Thursday, January 2, 2025

నలభై ఏళ్ల పార్టీకి నూరేళ్లు నిండినట్లేనా?

(ఎస్.జి.కె)

ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ప్రతి రాజకీయ పార్టీ గెలుపు ఓటములపై సమీక్షించుకోవడం పరిపాటి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అలా చేసిన దాఖలాలేవి లేవు. ఎన్నికల్లో గెలిస్తే మొత్తం క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటాడు. ఓడిపోతే మాత్రం చాలా చిత్ర విచిత్రాలు చూపిస్తారు. 2019లో ఓటమి పాలైనప్పుడు జరిగిందదే. తెల్లారేసరికి ఓ భజన బృందం రెడీ అవుతుంది. “మీరు ఓడిపోవటం ఏంటయ్యా! ఎక్కడో మోసం జరిగిందయ్యా! ఎవరో మోసం చేశారయ్యా!” అంటూ సీన్ క్రియేట్ చేస్తారు. ఇక దాన్నే ఎల్లో మీడియా కళ్లకు కడుతుంది. దీంతో సమీక్ష ముగిసినట్లే. ఇటీవల జరిగిన ఆవిర్భావ సభలో సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయంపై నోరు మెదపలేదు. ఆయన మానసిక స్థితి అటువంటిది. చుట్టూ భజన పరులు ఉండాల్సిందే. సద్విమర్శకులను సమీపానికి కూడా రానివ్వరు. ఇలాంటి స్థితికి ఎల్లో మీడియా కారణమనే విషయం ఆయన గ్రహించాలి.

ఉషా కిరణాలు రాకముందే నిషా వార్తలతో మత్తులో ముంచే పత్రిక ఒకటైతే, కొడగడతున్న తెలుగుదేశం పార్టీకి నిత్యం తైలం వేసి జ్యోతి వెలిగించేది మరోకటి. రెండోది చిలక పచ్చ పత్రిక. కాకితో కబురు పెడితే దాని అధిపతి చిటికలో వాలిపోతాడు. చంద్రబాబుకి మేలు చేస్తున్నట్లు భ్రమిస్తూ ఎక్కువ హాని చేసేది ఈయనే. ఇటీవల పంచాయితీ ఎన్నికలు జరిగిన విషయం విదితమే. రెండుకి రెండు కలిపితే నాలుగు అనేది అందరికి తెలిసిన లెక్క కాని ఆ పత్రికకి వేరే లెక్కలుంటాయి. పంచాయితీ ఎన్నికల ఫలితాలను “తెలుగుదేశం పార్టీ లెక్క”, “వైఎస్ఆర్ పార్టీ లెక్క” అని రెండు రకాల ఫలితాలు ప్రకటించింది. ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినా పార్టీలు బాహటంగానే అభ్యర్ధులను ప్రచారం చేసుకున్నాయి. మరి ఆ పత్రికకి గ్రామ స్థాయిలో రిపోర్టర్లు ఉన్నారు. వారి నుండి నిజాలు తెలుసుకోవచ్చు. మరి రెండు రకాల లెక్కలు ఎక్కడ్నించి వచ్చాయి. నిజం చెపితే చంద్రబాబుకి కోపం వస్తుంది గనుక. అంతటితో ఊరుకోలేదు. పంచాయితీల్లో తెలుగుదేశానికి దాదాపు 40 శాతం వచ్చాయని భ్రమలు కల్పించారు. దీంతో చంద్రబాబు మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫలితం తెలుగుదేశం భూస్థాపితం. దీంతో కళ్లు పచ్చబడ్డాయి. 11 కార్పొరేషనలో ఒక్కటీ గెలవలేదు. 75 మున్సిపాలిటీల్లో ఒకటి మినహా మిగతా చోట ఘోర పరాజయం . సొంత జిల్లాలో సైతం ఓటమి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి 52 శాతం, తెలుగుదేశానికి 30 శాతం ఓట్లు వచ్చినట్లు ప్రకటించడం జరిగింది. మరి ఏకగ్రీవాల మాటేమిటి? ఏకగ్రీవాల్లో 95 శాతం వైఎస్ఆర్ పార్టీ గెలిచింది అంటే ఆ స్థానాల్లో తెలుగుదేశం పోటీ పెట్టే సాహసం చేయలేదు. అవికూడా కలిపితే తెలుగుదేశానికి 30 శాతం ఓట్లు కూడా రావు. వైఎస్ఆర్ పార్టీ ఓట్లు శాతం మరింత పెరుగుతాయి.

పొగడ్తల విషయానికొస్తే 40 ఏళ్ల క్రితం వచ్చిన బాపు – రమణ సినిమా ‘ముత్యాల ముగ్గు’ని గుర్తు చేసుకోవాలి. అందులో పొగడ్తల మూలంగా వచ్చే ప్రమాదాన్ని చాలా చమత్కారంగా చూపించారు. బోర్డు మీద రేట్లు పెట్టి మరీ హత్యలు, అరాచకాలు చేసే ఒక విలన్ పాత్రదారి (రావు గోపాలరావు) ఒక భజన బృందం పెట్టుకుంటాడు. అయితే అది భజన చేయడానికి కాదు. ఎవరైనా పొగిడితే ఉబ్బిపోకుండా అటెక్షన్లో ఉంచడానికి. ‘నన్నేవరైనా పొగిడితే వీళ్లు భాజాలు మోగిస్తారు. నేను భరతం (పొగిడినవారికి) పట్టేస్తా’ అంటాడు. పొగడ్తల మూలంగా విచక్షణా జ్ఞానం కోల్పోతారనేది దీని సారాంశం. ఈ సత్యాన్ని నేటికీ గ్రహించకపోవటం విచారకరం.

అసలు తెలుగుదేశం పార్టీ పతనం 2004లోనే ప్రారంభమైంది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ గెలుపుతో ఈ పతనానికి నాంది జరిగింది. మొత్తం 294 స్థానాలకు గాను కాంగ్రెస్ కూటమికి 226 స్థానాలు వస్తే తెలుగుదేశం పార్టీకి కేవలం 47 మాత్రం వచ్చాయి. పత్రికా పాఠకుల్లో 90 శాతం వాటా ఆ రోజుల్లో ఆ రెండు పత్రికలదే. ‘సాక్షి’ అప్పటికి లేదు. అప్పటికే ఆ పత్రికలను జనం కరపత్రాలుగా చూడటం ప్రారంభించారు. అచ్చులో ఉన్న ప్రతీది అక్షర సత్యం కాదని గ్రహించారు. 2009లో చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం రావటంతో త్రిముఖ పోటీ జరిగింది. అంతకు ముందు కాంగ్రెతో కలిసి పోటీ చేసిన వామపక్షాలు, తెలంగాణా రాష్ట్ర సమితి తెలుగుదేశంతో జతకట్టడంతో ఆ పార్టీకి కాస్త సీట్లు పెరిగాయి. గాని ఓట్లు పది శాతం అంటే 38 నుండి 28 శాతానికి తగ్గాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి కొద్ది నెలల్లో ప్రమాదవశాత్తు మృతి చెందటం, వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం జరిగాయి. ఇతర పార్టీల నుండి వచ్చిన వారు తమ ఎంఎన్ఏ పదవులకు రాజీనా చేయాలని వైఎస్ఆర్ పార్టీ షరతు విధించింది. ఫలితంగా 2012లో జరిగిన 18 శాసనసభ ఉప ఎన్నికల్లో తెలుగుదేశానికి గెలుపు మాట అటుంచి మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు.

అయితే రాష్ట్రం విడిపోవటం తెలుగదేశానికి కలిసొచ్చిందనే చెప్పాలి. చంద్రబాబు అనుభవజ్ఞుడని, కేంద్రంలో చక్రం తిప్పుతాడని జనం భావించారు. అమలు సాధ్యంకాని వందలాది ఎన్నికల హామీలు ఇచ్చాడు. అప్పుడే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ పెట్టకుండా చంద్రబాబుకి బేషరతుగా మద్దతు ఇచ్చాడు. ఇక బిజెపితో పొత్తు ఉండనే ఉంది. మోడీ హవా ఉంది. ఇన్ని వున్నా బొటాబొటి ఓట్ల మెజార్టీతో బాబు అధికారంలోకి వచ్చాడు. తరువాత కేంద్రంలో చక్రం తిప్పటం అటుంచి చివరకు సైకిల్ చక్రం కూడా తిప్పలేకపోయాడు. దానికి తోడు లక్షల కోట్ల రూపాయల ఎన్నికల హామీలు అమలులో వైఫల్యం. ఫలితంగా 2019 ఎన్నికల్లో కేవలం 23 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ప్రస్తుతం తెలుగుదేశం ఓట్ల శాతం అధికార పార్టీ ఓట్ల శాతంతో సగానికి పడిపోయిన స్థితి. ఏడు పదుల వయసులో పార్టీని నడిపించే సత్తా చంద్రబాబుకు లేదు. లోకేష్ కి నాయకత్వ లక్షణాలు లేవు. సీనియర్లు జారుకుంటున్నారు. ఇదంతా దేనికి సంకేతం? మరి నలభై ఏళ్ల పార్టీకి నూరేళ్లు నిండినట్లేనా!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles