Monday, January 27, 2025

రసకందాయంలో పంజాబ్ ఎన్నికల రంగం

  • అమరేంద్రుడి కొత్త పార్టీ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
  • ఎన్నికలలో కాంగ్రెస్ మళ్ళీ గెలిస్తే దళిత ముఖ్యమంత్రి కొనసాగుతారా?
  • ఆమ్ ఆద్మీపార్టీ అధికారం అందుకుంటుందా?

యోధుల సీమగా పేరుగాంచిన పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం దగ్గరకు వచ్చేసింది. పట్టుమని మూడు నెలల సమయం మాత్రమే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాలి. గత ఎన్నికలు ఫిబ్రవరి 4వ తేదీన జరిగాయి. ఈ పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఈసారి పంజాబ్ లో ఆ మోతాదు ఎక్కువగానే ఉండనుంది. కాంగ్రెస్ లో ముసలం సంభవించడం దానికి ప్రధాన కారణం. ఆ పార్టీకి చెందిన అత్యంత శక్తివంతమైన సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆ పరిస్థితిని దిల్లీ అధిష్టానమే కల్పించింది. అత్యంత అవమానకరమైన రీతిలో ఆయనను ముఖ్యమంత్రి సింహాసనం నుంచి దించేసింది.

Also read: ఇంటి నుంచి ఐటీ పనికి త్వరలో స్వస్తి

కెప్టెన్ యుద్ధానికి దూరంగా ఎందుకుంటారు?

అసలే పంజాబీ, దానికి తోడు ఆయన రాజవంశీకుడు, సైనికుడు కూడా. యుద్ధం చేయకుండా ఊరకే ఎందుకుంటాడు? యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాడు. శంఖం ఎప్పుడో పూరించాడు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వరుసగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బిజెపిలో చేరతారని బాగా ప్రచారం కూడా ఆ మధ్య జరిగింది. బిజెపిలో చేరడం లేదని, రాజకీయ క్షేత్రంలోనే ఉంటానని, తన దగ్గర అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని పదే పదే వివరించారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నాని తాజాగా ప్రకటించారు. బిజెపితో పొత్తు ఉండదని అంటున్నారు. దీనితో కెప్టెన్ రాజకీయ ప్రస్థానంపై స్పష్టత వచ్చేసింది. ఇక పార్టీ పేరు, వివరాలు ప్రకటించడమే తరువాయి. తను స్థాపించబోయే పార్టీ నుంచి అన్ని స్థానాలకు పోటీలో నిలుస్తున్నామని తెలియచేశారు. పంజాబ్ లో తనకు ఈ పరిస్థితి రావడానికి మూలకారణమైన నవ్ జోత్ సింగ్ సిద్ధూ పోటీ చేసే చోటే బరిలో దిగుతానని ఆయన వెల్లడించారు. ఇటు సిద్ధూను -అటు కాంగ్రెస్ ను ఓడించి, గుణపాఠం చెప్పాలనే తీవ్రమైన కసిలో అమరీందర్ ఉన్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బిజెపి చాలా బలహీనంగా ఉంది. బహుశా అందుకే ఆయన ఆ పార్టీలో చేరలేదని చెప్పవచ్చు. 70 ఏళ్ళు దాటిన వారికి పదవుల కేటాయింపుల విషయంలోనూ బిజెపి కొన్ని నియమాలను పెట్టుకున్నది. ఇది కూడా మరో కారణం కావచ్చు. ఆ రాష్ట్రంలో స్థానాల పరంగా ఆమ్ ఆద్మీ పార్టీ, ఓటింగ్ శాతం ప్రకారం శిరోమణి అకాళీదళ్ కాంగ్రెస్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీల్లో చేరడానికి తనకు అవకాశాలు ఉన్నా సొంత పార్టీని స్థాపించి తన సత్తా ఏంటో చూపించాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు భావించాలి. పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 స్థానాలు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే 59 సీట్లను దక్కించుకోవాలి. ప్రస్తుతం కాంగ్రెస్ -77, ఆమ్ ఆద్మీ పార్టీ -20, శిరోమణి అకాళీదళ్ -15, బిజెపి -3, లోక్ ఇన్సాఫ్ పార్టీ -2 స్థానాల బలంతో ఉన్నాయి. ఇవన్నీ 2017 ఎన్నికల్లో సాధించుకున్న సీట్లు.

Also read: రజనీ బాబాసాహెబ్ ఫాల్కే పురస్కారం బస్సు డ్రైవర్ సహా ఆత్మీయులందరికీ అంకితం

పరిస్థితులు తారుమారు అవుతాయా?

2022 ఫిబ్రవరిలో రాబోయే ఎన్నికల్లో ఇవన్నీ తారుమారయ్యే పరిస్థితులు రావచ్చని పంజాబ్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం వచ్చిఉండకపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చిఉండేదని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘ఆమ్ అద్మీ పార్టీ’ అధికారాన్ని తన్నుకుపోయినా ఆశ్చర్యపడక్కర్లేదని మరికొందరు జోస్యం చెబుతున్నారు. వ్యవసాయ బిల్లుల అంశంలో విభేదించి, ఎన్ డి ఏ నుంచి అకాళీదళ్ పార్టీ బయటకు వచ్చేసింది. బహుజన సమాజ్ పార్టీ -అకాళీ దళ్ కలిసి ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నాయి. గత ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బి ఎస్ పి కనీసం ఒక్క సీటును కూడా దక్కించుకోలేక పోయింది. ఓటింగ్ శాతం కూడా కేవలం 1.5శాతం మాత్రమే. అకాళీదళ్ కు 25.2 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 38.5 శాతం ఓట్లను పొందగలిగింది. అమరీందర్ స్థానంలో దళిత నేత చరణ్ జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించారు. సామాజిక సమీకరణాల ప్రకారం దళితులు, జాట్ లు అత్యంత కీలకం. ఎక్కువమంది ఓటర్లు ఈ సామాజిక వర్గాలకు చెందినవారే ఉన్నారు. నవ్ జోత్ సింగ్ జాట్ వర్గానికి చెందిన నేత. ఆ విధంగా రెండు వర్గాల నుంచి ఓట్లను రాబట్టవచ్చు, మళ్ళీ గెలుపుగుర్రాన్ని ఎక్కవచ్చునని కాంగ్రెస్ అధిష్టానం లెక్కలు వేసుకుంటోంది. స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని అమరీందర్ ను పక్కనపెట్టి, నవ్ జోత్ ను అందలమెక్కించారు. అతను ఏకుమేకై కూర్చున్నాడు. కొత్త ముఖ్యమంత్రి తీరు నచ్చక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.పార్టీ గెలవాలంటే ఏమేమి చెయ్యాలో చూపిస్తూ 13 ప్రతిపాదనలను నిర్దేశిస్తూ అధిష్టానానికి ఇటీవలే లేఖాస్త్రాన్ని సిద్ధూ సంధించారు. అది పార్టీ పెద్దలకు చికాకు తెప్పించింది. వేరు మార్గంలేక,వారు ప్రస్తుతానికి మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ దూకుడు పెంచుతున్నారు. కాంగ్రెస్ తర్వాత ఓట్ బ్యాంక్ లో రెండవ స్థానంలో ఉన్న శిరోమణి అకాళీదళ్ ను బుజ్జగించే ప్రయత్నాన్ని బిజెపి చేపట్టిందని వినపడుతోంది. ఎన్నికల ఫలితాలను బట్టి, అమరీందర్ సింగ్ కొత్త పార్టీ -బిజెపి సమాగమంపై ఒక స్పష్టత వస్తుందనుకోవాలి. బిజెపి విధానాలపై అమరీందర్ ఈమధ్యకాలంలో ప్రశంసలు గుప్పిస్తున్నారు. వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రంతో చర్చిస్తున్నానని,త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తానని తాజా మీడియా సమావేశంలో కెప్టెన్ తెలియజేశారు. మొత్తంమీద బిజెపి పెద్దలు అమరీందర్ సింగ్ మధ్య రాజకీయపరంగా కొన్ని ఒప్పందాలు కుదిరివుంటాయని  అటు దిల్లీ-ఇటు పంజాబ్ లో చెప్పుకుంటున్నారు.

Also read:సకారాత్మక సంచలనాలకు చిరునామా స్టాలిన్

అన్ని పార్టీలలోనూ గందరగోళం

రాజకీయాల్లో ఏదైనా జరుగవచ్చనే సూత్రం ఎట్లాగూ ఉంది. 2022 ఎన్నికల విషయానికి వస్తే అన్ని పార్టీల పరిస్థితి గందరగోళంగానే ఉంది. కాంగ్రెస్ ను అన్నేళ్లు అధికారంలో నిలబెట్టిన ఘనత కెప్టెన్ కే చెందుతుంది. కానీ 2017-2021 పాలనాకాలంలో, ఇటు ప్రభుత్వ పరంగానూ, అటు పార్టీ పరంగానూ అమరీందర్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయి. మంత్రులకు సైతం అందుబాటులో ఉండరని, తగాదాలు దిల్లీకి చేరాయి. అంతకు ముందు ఎట్లా ఉన్నా కెప్టెన్ కాలంలో ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెరిగింది. 2017ఎన్నికల్లో గెలుపు కూడా నల్లేరుపై బండి నడకలా సాగలేదు. చివర్లో బిజెపిని వీడి సిద్ధూ కాంగ్రెస్ లో చేరాడు. పార్టీ గెలుపుకు అది కొంత ఉపయోగపడిందని చెబుతారు. ఈసారి పరిస్థితి వేరు. అంతర్గత కుమ్ములాటలు పెరగడం వల్ల పార్టీకి అప్రతిష్ఠ పెరిగింది.అమరీందర్ సింగ్ వర్గం చీలిపోయింది. కొత్తగా స్థాపించబోయే పార్టీతో ఆ వర్గం నడువనుంది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దళితనేతను ముఖ్యమంత్రి పీఠంపై కాంగ్రెస్ కూర్చోపెట్టింది. ఒకవేళ పార్టీ గెలిస్తే అతనిని కొనసాగిస్తారనే భరోసా కలగడం లేదు. సిద్ధూకు దళిత వ్యతిరేకిగా పేరుంది. ముఖ్యమంత్రి పదవిపై అతనికి ఎప్పటి నుంచో కన్నుంది. ఇవన్నీ కాంగ్రెస్ కు చికాకు తెప్పించే విషయాలే. ఓటర్లలో నమ్మకాన్ని పోగొట్టే అంశాలే. వ్యవసాయ బిల్లుల అంశంపై సుదీర్ఘకాలం నుంచి ఉద్యమం జరుగుతోంది. దీని ప్రభావం బిజెపిపై ఉంటుందనే చెబుతున్నారు. ‘దంగల్’ సినిమాను తలపించే ఉత్కంఠ రేపటి ఎన్నికల సంగ్రామంలో కనిపించనుంది. అతి సున్నితమైన పంజాబ్ రాష్ట్రంలో మత వైషమ్యాలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీలకూ, నేతలకూ ఉంది.

Also read: అటు చైనా, ఇటు పాకిస్తాన్, అడకత్తెరలో భారత్

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles