భారత దేశానికి మూడవ ప్రధాని, దేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి, 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో నాలుగో పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసిన శ్రీమతి ఇందిరాగాంధీ అక్టోబరు 31, 1984 న్యూఢిల్లీ లోని సఫ్దార్‌జంగ్ రోడ్డు లోని తన నివాసంలో 09:20 కు అంగరక్షకులయిన సత్వంత్‌సింగ్, బియాత్‌సింగ్ లచే హత్య గావింప బడ్డారు. ఈ హత్య అమృత్‌సర్ లోని స్వర్ణ దేవాలయంలో భారత సైన్యం జూన్ 1984 న జరిపిన ఆపరేషన్ బ్లూస్టార్ కు ప్రతీకారంగా జరిగింది. 1984 అక్టోబర్ 30 మధ్యాహ్నం ఇందిరా గాంధీ చేసిన చివరి ప్రసంగాన్ని ఎప్పటి లాగే ఆమె సమాచార సలహాదారు హెచ్‌వై శారదాప్రసాద్ తయారు చేశారు. ఆ రోజు ఆమె ముందుంగా తయారు చేసుకున్న ప్రసంగ పాఠం కాకుండా సొంతంగా మాట్లాడారు.
రేపు నేను ఉండకపోవచ్చు: ఇందిర
ఆమె మాట్లాడే తీరులోనూ మార్పు కనిపించింది. ఇందిర ప్రసంగం ఇలా సాగింది: “నేనీ రోజు ఇక్కడున్నాను. రేపు బహుశా ఇక్కడ ఉండక పోవచ్చు. నేను ఉంటానా, ఉండనా అన్న దానిపై నాకేమీ బాధ లేదు. నేను సుదీర్ఘ కాలమే జీవించాను. నేను ప్రజాసేవలో నా జీవితాన్ని గడిపినందుకు గర్వపడుతున్నా. నేను నా చివరి శ్వాస వరకూ సేవ చేస్తూనే ఉంటాను. నేను చనిపోతే నా ఒక్కో రక్తం బొట్టూ దేశాన్ని పటిష్టం చేయడానికి తోడ్పడుతుంది.” ఆ రాత్రి ఢిల్లీకి చేరుకునే సరికి ఇందిర బాగా అలసి పోయారు. ఆ రోజు రాత్రి ఆమె చాలా తక్కువ సేపు నిద్రపోయారు. ముందు గదిలో పడుకున్న సోనియా ఉదయం 4 గంటల సమయంలో ఆస్థమా మందు వేసుకోవడం కోసం బాత్రూంకు వెళ్లినప్పుడు ఇందిర మెలకువతోనే ఉన్నారు. ఆమె కూడా తన వెనుకే బాత్రూం వరకూ వచ్చారనీ, మందు వెదకడంలో తనకు సహాయం చేశారనీ సోనియా గాంధీ తన పుస్తకం ‘రాజీవ్’లో రాశారు. మళ్లీ ఇబ్బంది కలిగితే తనను పిలవమనీ, తాను మెలకువ తోనే ఉంటానని ఇందిర తనకు చెప్పారని సోనియా రాశారు. అల్పాహారం తీసుకుని, ఉదయం ఏడున్నరకల్లా ఇందిర తయారయ్యారు. ఆ రోజు ఆమె నల్లటి అంచున్న కాషాయ రంగు చీర కట్టుకున్నారు.
డాక్యుమెంటరీ నిర్మాత ఉస్తినోవ్
మొదటి అపాయింట్‌మెంట్ పీటర్ ఉస్తీనోవ్‌తో. ఆయన ఇందిరా గాంధీపై ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు. ఒక రోజు ముందు జరిగిన ఒడిశా పర్యటనలో కూడా ఉస్తీనోవ్ ఆమెను చిత్రీకరించారు. మధ్యాహ్నం ఆమె బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి జేమ్స్ కాలెఘన్‌నూ, మిజోరం నాయకుడొకరినీ కలవాల్సి ఉంది. ఆ రాత్రి ఆమె బ్రిటన్ రాకుమారి యాన్‌కు విందు ఇవ్వాల్సి ఉంది. అల్పాహారం తర్వాత మేకప్ మ్యాన్ ఆమె ముఖంపై పౌడర్, బ్లషర్ అద్దుతుండగా డాక్టర్ కేపీ మాథుర్ అక్కడికి చేరుకున్నారు. ఆమెను చూడడానికి ఆయన రోజూ వచ్చే సమయం అదే. ఆమె డాక్టర్ మాథుర్‌ను లోపలికి పిలిచి అక్కడే మాట్లాడారు. తొమ్మిది గంటల 10 నిమిషాలకు ఆమె బయటికి వచ్చినప్పుడు ఎండ తీవ్రంగా ఉంది. ఆమెపై ఎండ పడకుండా ఉండేందుకు ఓ సైనికుడు నారాయణ్ సింగ్ నల్లరంగులో ఉన్న గొడుగును పట్టుకొని ఆమె పక్కన నడుస్తున్నారు. ఆమెకు కాస్త వెనకాల ఆర్కే ధావన్, ఇందిరా గాంధీ వ్యక్తిగత సహాయకులు నాథు రామ్ ఇంకొంచం వెనుక ఉన్నారు. అందరి కన్నా వెనుక ఆమె ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ రామేశ్వర్ దయాళ్ ఉన్నారు.
ధావన్ తో మాట్లాడుతూ నడుస్తున్న ఇందిర
ఇందిర అక్బర్ రోడ్ వైపు నుంచి వికెట్ గేట్ వైపు వెళుతున్నప్పుడు ఆమె ధావన్‌తో మాట్లాడు తున్నారు. ఆరోజున కార్యక్రమాల గురించి ధావన్ ఆమెకు వివరిస్తున్నారు. ఇంతలో అక్కడ డ్యూటీలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు బియాంత్ సింగ్ రివాల్వర్ తీసి ఇందిరా గాంధీపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆమె కడుపులో దిగింది. పాయింట్ బ్లాంక్ రేంజిలో మరో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఆమె భుజం, గుండె, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి ఐదడుగుల దూరంలో సత్వంత్ సింగ్ తన థామ్సన్ ఆటో కార్బైన్ గన్ పట్టుకొని అక్కడే నిలబడి, ఇందిరా గాంధీ కింద పడుతున్నప్పుడు దిగ్ర్భాంతి చెంది కదలలేక పోయాడు. బియాంత్ సింగ్ అతనిని కాల్పులు జరపమని గట్టిగా అరిచాడు. సత్వంత్ సింగ్ వెంటనే తన థామ్సన్ ఆటో కార్బైన్‌లో ఉన్న మొత్తం 25 బుల్లెట్లను ఆమె శరీరంలోకి దించాడు. అప్పుడు అందరికన్నా వెనకాల నడుస్తూ వచ్చిన రామేశ్వర్ దయాళ్ ముందుకు పరిగెత్తే ప్రయత్నం చేశాడు.కానీ ఆయన ఇందిరా గాంధీ దగ్గరకు చేరుకోక ముందే తొడ, కాళ్లపై సత్వంత్ జరిపిన కాల్పులతో కిందపడి పోయాడు.
లొంగిపోయిన హంతకులు
అప్పుడే బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ తమ ఆయుధాలను కింద పడేసి “మేమేం చేయాలను కున్నామో చేసేశాం. ఇప్పుడు మీరు ఏం చేయాలను కుంటున్నారో చేసుకోండి.” అన్నారు. దగ్గరలో ఉన్న ఓ రూమ్ నుంచి ఐటిబీపీ దళాలు పరిగెత్తుకొచ్చి సత్వంత్ సింగ్‌ను అదుపులోకి తీసు కున్నాయి. ఎప్పుడూ అక్కడ ఓ అంబులెన్స్ ఉండేది. కానీ, ఆ రోజు డ్రైవర్ ఎందుకో రాలేదు. అప్పుడే ఇందిరా గాంధీ రాజకీయ సలహాదారు మఖన్ లాల్ ఫోతేదార్ కారు తీయండని అరిచాడు.
ఇందిరమ్మను ఆర్కే ధావన్, భద్రతా అధికారి దినేష్ ఇద్దరూ అక్కడి నుంచి లేపి తెల్లటి అంబాసిడర్ కారు వెనుక సీటులో పడుకో బెట్టారు. ముందు సీట్లో ధావన్, ఫోతేదార్, డ్రైవర్ ముగ్గురూ కూర్చున్నారు. సోనియా గాంధీ అరుస్తూ పరిగెత్తుకుని వచ్చారు. రక్తసిక్తమైన ఇందిర తలను సోనియా గాంధీ తన ఒడిలో పెట్టుకున్నారు. కారును వేగంగా ఎయిమ్స్ వైపు కు తీసుకెళ్లారు. సోనియా గాంధీ గౌన్ ఇందిరా గాంధీ రక్తంతో తడిసి పోయింది. కారు తొమ్మిది గంటల 32 నిమిషాలకు ఎయిమ్స్‌కు చేరింది.
గుండె పనిచేస్తోంది కానీ నాడి అందలేదు
ఎమర్జెన్సీ వార్డు గేటు తెరిచి ఇందిరా గాంధీని కారు నుంచి కిందకి దింపేందుకే మూడు నిమిషాల సమయం పట్టింది. అప్పుడు అక్కడ ఒక్క స్ట్రెచర్ కూడా అందుబాటులో లేదు. ఎలాగోలా ఒక స్ర్టెచర్‌ను ఏర్పాటు చేశారు. ఇందిరా గాంధీని కారు నుంచి బయటకు తీసుకు వస్తున్నపుడు అక్కడున్న డాక్టర్లు కంగారు పడుతూ వెంటనే ఎయిమ్స్ సీనియర్ కార్డియాలజిస్టుకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కొద్ది నిమిషాల్లోనే డాక్టర్ గులేరియా, డాక్టర్ ఎంఎం కపూర్, డాక్టర్ ఎస్ బలరాం అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌లో ఇందిరా గాంధీ గుండె ఎక్కడో పని చేస్తున్నట్లుగా చూపిస్తోంది కానీ పల్స్ రేట్ మాత్రం చూపించడం లేదు. ఒక డాక్టరు ఆమె ఊపిరి తిత్తులకు ఆక్సిజన్ చేరాలని, ఆమె మెదడు పని చేయాలని ఆమె నోటి ద్వారా శ్వాస నాళంలోకి ఒక ట్యూబు వేశాడు. ఇందిరా గాంధీ శరీరంలోకి 80 బాటిళ్ల రక్తాన్ని ఎక్కించారు. “ఆమెను చూసిన వెంటనే ఆమె ఇక లేరని అనుకున్నాను. దాన్ని నిర్ధారించేందుకు ఈసీజీ స్కానింగ్ చేశాం. అప్పుడే అక్కడున్న ఆరోగ్యశాఖ మంత్రి శంకరానంద్‌ను ఇప్పుడేం చేద్దాం అని అడిగా. ఆమె మరణించారని ప్రకటించాలా? అని అడిగితే ఆయన వద్దన్నారు. ఆ తర్వాత ఆమెను ఆపరేషన్ థియేటర్‌లో తీసుకెళ్లాం” అని డాక్టర్ గులేరియా పేర్కొన్నారు. డాక్టర్లు ఆమె శరీరాన్ని హార్ట్ అండ్ లంగ్ మెషీన్‌పై పెట్టారు. ఈ మెషీన్ వల్లే ఆమె రక్త ఉష్ణోగ్రత 37 డిగ్రీల నుండి 31 డిగ్రీలకు పడిపోయింది.
ఆమె చనిపోయారని తెలిసినా ఎయిమ్స్ ఎనిమిదో అంతస్తుపై ఉన్న ఆపరేషన్ థియేటర్‌లో ఆమెను తీసుకెళ్లారు. కాల్పులతో ఆమె కాలేయంలో కుడి భాగం ఛిద్రమైందని నిర్ధారించారు. ఆమె పెద్ద ప్రేగులో దాదాపు 12 రంధ్రాలయ్యాయి. చిన్న ప్రేగు కూడా దాదాపు దెబ్బతింది. ఓ ఊపిరితిత్తి లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. బుల్లెట్లతో ఆమె వెన్నెముక కూడా దెబ్బతింది. కేవలం ఆమె గుండె మాత్రమే సురక్షితంగా ఉంది. ఇందిర మరణించారని కాల్పులు జరిపిన నాలుగు గంటల తర్వాత ప్రకటించారు. దాదాపు రెండు గంటల 23 నిమిషాలకు ఇందిరా గాంధీ ఇక లేరని ప్రకటించారు.
‘మనం లౌకికవాదులం కాదా?’
ఇందిరా గాంధీపై ఇలాంటి దాడి జరగొచ్చనే విషయంపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ముందే ఆందోళన వ్యక్తం చేశాయని ఇందిరా గాంధీ జీవిత చరిత్ర రాసిన ఇందర్ మల్హోత్రా పేర్కొన్నారు. సిక్కు భద్రతా సిబ్బందిని మొత్తం ఆమె ఇంటి నుంచి తీసేయాలని ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు సిఫారసు కూడా చేశాయి. కానీ దీనికి సంబంధించిన ఫైలు ఇందిరా గాంధీ వద్దకు వెళ్ళినప్పుడు ఆమె ఆగ్రహించి “ఆరింట్ వి సెక్యులర్ ? (మనం లౌకికవాదులం కాదా?) అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఒకేసారి ఇద్దరు సిక్కు భద్రతా సిబ్బందిని ఆమె వద్ద డ్యూటీలో ఉంచ కూడదని నిర్ణయించారు. సందర్భం కలిసొచ్చి బియాంత్, సత్వంత్ ఇద్దరూ ఒకేచోట ఉండి ఆపరేషన్ బ్లూ స్టార్ కి ఇందిరా గాంధీపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఇందిరాగాంధీ మరణ వార్త మనదేశంలోని మీడియా సంస్థలకంటే ముందుగా బీబీసీ ప్రపంచానికి చాటింది.
(అక్టోబర్ 31 ఇందిరా గాంధీ వర్ధంతి)