“మూఢ నమ్మకాలు ఉన్న మూర్ఖులకంటే, మీరంతా నాస్తికులు కావాలని అనుకుంటా న్నేను. నాస్తికుడి విషయంలో ఆలోచించేందుకుంది. కానీ, మూఢత్వం ఒక్కసారి మీ బుర్రల్లో దూరిందా.. ఇక అది చెడిపోవడమే తరువాయి, ఆ దిగజారుడుతనం మొత్తం జీవితాన్నే ఆక్రమిస్తుంది.” / “శతాబ్ధాలుగా మనం హత్తుకున్న వందలాది మూఢ నమ్మకాలను వొదిలించుకోవాలి. అతీత శక్తుల కట్టు కథలు అతి బలహీనమైన మనస్తత్వ ప్రతీకలు. ఇవన్నీ భ్రష్టత్వానికీ, మరణానికీ సూచికలు. చదూకున్న ఆలోచనాపరులు, సమర్ధ వంతులు సైతం వీటికై కాలాన్ని వృధాచేయడం, మూఢ నమ్మకాలు బలపరిచే కారణాల్ని సృష్టించడం మానవతకే తీరని అవమానం!”(పేజీలు 9,10)
మతోన్మాదానికి బలైపోయిన డా. నరేంద్ర దభోల్కర్ సోదరుడు డా. దత్తప్రసాద్ దభోల్కర్ ఎంతో పరిశోధించి మరాఠీలో రచించిన ఈ పుస్తకాన్ని ఆల్కా పవన్ గాడ్కర్ ఆంగ్లంలో అనువదించగా మహరాష్ట్ర పూనే కి చెందిన “లోకాయత్” యవజన సోషలిస్టు సంస్థ ప్రచురించింది. ఏడేళ్ళ క్రితం నేను దానిని తెలుగు లోకి తర్జుమా చేసి ప్రచురించినదే ఈ పుస్తకం. Rationalist, Scientific, Socialist అనే పదాల్ని చూసి మొదట్లో హేళన చేస్తూ మాట్లాడిన వాళ్ళే ముప్పై రెండు పేజీల ఈ చిన్న పుస్తకం చదివాక సీరియస్ గా నాతో చర్చించడం జరిగేది. అందరూ అననుకానీ అభిప్రాయాలు మర్చుకున్న మిత్రులు ఎందరో ఉన్నారు!
Also read: చీకటి రాత్రులు – వేకువ వెలుగులు
“విశ్వశించేలాగైతే మనకి హేతువు ఎందుకు ఇవ్వబడింది? హేతువిరుద్ధంగా ఆలోచించడం దైవధిక్కారం కాదా? దేవుడిచ్చిన ఉత్కృష్టమైన వరాన్ని కాదని జీవించే హక్కు మనకేముంది? తానిచ్చిన సౌలభ్యాన్ని వినియోగించుకోని మూఢ భక్తుల కంటే హేతు సహితంగా జీవించే ఆలోచనా పరుల్నే దేవుడు మన్నిస్తాడని కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే, మూఢభక్తి ఇంద్రియ సుఖానుభవాల్ని చంపి మనుషుల్ని పశువుల స్థాయికి దిగ జార్చుతుంది” అన్న వివేకానంద, “గ్రంథాలేవీ అంతిమం కావు. మతపరమైన సత్యాన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకోవడమే సహేతుకతకు సాక్ష్యం!” అంటాడు! (పేజీ 12)
Also read: అభివృద్ధి – ఆదివాసులు – హింస
విబేధాలు – విమర్శలు ఉండాల్సిందే కానీ వాటి విలువ అర్థవంతమైన సంవాదాలతోనే ముగియాలి కానీ నిరర్దకమైన వాదనలతో కాదనేదే నా అభిప్రాయం. అభిప్రాయాల్ని మార్చుకోడానికి సిద్దంగా లేనివాళ్ళు, ప్రజల అభిప్రాయాలను మార్చడానికి ప్రయత్నం చేయడం ఒక వింత. వ్యక్తిగతంగా నాకు కూడా అనేక విషయాల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఉన్మాదానికి వ్యతిరేకంగా గొంతు విప్పిన ఒక బలమైన సాంస్కృతిక స్వరంగా వివేకానందుడ్ని గురించిన పుస్తకాన్నిలా తీసుకుని రావడం ప్రాధాన్యత కలిగిన కార్యాచరణ అని తలిచాను నేను, ఇప్పుడా ప్రాధాన్యత పెరుగుతోంది!
Also read: ‘మతాతీత మానవత్వమే మన మార్గం’
“వికాసానికి స్వతంత్రం మొదటి నియమం. ఆలోచించడానికి, మాట్లాడడానికి, నచ్చిన బట్టలేసుకుని నచ్చింది తినడానికి, నచ్చిన వారితో జీవిస్తూ, నచ్చినట్లుండడానికీ ఇతరులకి హాని చేయనంత వరకూ, ప్రతి ఒక్కరికీ స్వతంత్ర ముండాలి.”అంటూ, “పురోహిత వర్గం సృష్టించిన విధ్వంసాలు అన్నిటిలోనూ మొత్తంగా కులమనేది ఒక ఘనీభవించిన సామాజిక వ్యవస్థ. ఇప్పుడది దుర్గంధం వెదజల్లుతూ కంపు కొడుతోంది.” అంటాడు. అంతేకాదు, బోధకులు అందరిలోనూ నీతీ, ధైర్యం కలవాడు బుద్దుడు అంటూ,”కులాన్ని అసలు గుర్తించని గొప్ప భారతీయ తత్వవేత్త బుద్దుడు. అతని అనుచరులెవరూ భారతావనిలో మిగలలేదు. ఇతర తత్వవేత్తలంతా ఎంతో కొంత సామాజిక దురభిమానాన్ని కల్గిఉన్నారు” అంటాడు! (పేజీ 12, 16)
భారద్దేశ బీదరికానికీ, వెనుక బాటుతనానికీ కులవ్యవస్థే కారణమన్న ఆయన ఈ దేశంలో ‘ఒకే కులం మిగిలే రోజొకటొస్తుందని ‘ అంటాడు. అంతే కాదు, ‘అసమానతలనేవి ఉన్నప్పుడు బలవంతులకంటే బలహీనులకి అవకాశాలు ఎక్కువ ఇవ్వబడాల’న్నాడు. ఇంకా స్పష్టంగా, బ్రాహ్మణులు వారి ప్రత్యేక హక్కుల్ని వొదులు కోవడం ద్వారా వెనకబడ్డ కులాల ఉన్నతికి తోడ్పడాలని విజ్ఞప్తిచేసాడు. ఇక మతానికి సంబంధించీ ఆయనది ఎంత ఆధునిక దృక్పథం అంటే, “జీవితాన్ని అందరి మంచి కోసం, ఆనందం కోసం అర్పించడమే మతం” అన్నాడు. అక్కడితో ఆగలేదు, “ఒక్క మతం కనుక సత్యం అయితే, మతాలన్నీ సత్యాలై తీరాలి” అన్నాడు.”అన్ని మతాల ఆదర్శ సారాంశం ఒక్కటే, స్వాతంత్ర్యాన్ని సముపార్జించడం, దుఃఖాన్ని విడనాడటం” అంటూ,”మనకో కొత్త దేవుడు, కొత్త వేదాలు, కొత్త మతం అవసరం” అంటాడు!(పేజీలు16,17,18).
