Thursday, November 7, 2024

శేషేంద్రశర్మ మేధో సంపత్తి హక్కులు ఎవరివి?

సుప్రసిధ్ధుడు గుంటూరు శేషేంద్రశర్మ రచనలపై మేధోసంపత్తి హక్కుల గొడవలో మరణానంతరం సమస్యలో పడినా ఆరోపణలు వీగిపోయాయి. కొందరు మహానుభావులు శర్మగారి గ్రంథాలను ఇతరులైన కొందరు చౌర్యం చేసారని కోర్టుదాకా వెళ్లింది. దాని అర్థం మహాకవి శేషేంద్రశర్మ తప్పు చేశాడని కాదు లేదా గ్రంథచౌర్యం జరిగిందనీ కాదు. అంతపని ఆయన చేస్తాడా?  కామోత్సవ్ పుస్తకం కాపీరైట్ విషయంలోన ఇతర అనేక సుప్రసిద్ధ రచనలపైన కూడా శేషేంద్ర శర్మ గారి కుమారుడు సాత్యకి ఫిర్యాది చేశారు. కనుక ఆ తగాదా కోర్టుకు వచ్చింది.

విలువైన రచన కూడా డబ్బు అనే సంపదను దొంగిలించడం వంటిదే. అది కూడా మామూలు దొంగ పనే కదా.  కాపీరైట్ చట్టం ప్రకారం రచయితకు తన రచనపైన ప్రచురణ ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందే అధికారం తన జీవిత పర్యంతం ఉండడమే కాక తదనంతరం 60 ఏళ్లపాటు తన వారసులు లేదా వారి ద్వారా హక్కులు బదిలీ తీసుకున్నవారు అనుభవించవచ్చునని చట్టం పేర్కొన్నది. ఎవరైనా దాన్ని ఆ హక్కుదారుల అనుమతి లేకుండా ప్రచురిస్తే అందుకు జైలు శిక్ష జరిమానా భారం వహించవలసి వస్తుందని చట్టం వివరిస్తున్నది.

సాత్యకి

మహాకవి శేషేంద్ర శర్మ కుమారుడు సాత్యకి 2008లో ప్రచురణకర్తలయిన నీల్ కమల్ వారిపైన, శేషంద్రశర్మ గారి రెండో భార్య అయిన ఇందిరా ధనరాజగీర్ పైన కాపీరైట్ దావా వేశారు. ఈ కేసులో 2018 ఫిబ్రవరి 7వ తేదీన 11వ అదనపు ముఖ్య న్యాయాధికారి శ్రీ ఎస్ వి విద్యానాథ రెడ్డి (ఎంఎ ఎల్ ఎల్ ఎం) గారు న్యాయం ఉందని సాత్యకికి అనుకూలంగా ఇచ్చిన తీర్పుతో కీలకమైన ఒకదశ ముగిసింది. అయితే అప్పీలు దశ ఇంకా కొనసాగుతున్నది.

శేషేంద్ర శర్మగారి రచనలపైన హక్కు సాత్యకి ఇచ్చారు.  శేషేంద్ర రెండో తనయుడు కనుక వారి తదనంతరం తండ్రి పుస్తకాల పైన కాపీరైట్ కలిగి ఉంటాయని శర్మ రాసారు.  అని సాత్యకి వాదించారు. ఆ సాక్ష్యం కూడా చెప్పారు. శేషేంద్ర తన రచనలన్నింటి పైన కాపీరైట్ ను సాత్యకికి మాత్రమే తన స్వదస్తూరీతో రాసిన పత్రం ద్వారా 2‌-12-1989 ధారాదత్తం చేశారని కోర్టులో చెప్పారు. అప్పుడు ఇతర కుటుంబసభ్యులకు అందులో భాగం ఉండదు.  ఇదంతా సాత్యకి ఈ దావాలో కోర్టుకు విన్నవించారు. ‘నాదేశం నా ప్రజ’ తో సహా అనేకానేక శేషేంద్ర రచనలపై తనకే ప్రచురణాది హక్కులు ప్రతులు వెలువరించే హక్కులు ఉన్నాయని రుజువులు చూపారు. శేషేంద్ర రచనలు అనేక భాషలలోకి తర్జుమా అయినాయనీ, ఆ పుస్తకాలపైన కాపీ హక్కులు కూడా ఈయనకే చెందుతాయరనీ సారాంశం. కనుక ఆయన తన తండ్రిగారి పుస్తకాల పునర్ముద్రణ ప్రారంభించారని కూడా వివరించారు.  ‘ఎంతకాలం ఎండమావులు’ అనే పుస్తకంలో తన తండ్రి కాపీరైట్ ఇస్తూరాసిన పత్రాన్ని ప్రచురించారు కూడా పేర్కొన్నారు.  అదే విధంగా ‘సాహిత్య దర్శిని,’  ‘సొరాబు,’  ‘స్వర్ణహంస,’ ‘వచ్చింది వోట్లరుతువు,’  ‘షోడశి,’  ‘రామాయణ రహస్యములు,’  ‘శబ్దం నుంచి శతాబ్దం వరకు,’  ‘ఊహలు’ అనే గ్రంధాలను, వాటి అనువాద గ్రంధాలను ప్రచురించారు. శ్రీశేషేంద్ర శర్మగారు 2001 మే 30 న కీర్తిశేషులైనారు. తరువాత కూడా ‘నా దేశం నాప్రజలు,’  ‘ఆధునిక మహాభారతం’ వంటి పుస్తకాలను మళ్లీ మళ్లీ ముద్రించారు. అయితే శేషేంద్రశర్మగారు కాపీరైట్ ను 5.1.2006న తనకు బదిలీ చేశారని శ్రీమతి ఇందిరా ధనరాజ్ గీర్ దినపత్రికలలో నోటీసును ప్రచురించారు. ‘నాదేశం నా ప్రజలు’ అన్న పుస్తకాన్ని నీలకమల్ ప్రచురణ కర్తలు ప్రచురించిన విషయం కూడా సాత్యకి తెలియజేశారు. ఇవన్నీ తన హక్కును హరించే చర్యలనీ చట్టప్రకారం చెల్లవని సాత్యకి ఈ దావాలో సవాలు చేసారు. జడ్జిగారు తన తీర్పులో వివరంగా ప్రస్తావించారు. అంతే కాదు. అంతకుముందు ఆ ఆరోపణ కోర్టు ముందు విచారణ జరిగింది. అటూ ఇటూ న్యాయవాదులు వాదించుకున్నారు. సాక్ష్యాలు రుజువులు కోర్టు ముందు పెట్టారు. అవి జడ్జిగారు విన్నారు. అటూ ఇటూ అనేక ఏళ్లపాటు పరిశీలించారు. అయితే ఈ ఆరోపణలను ప్రతివాదులు ఖండించారు. తమకే అన్ని హక్కులున్నాయనీ, సాత్యకి గారికి వారి తండ్రి ప్రేమాభిమానాలతో కాపీరైట్ ఆస్తిలాగా బదిలీ చేసారనడం సరికాదనీ, కనుక సాత్యకి గారికి ఏ హక్కులూ లేవనీ వాదించారు. ఇరు పక్షాల వాదనలపైన న్యాయస్థానం మూడు ప్రశ్నలు రూపొందించింది. 1. ఇతర ప్రచురణ కర్తలు శేషేంద్ర శర్మ రచనలను ప్రచురించకుండా శాశ్వత నిషేధ ఉత్తర్వులు ఇవ్వవచ్చా? 2. సాత్యకి అడిగినట్టు 50 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించవచ్చా? 3. ఏ విధమైన న్యాయం చేయాలి?

ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి సాక్ష్యాలను కోర్టు విచారించింది. తరువాత ఇరు వర్గాల వాద ప్రతివాదాలను ఖండనమండనలను విన్నారు.

ఇందిరా దేవీ ధన్ రాజ్ గీర్

కొత్త సెక్షన్ 9(ఎ) 19(5) కాపీరైట్ చట్ట

దావా వేసిన సాత్యకి గుంటూరు శేషేంద్ర శర్మగారికి వారి శ్రీమతి జానకి గారికి కలిగిన రెండో తనయుడు అనడం నిర్వివాదాంశం. ప్రతివాదులు కూడా అంగీకరించారు. సాత్యకి కి కాపీరైట్ బదిలీ చేస్తూ శేషేంద్ర శర్మ గారు ఇచ్చారన్న లేఖ శేషేంద్ర శర్మగారు రాసినదే అని ఇందిరా ధనరాజ్ క్రాస్ ఎగ్జామినేషన్ లో అంగీకరించారని కోర్టు తీర్పులో పేర్కొన్నది. 1994లో కాపీరైట్ చట్టానికి చేసిన సవరణలకన్న ముందే కాపీరైట్ బదిలీ చేసారు కనుక, ఈ బదిలీకి కొత్త నియమాలు వర్తించబోవు.  కనుక సాత్యకి తన కాపీరైట్ హక్కును అయిదేళ్లలోగా వినియోగించలేదు కనుక ఆ హక్కు విఫలమౌతుందనీ, కనుక మౌనంగా నిష్క్రియ ద్వారా ఆ హక్కులను ఇందిరా ధనరాజ్ గిర్ కి బదిలీ అవుతాయనడానికి వీలు కలిగించే కొత్త సెక్షన్ 9(ఎ) 19(5) కాపీరైట్ చట్ట నియమాలు వర్తిస్తాయనే వాదన చెల్లదు. 1994 కన్న ముందు జరిగిన కాపీరైట్ బదిలీ లకు కాపీరైట్ చట్టం 1957 లో సెక్షన్ 19కింద 2 నుంచి 6 సబ్ సెక్షన్లు వర్తించవని సెక్షన్ 19(7)లో చాలా స్పష్టంగా ఉంది. సాత్యకి పేరున రాసిన లేఖ శేషేంద్ర శర్మ జీవితకాలంలో రాసినదే, ఎంతకాలం ఈ ఎండమావులు అన్న పుస్తకాన్ని కూడా ఆయన జీవితకాలంలోనే సాత్యకి ప్రచురించడమే గాక అందులో తనకు కాపీరైట్ ఉందనే లేఖను కూడా చేర్చారని కోర్టు గుర్తించింది. దీన్ని బట్టి సాత్యకి తన కాపీరైట్ హక్కును అయిదేళ్లలో వినియోగించుకున్నట్టే కనుక కాపీరైట్ సవరణ చట్టం వర్తిస్తుందనుకున్నా, ఆయన హక్కులు స్థిరంగానే ఉంటాయని కోర్టు వివరించింది.

ఇందిరాదీేవీ ధన్ రాజ్ గీర్ తో శేషేంద్రశర్మ

శేషేంద్రశర్మ రచనదే కాపీరైట్

తనకు శర్మగారే కాపీరైట్ బదిలీ చేసారనడానికి రాజ్ కుమారి గారు కోర్టుకు సమర్పించిన పత్రం కల్పిత పత్రమని సాత్యకి వాదించారు. తెలంగాణా ప్రభుత్వ ఫోరెన్సిక్ లాబోరేటరీ ఈ పత్రాన్ని నిశితంగా పరీక్షించి ఇది నకిలీ పత్రమనీ, శర్మగారి సంతకాన్ని ఒకానొక అచ్చు విధానంద్వారా సృష్టించారని నివేదిక ఇచ్చింది. ఆ విషయం కోర్టులో అసిస్టెంట్ డైరెక్టర్ సమర్థించారనీ కోర్టు ధృవీకరించింది.  కనుక కాపీరైట్ తనకు బదిలీచేసారన్న రాజ్ కుమారి వాదన, దానికి ఆధారమైన పత్రం చెల్లవని, ఆమెకు శర్మగారి రచనలపై కాపీరైట్ హక్కులు లేవని కోర్టు తేల్చింది. కనుక మొదటి ప్రశ్నకు సమాధానం,

ఫోర్జరీ పత్రాలా?

సాత్యకి అభ్యర్థన మేరకు ఆయనకు చెందిన శేషేంద్ర శర్మ పుస్తకాల కాపీరైట్ హక్కును భంగం చేసే విధంగా ప్రతివాదులు కానీ మరెవరైనా కానీ ప్రచురించడానికి వీల్లేదని శాశ్వత నిషేధపుటుత్తర్వులను కోర్టు జారీ చేసింది.  రెండో వివాదపు సవాల్ సాత్యకిగారికి యాభైవేల నష్టపరిహారం ఆదేశించాలన్న అభ్యర్థనను కోర్టు అంగీకరించలేదు. న్యాయ పరిష్కారం ఏమిటి? అనే మూడో ప్రశ్నకు సమాధానంగా ప్రతివాదులు, వారి ఉద్యోగులు, వారి ఏజెంట్లు, సేవకులు ఎవరు కూడా ‘నాదేశం నా ప్రజలు’ తో సహా ఇతర శేషేంద్ర సాహిత్య గ్రంధాలను ముద్రించకుండా కోర్టు నిషేధించింది. ఇది కాపీరైట్ వివాదంలో సాత్యకి సాధించిన ఘన విజయం. శేషేంద్ర శర్మగారు సాత్యకికి ప్రేమపూర్వకంగా కాపీరైట్ ఆస్తి బదిలీ చేసిన లేఖ నిజమైనదని తేలింది. రాజ్ కుమారికి బదిలీ చేసారన్న లేఖ కల్పిత లేఖ అని రుజువైంది.

దాని అర్థం ఏమంటే పూర్తి విచారణ జరిగిన తరువాత సాక్ష్యాలు రుజువైనట్టు జడ్జిగారు నిర్ధారించినతరువాత ఆ కాపీరైట్ సాత్యకిదేనని కోర్టు తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పుపైన అప్పీలు విచారణ ప్రస్తుతం నాలుగేళ్లుగా హైకోర్టులో వాయిదాల దశలో ఉంది. హైకోర్టు సాత్యకి కాపీరైట్ పైన నిలిపివేత ఉత్తర్వు ఇవ్వడానికి నిరాకరించడం విశేషం.  అంతకుముందు ‘కామోత్సవ్’ అశ్లీలం కాదని సుప్రీంకోర్టులో విజయం సాధించడం కూడా సాధ్యమైంది. కాపీరైట్ వివాదంలో సాత్యకి కే కాపీరైట్ ఉందని కోర్టు తీర్పు చెప్పడంతో మరొక సారి శేషేంధ్రశర్మ ప్రచురించడానికి సాధ్యమౌతుంది. ఏదేమైనా అద్భుతమైన కవి అయిన శేషేంద్రశర్మ రచనలు జనంలోకి మళ్లీ మళ్లీ వస్తున్నాయి కూడా.

(మహాకవి శేషేంద్రశర్మ వర్థంతి  మే 30)

మాడభూషి శ్రీధర్ 28.5.2023

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles