మా యింటి పెరటిచెట్టు ఉదయం
పాట మానేసి చాల రోజులైంది
ఆ పాట మా యింటిల్లిపాదికి శుభోదయం
మా యింటికే కాదు,
మా వీధి మొత్తానికీ సుప్రభాతగీతం
రంగులు పూచే ఆకాశానికి
ప్రకృతి ప్రసాదించే మేలుకొలుపు సింఫనీ…
మూగబోయిన చెట్టుని పలుకరిద్దామని
కొమ్మల్ని చేతుల్లో పొదువుకుంటే
ఆకుల కళ్ళతో ఆకాశాన్ని చూపింది
శూన్యం నిండా ఇనుపచెట్ల దర్శనం
సాలెగూడులా నగరానికి అల్లుకున్న టవర్ల పైన
క్రూరపు గద్దల కాపురం
మా చెట్టు కొమ్మల్లోని ఖాళీ గూళ్ళలో
ఒక్క పిచ్చుకయినా కనిపించలేదు
పిచ్చుకలు కిచకిచల సంగీతాన్ని సృష్టిస్తేనే కదా
చెట్లకి రోజూ పండుగ
గోడమీది అద్దానికి ఆనందం
ఇల్లంతా శబ్ద నృత్య వాతావరణం
ఇనుపచెట్లు తరిమేసిన పిచ్చుకల పరస
ఏ నిరాశాఎడారుల్లో మాయమైపోయిందో
ఏ రాబందుల అగ్ని సృష్టి భుగభుగల్లో
భస్మీపటలమై జ్ఞాపకంగా మిగిలిపోయిందో
గోడమీద పిచ్చుక బొమ్మొకటి
నోరు తెరచి నన్ను ప్రశ్నిస్తున్నట్టు..
మానవజాతి అభివృద్ది కోసం
జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తున్న విధ్వంసకారుడిలా
ఆ బొమ్మ ముందు మోకరిల్లిన నేరస్తుణ్ణి నేను…!!
(కవి మొబైల్: 9849230443)