రామాయణమ్ – 77
పాపమా పిచ్చితల్లి ఒంటరిగా భర్తను గురించిన తలపులతో ఆయనకు ఏ ఆపద వాటిల్లినదో అనే భీతితో తల్లడిల్లిపోతూ దిగులుగా కూర్చొని ఉన్నది
ఇంతలో ఆ పర్ణశాల ముందు వేదఘోష చేసుకుంటూ, అత్యంత మృదువైన కాషాయ వస్త్రము ధరించి, శిఖను, ఛత్రమును, పాదుకలను ధరించి, మంగళకరమైన దండ కమండలములను ఎడమ భుజానికి తగిలించుకొని ఒక సన్యాసి వస్తున్నాడు.
అతడు మారు వేషములో వచ్చిన సర్వలోక భయంకరుడైన రావణుడు.
Also read: ఈటెల వంటి మాటలతో లక్ష్మణుడిని బాధించిన సీత
చంద్ర సూర్యులు లేని సంధ్యను అంధకారము ఆవరించినట్లు ఆమె సమీపములోకి వచ్చాడు రావణుడు.
ఆతని చూడగానే జనస్థానము లోని పశుపక్ష్యాదులన్నీ కూడా గజగజవణికి పోయినాయి. గాలి కూడా భయముతో మెల్లగా వీచసాగింది. అప్పటివరకు గలగలా ప్రవహించే గోదావరీ నది తన వేగాన్నీ ఉధృతిని తగ్గించుకొని చాలా నెమ్మదిగా ప్రవహించసాగింది.
రామ లక్ష్మణులిరువురూ లేని సమయాన్ని చూసుకొని ఇదే అదనుగా భావించి లోకకంటకుడైన రావణుడు సీతా దేవిని సమీపించి నిలిచాడు.
ఈ లోకములో లేదు సీతమ్మ. మనసంతా మగని గూర్చిన ఆలోచనలే.
Also read: మారీచుడిని మట్టుపెట్టిన రాముడు
పరిపరి విధాలుగా పోతున్న మనస్సును అదుపు చేసుకోలేక భర్తకు ఆపద వాటిల్లినదేమో అని చింతిస్తూ ఉన్న ఆవిడ తనకు వాటిల్లబోయే విపత్తును లేశమాత్రము కూడా గ్రహించలేని స్థితిలో దైన్యముతో అలాగే కూర్చుని ఉన్నది.
రావణుడు సీతాదేవిని చూశాడు. వాడి మీద మన్మధుడు తన పని చేసుకు పోతున్నాడు. వాడిలో వికారము మొదలయ్యింది. పద్మములో కూర్చున్న లక్ష్మీదేవిలాగా ప్రకాశించే సీతమ్మను కామాతురుడై నిర్లజ్జగా, నిర్భయముగా చూస్తూ ఆవిడ సౌందర్యాన్ని చూపులతో గ్రోలుతూ ఇలా పలికాడు.
‘‘ఓ దేవి! నీ శరీరము అంతా పద్మముల వరుస లాగా ఉన్నది. పద్మలత లాగా ఉన్నది నీ తనువు( అనగా ముఖము పద్మము, హస్తములు పద్మములు, పాదములు పద్మములు, నేత్రములు పద్మములు ..) ఇన్ని పద్మములు ధరించిన నీవు ఎవ్వరవు? శుభకరమైన ముఖము కలదానా, నీవు పార్వతివా? నీవు కీర్తికి అధిష్ఠాన దేవతవా? కాంతికి అధిష్ఠాన దేవతవా? ఐశ్వర్యానికి అధిష్ఠాన దేవతవా? మంగళ ప్రదురాలైన శ్రీ లక్ష్మివా? అప్సరసవా? స్వేచ్ఛాసంచారిణి అయిన రతీ దేవివా? ఎవరవు? నీవెవరవు ? అందమైన చిరునవ్వు, ముత్యములవంటి పలువరుస, చక్కని నేత్రములు గల ఓ విలాసవతీ! నీవు నా హృదయాన్నిమనస్సును వరద ఉధృతితో ఉన్న నది ఒడ్డులను ఎలా కోసివేస్తుందో అలా కోసివేశావు. జగదేకమోహినివై భాసిల్లుతున్న నీవు ఎవరు? గంధర్వ కాంతవా? అప్సరసవా? కింనర స్త్రీవా ? లేక యక్షజాతికి చెందిన దానివా? అయినా నేను ఇంతకుమునుపు నీ వంటి స్త్రీని ఏ జాతిలోనూ చూసి ఉండలేదు.
Also read: సీతమ్మ కంటబడిన మాయలేడి
‘‘క్రూరమృగాలకు ఆలవాలమై, భయంకరమైన రాక్షసులు స్వేచ్చగా సంచరించే ఈ ఘోరాటవిలో నీ వెందుకు ఒంటరిగా నివసిస్తున్నావు? నిన్ను చూసి నా మనసు తల్లడిల్లుతున్నది. నీ వంటి అపురూప సౌందర్యరాశి ఉండదగ్గ ప్రదేశము కాదిది! రమణీయ ప్రాసాదోపరిభాగాలు,
సుందర ఉద్యానవనాలు ఉన్న నగర ప్రాంతములు నీవు సంచరించుటకు అనుకూలమైనవి!
‘‘నల్లని కన్నులు కల ఓ కోమలాంగీ నీవు శ్రేష్ఠమైన పూలమాలలు ధరించి, శ్రేష్ఠమైన ఆహారము, శ్రేష్ఠమైన వస్త్రములు, శ్రేష్టుడైన భర్తతో సుఖించటము యుక్తము అని నా అభిప్రాయము’’
అని పలుకుతున్న బ్రాహ్మణ రూపములోనున్న రావణుని చూసి సీతమ్మ సమస్త అతిధి ఉపచారములతో సేవించింది. అర్ఘ్య పాద్యాదులిచ్చి భోజనము సిద్దముగా నున్నది అని కూడా పలికింది.
కాషాయ వస్త్రము ధరించి బ్రాహ్మణ వేషముతో ఉన్న రావణుడు ఏ మాత్రము ద్వేషింపరాని ప్రశాంత చిత్తుడి లాగా కనపడుతున్నాడు సీతమ్మకు.
Also read: మారీచుని చంపుతానని బెదిరించిన రావణుడు
అలాంటి రావణునికి ఇంటికి వచ్చిన అతిధికి ఏ ఏ మర్యాదలు చేయాలో ఆయా మర్యాదలన్నీ చేసి నిండుగా మాటలాడుతున్నది సీతా మహాసాధ్వి.
కానీ రూపుదిద్దుకున్న దురాలోచనతో ఉన్న రావణుడు తన చావును ఆహ్వానిస్తూ సీతాదేవిని బలాత్కారముగా అపహరించాలని మనస్సులో నిశ్చయించుకున్నాడు.
Also read: రావణుడికి మారీచుడి హితబోధ
వూటుకూరు జానకిరామారావు