“ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వని కుమా
రతకు క్రౌంచాజల రాజమయ్యె
నావాడ పతి శకంధర సింధురాధ్యక్షు
లరిగాపు లెవ్వాని ఖరతరాసి
కాపంచ గౌడ ధాత్రీ పదం బెవ్వాని
కసివారుగా నేగునట్టి బయలు
సకల యాచక జనాశాపూర్తి కెవ్వాని
ఘనభుజాదండంబు కల్పశాఖి
ప్రబల రాజాధిరాజ వీరప్రతాప
రాజ పరమేశ బిరుద విభ్రాజి యెవ్వ
డట్టి శ్రీకృష్ణరాయ వీరాగ్రగణ్యు
డొక్క నాడు కుతూహలం బుప్పతిల్ల”
“ఇందీవరంబుల నీను క్రాల్గన్నుల
శరదిందు ముఖులు చామరము లిడగ
పణినసూను కణాది బాద రాయణ సూత్ర
ఫక్కి విద్వాంసులు పన్యసింప
పార్శ్వ భూమి నభీర భటకదంబ కరాళ
హేతిచ్ఛటాచ్ఛాయ లిరులు కొనగ
సామంత మండనోద్దామ మాణిక్యాంశు
మండలంబెగసి నీరెండ గాయ
మూరు రాయర గంగ పెండేర మణి మ
రీచి రింఛోళి కలయ నావృతము లగుచు
అంకపాళి నటద్దుకూలాంచలములు
చిత్ర మాంజిష్ఠ విభ్రమశ్రీ వహింప”
అల్లసాని పెద్దన
ఆధునికాంధ్ర వైతాళికుల్లో కీ.శే. కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారొకరు. వారి చారిత్రక పరిశోధనా గ్రంధాల్లో ప్రధానమైనవి “మహమ్మదీయ యుగము”, “శివాజీ చరిత్రము”. “మహమ్మదీయ యుగము” గ్రంధంలోని చివరి అధ్యాయం విజయనగర సామ్రాజ్య గాథను సమగ్రంగా వర్ణిస్తుంది. ఆంధ్రులకు పంతులు గారిచ్చిన సలహా ఇది: “తెలుగు కావ్యాలను కేవలం కావ్యదృష్టితోనే గాక చారిత్రక దృష్టితో కూడా చదవండి!”
Also read: తుం గ భ ద్రా న ది
కృష్ఢరాయల యుగం నాటి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కూలంకషంగా, ఉత్కంఠ భరితంగా, తెలియజెప్పే కావ్యం “మనుచరిత్ర”. ఈ కావ్యం అవతారిక లోనివే పై పద్యాలు. కృష్ఢరాయల వంశక్రమాన్నీ, విజయభువన సంసద్వైభవాన్ని, కృష్ణరాయల పాలనాదక్షతను, ఆయన పరాక్రమాన్నీ, అయన విజయపరంపరలను, రాయల నాటి సిరిసంపదలను, సాంస్కృతిక పునురుజ్జీవనాన్ని, కృష్ణభూపతిని కలవడానికై వచ్చి హంపీలో రోజలతరబడి విడిది చేసి, రాజదర్శనం కోసం అహోరాత్రులు వేచిచూసే దేశవిదేశాల రాయబారుల వృత్తాంతాలను, “మనుచరిత్ర” కావ్యావతారిక రసభరితంగా పేర్కొంటుంది. కేవలం కావ్యావతారిక లోనే గాక, కావ్యంలోని ఆశ్వాసాంత పద్యాల్లో, స్వరోచి పాత్రపోషణలో సైతం, సాహితీ సమరాంగణ సార్వభౌముణ్ఢి మనం కళ్ళారా చూస్తాం. చారిత్రక దృష్టితో ఆలోచిస్తే, రాయలనాటి తెలుగుజాతి చరిత్రను తెలుసుకోవడానికి ఉపకరించే రచనల్లో “మనుచరిత్ర” అగ్రస్థానంలో నిలుస్తుంది. కాకపోతే, ఈ కావ్యం ద్వారా కృష్ఢరాయల నాటి గాథను, కేవలం మనుచరిత్ర రచనాకాలం వరకు మాత్రమే మనం తెలుసుకోగలం.
Also read: సంధ్య
ఆధునిక యుగంలో విజయనగరంపై తొలిగ్రంధం క్రీశ 1895 లో వెలువడింది. రాబర్ట్ సీవెల్ “ఎ ఫర్ గాటన్ ఎంపైర్” అనే మకుటంతో వెలువరించిన పరిశోధనా గ్రంధమిది. ఈ గ్రంధం ప్రధానంగా అబ్దుల్ రజాక్, నికోలో కాంటి, డామింగో పీస్ వంటి విదేశీయుల ప్రత్యక్ష వృత్తాంతాలను ఆధారం చేసుకొని రచించినది. ఈ గ్రంధం వెలువడిన పది పదహైదేండ్లకు కొమర్రాజు లక్ష్మణరావు గారి “మహమ్మదీయ యుగము” వెలుగు చూసింది. విషయ పరిధిలో పంతులుగారి గ్రంధం “ఎ ఫర్ గాటన్ ఎంపైర్” కన్నా విస్తృతమైనది.
“నా జీవితము, నవ్యాంధ్రము” అనే తమ గ్రంధంలో అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఇట్లా అంటారు: “అనైక్యతతో, నైరాశ్యతతో కొట్టుమిట్టాడుతున్న తెలుగువారికి “ఎ ఫర్ గాటన్ ఎంపైర్” తమ పూర్వవైభవాన్ని జ్ఞాపకం చేసి వారిలో నూతనోత్సాహాన్ని నింపింది.”
క్రీశ 1901లో హైదరాబాదు సుల్తాన్ బజార్ వద్ద స్థాపింపబడిన “శ్రీకృష్ణ దేవరాయ భాషాంధ్ర నిలయం” తెలుగువారిలో పెల్లుబికిన నూతనోత్సాహానికి సూచిక. నేటికీ సజీవంగా వున్న ఈ భాషాంధ్రనిలయం స్థాపనకై ఆనాడు నడుం కట్టిన వారిలో లక్ష్మణ రావు పంతులు గారే ప్రథములని వేరే చెప్పవలసిన పని లేదు.
Also read: అమృతోత్సవ వేళ ఆప్తవాక్యం
తురుష్కుల దండయాత్రచే దేశంలో ఏర్పడ్డ ఉద్రిక్రతను “మనుచరిత్ర” షష్టాశ్వాసంలో అల్లసాని పెద్దన ప్రముఖంగా ప్రస్తావిస్తాడు. ఈ మ్లేచ్ఛుల దండయాత్రలను త్రిప్పికొట్టడానికి “కల్కి” భగవానుడే స్వయంగా అవతరించక తప్పదని పెద్దన చివరి ఆ ఆశ్వాసంలో ఆవేదన చెందుతాడు.
కృష్ణరాయలే “కల్కి” భగవానుని అవతారంగా బహుశా పెద్దన భావించి వుండవచ్చు. క్రీశ 1532లో కృష్ణరాయలు అకాలమరణం చెందడంతో తెలుగుజాతి ఒక పెద్ద దిక్కును కోల్పోయింది.
సువిశాల కాకతీయ సామ్రాజ్య పతాకం రెపరెపలు మాలిక్ కాఫర్ దండయాత్రల దరిమిలా క్రీశ 1326లో శాశ్వతంగా తెరమరుగైనట్లే, క్రీశ 1565 జరిగిన తళ్ళికోట యుద్ధంలో విజయనగర వైభవం సైతం కమ్మని జ్ఞాపకమై కరగిపోయింది.
Also read: నర్మగర్భితమైన జవరాలి పలకరింపు
“శ్రీకృష్ఢరాయలనే సూర్యుడు అస్తమించిన శతాబ్దానికే మరాఠా దేశంలో ఛత్రపతి శివాజీ అనే భానుడు పునః ప్రభవించినాడు” అని తమ “శివాజీ చరిత్రము”లో కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారు పేర్కొన్నారు. కృష్ణరాయలు, శివాజీ, అవతరించకుండా వుంటే దక్షిణభారత చరిత్రయే బహుశా తారుమారై పోయేది.
ఒకానొకప్పడు వింధ్యకు ఉత్తరాన కుషాన్ సామ్రాజ్యం, వింధ్యకు దక్షిణాన ఆంధ్రసామ్రాజ్యం, భారతదేశాన్ని తమ గుప్పిట పెట్టుకొని వుండేవని జవహర్ లాల్ నెహ్రూ తమ “గ్లింప్షెస్ ఆఫ్ వర్ల్డ్ హిస్టరీ” గ్రంధంలో పేర్కొన్నారు. శాతవాహనుల తదనంతరం విచ్ఛిన్నమై పోయిన తెలుగువారిని మొదట కాకతీయ ప్రభువులు, పిదప విజయనగర ప్రభువులు, ఒకే ఏలుబడి లోకి తెచ్చినారు. ఈ రెండు హైందవరాజ్యాల శిధిలాలపై వెలసి, విస్తరించిన బహుమనీ రాజ్యాల్లో గోలుకొండ కూడా ఒకటి.
