- రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలకు గాయాలు
సిడ్నీటెస్టు మొదటి రెండురోజుల ఆటను సంతృప్తికరంగా ముగించిన భారత్ మూడోరోజు ఆటను మాత్రం తీవ్రఅసంతృప్తి నడుమ ముగించింది. తొలిఇన్నింగ్స్ లో 244 పరుగులకే కుప్పకూలడంతో పాటు ఇద్దరు కీలక ఆటగాళ్ల గాయాలతో అయోమయంలో చిక్కుకొంది.
ఇదీ చదవండి: నవదీప్ సైనీకి టెస్ట్ క్యాప్
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ మూడో రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఎడమ మోచేతికి గాయం కావడంతో స్కానింగ్ కోసం టీమ్ మేనేజ్ మెంట్ అస్పత్రికి తరలించింది. అంతేకాదు. ఆస్ట్ర్రేలియా రెండోఇన్నింగ్స్ లో కీపింగ్ కు పంత్ అదుబాటులో లేకపోడంతో వృద్ధిమాన్ సాహాను సబ్ స్టిట్యూట్ కీపర్ గా బరిలోకి దించాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: సిడ్నీ టెస్టులో శుభ్ మన్ గిల్ అరుదైన రికార్డు
రిషభ్ పంత్ మాత్రమే కాదు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం గాయపడ్డాడు. ఆట 99వ ఓవర్ లో ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ బౌలింగ్ కు దిగిన సమయంలో జడేజా ఎడమచేయి బొటనవేలికి గాయమయ్యింది. జడేజా చేతివేలిని బంతి బలంగా తాకడంతో ఫీల్డింగ్ కు సైతం దూరంగా ఉండాల్సి వచ్చింది. చేతివేలి గాయంతోనే బ్యాటింగ్ ను కొనసాగించిన జడేజా 28 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.
గాయాలపాలైన రిషభ్ పంత్, జడేజాలకు స్కానింగ్ నిర్వహించాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. ఆ తర్వాతే వారి పరిస్థితిని అధికారికంగా ప్రకటించనుంది. ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్లు స్టార్క్, కమిన్స్, హేజిల్ వుడ్ ముప్పేటదాడితో భారత బ్యాట్స్ మన్ ను ఆత్మరక్షణలోకి నెట్టారు. షార్ట్ పిచ్ బౌలింగ్ తో తీవ్రఒత్తిడికి గురిచేశారు. పటిష్టమైన డిఫెన్స్ కు మరోపేరైన చతేశ్వర్ పూజారా సైతం షార్ట్ పిచ్ బంతుల దెబ్బలను కాచుకోక తప్పలేదు.
భారత్ ను 244 పరుగులకే ఆలౌట్ చేయడం ద్వారా కీలక తొలిఇన్నింగ్స్ ఆధిక్యత సాధించిన ఆస్ట్ర్రేలియా 197 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో మూడోరోజుఆటను ముగించింది. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు వార్నర్, పుకోవిస్కీల వికెట్ల నష్టానికి 103 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది.
ఇదీ చదవండి: సిడ్నీలో భారత్-కంగారూ టగ్ -ఆఫ్- వార్