- కేఎల్ రాహుల్ కు మణికట్టు గాయం
- టెస్ట్ సిరీస్ కు దూరం
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారతజట్టును గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. సిడ్నీ టెస్ట్ ప్రారంభానికి కొద్దిగంటల ముందే భారత మరో కీలక ఆటగాడు కెఎల్ రాహుల్…మణికట్టుగాయంతో గాయాలబారిన పడిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ లో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాహుల్ ఎడమచేతి మణికట్టుకు గాయమయ్యిందని, మణికట్టు చిట్లడంతో సిరీస్ లోని ఆఖరి రెండు టెస్టులకూ దూరం కాక తప్పదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
ఇదీ చదవండి: సచిన్ వారసుడు వచ్చేశాడు
ఇప్పటికే సీనియర్ ఫాస్ట్ బౌలర్లు ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయాలతో జట్టుకు దూరం కాగా…కెప్టెన్ విరాట్ కొహ్లీ …వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. దీంతో వైస్ కెప్టెన్ అజింక్యా రహానే స్టాండిన్ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టి…మెల్బోర్న్ లో ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ కు 8 వికెట్ల అద్భుత విజయాన్ని అందించడంతో పాటు ఆతిథ్య ఆస్ట్రేలియాతో 1-1తో సమఉజ్జీగా నిలిపాడు.
సిరీస్ కే కీలకంగా మారిన సిడ్నీ టెస్టు ప్రారంభానికి కొద్దిగంటల ముందే రాహుల్ కు గాయం కావడం టీమ్ మేనేజ్ మెంట్ ను ఆందోళనలో పడవేసింది. రాహుల్ గాయం నుంచి కోలుకోడానికి మూడువారాల సమయం పడుతుందని, స్వదేశానికి తిరిగి వచ్చి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రీహాబిలేషన్ శిబిరంలో పాల్గొంటాడని బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుటెస్టులు ముగిసే నాటికి రెండుజట్లూ 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో సిరీస్ లోని మూడోటెస్టు రెండుజట్లకూ డూ ఆర్ డై గా మారింది. ఆస్ట్ర్రేలియాతో ముగిసిన తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గొని నిలకడగా రాణించిన రాహుల్…టెస్ట్ సిరీస్ లో కనీసం ఒక్క మ్యాచ్ ఆడకుండానే స్వదేశానికి తిరిగిరావడం ఆశ్చర్యకరమే మరి.
ఇదీ చదవండి:కీర్తి శిఖరంపై క్రికెట్ వీరుడు సచిన్