గృహప్రవేశం అయింది.
ఉమ చుట్టాలకు ఇల్లు చూపిస్తోంది. ఇది మాస్టర్ బెడ్ రూం. అంటే మాది. ఇది పిల్లల బెడ్ రూం. ఇది గెస్ట్ రూం. ఇది మా అమ్మ బాపులు వచ్చినప్పుడు ఉంటరు. రూంలు అయిపోయినాయి. ‘‘మరి మా అక్క బెడ్ రూం ఏది?’’ అన్నడు రాం వాళ్ళ మేనమామ. ‘‘నాకెందుకురా. ఈ హాళ్ళనే ఏదో ఒక పక్క పడుకుంట’’ అన్నది పార్వతమ్మ. చుట్టాలందరి మొఖంల కోపం. వెంటనే ‘గెస్ట్ రూమే మా అమ్మ రూం’ అన్నడు రాం. వెంటనే ఉమ మొహం మాడిపోయింది. ఆమె మొఖంల కోపం బయటకస్తుంది. వెంటనే ఆమె తల్లి దండ్రులు ఆమెను పక్కకు తీసుకుపోయి ‘నువ్వు ఏం మాట్లాడకు. ఒక్క రూం కోసం చూసుకుంటే మొత్తం ఇల్లు పోయేటట్టున్నది’ అన్నది తల్లి. ‘ఊర్లె ఆస్తి కూడా’ అన్నడు తండ్రి.
ఏడుస్తున్న మనవడిని తీసుకొని గెస్ట్ రూంలకు పోయింది పార్వతమ్మ. రాం కూడా తల్లి వెనక పోయి కొడుకునెత్తుకొని వీపు నిమురుతున్నడు. ‘‘ఇదీ సంగతి. ఏమన్నా అంటే పిల్లల్ని కొడుతది. వాళ్ళ కొరకు నేను నోరు, చెవులు, కళ్ళూ మూసుకొని పడి ఉంటున్నా. పెండ్లిపెండ్లి అన్నవు. ఏమయిందో చూడు.’’
‘‘ఇంకేం కావాలి కొడుకా. బంగారం వలె ఇద్దరు పిల్లలు పుట్టింరు. ఇంకేం కావాలె?’’
‘‘వాళ్ళకోసమే అన్ని బాధలు భరిస్తున్న. ఆమెకు కోపం వస్తే పిల్లల్ని కొట్టి నా నోరు మూయిస్తుంది’’ అన్నడు రాం నిరాశగా.
ఏమర్థమయ్యిందో పిల్లలిద్దరూ తండ్రికి రెండు వైపులా చేరి భుజంమీద తల పెట్టారు. ‘‘వీళ్ళే నా బలం, వీళ్ళే నా బలహీనత. ఆమెకు ఆయుధాలు. నామీద పెత్తనం చెలాయించడానికి వీళ్ళను కొడుతుంది.’’
వచ్చిన చుట్టాలకు అర్థం అయింది ఏం జరుగుతున్నదో. ‘‘ఇదేమీ కొత్త కాదు. ప్రతి ఇంట్ల ప్రతి స్త్రీ చేస్తున్నదే ఇది. అందరు అనుభవిస్తున్నదే. ఎవ్వరూ ఏం చేయలేరు. అనుభవించవలసిందే’’ అని నిట్టూర్చారందరూ.
ఆ నిట్టూర్పుల శబ్దానికి కొత్త ఇల్లు మర్మోగింది.
‘పెండ్లి చేసుకొని చూడు,’ ‘ఇల్లు కట్టి చూడు’ అని ఎందుకన్నారో అర్థమయింది అందరికీ.
వివాహ వ్యవస్థా వర్థిల్లు!