Tuesday, January 21, 2025

ఇందిరా గాంధీ, సరిలేరు నీకెవ్వరు!

సరిగ్గా 46 ఏళ్ల క్రితం,మార్చ్ 20, 1977 న జరిగిన

లోకసభ ఎన్నికలలో ఇందిరా గాంధీ పరాజయం నేపధ్యంలో

వనం జ్వాలా నరసింహారావు

సుమారు పదహారేళ్ల పాటు భారత ప్రధాన మంత్రిగా వున్న ఇందిరా గాంధీ, తనదంటూ ప్రత్యేకంగా సంతరించుకున్న దృఢమైన ఆత్మ స్థయిర్యం, నిరంకుశ ధోరణి, రాజీ పడని మనస్తత్వం కలబోసిన అరుదైన వ్యక్తిత్వంతో, అనునిత్యం సంక్లిష్టమైన పరిస్థితుల్లో వున్న దేశానికి, అత్యంత సమర్థవంతమైన పరిపాలనను అందించి చరిత్రలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు. సర్వేపల్లి రాధా కృష్ణన్, జకీర్ హుస్సేన్, వరాహగిరి వెంకట గిరి, ఫకృద్దీన్ అలీ అహమ్మద్, నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్ సింగ్ లు రాష్ట్రపతులుగా వున్నప్పుడు ఆమె ప్రధాన మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా లాంఛనంగా రాజకీయాల్లోకి ప్రవేశించి, నాలుగు పదుల వయస్సులో 1959లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికై, ప్రపంచ చరిత్రలోనే ప్రప్రధమంగా బాలట్ ద్వారా అధికారంలోకి వచ్చిన కేరళ కమ్యూనిస్టు  ప్రభుత్వాన్ని రద్దు చేయించడంలో కీలక పాత్ర పోషించారు ఇందిరా గాంధీ.

తండ్రి జవహర్ లాల్ నెహ్రూతో చిన్నారి ఇందిర

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, పార్టీలోని ‘సిండికేట్’ నాయకత్వాన్ని ధిక్కరించి, పార్టీని చీల్చి, భారత జాతీయ కాంగ్రెస్ అంటే తానే అన్న చందాన, మొత్తం పార్టీ యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎమర్జెన్సీ అనంతరం ఓడిన అప్పటి కాంగ్రెస్ పార్టీని, అచిర కాలంలోనే గద్దెనెక్కించడానికి, మరో మారు చీల్చి, ఇందిరా కాంగ్రెస్ గా నామకరణం చేసి, రెండేళ్లకే మళ్ళీ అధికారంలోకి వచ్చి, పాలనా పగ్గాలను, పార్టీ పగ్గాలను తన చేతుల్లో వుంచుకున్నారు. తనకు ఎదురు లేకుండా, ఎదిరించిన వారికి పుట్ట గతులు లేకుండా, ఏకచ్ఛత్రాధిపత్యంగా,మకుటంలేని మహారాణిగా దేశాన్ని ఏలారు. నియంతృత్వ ప్రజాస్వామ్యమంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది. అధికారంలో వున్నా- లేకపోయినా అత్యంత బలీయమైన శక్తిగా గుర్తింపు పొంది, వైరి వర్గాలను నామరూపాలు లేకుండా చేయగలిగే స్థాయి ఆమెది.

పార్టీ పరంగా నియంతృత్వ పోకడలున్న ఇందిరాగాంధీ, పాలనా పరంగా ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా మలిచే ప్రయత్నంలో అప్రయత్నంగానే నిరంకుశత్వం అలవరచుకున్నారనొచ్చేమో! ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బలమైన కేంద్రం దిశగా ఆమె విధానాలు రూపుదిద్దుకోసాగాయి. తన పార్టీకి చెందిన ముఖ్యమంత్రులను ఇష్టమొచ్చిన రీతిలో మార్చడం, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేయడం, అధికారాలను కేంద్రీకరించడం ఆనవాయితీగా మారిపోయింది. కమ్యూనిస్టు వ్యతిరేకతను వదిలి, సిండికేట్ పై విజయం సాధించడానికి వామ పక్షాలను కలుపుకున్నారు. ‘కమ్యూనిజం’ కంటే ‘కమ్యూనలిజం’ వల్లే ప్రమాదం అంటూ అలనాటి జనసంఘ్ లాంటి పార్టీలను ఎదగకుండా చేశారు.

పక్షపాతంగా వార్తలు ప్రసారం చేస్తున్నారనే ఆరోపణపైన బీబీసీ బ్యాన్ చేసినప్పటి ఇందిరాగాంధీ

ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళికైనా, గరీబీ హటావో పథకమైనా, బాంకుల జాతీయ కరణైనా, గ్రామీణ బాంకుల స్థాపనైనా, రాజ్యాంగ సవరణలైనా, సవరణలలో భాగంగా అవతారికలో ‘సామ్యవాదం, లౌకిక వాదం’అన్న పదాలను చేర్చడమైనా, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రాధమిక హక్కులకంటే ముఖ్యమైనవని చెప్పడమైనా, మరేదైనా, ఏమి చెప్పినా, చేసినా, ఇందిరా గాంధీ మనసులో మాట ఒకటే. భారత దేశానికి నాయకత్వం వహించగలిగేది తానే అని, తాను దానికోసమే జన్మించానని ఆమె నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆమె అనుకున్న కార్యం సాధించడానికి దేనికైనా వెనుకాడక పోయేవారు. ఆ నమ్మకమే ఆమె గెలుపుకు సోపానాలయ్యాయి, ఓటమికి కారణాలయ్యాయి. ఓడినా గెలిచి అధికారంలోకి రాగలిగిన ఏకైక వ్యక్తిగా, ప్రపంచ చరిత్రలోపేరు తెచ్చుకున్నారు.

అణుయుగంలో, అంతరిక్ష యుగంలో భారతదేశాన్ని అడుగు పెట్టించిన ఘనత, సోవియట్ వ్యోమ నౌకలో భారతీయులను పంపడానికి చొరవ తీసుకున్న ఘనత ఇందిరా గాంధీదే. భారత దేశం అంతర్జాతీయ రంగంలో ఎవరి పక్షం వహించదని, ఎలుగెత్తి చాటి చెపుతూ, అలీన విధానాన్ని పాటించే దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి తీసుకెళ్ళింది ఇందిరా గాంధీ. సోవియట్ యూనియన్ తో మైత్రి చేసినప్పటికీ, అమెరికా వ్యతిరేకిగా ముద్ర పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇందిరా గాంధీలో సహనం, అసహనం సమపాళ్లలో వుండేవని ఆమెను గురించిన కథనాల్లో పలువురు పేర్కొన్నారు. ఎప్పుడు దూకుడుగా వ్యవహరించేవారో ఎప్పుడు నిశ్శబ్దంగా పనులు చక్కబెట్టేవారో, ఎందుకు ఒంటరిగా వుండదలుచుకునేవారో, ఎప్పుడు-ఎందుకు ఏ పని చేసేవారో కనుక్కోవడం అంత తేలిక కాదని మీడియాలో కథనాలొచ్చేవి. ఒకరిని చేరదీయడంలోను, ఇంకొకరిని పక్కన పెట్టడంలోను, ఆమెకు ఆమే సాటి. రిచర్డ్ నిక్సన్ ప్రయివేట్ పౌరుడిగా ఆమెను కలవడానికి వచ్చినప్పుడు వెంట వచ్చిన ట్రాన్స్లేటర్ నుసంభాషణ ముగించమని హిందీలో అన్నారట.

రాజీవ్ గాంధీ, సానియా, సంజయ్, మేనక, రాహుల్, ప్రియాంకలతో ఇందిరాగాంధీ

బాల్యంలో జైలులో వున్న తండ్రి జవహర్లాల్ నెహ్రూ తనకు రాసిన ఉత్తరాలలో వర్తమాన ప్రపంచ చరిత్రతో పాటు ప్రాచీన, భవిష్యత్ దర్శనం కలిగే విధంగా ఎన్నో విషయాలను తెలుసుకోగలిగారు. నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధాని అయినప్పుడు, తండ్రి దగ్గరకు వచ్చే వారికి ఆతిథ్యం సమకూర్చే బాధ్యతలను, కర్తవ్య పరాయణతో నిర్వర్తించారు. జవహర్లాల్ ను కలవడానికొచ్చిన దేశ-విదేశీయ ప్రముఖులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, పాత్రికేయులు, విద్యావేత్తలు, సామాజిక శాస్త్రజ్ఞులు, ఆయన పక్షాన ఆతిథ్య బాధ్యతలు బిడియంగా చేపట్టిన ఇందిరను,  తండ్రి చాటు బిడ్డగా, నెహ్రూ కూతురుగానే చూసినప్పటికీ,ఆమె మాత్రం రాజకీయ పాత్ర పోషించకుండా వుండలేని పరిస్థితికి చేరుకున్నారు.

తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ మంత్రివర్గంలో సమాచార-ప్రసార శాఖను చేపట్టారు. శాస్త్రి హఠాన్మరణం దరిమిలా, కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం వున్నా లేకపోయినా, ఇందిరను ప్రధాన మంత్రిని చేశారు. ఇక అక్కడి నుంచి ఇందిర అధ్యాయం మొదలైంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించడంతో భవిష్యత్ పై దృష్టి సారించారు ఇందిరా గాంధీ. ప్రజలకు తాను మరింత చేరువ కావాలంటే, సామ్యవాద పంథాలో పయనించడం మినహా మార్గం లేదని విశ్వసించింది. తదనుగుణంగా ప్రభుత్వ పథకాల రూపకల్పనకు అంకురార్పణ చేయసాగారు.

లంబాడా మహిళలతో కదం కలిపి నృత్యం చేస్తున్న ఇందిరాగాంధీ

అకస్మాత్తుగా మరణించిన రాష్టపతి జకీర్ హుస్సేన్ స్థానంలో, ఇందిరా గాంధీని విమర్శించే నీలం సంజీవరెడ్డిని ఇందిర వ్యతిరేక కాంగ్రెస్ అధిష్టాన వర్గం అభ్యర్థిగా నిర్ణయించింది. నామినేషన్ పై ఆయననే ప్రతిపాదించిన ఇందిరా గాంధీ, ఓటింగులో, స్వతంత్ర అభ్యర్థి వీవీ గిరికి మద్దతును బహిరంగంగానే ప్రకటించి, తన వారందరినీ ఆయనకే ఓటెయ్యమని సూచించారు. ఆమే నెగ్గారు. నీలం ఓటమి పాలయ్యారు. మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలోంచి వెళ్లిపోయే పరిస్థితులు ఆమె కలిపించారు. కాంగ్రెస్ పార్టీని చీల్చింది. ఏడాది ముందే 1971 లో ఎన్నికలకు పోయి, అఖండ విజయం సాధించి పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించారు.

భారత-పాకిస్తాన్ యుద్ధంలో, ఇందిర నేతృత్వంలోని భారతదేశం అఖండ విజయం సాధించారు. బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఉపఖండంలో తిరుగులేని శక్తిగా భారత దేశానికి పేరు తెచ్చారు. ఇందిరా గాంధీని ద్వేషించే అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ తన సంపూర్ణ మద్దతును పాకిస్తాన్ కు ఇచ్చిన నేపధ్యంలో, యుద్ధానంతరం ఆయనకొక ఘాటైన ఉత్తరం రాశారామె. లక్షలాది మంది తూర్పు పాకిస్తాన్ శరణార్థులు సరిహద్దులు దాటి భారత దేశానికి వచ్చి పడుతుంటే, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమకుందని, ఆ కర్తవ్య నిర్వహణలో యుద్ధం చేయాల్సి వస్తే, తాను చేసిన తప్పేమిటో స్పష్టం చేయాలని నిక్సన్ ను ప్రశ్నించారు.

ఆమె ఆరోహణ పర్వం కొనసాగుతుండగానే, అవరోహణ పర్వం కూడా మొదలైంది. అలహాబాద్ హైకోర్టు, ఇందిరా గాంధీపై వేసిన ఎన్నికల పిటీషన్ లో ఆమెకు వ్యతిరేకంగా, లోక్ సభకు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించింది. ఆమె పై కోర్టుకు అపీల్ చేసుకునే వీలున్నప్పటికీ, తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించి, అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అంతర్గత బధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించారు. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపారు ఇందిరా గాంధీ. రాజ్యాంగాన్ని తిరగ రాశారు. అవధులు లేని అధికారాలను ఇందిరా గాంధీ తన సొంతం చేసుకున్నారు. అత్యవసర పరిస్థితికి అనుగుణంగా, అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించడానికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఇందిరకు మరింత బలం చేకూరింది.

ఐదేళ్ల లోక్ సభ పదవీకాలం పొడిగించి, ఆరేళ్లు చేసిన తర్వాత, మరో ఏడాది పొడిగించబోతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే, హఠాత్తుగా, జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించారు ఇందిరా గాంధీ. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. ప్రతి పక్షాలన్నీ ఏకమయ్యాయి. మార్చ్ 20, 1977 న జరిగిన లోక సభ ఎన్నికలలో ఇందిరా గాంధీని ఆమె నియోజక వర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా ప్రధమ కాంగ్రెసేతర ప్రభుత్వానికి సారధ్యం వహించారు. ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేశారు ఇందిరా గాంధీ.

అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ భార్య జాక్విలిన్ కెన్నడీతో ఇందిరాగాంధీ

ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు తిరిగి ప్రారంభించారు. తన పార్టీలో తనకు వ్యతిరేకంగా వున్న వారితో బంధాలు తెంచుకుని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన వారిలో సగం మందికి పైగా తన వెంట వుంచుకుని, మరో మారు కాంగ్రెస్ పార్టీని చీల్చారు. కాంగ్రెస్ (ఐ) ని స్థాపించారు. అదే అసలు సిసలైన భారత జాతీయ కాంగ్రెస్ గా ప్రకటించారు. ప్రజలు ఆమె పక్షమే వున్నారనడానికి, దేశ రాజకీయాల్లో ఒకటి వెంట మరొకటి చోటు చేసుకున్న సంఘటనలే నిదర్శనం. కర్నాటకలోని చిక్ మగలూర్ నుంచి ఇందిరా గాంధీ లోక సభకు ఎన్నికవడంతో, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) అఖండ విజయం సాధించడంతో ప్రజలు ఆమెకు తిరిగి బ్రహ్మ రధం పట్ట సాగారు. ఈ నేపధ్యంలో, ఒకానొక సందర్భంలో, లోక్ సభలో సుదీర్ఘ చర్చ అనంతరం, ఇందిరా గాంధీ సభ్యత్వం రద్దుచేయాలని, సమావేశాలు ముగిసేవరకు అరెస్ట్ చేయాలని, ప్రధాని మొరార్జీ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. పార్లమెంట్ హాలును వదిలి వెళ్లనని, తననక్కడే అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తూ భీష్మించుకుని కూచున్నారు. అరెస్ట్ చేయడానికి మూడు గంటల తర్వాత వచ్చిన అధికారులకు నమస్తే చెపుతూ వారి వెంట వెళ్లారు ఇందిరా గాంధీ.

జాతీయ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ

జులై 1979 లో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దానికి కారణ భూతుడైన చరణ్ సింగ్ కు మద్దతు పలికి, ఆయన ప్రధాన మంత్రి కావడానికి తోడ్పడ్డారు ఇందిరా గాంధీ వ్యూహాత్మకంగా. దరిమిలా చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని విశ్వాస తీర్మానంలో ఓటమి పాలు చేశారు. జనవరి 1980 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) మూడింట రెండు వంతుల మెజారిటీతో అఖండ విజయం సాధించి, ఇందిరా గాంధీ మరో మారు ప్రధాన మంత్రి అయ్యారు. సుస్థిరతా, అస్థిరతా అన్న నినాదంతో ఆమె ఎన్నికల బరిలో దిగి గెలిచారు. ప్రజాస్వామ్యం, నియంతృత్వం కంటే సుస్థిరతే ముఖ్యమని భారత దేశ ఓటర్లు స్పష్టం చేశారు. భారత దేశానికి కావాల్సింది నియంతృత్వం సమపాళ్లలో కల్సిన ప్రజాస్వామ్యం అన్న సంకేతాన్ని కూడా ఓటర్లు బహిర్గతం చేశారని అనాలి.

ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో అమృత్‌సర్ లోని గోల్డెన్‌ టెంపుల్, హర్మందిర్ సాహిబ్ పై జరిగిన సైనిక దాడికి నిరసనగా, అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ లు జరిపిన కాల్పుల్లో అక్టోబర్ 31, 1984 న ఇందిరాగాంధి హత్యకు గురైనారు. మరణించడానికి క్రితం రోజు జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, దేశ  సేవలో తన ప్రాణాలు పోయినా బాధ పడనని, చనిపోతే తన రక్తంలోని ప్రతి నెత్తురు బొట్టు జాతికి బలం చేకూరుస్తుందని యాదృచ్చికంగా అన్నారో, లేదా, ఆమెలోని ఏదైనా అంతర్నిహిత శక్తి అలా అనిపించిందో భగవంతుడికే తెలియాలి. ఇందిరాగాంధి హత్యకు గురై మరణించి నలబై సంవత్సరాలు కావస్తున్నా, జాతీయ-అంతర్జాతీయ రంగాలలో ఆమె మిగిల్చిన తీపి-చేదు గుర్తులు అజరామరంగా అశేష ప్రజానీకం గుండెల్లో గూడుకట్టుకున్నాయి. ఇందిరాగాంధీ తప్పొప్పులు పక్కన పెట్టితే, అమెనెంతగా అభిమానించేవారో, అంత మోతాదులోనే, ఆమెలోని మంచి చెడులను నిశితంగా  విమర్శించేకోట్లాది ప్రజలు ఇప్పటికీ చాలామంది వున్నారు. ఆమెదో అరుదైన వ్యక్తిత్వం. అందుకే, ‘సరిలేరు నీకెవ్వరు ఇందిరాగాంధీ’.

Narasimha Rao Jwala
Narasimha Rao Jwala
Jwala Narasimha Rao is the Chief Public Relations Officer for Telangana Government. He is the only PR professional and a senior journalist who worked for both Governors and Chief Ministers. Rao is a prolific writer who published commentaries on Ramayana, Bharata and Bhagavata. He hails from Khammam.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles