పెన్మెత్స రవి ప్రకాష్ అశోకవర్మ
“మహిళల”దినం… మహిళల ఉత్సవం… మహిళాదినోత్సవం… జాతీయమైనా, అంతర్జాతీయమైనా ప్రతీ సంవత్సరం ఒక్క మార్చి 8 తేదీకే పరిమితమా…?
ఈ ఒక్కరోజే మహిళలకందరికీ సందేశాలు… అభినందనలు… శుభాభినందనలు… శుభాకాంక్షలా…?
ఈ ఒక్కరోజే స్త్రీ శక్తి… విముక్తి… స్వేచ్ఛ… స్వాతంత్ర్యం… సమానత్వం… సాధికారత అంటూ అన్నింటా ఉపన్యాసాలా…?
ఎంత కాలం… ఎంతకాలం…
ఇంకెంత కాలం ‘కార్యేషు దాసి’ అంటూ మహిళలల్ని, సేవకులు గా చూస్తారు…?
వారి ‘శ్రమ’ను గుర్తించండి చాలు…
ఇంకెంత కాలం ‘కరణేషు మంత్రి’ అంటూ మహిళలల్ని, మోసంచేస్తారు…?
మీ అభ్యున్నతి కోసం వారిచ్చే విలువైన ‘సలహాల్ని’ వినండి చాలు…
ఇంకెంత కాలం ‘భోజ్యేషు మాతా’ అంటూ మహిళలల్ని, వంటగదికే పరిమితం చేస్తారు…?
మీ ఆయురారోగ్యాల కోసం, వారు పడుతున్న ‘కష్టాలను’ గౌరవించండి చాలు…
ఇంకెంత కాలం ‘రూపేచ లక్ష్మీ’ అంటూ మహిళలల్ని, అందానికీ – అలంకరణకూ పరిమితం చేయాలనుకుంటున్నారు…?
మీ ఆనందం కోసం వారు పడుతున్న ‘ఆవేదనను’ చూడండి చాలు…
Also Read : పండంటి కాపురానికి పదహారు సూత్రాలు
ఇంకెంత కాలం ‘శయనేషు రంభ’ అంటూ మహిళలల్ని, లైంగిక వస్తువులా భావిస్తారు…?
మీ సుఖ-సంతోషాల కోసం, వారు ఒక పడక వస్తువులా ‘అనుభవిస్తున్న’ నరకాన్ని కొంచం అర్థం చేసుకోండి చాలు…
ఇంకెంత కాలం ‘క్షమయా ధరిత్రీ’ అంటూ మహిళలల్ని, హింసిస్తారు…?
మీ కోసం జీవితాంతం ఎన్నో సహిస్తున్న, ఎంతో ఓర్చుకొంటున్న వారి ‘సహనానికి’, చేస్తున్న ‘త్యాగాల’కు విలువనివ్వండి చాలు…
అనాదిగా మన మహిళలు “మన” నుండి కోరుకొంటున్నవి, ఆశిస్తున్నవి ఇవే…
ఇళ్లో – వాకిళ్లో, బంగారాలో – నగలో, రత్నాలో – ఆభరణాలో కాదు…
“మీ” నుంచి కేవలం ఒక గుర్తింపు… ఒక గౌరవం… ఒక నమ్మకం… ఒక ప్రోత్సాహం… ఒక చేయూత… వారికి ఇవ్వండి చాలు…
కొంత ఆదరణ… మరికొంత అభిమానం… ఇంకొంత ఆప్యాయత… వారికి ఇవ్వండి చాలు….
కొంచెం ప్రేమ… ఇంకొంచెం సహకారం… మరికొంచెం విలువ… వారికి ఇవ్వండి చాలు…
కొన్ని అవకాశాలు… ఇంకొన్ని ఉత్సాహాలూ… మరికొన్ని ప్రోత్సాహాలు… వారికి ఇవ్వండి చాలు…
ఇవే… ఇవే…
ఇలాంటివే… ఇలాంటివే…
చిన్న, చిన్న విషయాల్ని…
చిన్న, చిన్న సుఖాల్ని….
చిన్న, చిన్న సంతోషాలల్ని…
మాత్రమే
మహిళలు కోరుకుంటున్నారు…
మహిళలు ఆశిస్తున్నారు…
“యత్ర నార్యస్తు పూజ్యంతే…” అంటూ మహిళలల్ని, మీరు ఎంతమాత్రమూ పూజించనక్కరలేదు, మహిళల్ని మహారాణులుగా అంతకన్నా చేయనక్కర్లేదు…!
Also Read : ఆధునిక మహిళ కోరుకుంటోంది హక్కులు కాదు, ఆప్యాయత – ఆదరణ
‘స్త్రీ’ శక్తి…
‘స్త్రీ’ విముక్తి…
‘స్త్రీ’ స్వేచ్ఛ…
‘స్త్రీ’ స్వాతంత్ర్యం…
స్త్రీ సమానత్వం…
‘స్త్రీ’ అధికారం…
‘స్త్రీ’ సాధికారత…
అంటూ పెద్ద, పెద్ద మాటలు అసలే వద్దు…
ఒకరు ఇచ్చేది ‘స్వేచ్ఛ’ కాదనీ…
‘స్వాతంత్ర్యం’ ఎవరి భిక్షా కానే కాదనీ…
ఆత్మవిశ్వాసాన్నే ఆలంబనగా చేసుకొని బతికే ఆడవారికి చాలా బాగా తెలుసు…
వీలైతే, మహిళలను కష్టపెట్టకుండా, వార్ని ఎంతమాత్రం హింసించకుండా, వారిని గౌరవించండి చాలు… వారి ఆత్మ గౌరవాన్ని సంరక్షించండి చాలు…
అదే వారికి కొంచెమైనా విముక్తి…
అదే వారికి కొంత స్వేచ్ఛ…
అదే వారికిచ్చే కనీస స్వాతంత్ర్యం…
అదే కొంతైనా మీరిచ్చే సమానత్వం…
ప్రతీ ‘పడతి’ పుట్టుకతోనే ఒక గొప్ప నాయకురాలు… ఒక పోరాట యోధురాలు… ఓ సాహసి…
ఆదినుండీ మగాడ్నీ, అవనినీ పాలిస్తూ, పరిపాలిస్తూ, సర్వకాల-సర్వావస్తల్లోనూ కాపాడుతున్న అతివలు ఎల్లప్పుడూ అదిపరాశక్తులే…
దయచేసి… మనకొక ఉనికినిచ్చిన, మనకు మనుగడనిచ్చిన, మనకంటూ ఒక అస్తిత్వాన్నిచ్చిన, మన మానవజాతికి సర్వదా ఆధారభూతమైన ‘మహిళను’… ఒక ‘స్త్రీమూర్తి’ గా… ఓ ‘మహిళా’మూర్తిగా గుర్తించి, గౌరవించండి, అభిమానించండి… చదివించి, చేయిఅందించి, చేయూతనివ్వండి…
Also Read : మాటలతో ఆకట్టుకోండి, మనసు దోచే ఉద్యోగం చేపట్టండి!
మహిళలల్ని మనం రక్షించుకొంటే, మనల్నీ, మన భవిష్యత్తునూ మనం సంరక్షించుకొన్నట్టే…
భార్యకు తన శరీరంలో సగభాగాన్నిచ్చి అర్ధనారీశ్వరుడైన ఆదిదేవుడు ఈశ్వరుని స్ఫూర్తితో, పురుషజాతి సమస్తం మహిళల్ని ఎల్లప్పుడూ, అన్నివేళలా, సదా, సర్వదా గౌరవించాలనీ కోరుకుంటూ… ఆశిస్తూ… అభిలషిస్తూ… ఆకాంక్షిస్తూ… మహిళామణులందరికీ అంతర్జాతీయ ‘మహిళా’ దినోత్సవ శుభాకాంక్షలతో…
జై హింద్… భారత మాతకు జై…