Wednesday, January 22, 2025

టిడిపి, జనసేన చారిత్రాత్మక సమావేశంలో బిజెపికి చోటు లేదా?!.. మరి తెలంగాణాలోనూ అంతేనా?!

వోలేటి దివాకర్

విజయదశమి పర్వదినాన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమహేంద్రవరంలో టిడిపి, జనసేన తొలి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రానున్నది టిడిపి – జనసేన ప్రభుత్వమే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ధీమాగా ప్రకటించారు. ఈ సమావేశంలో చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ, అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించాలని, రాష్ట్రాభివృద్ధి కోసం ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని తీర్మానించారు. రాష్ట్రంలో వైసిపి వైరస్ పోవాలంటే టిడిపి-జనసేన వ్యాక్సిన్ అవసరమని సుమారు 3గంటలకు పైగా సాగిన ఈ సమావేశం అనంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో పవన్ వ్యాఖ్యానించారు. నవంబర్ 1వ తేదీన ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రకటించి, 2024 ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతామని కూడా వెల్లడించారు. అంటే టిడిపి -జనసేన కూటమిలో బిజెపి ఉండదన్న విషయం ఈ సందర్భంగా స్పష్టమవుతోంది.

Also read: చంద్రబాబునాయుడు అమాయకుడే!… రాజకీయ కక్షతోనే ఆయనను అరెస్టు చేశారు!- ఉండవల్లి

బీజేపీ బద్దవిరోధులైన కాంగ్రెస్, వామపక్షాలు

టీడీపీ-జనసేన కూటమితో వచ్చే ఎన్నికల్లో జట్టు కట్టే అవకాశాలు మెండుగా  ఉన్నాయి. ఇటీవల తెలంగాణా ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ పవన్ ను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై పవన్ స్పష్టమైన హామీ ఇవ్వకపోగా, 30 చోట్ల పోటీకి తమ పార్టీ కేడర్ ఉత్సాహంగా ఉందని కూడా పేర్కొనడం గమనార్హం. మరోవైపు చంద్రబాబునాయుడు అరెస్టును బిఆర్ఎస్ పెద్దగా పట్టించుకో లేదు. పై పెచ్చు మెట్రో రైళ్లు, ఓఆర్ఆర్ పైన హైటెక్ గా సాగిన టిడిపి సానుభూతిపరుల నిరసనలపై స్పందిస్తూ.. ఎపిలో రాజకీయాలు ఇక్కడెందుకని ముఖ్యమంత్రి కెసిఆర్ తనయుడు కెటిఆర్ వ్యాఖ్యానించడంతో టిడిపి శ్రేణులు లోలోన భగ్గుమంటున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణాలో కూడా టిడిపి జనసేన జట్టు కట్టవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Also read: 2039 మంది ఖైదీల్లో చంద్రబాబు ఒకరు, సకల జాగ్రత్తలూ తీసుకుంటున్నాం, డీఐజీ రవికిరణ్

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని, అవసరమైతే విపక్షాలన్నింటినీ కలుపుకునిపోతామని పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించారు. వారసత్వ పార్టీ అయిన టిడిపితో పొత్తు ప్రసక్తే లేదని బిజెపి నాయకులు ముందు నుంచీ స్పష్టం చేస్తున్నారు. దీనిపై స్పందించిన పవన్ అవసరమైతే టిడిపి – జనసేన- బీజేపీ పొత్తు కోసం బీజీపీ పెద్దలను కూడా ఒప్పిస్తానని చెప్పారు. అయితే జైలులో చంద్రబాబునాయుడును కలిసి, పొత్తు ప్రకటన చేసిన తరువాత ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన వ్యాఖ్యలను గమనిస్తే దీర్ఘకాలిక మిత్రపక్షం బీజీపీని పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. మరోవైపు చంద్రబాబునాయుడు అరెస్టు వెనుక బీజీపీ పెద్దల ఆమోదం ఉందన్న భావన తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉంది. ఈ తరుణంలో రాష్ట్ర భవిష్యత్ కోసం బీజీపీ తమ విధానాన్ని అర్థం చేసుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన మాట్లాడటం గమనార్హం.

Also read: 17ఏపై సుప్రీం న్యాయమూర్తి గత ఉత్తర్వులు పరిశీలిస్తే… చంద్రబాబుకు భంగపాటు తప్పదా?

గోరంట్లకు దక్కని గౌరవం

పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, పార్టీలో చంద్రబాబునాయుడు కన్నా సీనియర్ నని చెప్పుకునే సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి పార్టీలో తగిన గౌరవం, గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదన ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. టిడిపి, జనసేన సమన్వయ కమిటీలో చోటు దక్కకపోవడమే ఇందుకు ప్రబల నిదర్శనంగా భావించవచ్చు. ఆయన కన్నా జూనియర్లు అయిన నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన పితాని సత్యనారాయణకు ఈ కమిటీలో చోటు దక్కడం విశేషం. చంద్రబాబు కుటుంబం ఆయన కన్నా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ అధినేత జైలులో ఉంటే కనీసం ఒక్కసారి కూడా గోరంట్లకు బాబుతో ములాఖత్ అయ్యే అవకాశం దక్కకపోవడం గమనార్హం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతల్లానే ఆయన కూడా చంద్రబాబు జైలు వద్దకు వచ్చి వెళుతున్నారు. చంద్రబాబు అరెస్టు నిరసన కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. జనసేన టిడిపి పొత్తు నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గం కూడా జనసేన నేత కందుల దుర్గేష్ పరమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడటం అంటే ఇదేనేమో…!

Also read: త్వరలో భువనేశ్వరి ఓదార్పు యాత్ర!

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles