భావసంపద-భాషాదారిద్ర్యం
అధ్యక్షా!
తెలుగు భాషాభివృద్ధి సంఘ కార్యదర్శినైన నేను ఈ అత్యవసర సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందో టూకీగా రెండు ముక్కలలో చెబుతాను.
మహారాజశ్రీ మన ప్రభుత్వంవారు శాసనసభా నిర్వాహకుల అత్యవసర విజ్ఞప్తిని మన భాషాసంఘానికి పంపించి ఈ క్రింది విషయాలను కూలంకషంగా చర్చించి, పదునైన నిర్ణయాలు తీసుకుని తమకు వెంటనే పంపవలసినదిగా ఆదేశించారు.
ఆ విషయాలేమిటనగా
- భాషాదారిద్ర్యము-దాని పర్యవసానాలు.
- ఇతర భాషలలో భాషా సంపద ఎలా ఉంది?
- ఇతర భాషల నుండి మనం పదునైన పదాలను దిగుమతి చేసుకోవచ్చునా?
- ఈ భాషాదారిద్ర్యాన్ని వదలగొట్టుకోవడం ఎలా?
- భాష అన్ని అవసరాలకూ సరిపోవాలంటే మనం ఎవరిని ప్రోత్సహించాలి?
- అధ్యక్షుని అనుమతితో ఇంకేమైనా, ఎవరైనా మాట్లాడవచ్చును.
అధ్యక్షా,
మనం ప్రతిదినమూ అసెంబ్లీ సమావేశాలు చూస్తూనే ఉన్నాం. కొంతసేపు వాదోపవదాలు అయిన తర్వాత మిగతా కార్యక్రమం చాలా పేలవంగా ఉంటోందని, భాషా సంఘ సభ్యులైన మీరు గమనించే ఉంటారు!
నవాదశ (అష్టాదశ కాదు) పురాణాలలో ఆఖరి పురాణమైన బూతుపురాణం అందరూ చదవకపోవడమున్నూ, చదివినవారు కూడా కూడూ, గుడ్డా, పదవీ పెట్టని బూతుపురాణం ఎందుకూ పనికి రాదని ఆలోచనా రాహిత్యంతో నిర్ణయాలు తీసుకోవటమున్నూ జరిగి, ఈ బూతుపురాణమనేది తెలుగు ఆదిగ్రంథాలలో అట్టడుగు స్థాయికి పోయింది. ఇప్పుడే బాగా సంస్కారవంతులు, చదువుకున్నవారు శాసనసభ్యులవటం మూలానా, మరలా ఈ బూతుపురాణానికి పునర్జన్మ లభించి వెలుగులోకి వచ్చాయి. అసలీ బూతుపురాణాలన్ని రాజసభ (శాసనసభ)లో వాడుకోవడం మొదలుపెట్టిన మన శిశుపాలుడు గారిని ఒక్కసారి స్మరించుకుని మరీ ముందు వెళదాం! అట్లా అని కురుసభలో దుర్యోధనుని తిట్ల పురాణాలు, బూతు సందేశాలను మనం తక్కువ చేయనక్కరలేదు. ఎప్పుడైతే భాషా దారిద్ర్యం ఏర్పడిందో ‘అప్పుడు ఆడువారిని ఆశ్రయించు’ అని మన శకునిమామ ఉపదేశం మనకు సర్వదా శిరోధార్యం!
ఇప్పుడు మహారాజశ్రీ తెలుగుప్రభుత్వంవారికి మనం అత్యవసరంగా ఈ భాషాదారిద్ర్య నివారణకు పరిష్కారం చూపాలి.
గౌరవనీయులైన శాసనసభ్యులకు ఏ మాత్రం కొదవలేకుండా బుూతులతో మన తెలుగు భాషను పరిపుష్టం చేసి, గ్రంథాలను అచ్చువేసి, సభ్యులందరికీ వచ్చే సమావేశాలలోపు మనం అందజేయాలి!
దానికి మన ప్రణాళిక
- ఉన్న బూతులకు పదును పెట్టడం
- మరీ ముఖ్యంగా, కొత్త బూతులు సృష్టించడం
- అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళే కాకుండా పిన్నులు, పెద్దమ్మలు, అత్తలు, కోడళ్ళు లాంటివాళ్ళను కూడా చేదోడుగా ఈ బూతుపురాణంలోకి తీసుకురావడం వంటివి వెంటనే చేసి, భావి తరాలకు మనం మార్గదర్శకులం కావాలి!
- భాషాదారిద్ర్యంతో మన ఏలికలు ఏ మాత్రం అవమానాల పాలవ్వగూడదనేది మన లక్ష్యంగా పెట్టుకొని దానికి రూపకల్పన చేయాలి.
- దానికి అవసరమైతే ఇతర భాషలను అర్జంటుగా అధ్యయనం చేసి, మనకంటే ‘‘పోటుగాళ్ళు’’ అక్కడ ఉంటే వారిని గప్ చుప్ గా మన భాషలో ఇముడ్చుకోవాలి.
- భాషాదారిద్ర్యాన్ని వదలగొట్టుకోవాలంటే మనం మన జాతి సంపద, భాషా సంపద ఐన చౌడప్పలాంటి కవులను స్మరించుకొని వందలాది చౌడప్పలను సృష్టించుకోవాలి.
- తిట్టుకవిత్వం అధ్యయనానికి పదిమందితో కూడిన ఒక కమిటీ వేయాలి. వారు రోజూ పది పదునైన బూతులు మన శాసనసభ్యులకు అందజేయాలి.
- ఒకే మూసరకం బూతులు కాకుండా పసందైన బూతులు – సందర్భానుసారంగా వాడగలవి- తయారు చేసి వాటిని ఎప్పుడు, ఏ సందర్భంలో వాడాలో మన నేతలకు సవివరంగా తెలియజేయాలి. (కిందటి సమావేశాలలో ఆవేశం ఎక్కువై భావ సంపద పుష్కలంగా ఉన్నాగాని, భాష లోపించి కొన్ని బూతులు వాడకుండా ఉండడం మనం గమనించే ఉంటాము). వారు వీరు అని కాకుండా ప్రజలందరినీ ఈ బూతుపురాణాల్లో (పెద్దాచిన్నా, ధనిక, పేద, ఆడ,మగ ఇత్యాది తేడాలు లేకుండా) బూతుకు ఎవ్వరూ అనర్హులు కారని మనం నిరూపించాలి.
ఇలాంటిపరిస్థితి మన శాసనకర్తలకు ఇకముందు రాకుండా వారిని ఒక ఒడ్డుకు చేర్చాలి.
ఇదే మన తక్షణ కర్తవ్యం
జై తెలుగు భాషా!
జై తెలుగు శాసనసభా
జై……జై…..!