ప్రాఫెసర్ దేవరాజు మహారాజుకు బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు
గోరటి వెంకన్న, తగుళ్ళ గోపాల్ కి కూడా అవార్డులు
కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురణలో పరిచయం
ముగ్గురు తెలంగాణ బిడ్డలు, ప్రముఖ వాగ్గేయకారుడు, ఎంఎల్ సీ గోరటి వెంకన్న, ప్రముఖ రచయిత, ఆచార్యుడు దేవరాజు మహారాజ, తగుళ్ళ గోపాల్ కే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించారు. దీనిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హర్షం వెలిబుచ్చారు. ప్రొఫెసర్ దేవరాజు మహారాజు గురించి సాహిత్య అకాడమీ ప్రచురించిన పరిచయం దిగువన ఇస్తున్నాం.
డాక్టర్ దేవరాజు మహారాజు సమకాలీన తెలుగు సాహిత్య రంగంలో తనదైన రాజముద్ర వేసుకుని, సాహితీ స్వర్ణోత్సవం జరుపుకున్న సుప్రసిద్ధ సాహితీవేత్త. వృత్తిరీత్యా జీవశాస్త్రవేత్త. తెలుగు వచన కవిత్వంలో తెలంగాణ ప్రజల భాషను ప్రవేశపెట్టి, తొలి కవితా – కథా సంపుటాలు ప్రకటించినవాడిగా గుర్తింపు వుంది. వీరి సారస్వత కృషి (1960-2010) గురించి కాలక్రమేణా స్పందించిన సుమారు ఎనభైమంది సాహితీవేత్తల వ్యాసాలు ‘ఆవరణం’ సాహితీ స్వర్ణోత్సవ సంచికలో నమోదు చేయబడ్డాయి. వివిద ప్రక్రియల్లో ఇప్పటి వరకూ వెలువరించిన 83 పుస్తకాలు విశాలాంధ్ర ప్రచురణాలయం, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, వనచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, జన విజ్ఞానవేదిక, మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం జీవన ప్రచురణలు ప్రచురించాయి. తెలుగు అకాడమీకి రచయితగా, సంపాదకుడిగా సహకరించి, డిగ్రీ పాఠ్యగ్రంథాలు వెలువరించడానికి దోహదం చేశారు. జాతీయ స్థాయి సాహిత్య సమావేశాలలో పాల్గొన్నవీరు, దశాబ్దకాలం పాటు నేషనల్ బుక్ ట్రస్ట్ – దిల్లీ వారికి సలహా సంఘ సభ్యులు. ప్రాంతీయ స్థాయి నుండి జాతీయ స్థాయి దాకా ఎన్నోసార్లు ఎన్నో అవార్డులకు న్యాయనిర్ణేతగా, జ్యూరీ మెంబర్ గా వున్నారు. వీరి ‘గుడిసె గుండె,’ ‘గాయపడ్డ ఉదయం’ కవితా సంపుటాలపై పరిశోధనలు జరిపి ఒకరు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి, మరొకరు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి యం.ఫిల్ డిగ్రీలు తీసుకున్నారు. వీరి కవితలు బెంగుళూరు విశ్వవిద్యాలయం యం.ఎ. సిలబస్ లో చోటు చేసుకున్నాయి. మద్రాసు యూనివర్శిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఉస్మానియా యూనిర్శిటీలలో వీరి రచనలపై పరిశోధనలు జరుగుతున్నాయి.
భారతీయ భాషల ప్రపంచ కవిత్వాన్ని, కథల్ని తెలుగులోకి అనువదించి తెలుగు కళ్ళకు ఇరుగు పొరుగు దృశ్యాల్ని చూపించారు. ఒక కొత్త కిటీకీ తెరిచారు. వెండితెర కవిత్వంగా కొనియాడబడుతున్న భారతీయ సమాంతర సినిమాను విశ్లేషించారు. ఆధునిక యుగ వైజ్ఞానిక స్పృహతో జానపద సాహిత్య పరిశీలన చేశారు. సమాజంలో శాస్త్రీయ అవగాహనను పెంచడానికి సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాల్ని ప్రచురించారు. బాల సాహిత్యంలోనూ, రేడియో నాటకరంగంలోనూ కృషి చేశారు. రచనే ఆయన గుర్తింపు కార్డు. రచనే ఆయన ఊపిరి. తానొక బాధ్యత గల రచయితనని ఆయన ఎప్పుడూ మరచిపోరు. ప్రముఖ అనువాదకులు కీ.శే. దండమూడి మహీధర్ ఈయనను ‘అభినవ కొడవటిగంటి కుటుంబరావు’ అని పిలిచేవారు. ‘పట్టు పాగపై మరియొక పట్టుపాగ/చుట్టినట్టుగా నీ పేరు తట్టెనోయి’ అని అభినందించారు పోరంకి దక్షిణామూర్తి. ప్రయోగాత్మకతకు తన ఆత్మను జోడించగలవాడని ఆయన కవితలు, డాక్యుమెంటరీ స్టోరీస్, మనిషి కథలు, కాలాన్ని వెనకేసిన మనిషి వంటి రచనలు చదివితే తెలుస్తుంది. ఫ్రెంచ్ గడ్డంతో విలక్షణంగా కనిపించే ఈ ఏకైక తెలుగు కవికి అనేక ప్రత్యేకతలున్నాయి. కవిత్వానువాదంలో విశేషంగా కృషి చేయడం, మూఢనమ్మకాల నిర్మూలనకు కలం పట్టడం అందులో కొన్ని. ఎయిడ్స్ అవగాహన కోసం తెలుగులో తొలి పుస్తకం రాసింది వీరే. ‘నేనంటే ఏమిటి?’ అనే ప్రశ్నకి వైజ్ఞానికంగా వివరణ నిచ్చింది వీరే. ‘భారతీయ వైజ్ఞానిక వికాసం’ గ్రంథం ఆధారంగా ఎస్ సీఇఆర్ టీ ఒక డాక్యుమెంటరీ (2018) రూపొందించింది. భారతీయ సమాంతర సినిమాపై తొలి గ్రంథం కూడా వీరిదే.
‘పాలు ఎర్రబడ్డాయి’ కథకు ఆంధ్రజ్యోతి వారపత్రిక బహుమతి (1973), ‘జీవిత పోరాటం’ కథకు జ్యోతి మాసపత్రిక బహుమతి (1982), తొలి ఎక్స్ –రే కవిత్వ అవార్డు (1983), జాతీయ సమావేశాలకు రెండుసార్లు భారత్ భవన్ (భోపాల్)వారి ఆహ్వానం (1987, 1989), రంజని రజతోత్సవాల సన్మానం (1989), ‘గాయపడ్డ ఉదయం’ వచన కవితా సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం (1991-92), దాశరథి దంపతుల సత్కారం (1994), రాష్ట్ర ప్రభుత్వ ఉగాది సత్కారం (1996), ఆంధ్రా అసోసియేషన్, న్యూఢిల్లీ (ఎపి భవన్) సన్మానం (1997), మారసం-సురమళి కథా పురస్కారం(2002), డాక్టర్ పరుచూరు రాజారామ్ సాహితీ సత్కారం –గుంటూరు(2006), అనువాదానికి సాహితీ మేఖల జాతీయ అవార్డు (2009) అందుకున్నారు. ఇందూరు భారతి – నిజామాబాద్, సాహితీ మేఖల – నల్లగొండ సంస్థల తొలి ‘సాహితీ జీవన సాఫల్య పురస్కారాలు (2012, 2015) స్వీకరించారు. జమ్మి కోనేటిరావు- తొలి వైజ్ఞానిక సారస్వత జీవన సాఫల్య పురస్కారం (2016), వికాసం, బరంపురం (ఒడిశా), విశాఖ రచయితల సంఘం సంయుక్తంగా అందించిన ప్రప్రథమ వుప్పల లక్ష్మణరావు సాహితీ జీవన సాఫల్య పురస్కారం(2017) అందుకున్నారు, కిన్నెర- కళానిలయం సంస్థల శ్రీశ్రీ సాహితీ పురస్కారాలు, శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా కళానిలయం వారి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం (2016), అరసం, మార్క్సిస్టు అధ్యయన కేంద్రం, జనసహకార సమితి సంయుక్తంగా అందించిన పురిపండా అప్పలస్వామి జీవిత సాఫల్య పురస్కారం (2019) స్వీకరించారు. జీవశాస్త్రానికి సంబంధించి తను కనుగొన్న కొత్త పరాన్న జీవులకు తెలంగాణ, నిజామాబాద్ ల పేర్లుపెట్టి జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పరిశోధనా పత్రాలు సమర్పించి, ప్రచురించారు. మరోవైపు కేంద్ర సాహిత్య అకామీ (2007), ఆకాశవాణి (2014), కుమార్ ఆససాన్ మెమోరియల్ (2015) జాతీయ కవి సమ్మేళనాలలో పాల్గొన్న సృజనశీలి, బహుగ్రంథకర్త.
పుట్టింది 21 ఫిబ్రవరి 1951, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ సి, పిహెచ్ డి (1979) తీసుకుని, వృక్ష పరాన్నజీవులపై పరిశోధనలు చేస్తూ, చేయిస్తూ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు జువాలజీ ప్రొఫెసర్ గా ముప్పయ్యేళ్ళు మార్గదర్శనం చేశారు. ఒక వైపు వృత్తిరీత్యా జీవం గురించి పరిశోధన! మరొకవైపు ప్రవృత్తిరీత్యా జీవితం గురించి శోధన!! పరాన్న జీవశాస్త్రంలోంచి సామాజిక పరాన్నజీవులపైకి దృష్టి సారించడం, ఒక తాత్విక భూమికను రూపొందించుకుని రెండింటి మధ్య ఒక వారధిలా నిలబడగలగడం ఈయన ప్రత్యేకత! సాహిత్యంలో నిత్య పరిశోధనాయాత్రికుడు. బాధ్యత ఎరిగిన కవి. మానవవాది. బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ దేవరాజు మహారాజు.
(Profile published by Sahitya Akademi, New Delhi, in WHO’S WHO OF INDIAN WIRTERS SA 60 A (Rev.Ed), Sr. No. 33)
How-do-you-do? an amazing blog post dude. Thnkx But I’m having problem with ur rss feed. Unable to subscribe. Is there anybody else facing similar rss feed issue? Anybody who knows please respond. Thanks in advance