స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరూ ఊహించినట్టుగానే రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ దేశంలో బహుజన రాజకీయాలకు చిరునామాగా నిలిచిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరారు. ఆయన నల్లగొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్పసభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరైనప్పటికీ ప్రధాన స్రవంతి పత్రికలలో ముఖ్యవార్త కాలేకపోయింది. మరోసారి మీడియా తన స్వభావం గురించే కాక తన ప్రాధాన్యతల గురించి కూడా ప్రజలకు చాటి చెప్పుకుంది. ఈ దేశంలో రాజకీయాలు చేయడమైనా, అధికారం అందుకోవాలన్నా కొన్ని కులాలకు మాత్రమే పరిమితం కావాలని ఆ కులాలతోపాటు ప్రధాన స్రవంతి మీడియా కోరుకుంటున్నదని స్పష్టంగా ఇలాంటి సంఘటనలు విశదం చేస్తాయి.
Also read: పార్లమెంటులో ప్రతిసారీ అదే తంతు
బాబాసాహెబ్ అంబేడ్కర్ బోధించిన ‘మాస్టర్ కీ’ సిద్ధాంతం ప్రకారం బడుగు బలహీన పీడిత సామాజిక వర్గాలైన ఎస్సీ, ఎస్టి, బిసి, మైనారిటీలు రాజ్యాధికారం చేపట్టినపుడు మాత్రమే వారి సమస్యలకు నిజమైన పరిష్కారాలు కనుగొంటారు. అప్పటివరకూ వారి ఇబ్బందులు తీర్చడానికి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ, వారే విభిన్న పరిష్కార మార్గాలు చూపిస్తూ సాయం కోసం అర్థించవలసిన పరిస్థితి తప్పదని ఆయన విస్పష్టంగా చెప్పారు. అంబేడ్కర్ మరణానంతరం ఆయన రాజకీయ మార్గాన్ని ప్రజలలోకి తీసుకెళ్లి బహుజనులకు రాజ్యాధికారపు రుచి చూపించడమే కాక, ప్రజలకు కనుచూపు మేరలో లేదనుకున్న ఒక ఆశాకిరణాన్ని కాన్షీరాం అందించారు. బీఎస్పీ ఏర్పాటుచేయడం, వివిధ రాష్ట్రాలలో కాళ్లూనుకునేలా ప్రయత్నించడం, మాయావతిని ఒక గొప్ప నాయకురాలిగా తీర్చిదిద్దడం ద్వారా దేశానికి తృతీయ ప్రత్యామ్నాయపు ఆశను కలిగించారు. ఉత్తరప్రదేశ్ లో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఒక దళిత మహిళ ప్రమాణస్వీకారం చేయడం కులవ్యవస్థ వేళ్లూనుకున్న భారతదేశ చరిత్రలో ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన విషయం . ప్రతిసారి భారత పార్లమెంటు ఎన్నికలలో తృతీయ ప్రత్యామ్నాయంగానే కాక, మాయావతి ప్రధానమంత్రి కాగల అవకాశం ఉన్న వ్యక్తిగా ‘ద హిందూ’ వంటి ఆంగ్ల పత్రికలు సైతం సంపాదకీయ వ్యాసాలు ప్రచురిస్తుండడం కూడా మనం గమనించాలి.
Also read: వారు బయటకొస్తారా?
దేశంలో మూడో అతిపెద్ద పార్టీ
2009లో జరిగిన సాధారణ ఎన్నికలలో అటు దేశంలోనే కాక ఇటు మన రాష్ట్రంలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఓట్ల సాధింపులో మూడో స్థానంలో నిల్చున్న సంగతి మనకు తెలిసిందే. 6.17 శాతం ఓట్లతో దేశంలో మూడో అతి పెద్ద పార్టీగా బీఎస్పీ స్థానం దక్కించుకుంది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 28.55 శాతం ఓట్లు రాగా, బిజెపి 18.80 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. వీటిలో పట్టణ, గ్రామ ప్రాంతాల ఓట్ల షేరింగ్ ను జాగ్రత్తగా విశ్లేషించుకుంటే విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. రిజర్వేషన్ ఫలాలు అనుభవించి ఉన్నత విద్య, ఉత్తమ ఉద్యోగాలు పొందిన కొందరు బహుజన ప్రజలు అతిగా ఆలోచించి తమ విలువైన ఓటుకు మరింత విలువ కల్పించాలనుకుని కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓట్లు వేసినట్లు పట్టణ పార్టీ ఓటర్ల మొగ్గు నిగ్గు తేలిస్తే, గ్రామాల ఓటర్లు మాత్రం అభ్యర్థుల గెలుపు ఓటముల గురించి ఆలోచించకుండా అంబేడ్కర్ పై గుండెల నిండా ఉన్న ప్రేమతో… అసలు అభ్యర్థులతో సంబంధం లేకుండా ఏనుగు గుర్తుకు ఓటేసి నీలిజెండాను గుండెలకు అదుముకున్నారు. ఇదే ధోరణి తరువాతి సాధారణ ఎన్నికలలో సైతం కనిపించింది.
Also read: జల జగడం
2014 ఎన్నికలలో బిజెపి గంపగుత్తగా దేశంలో 31 శాతం ఓట్లను కొల్లగొట్టుకుని ఈ దేశపు ప్రజల ఆలోచన ధోరణికి అద్దంపట్టింది. కాంగ్రెస్ పార్టీ 19 శాతం ఓట్లతో సరిపుచ్చుకుని నామమాత్రంగా మిగిలింది. నాలుగు శాతం ఓట్లతో దేశంలో మూడో అతి పెద్ద పార్టీగా బీఎస్పీ నిలబడింది. అయితే ఆ పార్టీకి దేశవ్యాప్త బేస్ లేకపోయినా వరుసగా మూడోసారి మూడో స్థానంలో నిలవడం వల్లనే ఎన్నికల ఫలితాలలో హంగ్ పరిస్థితులు వస్తే మాయావతి ప్రధాని కాగలరని సెఫాలజిస్టులు తేల్చడానికి కారణమైంది. కేవలం కొన్ని రాష్ట్రాలలోనే తనకు మనుగడ ఉన్నప్పటికీ ఆ పార్టీ దిగువ శ్రేణులలో తమ జీవితాలకు కొండంత భరోసానిచ్చిన బాబాసాహెబ్ అంబేడ్కర్ పట్ల అకుంఠితమైన ప్రేమాభిమానాలు ఉండడమే దీనికి కారణం. పట్టణ ఓటర్లలో మార్పు రాకపోవడం గమనించాలి.
Also read: సిక్కోలు రైతుకు బాసట
పట్టణ బహుజన కులాల ఓటర్లు విద్యాధికులు, ఉద్యోగులు కావడం వల్ల తమ నియోజకవర్గ అభ్యర్థి గురించి, తాము ఓటు వేయవలసిన పార్టీ గెలుపోటములు గురించి అతిగా ఆలోచించారు. ప్రతి మనిషికి ఒక ఓటు, ప్రతి ఓటుకు సమాన విలువ కల్పించిన అంబేడ్కర్ ఉద్దేశాన్ని తలకిందులుగా అర్థం చేసుకున్నారు. వేల సంవత్సరాలుగా తమను కనీసం మనుషులుగా గుర్తించని ఈ సమాజంలో ఓటు అనే ఆయుధం ఇచ్చి మనిషిగా గుర్తింపునిచ్చిన అంబేడ్కరను దాటి ఈ పెద్దమనుషులు ఆలోచన చేయడం మొదలుపెట్టారు. తమ కులాన్ని, తమ పెద్దలు పడ్డ అగచాట్లను తమ పిల్లలకు సైతం చెప్పడానికి ఇష్టపడని ఈ బహుజన కులాల విద్యాధికులు అంబేడ్కర పట్ల తమకున్న గౌరవాన్ని తమ పిల్లలకు నేర్పించడం మానేసినట్లే, ఒక్క ఓటు ద్వారా తమ కృతజ్ఞతను నిరూపించుకోవలసిన వారు కీలక సమయంలో వెన్ను చూపించారు. నీలిజెండా గెలవదని తమకు తామే తీర్పులిచ్చుకుని, తమ ఓటు వృధా పోకుండా గెలుస్తుందనుకున్న పార్టీకి ఓట్లు వేశారు. దళిత, గిరిజన ఉద్యోగులే కాదు, బిసిలు కూడా అంబేడ్కర్ ఆలోచనధోరణి సరిగా అందుకోకపోవడం వల్ల ఈ దేశంలో బహుజనులకు రాజ్యాధికారం నెరవేరని కలగా మిగిలిపోయింది.
Also read: స్వదేశీ అంటే..?
2019 ఎన్నికలలో బీఎస్పీకి ఓట్ల శాతం తగ్గలేదు గాని, సీట్ల సంఖ్య బాగా పడిపోయింది. కేవలం పదిమంది మాత్రమే లోక్ సభలో ప్రాతినిధ్యం వహించే ఎంపిలు కాగలిగారు. డిఎంకెకు ఓట్ల శాతం తగ్గినా, పెరిగిన సీట్ల సంఖ్యవల్ల మూడవ స్థానం దక్కించుకుని, బీఎస్పీ నాలుగో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
Also read: మూతపడనున్న ఇంటర్ బోర్డు?
దక్షిణాదిలో అందరికంటే ముందు
దక్షిణాదిలో బహుజన రాజకీయాలకు అంబేడ్కర్ కంటే మునుపే బీజం పడిన సంగతి మనకు తెలుసు. తమిళనాడులో పెరియార్, కేరళలో నారాయణగురు బహుజన రాజ్యాధికార ఆలోచన ధారను ఇక్కడి ప్రజలకు అందించారు. 2019 ఎన్నికలలో తమిళనాడులో డిఎంకె పార్టీ విజయదుందుభి మోగించి దేశవ్యాప్త ఓట్ల శాతంలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. అయినప్పటికీ విడుదలై చిరుతైగల్ కచ్చి (విసికె) పార్టీ అధినేత తిరుమావలన్ ఎంపి సీటు మాత్రమే కాక, నాలుగు ఎమ్మెల్యే సీట్లను కూడా గెల్చుకున్నారు. కాని రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం బహుజన రాజ్యాధికార సాధన చేపట్టాలన్న ఆశయం ఉన్నవారు ఒక్క తాటి మీద నిలవలేకపోయారు. ఎవరికి వారే ఒకే అజెండాతో విడిపోయారు. బీఎస్పీకి దక్షిణాదిలో దిశానిర్దేశం చేసే నాయకత్వం లోపించడం, చిన్నచిన్న విభేదాలతో విడిపోయిన వ్యక్తులను కలిపే అతి పెద్ద ఏకీకృత శక్తి ఇక్కడ లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. ఇందువల్ల ఓట్ల శాతంలోగాని, సీట్ల సంఖ్యలోగాని ప్రజలకు ఏ విధంగానూ మెరుగైన సందేశం ఇవ్వగలిగే ఫలితాలు విభిన్న స్థాయి ఎన్నిక (గ్రామపంచాయితీ, మున్సిపాలిటీ, అసెంబ్లీ, పార్లమెంటు)లలో సాధించలేకపోతున్నారు. ఇదే సందర్భంలో మన ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనం సంఘటితంగా బహుజన సమాజ్ పార్టీ నుంచి ఒక శాసనసభ్యుని గెలిపించుకున్న సంగతి ప్రస్తావించుకోవాలి. అరకు నియోజకవర్గం నుంచి లకే రాజారావు ఏనుగు గుర్తు మీద ఎమ్మెల్యే కాగలిగారు.
Also read: పలుకే బంగారమాయే!
ప్రవీణ్ కుమార్ ఇప్పటికే వేలాదిమంది విద్యార్థుల జీవితాలలో పెనుమార్పులు తీసుకొచ్చిన ఘనత సాధించారు. లక్షలాది కుటుంబాలకు చదువువల్ల సాధించుకున్న ఆత్మగౌరవాన్ని కానుకగా అందించారు. తనకంటూ ఒక సైన్యాన్ని గత రెండు దశాబ్దాలలో నిశ్శబ్దంగా తయారుచేసుకున్నారు. బహుజన శ్రేణులను సమాయత్తం చేయగల యంత్రాంగాన్ని సన్నద్ధం చేసుకున్నారు. మరో కాన్షిరామ్ మాదిరిగా కింగ్ మేకర్‌గా ఉండి రెండు తెలుగు రాష్ట్రాలలో బహుజన రాజ్యాధికార స్వప్నాన్ని సాకారం చేస్తారని పెద్దఎత్తున ప్రజలలో ఆశలు మోసులెత్తుతున్నాయి. అది ఏ యుద్ధతంత్రాల ద్వారా సాధిస్తారో వేచి చూడాలి!
Also read: రైట్.. రైట్.. ప్రైవేట్..
చాలా మంచి వ్యాసం సర్
మంచి విశ్లేషణ సర్
చాలా బాగుంది అన్న.