ఆకాశవాణిలో నాగసూరీయం – 1
“… వ్యాసమును తీసుకుని ఇంటికి వస్తూ, త్రోవలో, ఆప్త స్నేహితుడు నార్ల వెంకటేశ్వరరావును పలకరిద్దామని అతని ఆఫీసుకు వెళ్ళాను. ఎంత పనిలో ఉన్నా, ఒక్క నిమిషం ఆ పని ఆపి, నాతో ఆప్యాయంగా మాట్లాడుతారు నార్ల. ఈ సంభాషణ కొంత, సాగాక, అలవాటు ప్రకారం, ఆయన అడిగారు : “ఏమైనా క్రొత్త రచన వ్రాశారా?” అని. నా దగ్గర ఉన్న ‘జ్ఞాపకాలు’ వారి చేతికిచ్చాను. నార్ల మెప్పు పొందడం చాలా కష్టం. కాని, నా వ్యాసం చదివి ఆయన అన్నారు : “చాలా బాగా వ్రాశారు, మాకియ్యండి : మీ జీవిత విశేషాలు వివరంగా వారం వారం, ఇల్లాగే వ్రాయండి. ఒక శీర్షికగా ప్రచురిస్తాము, ప్రభలో” అని. ఉద్యోగంలో ఉంటున్న నేను ఇలా వారం, వారం నన్ను గురించి వ్రాసుకోవడానికి వ్యవధి ఉంటుందా? అని నేను సందేహిస్తుంటే నార్ల “మీరు వ్రాయగలరు, నాకు తెలుసు : ఈ ఆదివారమే ఈ వ్యాసం వేస్తున్నాను. మళ్ళా వారానికి రెండవ వ్యాసం పంపండి” అని, తన పనిలో మునిగిపోయారు.
ఆ ఆదివారం ఆంధ్రప్రభలో “నా స్మృతిపథంలో…” అంటూ, చదువుకున్నాను నా ‘జ్ఞాపకాలు’. తరువాత వారం వారం. ఆ పేరు పెట్టినది నార్లవారే. వారం వారం వ్రాయించినది నార్లవారే…”
తెలుగు తొలి ఆకాశవాణి (మద్రాసు కేంద్రంలో తొలి) ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్, మంచి రచయిత, భావకుడు అయిన ఆచంట జానకిరామ్ (1902-1992) తన ఆత్మకథకు ముందుమాటలో ఈ విషయాలు రాసుకున్నారు. నా స్మృతిపథంలో, సాగుతున్నయాత్ర – అనే రెండు భాగాలుగా 1957-1963 మధ్యకాలంలో ఈ స్వీయచరిత్ర రాసుకున్నారు. ఇది ధారావాహికగా ప్రచురణ ఆంధ్ర ప్రభ దినపత్రిక ఆదివారం సంచికలో 1957 నవంబరు 3 మొదలైంది!
—–. ——– ——–. ——–
ఎందుకీ ప్రస్తావన?
ఈ విషయాలు ఇప్పుడు రాయడానికి ఓ నేపథ్యముంది… ఓ బలమైన కారణముంది!
ఎక్కువ మందిని హత్తుకునే విషయం గురించి రాయమని ‘సహరి’ మిత్రులు గొర్లి శ్రీనివాసరావు 2021 మే మాసంలో సూచించారు. కొంత తర్జనభర్జన తర్వాత ఆకాశవాణికి సంబంధించి నా ప్రమేయంతో జరిగిన ప్రయోగాలకు సంబంధించిన సంగతులతో ‘ ఆకాశవాణి లో నాగసూరీయం’ గా మలిస్తే బావుంటుందనే నిర్ణయానికి వచ్చాను!
ఇదీ ఆచంట జానకిరామ్ స్వీయచరిత్ర నేపథ్యం లోంచి నార్ల వెంకటేశ్వరరావు తోడ్పాటు గురించి ఇప్పుడు చెప్పడానికి కారణం!!
———————————————–
ఆకాశవాణిలో 33 సంవత్సరాలు
నా అరవయ్యేళ్ళ జీవితంలో సగానికి పైగా ఆంటే సుమారు 33 సంవత్సరాలు ఆకాశవాణిలో — నాలుగు రాష్ట్రాలలో అనంతపురం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కడప, మదరాసు, తిరుపతి కేంద్రాలలోనే కాక నాలుగు దక్షిణాది – ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు ఉద్దేశించిన ప్రసారభారతి శిక్షణా కేంద్రం (రీజనల్ అకాడమీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ మల్టీమీడియా, ఆర్ ఏ బి యం ), హైదరాబాద్ డైరెక్టర్ గా కూడా పనిచేశాను. సంతృప్తి కల్గించిన సందర్భాలు సులువుగా వందకు మించి ఉన్నాయి. ఢిల్లీ నుంచి నేషనల్ హుకప్ కోసం 1995 లో రూపొందించిన ‘రేడియోస్కోప్’ ఆంగ్లం సైన్స్ సంచికాకార్యక్రమం అదనం!
‘ఆకాశవాణిలో నాగసూరీయం’ వ్యాసమాలిక ప్రణాళిక ఏమిటి? వర్తమాన ప్రపంచానికి, భవిషత్తరానికి దోహదపడే విషయాలే ఇందులో ఉంటాయి. వాటిలో వ్యక్తిగతమైన సృజన, పరిస్థితుల పరిమితుల మధ్య సాగిన పరిశోధన, ఇబ్బందుల మధ్య సాధ్యమైన సామూహిక కృషి , ప్రజా ప్రయోజనం వంటివి తప్పక ఉంటాయి. చారిత్రకమైన విలువున్న ఈ ప్రయత్నాలు రేడియో మాధ్యమాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడే మెళుకువలు- ఓ పాఠంలా తోడ్పడే సంగతులు కూడా!
ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ నుండి ప్రారంభించాలి – అనే మీమాంసలో తారసపడిన మెరుపులాంటి… జ్ఞాపకం ఆచంట జానకిరామ్ గారి స్వీయచరిత్ర నేపథ్య శకలం. ఇది ఒక రకంగా నా స్మృతుల ముత్యాలసరం! వారం వారం చక్కటి ముత్తెం మీ కంటిముందు దొర్లించడం నా కర్తవ్యం!!
నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ డే
మన రేడియోకు సంబంధించి జులై 23కు ప్రాధాన్యత ఏమిటంటే ఆ రోజు ‘నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ డే’ (జాతీయ ప్రసార దినోత్సవం) కావడం. వ్యవస్థీకృతంగా భారతదేశంలో రేడియో ప్రసారాలు మొదలైన సందర్భం అది. 1927 జులై 23న (అప్పటి) బొంబాయిలో ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ (ఐబిసి) వారి బొంబాయి రేడియో కేంద్రాన్ని అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ఈ కంపెనీ కి చెందిన రెండవ రేడియో కేంద్రం అదే సంవత్సరం ఆగస్టు 26న కలకత్తాలో మొదలైంది. ఇవి ఎంతో కాలం నడవలేదు. 1930 మార్చి 1వ తేదీన ఈ కంపెనీ మూతపడింది. మరుసటి నెల అంటే ఏప్రిల్ 1 నుంచి బ్రిటీషు ప్రభుత్వం రేడియో కేంద్రాల బాధ్యతను తనే తీసుకుంది. కనుక 1923 జూన్ నుంచి అక్కడక్కడ కొన్ని ప్రయత్నాలు జరిగినా ఒక పద్ధతి ప్రకారం మొదలైంది 1927 జూలై 23ననే! అదీ నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ డే ప్రాధాన్యత. కనుక దీనితో ముడిపడిన సంగతి మంచి సందర్భమే!
తిరుపతిలో పని చేస్తున్నపుడు 2017 జూలై 22న చంద్రగిరి కోటలో ‘జాతీయ ప్రసార దినోత్సవం’ సందర్భంగా ‘వారసత్వ కళా విజ్ఞాన వాహిని’ పేరున శ్రోతల సమ్మేళనం నిర్వహించడం గుర్తుకు వస్తోంది. 2016 ఆగస్టు నుంచి 2018 ఆగస్టు దాకా తిరుపతి ఆకాశవాణి నిర్దేశక బాధ్యతలు నిర్వహించాను. సాధ్యమైనంత ఎక్కువ మందిని భాగస్వాములుగా చేయాలనే ప్రయోగాలు చాలా చోట్ల చేశాను. అయితే, అటువంటి చారిత్రక ప్రదేశంలో ఒక కార్యక్రమం రూపొందించి నిర్వహించడం నాకు తెలిసి అదే ప్రథమం!
చంద్రగిరి కోటలో కార్యక్రమం
చంద్రగిరి కోట 11వ శతాబ్దపు నిర్మాణం. పెనుకొండ నుంచి రాజధాని చంద్రగిరికి మారింది. సాళువ నరసింహ రాయలు కాలంలో చంద్రగిరి ప్రభ వెలిగింది. 1367 నుంచి రాజధానిగా వెలుగులు చిమ్మింది. 1664లో గోల్కొండ నవాబుల ఏలుబడికి, పిమ్మట 1792లో మైసూరు సంస్థానాధీసుల చేతికి వెళ్ళిందీ కోట. ఇందులో కోట మాత్రమే కాక, రాజమహల్, రాణిమహల్ నేటికీ ఎంతో సోయగాలు చిమ్ముతూ ఆకర్షిస్తున్నాయి!
‘కోడెనాగు’ సినిమాలో ‘ఇదే చంద్రగిరి…’ అనే ఘంటసాల పాడిన పాట బహుళ ప్రసిద్ధి పొందింది. చరిత్రనూ, చరిత్ర ప్రతీకలనూ గుర్తుపెట్టుకోవాలి. అవి చెప్పే గుణపాఠాలను తెలుసుకుని మనం మసలుకోవాలి. ఆ దృష్టితోనే తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో సినిమాపాటలు, సమాచారం మేళవించి ఇచ్చే కార్యక్రమానికి ‘చంద్రగిరి’ అని నా టెన్యూర్ లో నామకరణం చేశాం.
23 జూలై 2017న అన్ని తెలుగు ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేసే రీతిలో ఓ కార్యక్రమం విభిన్నంగా నిర్వహించాలనే తలంపు కల్గింది. ఎస్వీ యూనివర్సిటీ ఆర్కియాలజీ డిపార్టుమెంటు ప్రొఫెసరు డా. ఎన్. కృష్ణారెడ్డి నాకు బాగా పరిచయం, మంచి మిత్రుడు. చంద్రగిరి కోట ఆవరణలో ఆకాశవాణి కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచనకు ఊతంగా నిలిచి సాయం చేశారు. వారు శాసనాల అధ్యయనంలో కొట్టిన పిండి. ఆ విభాగంలో చదువుకున్న శ్రీమతి టి. శ్రీలక్ష్మి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏ యస్ ఐ) అమరావతి సర్కిల్ సూపరింటిండెంట్ గా అప్పుడు (ఇప్పుడు మైసూరు లో) పనిచేస్తున్నారు. ఆమె అనుమతి ఇచ్చారు. ‘వారసత్వ కళా విజ్ఞాన వాహిని’ పేరున ఆకాశవాణి మైక్రోఫోన్ ద్వారా శ్రోతలను ఆహ్వానించాం.
అలా ప్రణాళిక చేసిన కార్యక్రమం ‘జాతీయ ప్రసారదినోత్సవం’ (జూలై 23న) రోజున ప్రసారానికి అనువుగా ఒక రోజు ముందు (జూలై 22న) ఉదయం 11 గంటలకు చంద్రగిరి కోటలో నిర్వహించాం. చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల నుంచి సుమారు వంద మంది (19 నుంచి 92 సంవత్సరాల వయసు వున్న) శ్రోతలు – స్వచ్ఛందంగా పాల్గోవడం విశేషం. వారికి మేము ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు – ఒక్క ‘టీ’ మాత్రమే ఇవ్వగలిగాం. చంద్రగిరి నుంచి ఓ మైలు దూరం ప్రయాణిస్తే కానీ, చంద్రగిరి కోటకు వెళ్ళలేం. శ్రోతలకు ఆకాశవాణి అంటే ఎంతో అభిమానం కనుక వారు ఆనందంగా వచ్చారు. ఆర్కియాలజికల్ సర్వే వారు ఆ రోజు ప్రవేశ రుసుం రద్దు చేసి, శ్రోతలకు వెసులుబాటు కల్పించారు.
నూతలపాటి రాఘవరావు అద్భుత ప్రసంగం
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అప్పటి వైస్ ఛాన్సలర్ డా.వి. దుర్గాభవాని గారు, టిటిడిలో పనిచేసే విశ్రాంత ఐఎఎస్ అధికారి శ్రీ నందివెలుగు ముక్తేశ్వరరావు ప్రధాన అతిథి, ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. వీరు జర్నలిజం, భాషా సాహిత్యాల గురించి ఆకాశవాణి సేవల గురించి చక్కని ప్రసంగాలు చేశారు. శ్రోతలు గుండెలు విప్పి తమ అభిమానాన్ని మా మైకు ముందు అభిప్రాయాలుగా పంచారు. ఆ రోజు హైలైట్ ఏమిటంటే 92 సంవత్సరాల గుడివాడ నివాసి శ్రీ నూతలపాటి రాఘవరావు అద్భుతంగా ప్రసంగించడం. వారు దుర్గాభవాని మామగారు, గుడివాడ ఏఎన్ ఆర్ కళాశాలలో 42 సంవత్సరాలు తెలుగు, సంస్కృతం బోధించారు. రేడియో అంటే అభిమానం. న్యూస్ రీడర్, నాకు ఆత్మీయులైన శ్రీ దుగ్గిరాల పూర్ణయ్య వీరి పూర్వ విద్యార్థి.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కార్యక్రమం నిర్ణయం అయ్యాక ఏర్పాట్లు ఎలా చూసుకోవాలో ప్లాన్ చేసుకోవడానికి జూలై 18న చంద్రగిరి కోట ప్రాంతానికి డా. ఎన్.కృష్ణారెడ్డి, జర్నలిస్టు ఆలూరు రాఘవశర్మ కలసి వెళ్ళాం. తిరుగు ప్రయాణంలో తొండవాడ ముందు పాడుపడిన గుడి తాలూకు శిలాద్వారాలు, శిల్పాలు కనబడ్డాయి. ఆగి చూడాలనిపించింది. అది సంగీత వాగ్గేయకారుడు అన్నమయ్య చిన్న కుమారుడు చిన్నన్న నిర్మించిన దేవాలయం. చాలా గొప్పగా అనిపించింది. అక్కడ ఆగి ఫోటోలు తీసుకున్నాం. నేను కృష్ణారెడ్డి ఉండే ఓ ఫోటో మీకు నేను ఇక్కడ చూపెడుతున్నాను.
దాశరథి సంచలనం
‘వారసత్వ కళా విజ్ఞాన వాహిని’ శ్రోతల సమ్మేళనం జూలై 22న జరుగుతుండగా, ఈ హడావుడికి తోడు నా మొబైల్ కి ఒకటే ఫోన్లు. దానికి కారణం ఏమిటంటే జూలై 22 దాశరథి కృష్ణమాచార్య జన్మదినం. ఆయన నైజాంను ఎదిరించిన పోరాట యోధుడిగా, కవిగా, సినిమా కవిగా, ఆకాశవాణి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా బహుళ సుప్రసిద్ధులు. ‘ఆ చల్లని సముద్రగర్భం..’ అనే దాశరథి రాసిన పాటను ఆకాశవాణి హైదరాబాదు 1992లో ఈ మాసపు పాటగా రికార్డు చేసింది. కెబికె మోహన రాజు, విజయలక్ష్మి శర్మ పాడిన పాటకు చిత్తరంజన్ బాణిలు కూర్చారు. ఆ పాట గురించి ‘సాక్షి’ దినపత్రిక తెలంగాణ ఎడిషన్లో నా వ్యాసం ఆ రోజు ప్రచురణ అయ్యింది. అదీ మొబైల్ హడావుడికి కారణం! అలా దాశరథి స్ఫూర్తి కూడా మా కార్యక్రమంలో కలవడం ఇంకో విశేషం.
చంద్రగిరి కోట చెప్పే చరిత్ర అయినా, ఆకాశవాణి రూపొందించిన కార్యక్రమాల పరంపర అయినా, ఆకాశవాణి తొలి తెలుగు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఆచంట జానకిరాం ఆత్మకథ అయినా, ఆకాశవాణి శ్రోతల అభిమానమైనా, ఆకాశవాణి ఎనిమిది దశాబ్దాలుగా పంచిన కళా విజ్ఞాన సంస్కారమైనా … ఆకాశవాణి అవిచ్ఛిన్నమైన మహాస్రవంతికి అంతస్స్రవంతులే! అందుకే ఆ కార్యక్రమానికి ‘వారసత్వ కళా విజ్ఞాన వాహిని’ అని నామకరణం చేశాం! ఇపుడు రచనగా కొనసాగించే వ్యాసపరంపర కూడా అందులో అంతర్భాగమే!
అదీ చంద్రగిరి కోట ప్రాంగణంలో ఆకాశవాణి శ్రోతలు ఎగరేసిన అభిమానపు జెండా! ఇదీ ‘ఆకాశవాణి లో నాగసూరీయం’ జ్ఞాపకాల మాలికకు మంచి శ్రీకారం!!
డా. నాగసూరి వేణుగోపాల్, హైదరాబాద్
ఆకాశవాణి విశ్రాంత నిర్దేశకులు)
మొబైల్: 9440732392