాసం పెరగాలి

ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడల్లా కాడి పడేసి, అజ్ఞాతంలోకి, విందువినోదాల యాత్రలకు వెళ్లిపోయే అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రజల్లో, పార్టీలో విశ్వాసం పెంచడం అత్యంత కీలకం.  రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూలమైన ఫలితాలు రాకపోతే, రాహుల్ అస్త్రసన్యాసం చెయ్యడని ఎవరు భరోసా ఇవ్వగలరు? పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టే అంశంలో నిన్నటి వరకూ మౌనంగా ఉన్న రాహుల్ ‘ఈ విషయంపై ఆలోచిస్తాను’… అనగానే కొందరు శభాష్ అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. అవును, ‘నేను పార్టీని నడిపిస్తాను.. గెలుపుబాట పట్టిస్తాను,తిరిగి అధికారంలోకి తెస్తాను…’ అని ఆయన గట్టిగా చెప్పివుంటే బాగుండేది. క్యాడర్ లో, ప్రజల్లో పార్టీ పట్ల, నాయకత్వం పట్ల విశ్వాసం పెరిగేది. అలా చెయ్యకపోవడం సరియైన చర్య కాదనే భావించాలి. రైతుల పోరాటం, తాజాగా జరిగిన లఖీంపుర్ దుర్మార్గం, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్, కొందరు ముఖ్య నేతల వ్యవహారశైలి రేపు జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గుజరాత్ బిజెపిలోనూ అంతర్గత కలహాలు పెరుగుతున్నాయి.  కరోనా కాలం దేశానికి సమస్యలను, ప్రజలకు కష్టాలను ఎన్నోరెట్లు పెంచింది. బిజెపి/ఎన్ డి ఏ పాలనపై, మోదీ నాయకత్వంపై పూర్తి స్థాయి ప్రజావ్యతిరేకత లేకపోయినా, అసంతృప్తి, అసహనం పెరుగుతున్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లోనూ అదే తీరు నడుస్తోంది. పాలకపక్షం ఆచరించే ప్రజా వ్యతిరేక విధానాలను కేవలం ఎండగడితే సరిపోదు. వాటిని అడ్డుకొనే శక్తి ప్రతిపక్షాలకు ఉండాలి. బలమైన ప్రతిపక్షం లేకపోతే, పాలక పార్టీ నియంతృత్వ పోకడలు పోతుందని, ప్రజాస్వామ్యానికి అది గొడ్డలిపెట్టు వంటిదని, అంబేద్కర్ వంటి మహనీయ రాజ్యాంగ నిర్మాతలు ఏనాడో హెచ్చరించారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ బాధ్యతాయుతంగా, ప్రజాహితంగా మెలిగితేనే దేశానికి మంచి జరుగుతుంది. తన పాలనా కాలంలో, కాంగ్రెస్ తక్కువ తినలేదు. తనకు బలం ఉన్నప్పుడు తన ఇచ్చకు నచ్చినట్లే వ్యవహరించింది. మన్ మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న పదేళ్లు మేడమ్ సూపర్ పవర్ గా వ్యవహరించారు. ఇప్పుడు కూడా సోనియాగాంధీ సూపర్ పవర్ నే చూపిస్తున్నారు. పార్టీని కొత్త పుంతలు తొక్కించాలంటే అంతర్గతంగా అనేక ప్రక్షాళనలు చేపట్టాలి. బూత్ స్థాయి నుంచి పునఃనిర్మాణం చేసుకుంటూ రావాలి. ఏకస్వామ్య, నియంతృత్వ ధోరణులకు స్వస్తి పలకాలి.పార్టీ పట్ల, నాయకత్వం పట్ల,ప్రతిపక్ష పాత్ర పట్ల విశ్వాసం పెంచితేనే కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉంటుందని భావించాలి.

Also read: కల్లోల కశ్మీరం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles