* ఆఖరి రెండు వన్డేలకు ఇంగ్లండ్ కెప్టెన్ దూరం
* భుజం గాయంతో శ్రేయస్ అయ్యర్ అవుట్
భారత్- ఇంగ్లండ్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ తొలిమ్యాచ్ రెండుజట్లకూ చేదుఅనుభవాన్ని మిగిల్చింది. పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ముగిసిన తొలివన్డే మ్యాచ్ ఆడుతూ భారత మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్, ఇంగ్లండ్ కెప్టెన్ వోయిన్ మోర్గాన్ తీవ్రంగా గాయపడ్డారు.
ఇంగ్లండ్ కీలకఆటగాడు,కెప్టెన్ మోర్గాన్ చేతివేళ్లు చిట్లడంతో సిరీస్ లోని ఆఖరి రెండువన్డేలలో పాల్గొనే అవకాశంలేదని టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది. సూపర్ హిట్టర్ శామ్ బిల్లింగ్ సైతం మెడనరం గాయంతో జట్టుకు అందుబాటులో లేకుండాపోయాడు.
Also Read : భారత క్రికెటర్లకు సరికొత్త ముప్పు
కెప్టెన్ మోర్గాన్ ఆఖరి రెండువన్డేలకూ దూరం కావడంతో…వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జోస్ బట్లర్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు.
శ్రేయస్ అయ్యర్ కు డబుల్ షాక్
సూపర్ ఫామ్ లో ఉన్న భారత మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తొలివన్డే ఆడుతూ తీవ్రమైన భుజం గాయానికి గురయ్యాడు. ప్రస్తుత సిరీస్ లోని ఆఖరి రెండు వన్డేలలో అయ్యర్ పాల్గొనే అవకాశమే లేదని, బయోబబుల్ వాతావరణం నుంచి అయ్యర్ ను తప్పించినట్లు బీసీసీఐ ప్రకటించింది.
అంతేకాదు…వచ్చే నెలలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహించాల్సిన శ్రేయస్ అయ్యర్ గాయంతో పూర్తిగా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అయ్యర్ భుజం తొలిగిపోయిందని, కోలుకోడానికి చాలా సమయమే పట్టవచ్చునని టీమ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే…అయ్యర్ మాత్రం…తాను సకాలంలో కోలుకొని పూర్తి ఫిట్ నెస్ తో ఐపీఎల్ లో పాల్గొనగలనన్న ధీమాను ట్విట్టర్ ద్వారా అయ్యర్ వ్యక్తం చేశాడు.
Also Read : కొహ్లీకి ఇంకా కాని శతకోదయం
ఇంగ్లండ్ తో ముగిసిన పాంచా పాటాకా టీ-20 సిరీస్ లో పలు కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్..వన్డే సిరీస్ లోని తొలివన్డే తర్వాత గాయంపాలు కావడం టీమ్ మేనేజ్ మెంట్ ను ఆందోళనకు గురి చేసింది. అయితే…సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లాంటి పలువురు ప్రతిభావంతులైన యువఆటగాళ్లు అందుబాటులో ఉండటం కాస్త ఊరటనివ్వనుంది.