Sunday, December 22, 2024

అల్లూరి సీతారామరాజు – ఇందిరమ్మ ఇచ్చిన భూమి

ఫొటో రైటప్: తమ సాగుభూములను రచయితకు చూపిస్తున్న రాయిపాలెం ఆదివాసీలు

రాజంపేట గ్రామానికి 05 మే 2023న చేరుకున్నా. అది నూకదొర ఆదివాసీల కుగ్రామం. అంతా లెక్కకడితే 16 కొంపలు. దానికి ఒక కిలో మీటరు దూరంలో రాయిపాలెం. అది కొండదొర ఆదివాసీల గ్రామం. మొత్తం కుటుంబాలు 35కి మించి లేవు. ఈ గ్రామాల మధ్య నేడు ఒక  భూ  ‘అనకొండ’ వచ్చి చేరింది. అది నెమ్మది నెమ్మదిగా ఈ రెండు గ్రామాల ఆదివాసీల భూమిని మింగెస్తూ వస్తున్నది. రాజంపేట గ్రామంలో కొంత భాగం కలుపుకొని 16 ఎకరాల భూమి తమదేనని అంటున్నది ఆ అనకొండ. ఇక రాయిపాలెం గ్రామానికి ఆనుకొని, వారి సాగులో వున్న 30 నుండి 40 ఎకరాల భూమి  తమదేనని బుసకొడుతున్నది ఆ అనకొండ. అనకొండ నెమ్మదిగా చుట్టుకుoటూ వస్తున్నది.  ఊపిరి ఆడనివ్వకుండా బిగించి చంపుతుంది. ఆనక నెమ్మదిగా మిoగేస్తుంది. అది దాని వేట పద్దతి. అది దాని భు కబ్జాపద్దతి. అది ముందు రికార్డులను తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఒక ‘లీగల ట్రాప్’ను  సిద్ధం చేసుకుంటుంది. రికార్డులు, భూమి పత్రాలు, రెవిన్యూ కార్యాలయంలో జరిగే తతంగాలు గూర్చి ఏమి తెలియని ఈ అమాయాక కష్టజీవులకు, లోలోపల నుండి అనకొండ తమను చుట్టుకు వస్తుందని తెలీదు.

Also read: రెండు నెలల రేషన్ అందింది, ఆహార భద్రతా చట్టం గూర్చి తెలిసింది

ఆదివాసీల దగ్గర కాగితాలు ఉండవు

అంతకు ముందు ఒకసారి వెళ్లి వచ్చాను. సాధారణ అనుభవం ఏమిటంటే బాధిత ఆదివాసీల వద్ద  కాగితాలు ఏమి వుండవు. పైన ఆకాశం, కింద భూమి, అంతే. వారు తరతరాలుగా సాగులో వున్నారనడానికి అవే సాక్ష్యం. అయినా,  నేను వెళ్ళిన వెంటనే ‘మీ వద్ద పాత కాగితాలు ఏమైనా ఉన్నాయా?’ అని అడుగుతూ వుంటాను, ఎందుకైనా మంచిదని. రాజంపేట వారిని అదే అడిగాను. నన్ను ఆశ్చర్యపరుస్తూ తమ వద్ద వున్న పాత కాగితాలు తెచ్చేపెట్టారు. అవి చాలాపాతవి. కొన్ని ఒరిజినల్ రికార్డులు. అప్పటి తాశీల్దార్ గ్రీన్ ఇంకుతో పెట్టిన సంతకాలు కనిపిస్తున్నాయి. కొన్ని పత్రాలు 1980 నాటివి. అంటే అవి 43 ఏళ్ల కిందటివి. వాటి మడతల వద్ద పిగిలిపోతున్నవి. మరి కొంతకాలం ఆగితే అవి పొడిగా మారిపోతాయి. భూమి సంగతి పక్కన పెట్టి వాటికి కాయకల్ప చికిత్స చేసే పని మొదలు పెట్టాము.

కాగితాలకు కాయకల్ప చికిత్స

ముక్కలుగా విడిపోయిన పత్రాలను పోల్చుకుంటూ తెల్ల టేపుతో ఒక షేప్ ఇచ్చే ప్రయత్నం చేసాం. వాటిని అర్జెంటుగా లామినేషణ్ చేయించవలసి వుంది.

పత్రాలకు కాయకల్ప చికిత్స చేస్తున్న రచయిత అజయ్ కుమార్

ఎండ వేడికి చెమటలు కారిపోతూ వుండగా, ఆ చెమట చుక్కలు ఈ పత్రాలపై పడకుండా జాగ్రత్తపడుతూ, వాటిని పసి పిల్లలవలె పట్టుకుంటూ ,  ఒకొక్కటొక్కటిగా తీసి పెడుతున్నాము. సుకూరు గడ్డిదొర, అల్లూరి సీతారామ రాజు ప్రస్తావన తెచ్చాడు. అల్లూరి సీతారామరాజు దగ్గర భూమి తీసుకొని ఇందిరమ్మ తమకు భూములు  ఇచ్చిందని అన్నాడు. సుకూరు గడ్డిదొర ఏమైనా గుర్రం ఎక్కడా అని మొదట నాకు అనుమానం వచ్చింది. లేదు బాగానే వున్నాడు. అల్లూరి సీతారామరాజు కాలానికి ఇందిరమ్మ సీలింగు మిగులు భూమి  చట్టం తీసుకురావడానికి అసలు సంబంధమే లేదు. నేను మరోసారి రెట్టించి అడిగితే, ఈ సారి మరింత గట్టిగా నొక్కి చెప్పాడు. ఆ విషయం తర్వాత చూద్దాం అనుకుంటు పత్రాల చికిత్స కొనసాగించాము.

Also read: రూ. 2,33,04559 అప్పుల సాలెగూడు నుండి బయటపడిన రోచ్చుపనుకు ఆదివాసీలు

రాజంపేట నూకదొర ఆదివాసీలు నా ముందు పెట్టిన  రికార్డులు  మనకు కొన్ని సంగతులు చెపుతున్నాయి.  భు సంస్కరణల చట్టం అనుసరించి కొంత భూమిని భుస్వాముల వద్ద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అలా చేసుకున్నాక వాటిని పేదలకు పంపిణి చేస్తారు. దీనినే ఇంగ్లిష్ లో ‘అసైన్ మెంట్’ అని రెవిన్యూ వారి తెలుగు భాషాలో ‘అతుకుబడి’ అని అంటారు. అలా అతుకుబడి చేసిన కాగితాలు ఇందులో వున్నాయి.

సీలింగు మిగులు భూముల ‘అతుకుబడి’ లో రెండు దశలు వుంటాయి. మొదట ఒక ‘ప్రొసీడింగ్’ ఆర్డర్ ఇస్తారు. అంటే, ఉదాహరణకు ఒక భుస్వామి వద్ద 10 ఎకరాల భూమిని సీలింగు మిగులుగా ప్రభుత్వం తీసుకుంది. దాని సర్వే నెంబర్ 5 అనుకుందాo. ఒకొక్కరికి  ఒక ఎకరా చొప్పున “సర్వే నెంబర్ 5 లో భాగం (S.no.5 part) 1 ఎకరా” అని అంటూ  ఎవరికీ ఇస్తున్నారో వారి పేరు రాసి ఇస్తారు. నిజానికి ఇది పూర్తీ స్థాయి అసైన్ మెంట్ పట్టాకాదు. ఇది తాత్కాలిక మంజూరు పత్రం.

