రవికాంచనివి కూడా చూసేస్తాడు
ఇంపుగా సొంపుగా రాసేస్తాడు
ఆనంద పరుస్తాడు
ఘటనా ఘటనలకు
భాష్యం చెపుతాడు
ఆలోచింప జేస్తాడు
భవిష్యత్ దర్శనంతో
జనాన్ని ముందుకు నడిపిస్తాడు.
మెరుగైన ఆలోచన అతని నైజం
విలక్షణ తర్కం అతని శైలి
తన సృజనా జగత్తు
నిజమని నమ్మించ గలడు
మాటల గారడీ చేస్తాడు
మనసుల్ని మరమ్మత్తు చేస్తాడు
భాషను బ్రతికిస్తాడు
దాన్ని వినూత్న రీతుల
కదను తొక్కిస్తాడు
సుందర హర్మ్యాలు నిర్మిస్తాడు
మనుషులతో పాటు
దెయ్యాలని కూడా
దేవుళ్ళుగా చేసి
ఆందులో కొలువుంచుతాడు.
అతన్ని ఛందో కారాగారంలో పెట్టి
యతి ప్రాసల సంకెళ్ళు తగిలించి
సనాతనత్వ తాడుతో ఉరితీస్తే
అతని అఖండ ఙ్ఞానాన్ని
అర్హులకు అందకుండా చెస్తే
యుగ ధర్మ నిర్వహణ అవుతుందా
కాలచక్రం వెనక్కి తిరుగుతుందా
ఎవరికీ జవాబు చెప్పాల్సిన పనిలేదు
నీలోకి చూసుకుని
నీకు నువ్వు చెప్పుకో.
Also read: చదువు
Also read: దేవాంతకులు
Also read: పెంపకం
Also read; చూపు
Also read: భావదాస్యం