3. గోదా వివాహ స్వప్నం
ఇన్దిరన్ ఉళ్లిట్ట దేవర్ కుళామ్ ఎల్లామ్
వన్ద్ ఇరున్దు ఎన్నై మగట్పేశి మన్దిరిత్తు
మన్దిరక్కోడి యుడుత్తి, మణమాలై
ఆన్దరి శూట్టక్కణా క్కణ్ణేన్ తోళీ నాన్
ప్రతిపదార్థం
ఇందిరన్ = ఇంద్రుడు, ఉళ్లిట్ట = అతనితోకూడి, దేవర్ = ఇతర అనేక దేవతలు, కుళామ్ = ఆ బృందం లేదా కులానికి చెందిన, ఎల్లామ్ = బంధుమిత్రులతో సహా అందరూ, వన్ద్ ఇరున్దు= వచ్చి యున్నారు, ఎన్నై = నేను కూడా, మగళ్ పేశి = పెళ్లి పిల్లగా మాట్లాడి, మన్దిరిట్టు = వియ్యంకులు పెద్దలు నిశ్చయించి, అన్దరి = ఆరోజు దేవకీ తనయుడిని యశోద ఒడిలో ఉంచి, అక్కడి నుంచి వసుదేవుడుదెచ్చిన అమ్మాయి కంసును చెరసాలలో ఆరోజు ఆకాశంలో అదృశ్యమైపోయిందే అనే సంఘటనను అన్దరి అన్నమాట గుర్తు చేస్తున్నది అంటే ఆమె ఆ దుర్గాభవాని లేదా యోగమాయ, ఆమే తన ఆడబడచు ఎందుకంటే ఆమె నారాయణుడి చెల్లెలుకదా, క్కోడియుడుత్తి = ఆ ఆడపడచు, దుర్గాదేవి వచ్చి నాకు పెళ్లి చీర కట్టించింది, మణ మాలై = వరమాలలు, శూట్ట = నాచేత ధరింపచేసింది అని కలగన్నానే చెలీ.
Also read: పెళ్లిపందిరికి వరరంగడు చేరినాడు
తెలుగు కవిత
అమరనాథుడితోడ దేవతలెల్లరేతెంచి, ఈ కన్య ఆ
కమలనయనునికిన్ తగిన వధువని నిశ్చయించి,
ఆమాధవుసోదరి దుర్గ కల్యాణ వస్త్రధారణజేయించి
సుమాలెన్నొనా సిగన్ దురిమినట్లు నే కలగంటినే చెలీ
వివరణ
గోదాదేవి రచించిన నాచ్చియార్ తిరుమొళి లోని 143 పాశురాలలో వారణమ్ ఆయిరం పది పాశురాలలో ఇది మూడవది. తనకు వచ్చిన సుందరశుభ స్వప్న విశేషాలను గోదాదేవి చెలికి వివరిస్తున్నారు. మొదటి పాశురంలో వరుడై నారాయణుడు వేయి ఏనుగుల మధ్యఊరేగుతూ వచ్చిన అద్భుత దృశ్యాన్ని వివరించారు. రెండో పాశురంలో వరుడు అందమైన పందిరిలో కూర్చుని వివాహ ముహూర్తాన్నినిశ్చియించే నిశ్చితార్థ వేడుకను నిర్వహించిన కల వివరించారు. మూడో పాశురంలో వివాహ వేడుకల్లో ఇంకో అడుగు ముందు పడింది. నారాయణుడిని ఉపేంద్రుడంటారు. అంటే ఇంద్రుడి తమ్ముడన్నమాట. తమ్ముడి పెళ్లి విషయాలు మాట్లాడడానికి అన్నగారైన ఇంద్రుడు సపరివారంగా శ్రీ విల్లిపుత్తూరుకు చేరుకున్నాడు. సంబంధుల మధ్య అంటే వియ్యంకుల మధ్య వివాహ ఏర్పాట్ల మాటలు నడిచాయి. వధువును అలంకరిస్తున్నారు. ఇంద్ర నారాయణుల సోదరి ధుర్గాదేవి అంటే గోదాదేవి ఆడపడుచు ముందే వచ్చారు. వధూనిశ్చయం జరిగిన తరువాత, వధువుచేత కల్యాణ వస్త్రాన్ని దుర్గాదేవి కట్టించారు. ఆ తరువాత ప్రత్యేకంగా రూపొందిన వరమాలలు తెచ్చి అందులో ఒక కల్యాణమాలను గోదా వధువుకు అలంకరింపజేశారని నేను కలగన్నానే చెలీ అని ఎంతో సంతోషంతో ఆమె తన ప్రియసఖికి వివరిస్తున్న పాశురం ఇది.
Also read: గోదాదేవి రచించిన వారణమాయిరమ్ – వేయేనుగుల కల