భు సంస్కరణల చట్టంలో ఒక మెలిక పెట్టారు. భూస్వాముల నుండి భూమి స్వాధీనానికి ముందు సదరు భూమికి వున్న భూమి శిస్తుకు 50 రెట్లు కలుపుకొని 15 సంవత్సారాలలో లబ్దిదారు ఆ నగదు చెల్లించాలి. అప్పుడు మాత్రేమే తాత్కాలిక మంజూరుగా ఇచ్చిన ప్రొసీడింగ్ ఆర్డర్స్ లు  D-ఫారం పట్టగా మారుతాయి. అంటే, అప్పుడు మాత్రమె  సర్వే సబ్ డివిజన్ వర్కు పూర్తీ చేసి పట్టా ఇస్తారాని అర్ధం. రెవిన్యూ వ్యవహారాలతో పరిచయం లేనివారికి ఈ తిరకాసులు ఒకపట్టాన అర్ధం కావు. అసలు లబ్దిదారు 15 ఏళ్లలలో ఈ నగదు ఎందుకు చెల్లించాలని పెట్టారో తెలీదు. కోనేరు రంగారావు భూకమిటి తన సిఫార్సులలో ( నెంబర్ : 4.3) ఈ నగదు చెల్లింపు రద్దు చేయాలని చెప్పింది. ఈ నివేదిక 2006లో వచ్చింది. కాని భూసంస్కరణల చట్టం వచ్చింది 1975లో. 30 ఏళ్ల తరువాత ప్రభుత్వం వేసిన కమిటి ఈ మాట చెపుతున్నది. కాని భూపంపిణి, భూసంస్కరణలు, వ్యసాయక  విప్లం గూర్చి నిత్యం మాట్లాడేవారు ఎన్నడైనా అడిగినారా? ప్రొసీడింగ్ మంజురు పొందిన వారిని కూడగట్టినారా? ప్రొసీడింగ్ ఆర్డర్స్ పొంది అవి పూర్తీస్థాయి D-పట్టాలు పొందని వారికీ చాలా అన్యాయం జరిగింది. ఆదివాసీలు  నా ముందు పెట్టిన పత్రాలను చూస్తున్నప్పుడు నాకు మరింతగా ఈ విషయం  స్పస్టమయ్యింది.

ప్రొసీడింగ్ ఆర్డర్ కూ, D-పట్టాకూ తేడా ఏమిటి?

లబ్దిదారు లేదా ప్రొసీడింగ్ ఆర్డర్ వున్న ఆసామి 15 ఏళ్లలో తాను కట్టవలసిన నగదు చెల్లించకపొతే,  అసలు ఆయన / ఆమె నుండి అధికారులు వసూలు చేయకపోతే, లేదా ఇద్దరూ ఆ విషయం (15 ఏళ్ల కాలంలో ఎవరికీ గుర్తు వుంటుంది) మర్చిపోతే నష్టo ఎవరికి?

ఒక ప్రొసీడింగ్ ఇచ్చి అది D-పట్టాగా మారలేదంటే ఏమి జరుగుతుంది? ఆ ‘మంజూరు’ పూర్తీస్తాయిలో రెవిన్యూ రికార్డులకు ఎక్కదు. D-పట్టాగా మారాలంటే అది సర్వే సబ్ డివిజన్ జరిగి, ఆ సర్వే నెంబర్ పటం (field measurement book – FMB) లో గుర్తించబడాలి. తద్వారా పట్టాదారుల చిట్టా (రిజిస్టర్)లోకి ఆ వివరాలు వస్తాయి. అప్పుడు, ఆ D-పట్టాదారు ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చే సహాయాలను, బ్యాంకు రుణాలు పొందగలడు. ముఖ్యంగా రికార్డులోకి చేరింది గనుక ఒక భద్రత వుంటుంది.

రాయిపేట పెద్దలు దాచి ఉంచిన భూమి రికార్డు

రాజంపేట నూకదొర పెద్దలు చురుకైన వారిలాగే వున్నారు. రికార్డు ఉంచారు. అవి ప్రొసీడింగ్ ఆర్డర్స్. తదుపరి వారు విషయాలు తెలుసుకొని రెవిన్యూ అధికారుల వెనకపడి ప్రభుత్వానికి కట్టవలసిన నగదు కూడా కట్టేసారు. ఇక అప్పటి నుండి “తాము నగదు కట్టేశాం గనుక తమకు పూర్తీ పట్టాలు ఇవ్వాలని” కోరుతూ రెవిన్యూ అధికారులకు కాగితాలు పెడుతున్నారు. వారి వద్ద అవి కూడా వున్నాయి.

ఇది ఇలా సాగుతుండగా విశాఖపట్టణంకు చెందిన ఒక శీఘ్ర  సంపన్న కుటుంబం అనే అనకొండ  అక్కడికి చేరింది. రాజంపేట – రాయిపాలం మధ్య సుమారుగా 100 నుండి 150 ఏకరాల మధ్య భూమిలో తిష్ట వేసింది. దాని దాహం తీరలేదు. రాజంపెట గ్రామంలో కొంతభాగంతో కలుపుకొని 16 ఎకరాలు భూమి తమదేననీ,  కనుక ఖాళి చేయాలనీ బెదిరించడం మొదలు పెట్టింది.

Also read: నాలుగు క్వార్టర్స్ బ్రాంది  బాటిల్స్ – (మైనస్)  ‘అత్యాచారం’ కేసులు = ??!!

ఆ రాత్రి రాయిపాలం గ్రామంలో గ్రామ సభ. రాయిపాలెం గ్రామంలో వున్నది కొండదొర ఆదివాసీలని చెప్పాను. గ్రామాన్ని ఆనుకొని మొత్తం 30 నుండి 40 ఎకరాలు భూమి తమదేనని  బెదిరిస్తున్నది అనకొండ. ఉదయం ఆరు గంటలకు  భూములను పరిశీలిసన చేశాము. అవి  ఆదివాసీల సాగులో వున్నాయి. వారు పెంచిన జీడి మామిడి తోటలు వున్నాయి. చెట్ల మొదళ్ళను బట్టి రైతు సాగును మనం చెప్పవచ్చు. వాటి వయస్సు 20 ఏళ్లకు పైగా వున్నది.

అల్లూరిఎదురయ్యాడు

ముందు రోజు రాజంపేట నూకదొర సుకూరు గడ్డిదొర చెప్పిన అల్లూరి సీతారామరాజు నాకు రాయిపాలెంలో ఎదురైనాడు. రాయిపాలెం కొండదొరలు ఒక కాగితం నా చేతిలో పెట్టారు. 2004వ సంవత్సరంలో అప్పటి V.మాడుగుల తాశీల్దార్ 24 మంది ఆదివాసీలకు ఇచ్చిన నోటీసు అది. తాము (అంటే ప్రభుత్వం) అల్లూరి సీతారామరాజు అనే భూస్వామి  నుండి, అతని కేసు నెంబర్ LCC No: 1174/1975, సీలింగు మిగులు భూమి స్వాదినం చేసుకొని మీకు పంపిణి చేశామని, కాని  మీరు సాగు చేయటం లేదు గనుకు ఎందుకు వారికి ఇచ్చిన ప్రొసీడింగ్స్ రద్దు చేయకూడదో చెప్పాలని, అది కూడా వారం (7) రోజులలో చెప్పాలని ఆ నోటీసు సారాంశం. ఈ నోటీసు ఇచ్చి 19 ఏళ్ళు గడిచిపోయింది. ఆదివాసీలు తమకు వచ్చిన నోటిసు పక్కన పడేసి తమ వ్యవసాయం ఎదో తాము చేసుకుంటున్నారు. 

సుకూరు గడ్డిదొర చెప్పంది నిజం. అయితే మన్య వీరుడు అల్లూరి,  ఈ భూస్వామి ఈ అల్లూరి వేరువేరు.

డేవిడ్ (David)  – గోలియత్ (Goliath)

2004 ఆదివాసీలకు ఇచ్చిన ప్రొసీడింగ్స్ రద్దు చేస్తామని తాశీల్దార్ నోటీసు రావడం, తురువాత విశాఖపట్టణంకు చెందిన గిరిజనేతర అనకొండ నుండి హెచ్చరికలు రావడం వెనుక ‘లింక్’ ఏమైనా వుందా? మరికొంత పరిశీలన తరువాత గాని పూర్తీ చిత్రం రాదు.

Also read: ఆదిమ తెగల ఆదివాసీల జీడి తోటలను నరికివేసే ప్రయత్నం:అడ్డుకున్న గిరిజన మహిళలు

రాజంపేట – రాయిపాలెం గ్రామాల మధ్య చొరబడిన ‘అనకొండ’ మన రాష్ట్రంలోనే అత్యంత సంపన్నమైన రాజకీయ, ఆర్దిక కుటుంబం. వారు ప్రజా ప్రతినిధిగా పార్లమెంట్ కు వెళ్లి ‘దేశసేవ జేసీసినారు’. రాజంపేట, రాయిపాలెం ఆదివాసీలకు – ఈ అనకొండకి మధ్య భూమి పోరాటం అంటే  అది డేవిడ్ (David), గోలియత్ (Goliath) మధ్య యుద్ధంలాంటిది.

రాజంపేట నూకదొరలూ,  రాయిపాలెం కొండదొరలూ తమ సాగు భూమిని నిలబెట్టుకోగలరా?!

Also read: ఇచ్చిన మాటకు కట్టుబడండి, బాధితుల డిమాండ్

PS అజయ్ కుమార్  

అజయ్ కుమార్ పీ ఎస్
అజయ్ కుమార్ పీ ఎస్
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles