Tuesday, January 21, 2025

దక్షిణాదిన ఏ. పి. ‘పోస్ట్-మండల్’ రాష్ట్రం కానుందా?

జాన్ సన్ చోరగుడి

ఉత్తరాది రాజకీయ-సామాజిక మూలాల్లోకి- ‘మండల్ ఫ్యాక్టర్’ చొచ్చుకుపోయిన విషయాన్ని మన 75 ఏళ్ల స్వాత్యంత్రం నాటికి బీహార్ రాజకీయ పరిణామాలు స్పష్టం చేశాయి. అంతేకాదు- ‘కాన్షీరాం ఫ్యాక్టర్’ 2022 ఆగస్టు నాటికి కూడా సజీవంగా ఉన్నట్టుగా స్పష్టమైంది. ఆయన- ‘రాజకీయ అస్పృశ్యత పాటించడం, రాజ్యాధికార సాధనకు అవరోధం’ అనేవారు. శిఖరం చేరడానికి ఎవరి చేతి ఊతం తీసుకుంటున్నాము అనేది అప్రస్తుతం అనేది ఆయన సిద్ధాంతం. అయితే, ఇరవై ఏళ్ల  క్రితం ఇటువంటి  పరిణామాలపై జాతీయ పత్రికల్లో కనిపించే వ్యాసాలు- ‘నైతికత’ కేంద్రంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు!

Also read: ‘అభివృద్ధి’ పట్ల తెలుగు సమాజం వైఖరి ఎటువంటిది?

బహుశా అది- ‘మండల్’కు తోడైన- ‘పోస్ట్ రిఫార్మ్స్’  ప్రభావం కావచ్చు. ఇప్పుడు ఇటువంటివి రాసేవారు, జరిగినవాటి మంచిచెడులు జోలికి వెళ్లకుండా కేవలం తారీఖులు వేసి, అప్పుడు జరిగింది ఏమిటో, అంతవరకే రాస్తున్నారు. ఇటువంటి పరిణామాలపై ఈ తరహా వైఖరి- ‘కాలమిస్టులు’తీసుకోవడం కూడా మంచిదే. ఎందుకంటే చరిత్ర యధాతధంగా- ‘రికార్డ్’ అవుతుంది. మంచిచెడుల బేరీజు సమాజం చూసుకుంటుంది. ఇప్పుడు ఇలా రాసేవారిలో కొత్తవారు, యువకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న- ఎన్.డి.ఏ వ్యూహాలు పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పిడికి దారి తీస్తున్నవి. అయితే ఎప్పటికయినా ఆంధ్రప్రదేశ్ లో అటువంటిది జరిగే అవకాశం ఉంటుందా?  ‘ఉండదు’- అని కనుక అనుకుంటే, అందుకు కారణం ఏమిటి?
తొంభై దశకం ఆరంభంలో

ఉత్తరాదిలో కొత్త రాజకీయ పార్టీగా ఏర్పడిన పదేళ్లకు, 1994 జనరల్ ఎలక్షన్ లక్ష్యంగా బి.ఎస్.పి. అధ్యక్షుడు కాన్షీరాం దక్షిణాదికి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ‘క్యాంప్’ చేసారు. అప్పటికి పి.వి. ఆర్ధిక సంస్కరణలు అమలు 1991 నాటికి కొత్తగా మొదలయింది. అయితే, వాటి ప్రభావం క్షేత్రస్థాయిలో ఇంకా కనిపించకముందే, కాన్షీరాం- ఇక్కడి- ‘జియో-పొలిటికల్’ పర్యావరణం, ఉత్తరాది అనుభవంతో రూపొందించిన తన ‘సోషల్-ఇంజనీరింగ్’ ప్రయోగాలకు సరిపడదని గ్రహించారు. దాంతో 1994 ఎన్నికల ఫలితాలు చూసాక, తన రాజకీయ క్రీడకు ఏ.పి. తగిన ‘మైదానం’ కాదని ఒక నిర్ణయానికి వచ్చి, ఆయన ఇక్కణ్ణించి నిష్క్రమించారు.

Also read: మోడీ-జగన్ లను దాటి మరీ చూడగలిగితే…

ఏ.పి వృద్ధి

ఇరవై ఏళ్ళ నాటిది, అందరు మర్చిపోయిన విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావనకు వచ్చింది? అనే ప్రశ్నకు ముందుగా ఇక్కడ సమాధానం చెప్పాలి. ఏ.పి.రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 2020-21లో కేంద్ర వృద్ధి రేటు కంటే అధికంగా ఉందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రజల్ని సోమరులను చేస్తున్న- ‘నగదు బదిలీ పధకాలు’ అనే విమర్శ చేస్తున్న మూడేళ్ళలోనే (‘కరోనా ప్లస్’) నమోదు అయిన వృద్ధి ఇది. అయితే, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న- ఈ ‘మోడల్’ మూలాలు ఎక్కడివి అని వెతికినప్పుడు, అందుకు- ‘అకడమిక్’ రంగంలో జాతీయ స్థాయిలో జరుగుతున్న అధ్యయనాలలో ఆసక్తికరమైన సారూప్యతలు కనిపిస్తున్నాయి.

Also read: జగన్ దావోస్ తనతో తీసుకెళ్ళింది ఏమిటి?

This image has an empty alt attribute; its file name is 9780226063478-683x1024.jpg
జెఫ్రీ విట్సో రాసిన డెమాక్రసీ అగైనెస్ట్ డెవలస్ మెంట్



అకడమిక్స్

‘సెంటర్ ఫర్ ది అడ్వాన్సడ్ స్టడీ ఆఫ్ ఇండియా’లో పొలిటికల్ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ జెఫ్రీ విట్సోయి గ్రంధం- ‘డెమోక్రసీ ఎగెనెస్ట్ డెవలప్మెంట్’ (2013)లో బీహార్ లో రెండు రకాల- ‘మండల్ పాలిటిక్స్’ ఉన్నవని అంటారు. వాటిలో ఒకటి- ‘హార్డ్ మండల్’ మరొకటి- ‘సాఫ్ట్ మండల్’ మొదటి దానికి లాలూ ప్రసాద్ యాదవ్ నాయకుడు అయితే, రెండవ దానికి నితీష్ కుమార్ ప్రతినిధులుగా ఉన్నారు. మొదటిది- ‘అభివృద్ధి కాదు ఆత్మ గౌరవం’ (వికాస్ నహీ సమ్మాన్ చాహీయే) కావాలి అనేది నినాదంగా ఉంది. అయితే నితీష్ మోడల్ అలా కాదు, మిగితావాళ్లను కలుపుకుని (‘ఇంక్లూజివ్’) అభివృద్ధి వైపు నడిచే దిశలో, ఎవరి వాటా వారికి పంపిణీ జరగాలి, అంటున్నారు. పలు విదేశీ యూనివర్సిటీలు- ‘పోస్ట్ కొలోనియల్  ఇండియా’ దృష్టితో ఉత్తర భారత దేశంలో- ‘క్యాస్ట్ పాలిటిక్స్ అండ్ కరప్షన్’ పై మనవద్ద  కొంతకాలంగా లోతైన అధ్యయనాలు చేస్తున్నాయి. ఈ స్కాలర్లు అంతా యువకులు.

Also read: ‘దావోస్’లో ఈ రోజు మనం ఎందుకున్నామంటే…

ఇక్కడ మన యూనివర్సిటీల్లో కూడా కొంతకాలంగా ఇటువంటి అధ్యయనం జరుగుతున్నది. రౌలిట్జ్  ఇండియా ప్రచురణ సంస్థ ఈ ఆగస్టు చివరి వారంలో మార్కెట్లోకి తెచ్చిన గ్రంధం- ‘క్యాస్ట్ మ్యాటర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ’.ఇదే కోవలోకి వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన డా. రాహుల్ చోరగుడి, ప్రొ. సోనీ పెలిస్రే, ప్రొ. ఎన్. జై రామ్ తో కలిసి సంకలనం చేసిన ఈ గ్రంధంలో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చమ బెంగాల్ రాష్ట్రాల్లోని సామాజిక పరిస్థితులు గురించి లోతైన సమీక్ష జరిగింది.
Also read: కొత్త సామాజిక శ్రేణులకు ఊతంగా ఆంధ్రప్రదేశ్

రాహుల్ చోరగుడి, సోనీ పెలిస్సెరీ, ఎన్ జయరాం ఎడిట్ చేసిన కేస్ట్ మ్యాటర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ, ఇష్యూస్, పర్ స్పెక్టీవ్స్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో…

అయితే, ఇప్పటివరకు చర్చించిన- ‘అకడమిక్’ అంశాలపై విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాల రాజకీయ దృక్పధం లేదా వైఖరి ఎటువంటిది? రాష్ట్ర విభజన అనివార్యం అనే విషయం రెండు ప్రాంతాల వారికి ముందే అర్ధమయింది. ఉద్యమం అంతిమ విజయం తెలంగాణది కనుక, దాన్ని అలా ఉంచితే; ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్నికల్లో తలపడిన  తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. పార్టీలు కొత్త భౌగోళిక రాష్ట్రం కోసం ఎటువంటి- ‘రోడ్ మ్యాప్’ను ముందుగా రూపొందించుకున్నాయి? రెండు దశాబ్దాలుగా ఉత్తరాది రాష్ట్రాల్లోని సామాజిక మూలాలలోకి చొచ్చుకుని పోతూ జరుగుతున్న- ‘సోషల్ ఇంజనీరింగ్’ గురించి ఈ రెండు పార్టీలు ఎంత మేర తగినంత స్పృహతో, ఎరుకతో ఉన్నాయి?

Also read: కల్లోల సమయాల్లో..సాంత్వనగీతం-‘ఎబైడ్ విత్ మీ’


తెలుగు దేశం

ప్రపంచ బ్యాంకు, డబ్ల్యు.టి.ఓ. యు.ఎన్ డి.పి. వంటి అంతర్జాతీయ సంస్థల మార్గదర్శకాలు మేరకు 1995 తర్వాత, పెద్ద ఎత్తున ప్రభుత్వ శాఖల- ‘రీస్ట్రక్చరింగ్’ జరిగింది. అప్పట్లో ఇందుకోసం ప్రత్యేకంగా- ‘రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్’ హైదరాబాద్ సచివాలయంలో పనిచేసింది. కానీ, ఈ పార్టీలో మాత్రం అటువంటిది ఏమీ జరగలేదు. మొదటినుంచి ఈ పార్టీకి ఉన్న సమస్య ఏమంటే- పదేళ్ల పాటు అది అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ, ‘పోస్ట్ మండల్’ లేదా ‘పోస్ట్-రిఫార్మ్స్’ దృష్టితో ఎటువంటి సమీక్ష గానీ మదింపు గానీ లేకుండా ఉదాసీనంగా ఉంటూ, ‘పోల్ మేనేజ్మెంట్’ మీద ఆధారపడి ప్రతిసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నది. సామాజిక శాస్త్రీయ దృష్టి కొరవడడం దీని ప్రధాన లోపం. పోనీ సామాజిక దృష్టి లేకున్నా, విభజన తర్వాత, చిన్న జిల్లాలు, సముద్రతీర ప్రాంత అభివృద్ధి వంటి అభివృద్ధి అంశాలు మీద దీనికి ఒక- ‘విజన్’ లేకపోయింది.
Also read: మూడవ ఏట అయినా అక్కడ దృష్టి మారుతుందా?
కాంగ్రెస్

2000 తర్వాత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కు కొత్త ‘వర్కింగ్ కల్చర్’ తెచ్చారు. ఢిల్లీ కాంగ్రెస్ అధిష్ఠానం పని తీరులో మార్పు లేకపోయినా, 1994 లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి ముందున్న సంస్కృతిలో వై.ఎస్. పార్టీ అధ్యక్షుడుగా సమూలమైన మార్పు తెచ్చారు. ఎన్నికల ముందు ఆయన పలు రాజకీయ సిద్ధాంతాలు నమ్ముతున్న ఆలోచనాపరులతో సమాలోచనలు జరిపారు. వాగ్ధానపూరితమైన పార్టీ ఎన్నికల ప్రణాళికతో, ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసాక, జె.ఎన్ యు. ఎకనమిక్స్ ప్రొఫెసర్ జయతీ ఘోష్ వంటి  ‘అకడమిక్’ నిపుణులను తన ప్రభుత్వానికి ‘రోడ్  మ్యాప్’ ఇవ్వమని కోరారు.
Also read: రాష్ట్ర విభజన నేపథ్యంలో… వొక దార్శనిక దృష్టిలో నుండి విజయవాడ
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్

‘పోస్ట్ రిఫార్మ్స్’ కాలంలో- ‘కార్పొరేట్ బిజినెస్’ రంగంలో ఉంటూ అక్కణ్ణించి రాజకీయాల్లోకి వచ్చిన యువకుడు జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్ర విభజనతో- ‘ఎరినా’ చిన్నది కావడం, తన ‘మోడల్ పాలిటీ’ని అమలు చేయడానికి  ఆయనకు కలిసొచ్చిన అంశం. దీని చారిత్రిక నేపధ్యం చూసినప్పుడు, ఇప్పుడున్న ఏ.పి. నేరుగా బ్రిటిష్ పాలనలో 200 ఏళ్ళ పాటు ఉంది. ఆర్థిక సంస్కరణలు తర్వాత వచ్చింది, అంటున్న- ‘సరళీకరణ’ తొలి దశ ఏ. పి.కి  బ్రిటిష్ కాలంలోనే అనుభవంలో ఉన్నది. దాంతో- ఇక్కడి ప్రజల్లో కులాలవారీ మతాలవారీ విడిపోయే లక్షణం లేదు. అందరికంటే ముందుగా ఈ విషయం గుర్తించి ఇక్కణ్ణించి నిష్క్రమించినది- కాన్షీరాం.

Also read: ‘షర్మిల ఫ్యాక్టర్’: కొన్ని మౌలిక భావనలు!

Manywar Kanshiram - Life History
కాన్సీరాం

90 దశకం ఆరంభంలో మొదలైన- ‘రాజ్యాధికారం’ నినాదం, ఒక సాహితీ వ్యక్తీకరణ దశ దాటి కార్యాచరణ దాకా చేరలేదు. 2015లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య తర్వాత, ఈ దిశలో ఎటువంటి తదుపరి కార్యాచరణ లేకపోవడం ఈ నినాదానికి వున్న పరిమితుల్ని స్పష్టం చేస్తున్నది. ఇక్కడే వీరు- ‘పవర్ పాలిటిక్స్’ వైపు నుంచి ‘ఫంక్షనల్ పాలిటిక్స్’ వైపు దృష్టి మళ్లించవలసిన అవసరం కనిపిస్తున్నది. దీన్నే బీహార్ విషయంలో ప్రొ. జెఫ్రీ విట్సోయి- ‘మండల్ పాలిటిక్స్’ మిశ్రమ నమూనా అంటున్నాడు. ఈ నేపథ్యంలో దక్షిణాదిన 2020 నాటికి జగన్మోహన్ రెడ్డి పార్టీ మునుపటి కాంగ్రెస్ మోతుబరి రెడ్డి రాజకీయాల నుంచి బయటకు రావడం ఆశాజనకంగా కనిపిస్తున్నది.  

Also read: ఈ హ్రస్వ దృష్టి రాజకీయానికి అంతం ఎప్పుడు?

(రచయిత అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాత)

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles