కావడానికి
అవి అల్పమైన వస్తువులే
కాని
అనుకోని పరిస్థితుల్లో
అనల్ప విషయాలు.
మ్యాగజైన్‌లో
చివరలు మలిచిన పేజీలు
అధ్యయన యాత్రలో
ముఖ్య మజిలీలౌతాయి.
ఇవాళెందుకో
ఇల్లంతా తిరుగుతున్నాను
ప్రతి గది మూలనా ఒకటి రెండు
చీపురు పుల్లలు దొరుకుతున్నాయి
అన్నింటినీ సేకరిస్తే
అదో సగం కట్ట అయ్యింది.
కొత్తది కొనాలనే
మా ఆవిడ ఆలోచనకు బ్రేకు పడింది.
గమనించనే లేదు
చివికిన బాత్ రూమ్ తలుపులకు
రంగు వెయ్యా లనిపించింది.
ఓ చోట
కరెంట్ వైర్‌కు చుట్టే రెడ్ టేప్ దొరికింది
మొన్న దీని కోసం మా వాడు
ఇల్లు పీకి పందిరేశాడు.
ఈ అద్దం
నా విద్యార్థి జీవితం నాటిది
దాని బ్లర్‌ను దాటి చూస్తే మసగ్గా
నాటి ఫ్లాష్‌బ్యాక్‌లు కనిపిస్తున్నాయి.
కిటికీలో
రెండు పెద్ద గుండీలు కనపడ్డాయి
అవి లేకపోతే
నేను కొత్త కోటు కొనాల్సి వచ్చేది.
నాకేదీ
వ్యర్థంగా కనిపించదు
కాలానికి
దాని అవసరముండాలి అంతే!
ప్రతి చర్యకూ
ఓ చరిత్ర వుంటుంది
నాది కొంత చురుకైన చూపే.
పేవ్‌మెంట్ మీద నడిచే కాళ్లకు
చెప్పు లున్నాయా అని గమనిస్తాను
పాతవైనా సరే.
ఆ నడక వారిని
ఏ గమ్యానికి చేరుస్తుందో అని ఆలోచిస్తాను.
నిన్న వేడి ఇసుకలో
పాక్కుంటూ పొయ్యే చీమను
చేతిలోకి తీసుకొని
చెట్టు నీడన వదిలాను.
పొద్దటి పూట
జాగింగ్ చేసే వృద్ధుని
స్పిరిట్‌ను మెచ్చుకుంటాను.
‘నా వైపు వింతగా చూస్తూ
పిచ్చి పట్టినట్టు తిరుగు తున్నావ్’
అంది మా ఆవిడ
‘అవును పిచ్చే
కవిత్వం రాస్తున్నాను’ అన్నాను.
Also read: ముంబయిలో వర్షం
Also read: అంశిక
Also read: గాలి
Also read: గొడుగు
Also read: మా ఊరు
Good