Sunday, December 22, 2024

ఇండో-పెసిఫిక్ పైనే అందరి దృష్టి

ప్రపంచంలోనే అతిపెద్దదైన పసిఫిక్ సముద్రంపై ఆధిపత్యానికి అగ్రరాజ్యాలన్నీ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. వాటిల్లో చైనా,అమెరికా, జపాన్ ముఖ్యమైనవి. అమెరికా-చైనా మధ్య సాగుతున్న పోరులో పసిఫిక్ సంబంధాలు కీలకమైనవి. సామ్రాజ్య కాంక్షతో రగిలిపోతున్న చైనా మిగిలిన దేశాలతో పాటు ఇండియాను ఇబ్బంది పెట్టడానికి శత విధాలా ప్రయత్నం చేస్తోంది. చైనా వైఖరి వల్ల విసిగిపోయిన దేశాలన్నీ క్రమంగా ఏకమవుతున్నాయి. భారత్ -చైనా సరిహద్దు వివాదం కొన్నాళ్ల నుంచి తీవ్రంగా సాగుతోంది.

చైనాకు చెక్ పెట్టేందుకు బైడెన్ వ్యూహం

అమెరికాలో జో బైడెన్ ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన  ప్రభుత్వం వీటిపై ప్రత్యేకమైన  దృష్టి పెట్టింది. చైనా వేసే ప్రతి అడుగునూ అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. చైనాకు చెక్ పెట్టడానికి సరికొత్త వ్యూహ రచనలు ఆరంభించింది. అందులో భాగంగా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉన్న తమ మిత్ర దేశాలతో కలిసి ముందుకు వెళ్ళడానికి పథక రచన చేస్తోంది. ఇండియా -చైనా మధ్య రగులుకున్న వివాదాలు చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కారం కావాలని కోరుకుంటోంది. ఈ అంశంలో తమ సంపూర్ణ సహకారం అందిస్తామని అమెరికా కొత్త ప్రభుత్వం మొట్టమొదటిసారిగా స్పందించింది. ఇది మంచి ప్రకటనే. పర్యవసానాలు తేలాల్సి వుంది.

ప్రపంచ దేశాల ఆసక్తి

డోనాల్డ్ ట్రంప్ పరిపాలనా కాలంలో చైనా -అమెరికా మధ్య బంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జో బైడెన్ చైనాతో ఎలా ప్రవర్తిస్తారు, ప్రస్తుతం ఉన్న మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకు సాగుతారు…అని ప్రపంచ దేశాలన్నీ చాలా ఆసక్తిగా చూస్తున్నాయి. బైడెన్ ప్రవృత్తి ట్రంప్ కు పూర్తి భిన్నం. గతంలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలోనూ బైడెన్ చైనాతో దూకుడుగా ప్రవర్తించలేదు. ఇప్పుడు అధ్యక్ష స్థానంలో వున్నారు. తమ దేశాన్ని అగ్రరాజ్యంగా నిలుపుకోవాల్సిన బాధ్యత ఆయనదే. తనదైన శైలిలో చైనాను ఎదుర్కుంటారని భావించాలి. బైడెన్ మొదటి నుంచీ భారత్ పై ప్రత్యేకమైన అభిమానంతో ఉన్నారు. ఇండో – పసిఫిక్ అంశంలోనూ ఆయన ఇండియాతోనే ఉంటారని చెప్పవచ్చు.

ఇది చదవండి: చైనాకు దీటుగా ఇండియా ఎదగాలి

అతిపెద్ద సముద్రం

పసిఫిక్ సముద్రం ప్రపంచంలోనే అతిపెద్దది. భూమిపై 32శాతం వ్యాపించి వుంది. ప్రపంచంలోని సముద్రాల వాటాలో దాదాపు సగం వంతు ఆధిపత్యం దీనిదే. ఆర్ధిక వనరులు అత్యధికంగా ఈ సముద్రంలో ఉన్నాయి. ఖనిజ సంపద, పెట్రోలియం, సహజవాయువుతో పాటు చేపల పరిశ్రమకు ఇది గొప్ప మూలాధారం. ముత్యాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. సహజంగా సముద్రాలను “రత్న గర్భ” అంటారు. అత్యంత విలువైన ఆర్ధిక వనరులు సముద్రంలో ఉంటాయి. రత్నాలు, వజ్రాలు వంటివి ఎన్నో సముద్రంలో నిక్షిప్తమై ఉంటాయి. సంపద, వాణిజ్యం,రవాణా, యుద్ధం మొదలైన విషయాలను దృష్టిలో పెట్టుకొని, సముద్రాలపై ఆధిపత్యం కోసం దేశాలన్నీ పోటీపడుతుంటాయి.

జపాన్ – చైనా వివాదం

ఇటు దేశీయంగానూ, అటు అంతర్జాతీయంగానూ సముద్రాల్లో వాటా అత్యంత కీలకం. సముద్రాలన్నింటిలో భౌగోళికంగా కూడా పసిఫిక్ సముద్రం అత్యంత కీలకం. ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుతమైన వాతావరణం లేదు. చైనా తన ఆధిపత్యాన్ని చాటుకోడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. పెద్ద ఎత్తున సైన్యాన్ని దింపింది. దక్షిణం వైపు జలలాన్నీ తమవే అంటోంది. ఈ సముద్రంపై సంపూర్ణమైన సార్వభౌమాధికారం తమకే ఉందని చైనా అభిప్రాయం. తూర్పు వైపు కూడా జపాన్ -చైనా మధ్య వివాదం నడుస్తోంది. వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రూనై, తైవాన్ దేశాలు చైనా వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇండో -పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుతమైన, ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచడానికి  భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నాలుగు చైనాను నిలువరించడానికి వ్యూహాత్మక భాగస్వాములుగా మారాయి. దీన్ని క్వాడ్రి లేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటారు.

ఇది చదవండి: భూటాన్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా

పొరుగుదేశాలను బెదిరించడమే చైనా విధానం

చైనా పొరుగుదేశాలన్నింటినీ బెదిరించడమే విధానంగా పెట్టుకుంది. దీని వల్ల ఇవన్నీ ఏకమవుతున్నాయి. ఈ దేశాల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంది. పసిఫిక్ అంటే ప్రశాంతమైన, అని అర్ధం. ప్రశాంతమైన ఈ సముద్రం చుట్టూ అశాంతి సృష్టించడానికి చైనా కంకణం కట్టుకుంది. సముద్రాలు సహజ వనరులు. వీటిపై ఏఏ దేశాల వాటా ఎంత, అనేది ఇంకా చర్చనీయాంశమే.ఇండో- పసిఫిక్ అంశం కొలిక్కిరావాల్సిన అవసరం ఉంది. దేశ భద్రతకు కూడా ఇది చాలా ముఖ్యం. మన ప్రభుత్వ విధానాలే ఫలితాలను ప్రభావితం చేస్తాయి. శాంతి స్థాపన జరిగేంత వరకూ విరామం ఎరుగక కృషి చేయాల్సిన బాధ్యత పాలకులదే. ఇటువంటి అత్యంత సున్నితమైన, కీలకమైన అంశాల్లో మన వ్యవహార శైలి మనల్ని రక్షిస్తుంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles