అశ్వినీకుమార్ ఈటూరు
అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ వీరుడుగా పేరుప్రఖ్యాతులు గడించిన తెలుగు బ్యాట్స్ మన్ వంగివరపు వెంకట సాయి (వి.వి.ఎస్.) లక్ష్మణ్ రాజకీయాలలో ప్రవేశించబోతున్నారా? బీజేపీలో చేరికకు రంగం సిద్ధం అవుతోందా? ఇప్పటికే భారతీయజనతాపార్టీకి చెందిన జాతీయ నాయకులు ఆయనను సంప్రదించారు. పార్టీలో ప్రధాని నరేంద్రమోదీ తర్వాత అత్యంత ముఖ్యుడు హోంమంత్రి అమిత్ షా పచ్చజెండా ఊపేశారు. దేశవ్యాప్తంగా చాలామంది క్రికెటర్లు (ఉదాహరణకు గౌతమ్ గంభీర్) బీజేపీలో ఉన్నారు.
రెండు తెలుగురాష్ట్రాలలోనూ తెలంగాణలో తమకు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 2019 ఎన్నికలలో నాలుగు లోక్ సభ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా దుబ్బాక ఉపఎన్నికలలో విజయదుంధుభి మోగించి రేపు అక్టోబర్ 30 న పోలింగ్ జరగబోయే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ తో నువ్వా-నేనా అన్నట్టు పోటీ పడుతున్న బీజేపీ మంచి ఊపు మీద ఉన్నది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా నియుక్తుడైన తర్వాత కాంగ్రెస్ లోనూ చైతన్యం పెరిగినప్పటికీ టీఆర్ఎస్ కి బీజేపీ అన్ని విధాలా తగిన ప్రత్యర్థి అవుతుందని కాషాయ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ వంటి మేటి క్రీడాకారుడిని పార్టీలో చేర్చుకొని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఏదో ఒక నియోజకవర్గంలో నిలబెడితే బాగుంటుందని బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తోంది. లక్ష్మణ్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలుగు వ్యక్తిని చేర్చుకుంటే పార్టీ ప్రతిష్ఠ పెరుగుతుందని నాయకత్వం ఆలోచిస్తున్నట్టు భోగట్టా.
వివిఎస్ లక్ష్మణ్ ప్రముఖ వైద్యుడు డాక్టర్ శాంతారామ్ కుమారుడు. 1 నవంబర్ 1974లో హైదరాబాద్ లో జన్మించారు. మెడికల్ కాలేజీలో చేరి క్రికెట్ కోసం చదువు మానుకున్నారు. వికెట్ల మధ్య నింపాదిగా పరుగులు తీసినప్పటికీ బంతిని కొట్టడంలో నైపుణ్యం ప్రదర్శించి పరుగులు ధారాళంగా సాధించగల మేటి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు. వంద టెస్టులలో ఆడినప్పటికీ ఒక్క టీ20 మ్యాచ్ లో కూడా ఆడకపోవడం విశేషం. గుంటూరు కు చెందిన శైలజను పెళ్ళి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్ కు 2012లొనే బైబై చెప్పారు. ఐపీఎల్ లో దక్కన్ చార్జర్స్ హైదరాబాద్ టీమ్ కి మెంటర్ గా పని చేస్తున్నారు. ఇదే కాకుండా స్పోర్ట్స్ చానెల్స్ కి కామెంటేటర్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం టీ 20వరల్డ్ కప్ పోటీలలో కామెంటరీ చెప్పుకుంటూ దుబాయ్ లో ఆనందంగా ఉన్నారు. 46 ఏళ్ళ వయస్సులో రాజకీయాలలో ప్రవేసిస్తారా లేక ఇదంతా గాలి వార్తేనా అన్నది ఆయన దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత మాత్రమే తేలుతుంది. లక్ష్మణ్ తో జాతీయ బీజేపీ నాయకులు చర్చలు జరిపిన సంగతి తనకు తెలియదని రాష్ట్ర నాయకుడు ఒకరు అన్నారు.