* పురుషులకు తీసిపోని మహిళామణులు
* దేశానికే ఖ్యాతి తెచ్చిన బంగారు తల్లులు
భారత క్రీడారంగంలో….పురుషులతో సమానంగా మహిళలూ దూసుకుపోతున్నారు. ప్రపంచీకరణ తర్వాతి కాలంలో…భారత మహిళలు మరింత జోరుపెంచారు. బాక్సింగ్ నుంచి స్కీయింగ్ దాకా….బ్యాడ్మింటన్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ వరకూ…క్రికెట్ మొదలు కొని టెన్నిస్ వరకూ….భారత తొలి మహిళలు ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడల్లో భారత తొలి మహిళలు ఎవరో ఓసారి చూద్దాం.
ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో….రంగం ఏదైనా భారత మహిళలు దూసుకుపోతున్నారు. పురుషులతో సమానంగా రాణిస్తూ తమకుతామే సాటిగా నిలుస్తున్నారు. భారత్ అంటే పురుషులు మాత్రమే కాదు..మహిళలు సైతం అంటూ చాటుకొంటున్నారు.
ప్రపంచీకరణతో అందివచ్చిన అవకాశాలను భారత మహిళా క్రీడాకారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోడం ద్వారా తమకుతామే సాటిగా నిలుస్తున్నారు.
తొలి మహిళ కరణం మల్లీశ్వరి…
నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్ లో….భారత్ కు పతకం సాధించిన తొలి భారత మహిళ ఎవరంటే …తెలుగుతేజం కరణం మల్లీశ్వరి అన్నపేరే…జవాబుగా వస్తుంది. సిడ్నీ వేదికగా 2000లో జరిగిన ఒలింపిక్స్ …మహిళల వెయిట్ లిఫ్టింగ్ 69 కిలోల విభాగంలో మల్లీశ్వరి కాంస్య పతకం సాధించకపోతే….పతకాల పట్టికలో భారత దేశానికి చోటు దక్కి ఉండేదికాదు. అప్పట్లో శతకోటి భారత పరువు దక్కించిన ఘనత… ఓ మహిళకు..అదీ కరణం మల్లీశ్వరికి మాత్రమే దక్కుతుంది. 1994 అర్జున, 1999లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మశ్రీ పురస్కారాలు అందుకొన్న మల్లీశ్వరికి 11 స్వర్ణాలతో సహా మొత్తం 29 అంతర్జాతీయ పతకాలు సాధించిన అరుదైన రికార్డు ఉంది.
Also Read : మహిళకు వందనం
క్రికెట్టే జీవితంగా మిథాలీ…
ప్రపంచ మహిళా క్రికెట్లో 6000 పరుగులు సాధించిన భారత తొలి మహిళ ..హైదరాబాద్ కు చెందిన మిథాలీరాజ్ మాత్రమే. కేవలం 11 ఏళ్ల చిరుప్రాయం నుంచే క్రికెట్ ఆడుతూ వచ్చిన మిథాలీ ప్రస్తుత 2021 సౌతాఫ్రికా వన్డే సిరీస్ లోని తొలి మ్యాచ్ వరకూ 200కు పైగా మ్యాచ్ లు ఆడి 6 వేల 190 పరుగులు సాధించింది. ఇందులో ఆరు సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2003లో అర్జున పురస్కారం, 2015 లో పద్మశ్రీ పురస్కారాలు అందుకొన్నమిథాలీకి 2017 లో ఐసీసీ అత్యుత్తమ మహిళా వన్డే క్రికెటర్ అవార్డు సైతం అందుకొన్న ఘనత ఉంది.
అహో! సింధు, వారేవ్వా సైనా!
భారత మహిళా బ్యాడ్మింటన్ అనగానే ముందుగా సైనా నెహ్వాల్…ఆ తర్వాత పీవీ సింధు మాత్రమే గుర్తుకు వస్తారు. అయితే …ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పాల్గొన్న భారత తొలి మహిళ ఘనత…జాతీయ మాజీ చాంపియన్ పీవీవీ లక్ష్మీకి మాత్రమే దక్కుతుంది. 18సార్లు జాతీయ చాంపియన్ లక్ష్మి 1996 అట్లాంటా ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించింది.
Also Read : గృహిణులకు జీతాలు ఇవ్వాలి
అయితే…ఒలింపిక్స్ లో కాంస్యం, ప్రపంచ, ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో భారత్ కు రజత పతకాలు అందించిన భారత తొలి మహిళ గౌరవం మాత్రం సైనా నెహ్వాల్ కే దక్కుతుంది. హర్యానాలో పుట్టి..హైదరాబాద్ లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎదిగిన సైనా…2015లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళ సైనా మాత్రమే. 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సైనాకు తన కెరియర్ లో 21 అంతర్జాతీయ టైటిల్స్ సాధించిన రికార్డు ఉంది. దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జునతో పాటు పద్మభూషణ్ అవార్డులు సైతం సైనాను వరించాయి.
నవతరం బ్యాడ్మింటన్ ప్లేయర్ , తెలుగు వెలుగు పీవీ సింధు…ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో రజత పతకం సాధించిన తొలి భారత మహిళగా మాత్రమే కాదు….ప్రపంచ బ్యాడ్మింటన్లో వరుసగా రెండు కాంస్యపతకాలు సాధించిన భారత తొలి మహిళా ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది. 2013లో అర్జున, 2015లో పద్మశ్రీ, 2016లో రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలను సింధు సొంతం చేసుకొంది.
సానియా తర్వాతే ఎవరైనా…
భారత మహిళా టెన్నిస్ లో ఎంతమంది క్రీడాకారిణులు ఉన్నా…హైదరాబాదీ షాన్ సానియా మీర్జా తర్వాతే ఎవరైనా. భారత టెన్నిస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత సానియాకు మాత్రమే దక్కుతుంది.
Also Read : మహిళలు పురుషులతో సమానం కాదు, వారి కంటే అధికులు
డబ్లుటిఏ సింగిల్స్ టైటిల్, గ్రాండ్ స్లామ్ డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ సాధించిన భారత తొలి మహిళా టెన్నిస్ ప్లేయర్ సానియా మాత్రమే. మూడు మిక్సిడ్, మూడు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో పాటు..ఆరు స్వర్ణాలతో సహా మొత్తం 14 పతకాలు సాధించిన అరుదైన రికార్డు సానియా మీర్జా పేరుతో ఉంది. 2015 మహిళా టెన్నిస్ డబుల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సంపాదించిన భారత తొలి మహిళ సానియా మీర్జా మాత్రమే.
సానియా 2004లో అర్జున, 2006లో పద్మశ్రీ, 2015లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2016లో పద్మభూషణ్ పురస్కారాలను అందుకొని..భారత టెన్నిస్ లో తనకంటూ ఓ ప్రత్యేకస్థానం ఏర్పాటు చేసుకొంది.
భారత బాక్సింగ్ మేరీ… గోల్డ్….
భారత మహిళా బాక్సింగ్ అంటే…మేరీ కోమ్ మాత్రమే. కేవలం బాక్సింగ్ కోసమే పుట్టిన ప్లేయర్ మేరీ కోమ్. ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ 45 కిలోల విభాగంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన మేరీకోమ్..2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ బాక్సింగ్ లో పతకం సాధించిన భారత తొలి మహిళా బాక్సర్ గా నిలిచింది. అర్జున, రాజీవ్ ఖేల్ రత్న లాంటి పలు అత్యుత్తమ పురుస్కారాలను మేరీకోమ్ అందుకొంది.
Also Read : స్త్రీ శక్తి… స్త్రీ విముక్తి… స్త్రీ స్వేచ్ఛ… స్త్రీ స్వాతంత్ర్యం… స్త్రీ సమానత్వం… స్త్రీ సాధికారత…???
ట్రాక్ రాణులు ఉష, అంజు…
భారత మహిళా ట్రాక్ అండ్ ఫీల్డ్ అనగానే…కేరళ కుట్టీలు పీటీ ఉష, అంజు బాబీ జార్జి గుర్తుకు వస్తారు. ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఫైనల్స్ కు అర్హత సాధించడంతో పాటు…400 మీటర్ల హర్డల్స్ లో నాలుగోస్థానం సాధించిన భారత తొలి మహిళా అథ్లెట్ గా పీటీ ఉష చరిత్రలో నిలిచిపోయింది.
1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్న పీటీ ఉషకు మొత్తం 101 అంతర్జాతీయ పతకాలు సాధించిన అసాధారణ రికార్డు ఉంది. 1984లో అర్జున, పద్మశ్రీ పురస్కారాలు అందుకొన్న పీటీ ఉషకు భారత మహిళా ట్రాక్ అండ్ ఫీల్డ్ చరిత్రలో ఓ ప్రత్యేకస్థానం ఉండితీరుతుంది.
తొలి మహిళా అథ్లెట్….
ఇక…ప్రపంచ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పతకం సాధించిన భారత తొలి మహిళా అథ్లెట్ గౌరవం మాత్రం…అంజూ బాబీ జార్జికే దక్కుతుంది. పారిస్ వేదికగా 2003లో ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల మహిళల లాంగ్ జంప్ లో అంజూ బాబీ కాంస్య పతకం గెలుచుకొంది.
Also Read : మహిళల చేతిలో కమండలం..
మహిళా కుస్తీలో ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి భారత వస్తాదు ఘనతను సాక్షీ మాలిక్ సంపాదించింది. 2016 రియో ఒలింపిక్స్ మహిళల కుస్తీలో సాక్షీ మాలిక్ ఈ గౌరవాన్ని సొంతం చేసుకొంది.
చదరంగ క్రీడలో గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించిన భారత తొలి మహిళ ఘనత భాగ్యశ్రీ థిప్సేది కాగా…జూనియర్ ప్రపంచ టైటిల్ సంపాదించిన భారత తొలి మహిళా చెస్ ప్లేయర్ తెలుగు తేజం కోనేరు హంపి మాత్రమే.
మంచు కొండలు, లోయలే వేదికగా జరిగే ఆల్పైన్ స్కీయింగ్ లో….పతకం సాధించిన భారత తొలిమహిళగా హిమాచల్ ప్రదేశ్ యువతి అంచల్ ఠాకూర్ రికార్డుల్లో చోటు సంపాదించింది.
టర్కీ వేదికగా ముగిసిన 2018 అంతర్జాతీయ స్కీయింగ్ మహిళల స్లాలోమ్ విభాగంలో…21 ఏళ్ల అంచల్ ఠాకూర్ కాంస్య పతకం గెలుచుకొంది. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ ప్రాంతంలోని మారుమూల గ్రామం బురువా నుంచి ప్రపంచ స్యీయింగ్ పోటీలలోకి దూసుకువచ్చిన అంచల్….తన కెరియర్ లో పాల్గొన్న తొలి అంతర్జాతీయ స్కీయింగ్ పోటీల్లోనే పతకం సాధించడం ద్వారా సంచలనం సృష్టించింది.
Also Read : పండంటి కాపురానికి పదహారు సూత్రాలు
మాజీ ఒలింపియన్ హీరాలాల్ శిక్షణలో రాటుదేలిన అంచల్…హిమాచల్ ప్రదేశ్ లోని మంచుకొండల్లో…అరకొర సౌకర్యాలతోనే సాధన చేయడం ద్వారా తానేమిటో నిరూపించుకొంది. అంతర్జాతీయ స్కీయింగ్ పోటీల్లో పాల్గొనటమే గొప్పగా భావించే భారత స్కీయర్లు…అందునా ఓ మహిళా స్కీయర్ ..పతకం సాధించడం ఇదే మొదటిసారి.
వివిధ క్రీడల్లో దేశానికి అంతర్జాతీయఖ్యాతి తెచ్చిన నిన్నటి,నేటితరం మహిళామణులకు..మహిళా దినోత్సవం సందర్భంగా…సకలం సలామ్ చేస్తోంది.