Also read: ఏల ప్రేమింతును
క్రీశ 1682లో గోలుకొండ మొగలాయీ ఏలుబడి లోకి వచ్చింది. వారు నియమించిన పారే నైజాం ప్రభువులు. క్రీశ 1748లో మొదటి నైజాం మరణానంతరం జరిగిన వారసత్వపు పోరులో ఫ్రెంచి వారు నిజాం కుమారునికి సహాయం చెయడంతో, అతడు కృతజ్ఞతా సూచకంగా ఫ్రెంచి వారికి ధారాదత్తం చేసినదే కోస్తా ఆంధ్ర. టిప్పుసుల్తాన్ యుద్ధరంగంలో వీరమరణం పొందిన అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ ఒత్తిడికి లోబడి నైజాం ఇంగ్లీషు వారికి “దత్తత” ఇచ్చినదే దత్తమండలం.
క్రీశ 1928లో నంద్యాల కడగల మహనంది పుణ్యక్షేత్రంలో డా. రాధాకృష్ణన్ అధ్యక్షతన ఆంధ్రమహాసభ సమావేశం ఘనంగా జరిగింది. తెలుగునేల నలుమూలల నుండీ ప్రతినిధులు విచ్చేసిన ఆ సభలో, కీశే చిలుకూరు నారాయణరావు గారు ప్రతిపాదించగా, అవమానకరమైన “దత్తమండలం” అనే పేరును తీసివేసి “రాయలసీమ” అనే పేరుతో పశ్చిమాంధ్రను పిలవాలని నిర్ణయం జరిగింది.
విజయనగర సామ్రాజ్యం ఏనాడో మట్టిలో కలిసిపోయింది. కృష్ణరాయల కీర్తిప్రభలు మాత్రం నేటికీ తెలుగునేల అంతటా ప్రకాశిస్తూనే వున్నాయి.
సామాజిక జగత్తుకే గాక సాహితీ జగత్తుకు సైతం ప్రీతి పాత్రుడైన కృష్ణరాయలను “మనుచరిత్ర” లో తొలిసారి ప్రవేశ పెట్టేవే నేటి రెండు పద్యాలూ!
Also read: భ గ్న మా లి క
మొదటి పద్యానికి తాత్పర్యం
“పిన్నవయసులో కుమారస్వామి క్రౌంచాజల పర్వతాన్ని భేదించినట్లుగా, తన తొలి జైత్యయాత్రలో దుర్బేద్యమైన ఉదయగిరిని జయించిన వాడెవ్వడు?”
“నావాడ దేశరాజు, శకంధర దేశరాజు, సింధూర దేశరాజు, ఎవ్వాని పదునైన కత్తికి భయపడి కప్పం చెల్లిస్తున్నారు?”
“గౌడులు, కనౌజులు, ఉత్కళులు, సారస్వతులు, మైథిలులు అనే పంచగౌడుల విశాల రాజ్యప్రదేశాల్లో స్వేచ్చగా గుఱ్ఱపు స్వారీ చేసే వీరుడెవ్వడు?”
“సమస్త యాచక జనాశలను కల్పవృక్ష శాఖవలె తీర్చగలిగే ఘనభుజాదండమెవ్వనిది?”
“ప్రబల రాజాధిరాజ వీరప్రతాప రాజపరమేశుడ”నే బిరుదు పొందిన వాడెవ్వడు?”
“అటువంటి శ్రీకృష్ణరాయ వీరాగ్రగణ్యుడు
రెండవ పద్యంతో అనుబంధితం
“నల్లని కలువల వలె వెలిగే కన్నులతో శరదిందు ముఖులైన లలనామణులు చామరాలు వీయగా”
“పాణిని, కణాదుడు, బాదరాయణుని వంటి జ్ఞానులను స్ఫురింపజేయగల మహావిద్వాంసులు సభలో ఉపన్యసింపగా”
“భయమనేదే ఎరుగని వీరభటులు రాజుకు రెండు వైపులా నిలబడి తమ చేతుల్లో ధరించిన భయంకరమైన ఖడ్గాల మిరుమిట్లచే నలువైపులా చీకటి గ్రమ్మగా”
“ఉచితాసనాలపై ఆసీనులైన సామంత రాజుల ఆభరణాల లోని మాణిక్యాల కాంతితో సభాస్థలి యావత్తూ నీరెండ కాయగా”
“మూరురాయరకు (అశ్వపతి, గజపతి, నరపతి అనే రాజులకు), వారివారి బిరుదులను తెలిపే కాలి యందెల మణిమరీచి యొక్క ప్రకాశంతో కలసి”
“లలనలు వీచే చామరాల గాలికి కృష్ణరాయల తెల్లని పట్టు వస్త్రం యొక్క కొసలు అటూ ఇటూ కదలుతూ ఎరుపు, పసుపు రంగులు మిళతమైన విచిత్ర వర్ణంతో రాయల వస్త్రం విలాస విభ్రమాన్ని కలిగింపగా”
“విజయ భువనాఖ్య సంసద్
భవనస్థిత సింహపీఠిపై రాయలు కొలువు దీరి వున్నాడు”
Also read: నా గు ల చ వి తి
నివర్తి మోహన్ కుమార్