- ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- తికాయిత్ కు రైతుల మద్దతు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలకు పైగా రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతోంది. ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతుండటంతో ఎపుడు ఏం జరుగుందోనని అధికారులు, పోలీసులు ఆందోళన చెందుతున్నారు. మహాత్మాగాంధీ వర్థంతిని పురస్కరించుకుని ఆందోళన చేస్తున్న రైతులు సద్భావనా దినం పాటిస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఉపవాస దీక్షలో కూర్చున్న రైతులు సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నారు. రైతుల ఆందోళనలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో విషపూరిత ప్రచారాన్ని అడ్డుకునేందుకు సింఘు, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో రేపు అర్థరాత్రి వరకు ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేశారు.
రైతుల ఆందోళనల నేపథ్యంలో సింఘు సరిహద్దులో భారీగా పోలీసులను మోహరించారు. టిక్రీ సరిహద్దులో 66వరోజు సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నిరసనలు జరుగుతున్న చోట అధికారులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. వందలాది మంది పోలీసులను మోహరించారు. రైతుల ఆందోళనపై ప్రభుత్వ తీరును తప్పుబడుతూ రాకేశ్ తికాయి కన్నీరు పెట్టుకోవడం, ఆత్మహత్య అయినా చేసుకుంటాగాని ఉద్యమం నుంచి వెనక్కి వెళ్లేది లేదని ప్రకటించడం రైతుల్ని తీవ్రంగా కలచివేసింది.
ఇది చదవండి: రైతుల అభివృద్ధి కోసమే సాగు చట్టాలు
తికాయిత్ కు సంఘీభావం తెలిపిన బీకేయు:
సాగు చట్టాలకు వ్యతిరేకంగా తమ ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ లోక్ శక్తి ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాలలో హింస చెలరేగడంతో ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం బీకేయు ప్రకటించింది. రాకేశ్ తికాయిత్ కు మద్దతుగా ఘాజీపూర్ సరిహద్దుకు వందలాది మంది రైతులు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఘాజీపూర్ కు వెళ్లే ఎన్ హెచ్-24 జాతీయ రహదారిని మూసివేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
వ్యవసాయ చట్టాల వాయిదాకు సిద్ధం-మోదీ:
రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంటులో రైతుసమస్యలపై చర్చించేందుకు సిద్దమని తెలిపారు. ఏడాదిన్నరపాటు కొత్త వ్యవసాయ చట్టాలను వాయిదా వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బడ్జెట్ లో రైతులకు మరిన్ని వరాలు ప్రకటిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
ఇది చదవండి: నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ సరిహద్దులు