రామాయణమ్ – 186
సూర్యుడు అస్తమించాడు, మెల్లగా చీకట్లు పుడమిని ఆక్రమించినాయి. కన్ను పొడుచుకొన్నా కానరాని చీకటి. అసురులు విజృంభించి యుద్ధము చేయుచున్నారు. దొరికిన వానరుడిని దొరికినట్లు నోట్లోవేసుకొని నమిలేస్తుంటే, అటువైపునుండి గోలాంగూల వానరులు రాక్షసులను గట్టిగా అదిమి పట్టి కౌగలించుకొని నలిపి నలిపి ముద్దలు చేసి నోట్లోవేసుకుంటున్నారు.
Also read: ఇరు పక్షాల మధ్య భీకర సమరం
ఇంకొకవైపు అంగదుడి దెబ్బలకు తాళలేక ఇంద్రజిత్తు అంతర్ధానమై పోయి మాయా యుద్ధము చేయసాగినాడు.
ఆ రాత్రి రామునికి ఎదురువచ్చిన రక్కసులందరికీ ఆతిథ్యరూపములో మృత్యుదేవతా గాఢాలింగనసౌఖ్యము లభించినది.
అంగదుని చేతిలో ఓడిపోయిన ఇంద్రజిత్తు రాముని చేతులలో రాక్షసులు చనిపోవుట గమనించి తీవ్రక్రోధముతో కనబడకుండా దాగి బాణరూపములో ఉన్న సర్పములను విడచి రామలక్ష్మణులను బంధించి అంతటితో ఆగకుండా నాగాస్త్ర ప్రయోగము చేయసాగెను.
Also read: అంగద రాయబారము
ఆ బాణములు అన్నదమ్ములిరువురినీ తీవ్రముగా బాధించి మూర్ఛలోనికి నెట్టివేసినవి.
ఇంద్రజిత్తు జాడ తెలిసికొనవలెనని అంగదునితో సహా కొందరు వానరులు ఆకాశములోనికి ఎగిరి వెతుకసాగిరి. వారి ప్రయత్నములన్ని నిష్ప్రయోజనములై పోయినవి.
మూర్ఛిల్లిన రామలక్ష్మణులు మరణించినారనుకొని ఆ వార్త ఉత్సాహముగా తండ్రికి ఎరిగించుటకొరకై లంకలోనికి వెళ్ళినాడు ఇంద్రజిత్తు.
‘‘మహారాజా, రాముడు మరణించినాడు. లక్ష్మణుడు మరణించినాడు. నీ కుమారుని శౌర్యప్రతాపములముందు వారే పాటి?’’
Also read: లంకను చుట్టుముట్టిన రామసైన్యం
‘‘ఆహా ఎంత శుభవార్త తెచ్చినావురా కొడకా! ఈ వార్త ఆ మూర్ఖురాలికి తక్షణమే ఎరిగించండి. పుష్పకము సిద్ధము చేసి అందులో తీసుకు వెళ్ళి ఆ జానకికి చూపండి. ఇప్పటిదాకా తాను ఎవరు అసహాయ శూరుడని విర్రవీగిందో అతని గతి ఏమయినదో చూపండి. జగదేక వీరుడట! అసహాయ శూరుడట! నేడేమైనది? ఊరుకాని ఊరులో దేశముకాని దేశములో నికృష్టపు చావు చచ్చినారు’’ అన్నాడు రావణుడు.
రావణుడి ఆజ్ఞానుసారము రాక్షస స్త్రీలు సీతమ్మకీ వార్త ఎరిగించి పుష్పకములో రణరంగమునకు తీసుకు వెళ్ళినారు.
అచట సీతాదేవి భూమాత ఒడిలో హాయిగా శయనించినట్లు నేలపై పడి యున్న రామలక్ష్మణులను చూసి హతాశురాలై తన ప్రక్కనే ఉన్న త్రిజటతో ‘‘చూసితివా త్రిజటా, నా వివాహ సమయములో ముత్తయిదువుల దీవెనలు ఏమయినవి? వేదపండితుల ఆశీర్వచనములు ఏ గాలి కి కొట్టుకుపోయినవి? జ్యోతిషపండితులు నాకు నా భర్తతో కలసి పట్టాభిషిక్తురాలనయ్యే యోగమున్నదని చెప్పినారు. వారి లెక్కలు నేడిలా ఏల తప్పినవి? సాముద్రికులు నా శరీర లక్షణములు చూసి నేను ఎప్పటికీ సౌభాగ్యవతినే అని తెలిపినారు. వారి వాక్కులు ఏ ఏటి వాలులో కొట్టుకుపోయినవి’’ అనుచూ కంటికిమంటికి ఏకధారగా విలపించగా, త్రిజట ఆమెని ఊరడించి…
Also read: రావణుడితో సుగ్రీవుడి మల్లయుద్ధం
‘‘తల్లీ రామలక్ష్మణులను పడగొట్టగల వీరుడు ముల్లోకములలో లేడని నీకు తెలియదా! అమ్మా, వారి శరీరమును ఒక్కసారి పరికించి చూసినచో నీకు అవగతమయ్యెడిది! వారిది కేవలము మూర్ఛ మాత్రమే తల్లీ! నీ కష్టములు ఈడేరు సమయము ఆసన్నమయ్యినదమ్మా. వారు తిరిగి చైతన్యవంతులగుటకు ఎంతో సమయము పట్టదమ్మా! త్వరలో నీవు శుభవార్త వింటావు’’ అనుచూ త్రిజట సీతమ్మను ఓదార్చి ధైర్యము చెప్పినది.
Also read: రావణుడి యుద్ధసన్నాహాలు, రాముడి రణవ్యూహం
వూటుకూరు జానకిరామారావు