Also read: ఒకానొక ప్రస్థానం గురించిన ప్రస్తావన
అలవాటైన పద్దతిలో స్వామిగా కాకుండా, వివేకానందుడికి అరాజకవాదం నుండి మొదలెట్టి కమ్యూనిజం వరకూ ఉన్న పరిచయాన్నీ, సోషలిస్టు గా ఎదిగిన క్రమాన్ని కొత్తగా చిత్రించిన తీరు ఇందులో చదవాలి. ‘సమానతకి సమీపంగా వచ్చిన మతం ఇస్లాం’ అని పేర్కొన్న ఆయన మహమ్మద్ ప్రవక్తని ‘మానవాళి సౌభ్రాతృత్వానికి సమతా ప్రవక్త’ అనడం మొదలు “అనాధలు, అభాగ్యుల నోట్లో ఇంతముద్ద పెట్టలేని దేవుడ్నీ, మతాన్నీ నమ్మను’ అనేంత దాకా, “వేదాలు బైబులు,ఖురాన్ లేని చోటుకి మానవాళిని నడిపించాలి. వేదాలు, బైబిల్, ఖురాన్ లని సమైక్యం కావించడం ద్వారానే అది సాధ్యం.’అని పేర్కొన్నాడు. 33 ఏళ్ళ వయసు లో నవంబరు 1, 1896 మేరీ హేలీకి రాసిన లేఖలో “నేను సోషలిస్టుని”అని ప్రకటించాడు! (పేజీలు 19,20,22,25)
పూర్వ నిశ్చితాభిప్రాయాలు పెట్టుకున్నవారికి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు కానీ ఒక మత దూతగా ముద్రవేయబడ్డ వివేకానంద, నిజానికి మానవాళి అంతటికీ చెందిన వాడనీ, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చుకానీ సర్వమానవవికాసం కాంక్షించాడనీ, ఈరోజు మతోన్మాదం ఆయన్ని కూడా జేబులో వేస్కుటోందనీ, ఆ ప్రయత్నాలు అడ్డుకుని వివేకానందుడినీ భారతీయ లౌకికత్వ మతసామరస్యానికి, సాంస్కృతిక మానవతా వాదానికీ ఒక ప్రతీకగా చూడగలగడమే సమాజంలోని బహుళత్వాన్ని కాపాడు కోవడానికి ప్రగతిశీల శ్రేణులకు ఈరోజు ఉన్న ప్రధాన ప్రమాణం అనేది ప్రచురణకర్తల భావం. చివరగా, అప్పట్లో నామమాత్రపు ప్రతిపాదిత విరాళం పెట్టిన ఈ పొత్తాన్ని చాలామట్టుకు వివిధ ప్రాంతాల వాళ్ళు కోరగా ఉచితంగానే పంచడం జరిగింది.ఇప్పుడిక కాపీలు లేవు. ఆసక్తి ఉన్న వారు నా వాట్సప్ 90320 94492 కి రిక్వెస్ట్ పెడితే సాఫ్ట్ కాపీలు (ఇంగ్లీషుమూలం, తెలుగు అనువాదం రెండూ కూడా) పంపగలను. ఆర్దిక సౌలభ్యం ఉన్న మిత్రులు అవకాశం ఉంటే మా కార్య క్రమాలకు సహకరించ డానికి స్వచ్చందంగా ముందుకు రావాల్సిందిగా మనవి!
Also read: కొన్ని తరాలు – కొన్ని స్వరాలు
(ముప్పైమూడు పుటల ఈ పుస్తకంలో రిఫరెన్స్ ఆధార గ్రంథాల జాబితాయే మూడు పేజీలుంది. ఇక మొదటి నుండి చివరి పేజి వరకూ మేటర్ లోనూ, హైలెట్ చేస్తూ ఇచ్చిన బాక్స్ ఐటమ్స్ లోని మొత్తం సమాచారం, కొటేషన్లకు స్పష్టంగా ఎక్కడికక్కడ పేజీ నంబర్లతో సహా సంప్రదించిన గ్రంథాల్ని ఉల్లేఖించడం జరిగింది. నేటి సంక్షోభ సమయంలో ఇలాంటి రచనలు ఎంతో ప్రయోజనం అని నమ్ముతూ రాజ్యాంగబద్ద లౌకిక ప్రజాతంత్ర అభ్యుదయ శక్తులు ఈ ప్రయత్నం వెనుక ఉద్దేశాన్ని అర్ధం చేసుకోక పోయినా వచ్చే నష్టం లేదు కానీ దయచేసి గతంలోలాగా అపార్ధం చేసుకొని పెడార్ధాలు తీయవద్దని మనవి చేస్కుంటూ ఈ అనువాద పుస్తకం గురించిన ఈ చిన్న రైటప్).
Also read: గదర్ పార్టీ వీరుడు దర్శి చెంచయ్య, పిరికితనం ఆయన రక్తంలోనే లేదు!
– గౌరవ్